పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)

 పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)


ఉపోద్ఘాతం

అక్టోబరు 4న, మనం పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారి మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. ముందుగా మీ అందరకు పండుగ శుభాకాంక్షలు!

పునీత అస్సీసి ఫ్రాన్సిస్ (క్రీ.శ. 1182–1226) క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, మిక్కిలిగా ప్రేమించబడుచున్న పునీతులలో ఒకరు. ఫ్రాన్సిస్ గారి ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువు ‘సిలువలో కొట్టబడిన యేసుక్రీస్తును సంపూర్ణంగా అనుసరించడం’. విశ్వాసం, ప్రేమ, శాంతి, దీనత్వం, విధేయతలకు మారుపేరుగా జీవించిన పునీతులు అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు!

సువార్తను అక్షరాలా జీవించి చూపిన గొప్ప ప్రతిరూపం పునీత ఫ్రాన్సిస్ గారు. “నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు. మనుష్యకుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు” (మత్త 8:20) అని పలికిన ప్రభువు మాటలను అక్షరాల పాటించి, పేదరికాన్ని తన జీవిత భాగస్వామిగా నెంచి, ప్రేమించిన మహాజ్ఞాని పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు! ఆయన జీవించిన ‘పేదరికం’, ఎవరూ జీవించి ఉండరు. ఫ్రాన్సిస్ గారు జీవించిన పద్ధతిలో పేదరికాన్ని మరే ఇతర పునీతులు అంత కఠినంగా పాటించలేదు. పేదవారిపట్ల ప్రేమ, స్నేహం, సేవా భావాలతో జీవించారు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించగలనోఅప్పుడే దేవున్ని పరిపూర్ణంగా ప్రేమించగలనని నమ్మినవారు. ఫ్రాన్సిస్ గారి దృష్టిలో, పేదరికం అనేది దేవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని, స్వేచ్ఛను ప్రసాదించే పవిత్ర మార్గం.

ఫ్రాన్సిస్ వారి బోధనలు, జీవన విధానం, పేదరికం, దైవప్రేమ, సృష్టిపట్ల గౌరవం, పశ్చాత్తాపాన్ని ఈ లోకానికి గుర్తుచేశాయి, నేటికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి.

1. ఫ్రాన్సిస్ వారి జీవితం, మలుపు-పరివర్తన

ఫ్రాన్సిస్ గారు, 1182లో ఇటలీలోని అస్సీసి పట్టణంలో జన్మించారు. తండ్రి పీటర్‌ బెర్నార్డోన్, ఒక పెద్ద బట్టల వ్యాపారి, తల్లి యోవాన్న పీకా. యువకుడైన ఫ్రాన్సిస్‌ చురుకైన స్వభావంతో, కలుపుగోలు తనంతో ఉండేవారు. ఫ్రాన్సిస్ గారు వ్యాపారంలో తండ్రికి సహాయం చేసినప్పటికీ, విందులు, వినోదాలు మరియు విలాసవంతమైన ఖర్చులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. యుక్తవయస్సులో ఫ్రాన్సిస్ గారు గొప్ప యోధుడుగా కావాలని కలలు కన్నారు. ఈ ఆశయంతోనే, కొన్ని యుద్ధాలలో కూడా పాల్గొన్నారు.

1202లో పెరూజియా నగరంతో జరిగిన యుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చింది. అస్సీసికి గొప్ప పేర్తు, కీర్తిప్రతిష్టలు తీసుకొని వస్తానని వాగ్దానం చేసి యుద్ధభూమికి బయలుదేరారు. సాహసంగల శూరుడుగా యుద్ధంలో పాల్గొన్నారు. కాని ఈ యుద్ధంలో పెరూజియా గెలవడంతో, ఫ్రాన్సిస్ తన ఇతర స్నేహితులతో ఖైదీగా పట్టుబడ్డారు. పరాజయం వారిని పదేపదే బాధించింది. పరాజయాన్ని అంగీకరించలేక, తన మిత్రులతో, తన కలల గురించి గొప్పగా చెబుతూ, ‘గొప్ప భవిష్యత్తు నాకోసం ఎదురు చూస్తుంది. ఒకరోజు లోకమంతా నన్ను గౌరవిస్తుంది’ అని అనేవారు. సంవత్సరం గడచి పోయింది. చెరనుండి విడుదల అయిన కొద్ది కాలానికే, తీవ్రమైన జబ్బున పడి, కోలుకున్నారు. అయితే, ఈ అనుభవాలు అన్నీ కూడా ఆయన అంతరంగంలో మార్పును మొదలుపెట్టాయి.

1205లో, పోపుసైన్యానికి జర్మన్ ప్రభువుల మధ్య యుద్ధం వచ్చింది. తన కలలను సాకారం చేసుకోవడానికి మరొక గొప్ప అవకాశంగా భావించి చాలా సంతోష పడ్డారు. ‘ఇన్ని రోజులు నీవు కోరుకుంటున్న మహిమ నీ తలుపు తట్టుచున్నది. వెళ్లి దానిని ఒడిసి పట్టుకో.ఊగిసలాట వద్దు. ముందుకు దూకు. పోరాడి జయించు. మంచి యోధుడిగా మారు. అప్పుడు లోకమంతా నీ ఆధీనంలో ఉంటుంది’ అని ఫ్రాన్సిస్ గారు తనలోతాను అనుకున్నారు. తండ్రి  బెర్నార్డోన్ కూడా తన కొడుకు ఆ ప్రాంతములోనే ఉత్తమమైన కవచాన్ని ధరించాలని, సొగసైన గుర్రంపై స్వారీ చేయాలని ఆశించి వాటిని సమకూర్చాడు.

ఇక ఆపూలియా ప్రాంతానికి యుద్ధంలో పాల్గొనడానికి వెళుతున్న మార్గంలో, స్పొలేటో అనే ప్రాంతంలో, ఫ్రాన్సిస్ గారు, “ఫ్రాన్సిస్‌, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? అని ఒక స్వరాన్ని విన్నారు. ‘ప్రభూ! నేను యోద్ధభూమికి, యోధున్ని కావాలని వెళ్ళుచున్నాను’ అని బదులు చెప్పారు. మరలా ఆ స్వరం, “నీవు ఎవరిని సేవించగలవు? యజమానుడినా లేక సేవకుడినా?” అని ప్రశ్నించింది. అందుకు ఫ్రాన్సిస్ ‘యజమానుడిని’ అని సమాధానం ఇచ్చారు. మళ్ళీ ఆ స్వరం, “కాని, నీవు యాజమానుడిని గాక, సేవకుడిని సేవిస్తున్నావు” అనగా, లౌకిక ఆశయాలను, కీర్తిని సేవిస్తున్నావు అని ఆ స్వరం పలుకగా, అప్పుడు ఫ్రాన్సిస్‌, ‘అయితే, నన్నేమి చేయమంటారు?’ అని ప్రశ్నించారు. అందులకు “నీవు తిరిగి నగరానికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు” అని ప్రభువు స్వరం వినిపించింది. ఫ్రాన్సిస్ గారు ఆశ్చర్యానికి గురయ్యారు. తను కన్న కలలు ఒక్క క్షణంలో మాయమైనట్లుగా అనిపించింది. తనలోతాను చాలాసేపు వేదనపడి, చివరికి ఇదే దేవుని చిత్తమని ఎరిగి అస్సీసికి తిరిగి వచ్చారు.

అప్పటినుండి వారు సువార్త ధ్యానాన్ని మొదలు పెట్టారు. దగ్గరలోని చిన్న గుహలో ప్రార్ధించారు. లౌకిక ఆశయాల నుండి వైదొలగారు. ఈ క్రమంలోనే ఆయన తన ధనాన్ని పేదలకు దానం చేయడం మొదలుపెట్టి, తమ తండ్రితో గొడవపడి, చివరికి తమ ఆస్తి హక్కులను కూడా వదులుకున్నారు. ఫ్రాన్సిస్ గారు తమ ఆస్తిని, ధనాన్ని అస్సీసి చుట్టూ ఉన్న శిథిలమైన దేవాలయాల పునర్నిర్మాణం కోసం ఖర్చు చేయడం ప్రారంభించారు.

2. కుష్టిరోగిలో ప్రభువు దర్శనం

ఫ్రాన్సిస్ గారు అత్యంత నిరాదరణకు గురైన పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠరోగులకు తమ జీవితాన్ని అంకితం చేయాలని, సేవ చేయాలని దృఢంగా తీర్మానించు కున్నారు. ఈ కుష్ఠరోగుల సేవయే క్రీస్తును అనుసరించడంలో ఆయనకు లభించిన మొట్టమొదటి సవాలు, మరియు ఆధ్యాత్మికంగా ఆయనకు గొప్ప మాధుర్యాన్ని ఇచ్చింది.

పునీత ఫ్రాన్సిస్ గారి ఆధ్యాత్మిక జీవితంలో, కుష్ఠరోగిని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకోవడం అనేది ఒక ముఖ్యమైన, నిర్ణయాత్మకమైన మలుపుగా పరిగణించ బడుతుంది. ఇది ఆయన జీవితాన్ని లౌకిక ఆశయాల నుండి దైవ సేవ వైపు పూర్తిగా మళ్లించింది. ఈ సంఘటన, తమ జీవితంలో అత్యంత కీలకమైన సంఘటనగా తాను భావించినట్లుగా ఫ్రాన్సిస్ గారు వారి వ్రాతలలో వ్యక్తపరచారు. ఫ్రాన్సిస్ గారు తమ తొలి జీవితంలో, మారుమనస్సు పొందక పూర్వం, కుష్ఠరోగులను చూడటానికే విపరీతమైన విరక్తి, భయాన్ని కలిగి ఉండేవారు. మధ్యయుగపు సమాజంలో, కుష్ఠు వ్యాధిని పాపానికి సంకేతంగా చూసేవారు, కుష్ఠరోగులను పట్టణాల బయట ఒంటరిగా ఉంచి, బహిష్కరించేవారు. ఫ్రాన్సిస్ కూడా వారిని చూసిన వెంటనే దూరంగా వెళ్ళిపోయేవారు. ఫ్రాన్సిస్ గారు స్వయంగా ఈ అనుభవం గురించి “నేను పాపంలో ఉన్నప్పుడు, కుష్ఠరోగులను చూడటం నాకు అత్యంత చేదుగా, అసహ్యంగా అనిపించేది. అయితే, ప్రభువు తానే నన్ను వారి మధ్యకు నడిపించారు, నేను వారికి దయ చూపించాను” అని రాసారు.

ఒకరోజు ఫ్రాన్సిస్ గారు తమ గుర్రంపై ప్రయాణిస్తున్నప్పుడు, అస్సీసికి సమీపంలో ఒక కుష్ఠరోగిని చూశారు. ఆయన సహజంగానే భయంతో పక్కకు తప్పుకోవాలని అనుకున్నారు. కానీ, దేవుని కృప మరియు ఆత్మబలంతో తన భయాన్ని, విరక్తిని అధిగమించి, గుర్రం దిగి, ఆ కుష్ఠరోగి దగ్గరకు పరిగెత్తారు. ఫ్రాన్సిస్ గారు ఆ రోగిని ముద్దుపెట్టుకొని, ఆయన చేతికి కొంత డబ్బు కూడా ఇచ్చారు. ఆయన తిరిగి గుర్రం ఎక్కి, వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఆ కుష్ఠరోగి అక్కడ కనిపించలేదు. దీంతో, ఆ రోగి సాక్షాత్తూ యేసు క్రీస్తే అని ఫ్రాన్సిస్ నమ్మారు.

ఈ సంఘటన ఫ్రాన్సిస్ గారు కేవలం క్షణికావేశంలో చేసిన పని కాదు, అది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది: చేదుగా, అయిష్టంగా భావించినది ఇప్పుడు మాధుర్యంగా మారింది. అంటే, లోకంలో తనకు విరక్తి కలిగించిన విషయం, దేవుని దృష్టిలో ప్రేమతో చేసినప్పుడు పరమ ఆనందాన్ని ఇచ్చింది. ఈ అనుభవం తర్వాత, ఫ్రాన్సిస్ గారు అస్సీసికి దిగువన ఉన్న కుష్ఠరోగుల ప్రాంతానికి వెళ్ళి, అక్కడే వారితో జీవించారు. వారికి సేవ చేస్తూ, గాయాలను కడుగుతూ, వారికి సేవలు చేస్తూ తమ జీవితాన్ని గడిపారు.

ఈవిధంగా, కుష్ఠరోగిని కౌగిలించుకోవడం అనేది సువార్తను ఆచరించడానికి ఆయన తీసుకున్న మొట్టమొదటి ఆచరణాత్మక చర్య. తన సుఖాన్ని, అహంకారాన్ని, భయాన్ని సిలువపై త్యాగం చేసి, క్రీస్తు యొక్క కరుణను, ప్రేమను స్వీకరించడానికి ఇది ఆరంభ బిందువు.

ఈ సంఘటన నేటి క్రైస్తవ లోకానికి, ముఖ్యంగా యువతకు, క్రీస్తును అనుసరించే విషయంలో శక్తివంతమైన మరియు ఆచరణాత్మకమైన సందేశాలను అందిస్తుంది. నేడు మన చుట్టూ నిస్సహాయ స్థితిలో నున్నవారు ఎంతోమంది ఉన్నారు. మన సహాయం కోసం ఎదురు చూసే వారు ఎంతో మంది ఉన్నారు!

అయితే, మొదటిగా, ఆకర్షణీయమైన వాటిని త్యజించడం నేర్చుకోవాలి - క్రీస్తును కనుగొనడం అనేది మనకు అత్యంత అసహ్యంగా లేదా అసౌకర్యంగా అనిపించే పనులలో మొదలవుతుంది. నేటి యువత సామాజిక మాధ్యమాలలో మరియు ప్రపంచంలో ఆకర్షణీయంగా, విజయవంతంగా కనిపించే వాటినే అనుసరించాలని కోరుకుంటారు. కానీ ఫ్రాన్సిస్ గారి అనుభవం, నిజమైన ఆధ్యాత్మిక మాధుర్యం మరియు శాంతి లభించేది... మనకు 'అసౌకర్యం' కలిగించే సేవలో... మన ‘అహంకారాన్ని’ చంపుకునే క్షణాల్లో... నిజమైన ఆధ్యాత్మిక మాధుర్యం మరియు శాంతి లభిస్తుందని మనమందరం గుర్తించాలి.

రెండవదిగా, క్రీస్తును ఇతరులలో గుర్తించడం - యేసుక్రీస్తును మందిరాలలో మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరిలో, ముఖ్యంగా పేదలలో, అణగారిన వారిలో, ప్రభువును చూడాలి. మత్తయి 25:40లోని ప్రభువు మాటలను గుర్తుకు చేసుకుందాం! “ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితివి”. నేటి సమాజంలో ‘కుష్ఠరోగులు’ అంటే శారీరక వ్యాధితో బాధపడేవారు మాత్రమే కాదు - నిరాదరణకు గురైనవారు, విభిన్నమైన ఆలోచనలు లేదా మతాలు కలిగినవారు, పేదరికం, వ్యసనాలు లేదా మానసిక సమస్యలతో బాధపడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నవారు... ఇలా ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు! కుష్టరోగులను జయించే ముందు, ఫ్రాన్సిస్ గారు ముందుగా తనలోని విరక్తిని, అహంకారాన్ని జయించారు. ఈ ఆత్మ-విజయమే ఆయనకు ‘ఆత్మకు, శరీరానికి మాధుర్యాన్ని’ యిస్తుంది నేడు మనం ఇతరులను మార్చాలని, మార్పు రావాలని ఆశిస్తాము, కాని నిజమైన పరివర్తన మొదలయ్యేది మన హృదయంలోనే అని గ్రహించాలి! మన బలహీనతలను, ద్వేషాలను జయించినప్పుడే దేవుని సేవలో నిజమైన ఆనందాన్ని పొందగలం.

3. ఫ్రాన్సిస్: శాశ్వత ఎడబాటు

1206లో, పునీత దమియాను దేవాలయంలో ప్రార్దిస్తుండగా, సిలువలో నున్న క్రీస్తు స్వరమును విన్నారు. “నా మందిరమును నిర్మించు” అని ప్రభువు స్వరాన్ని విన్నారు. శిథిలమైన సాన్ దమియానో దేవాలయాన్ని బాగుచేయించడానికి డబ్బు అవసరం కాగా, ఫ్రాన్సిస్ గారు తమ తండ్రి దుకాణంలోని విలువైన వస్త్రాలను గుర్రమును తీసుకువెళ్లి అమ్మేశారు. ఈ విషయం తెలిసిన ఫ్రాన్సిస్ తండ్రి, పీటరు బెర్నార్డోన్‌కు తీవ్రమైన కోపం వచ్చింది. ఫ్రాన్సిస్ తమ వారసత్వాన్ని, కుటుంబ గౌరవాన్ని, కష్టార్జితాన్ని పాడుచేస్తున్నారని, పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఆయన భావించారు. కోపంతో రగిలిపోయిన తండ్రి, ఫ్రాన్సిస్‌ను బంధించి, ఆ డబ్బును తిరిగి ఇమ్మని కోరుతూ,  అస్సీసి నగర బిషప్ ముందు న్యాయస్థానంలో నిలబెట్టాడు. బిషప్ గారు ఫ్రాన్సిస్‌ను పిలిచి, “నీవు దేవున్ని సేవించదలుచుకుంటే, ఈ డబ్బును నీ తండ్రికి తిరిగి ఇచ్చివేయాలి. దేవుని పనికి అన్యాయంగా సంపాదించిన డబ్బును ఉపయోగించకూడదు” అని ఉపదేశించారు. బిషప్ గారి మాటలకు ఫ్రాన్సిస్ వెంటనే అంగీకరించారు. అయితే, ఫ్రాన్సిస్ గారు మరింత ముందుకు వెళ్లి, “ఈ క్షణం నుండి నేను ఇకపై నిన్ను ‘తండ్రి’ అని పిలవను. ఇదిగో! నీ డబ్బుతో పాటు నీవు నాకు ఇచ్చిన ఈ బట్టలు కూడా నీకే ఇచ్చివేస్తున్నాను. ఇంతవరకు నేను పీటరు బెర్నార్డోన్ కుమారుడిని. కానీ ఇకపై పరలోకంలో ఉన్న దేవుడే నా ఏకైక తండ్రి” అని అన్నారు. ఆయన వెంటనే తమ శరీరంపై ఉన్న విలువైన దుస్తులను విప్పేసి, ఆ డబ్బుతో సహా వాటిని తండ్రికి ఇచ్చేసారు. నగ్నంగా నిలబడిన ఫ్రాన్సిస్, లౌకిక జీవితంతో తమకు ఇక ఏ సంబంధం లేదని తేల్చి చెప్పారు. వెంటనే బిషప్, తన పై వస్త్రాన్ని ఫ్రాన్సిస్ గారిని కప్పి, ఆశ్రయం కల్పించి రక్షించారు.

1207లో, పునీత దమియాను దేవాలయ పునర్నిర్మాణం పూర్తయింది. పెంతకోస్తు పండుగన గోపురంపై సిలువను ప్రతిష్టించి, ఆ సిలువతో సర్వలోకాన్ని దీవించాడు. “ఫ్రాన్సిస్ నీ తరువాతి ప్రణాళిక ఏమిటి?” అని సాన్ దమియానో దేవాలయ గురువు ప్రశ్నించగా, “దేవుడు ఇప్పటివరకు నేను నడవటానికి నాకు వెలుగును చూపించారు. నా తర్వాతి అడుగుకి కూడా దేవుడే ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తాడని నమ్మకం నాకున్నది. ప్రతీక్షణం నా జీవితం ఆయన సేవకే” అని ఫ్రాన్సిస్ గారు సమాధాన మిచ్చారు.

4. ఫ్రాన్సిస్: గొప్ప దైవ చిత్తాన్వేషి

ఈనాడు మనం ‘కోరికలు అనే వలయంలో చిక్కుకుపోతున్నాం. కోరికలు తీరనప్పుడు నిరుత్సాహ పడిపోతున్నాం. సానుభూతిఓదార్పుకు నోచుకోలేక పోతున్నాం. దేవుని వాక్యం, కార్యంపై ధ్యానంచేసి, ఆయన చిత్తాన్ని అన్వేషించుటకు మనకు సమయం లేకుండా పోతుంది. క్రీస్తు విశ్వాసులముగా, మనం దేవుని చిత్తం ప్రకారంగా జీవించాలని మనకు తెలుసు! కాని దైవచిత్తాన్ని వెదకుటలో, తెలుసుకోవడంలో, ఆచరించడంలో వెనకబడి పోతున్నాం! దానిలోనున్న ఆనందాన్ని, సంతోషాన్ని గ్రహించలేక పోతున్నాం.

పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ గారు దైవచిత్తాన్ని అన్వేషించడంలో పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్త వయస్సులోచిలిపిగా యువతకు నాయకుడై విచ్చలవిడిగా జీవించినప్పటికినిమార్పుమారుమనస్సు త్వరలోనే అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాల్లోనికి వెళ్లి దేవుని వాక్యంపైప్రేమపై ధ్యానించడం, ప్రార్ధించడం ప్రారంభించారు. దమియాను దేవాలయంలోని సిలువలో వ్రేలాడు క్రీస్తు ప్రతిమ ఫ్రాన్సిస్‌ హృదినిమదిని తొలచడం ప్రారంభించింది. ఫ్రాన్సిస్‌ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే!

1మే 1208, పునీత మత్తయి గారి పండుగ రోజున దైవపిలుపును, దైవచిత్తాన్ని ఫ్రాన్సిస్ గారు మరింత లోతుగా గ్రహించారు. ఆనాటి సువార్త పఠనం, “క్రీస్తు తన శిష్యులను వేదప్రచారానికి పంపటం” ఫ్రాన్సిస్‌ గారిని ఎంతగానో ఆకట్టుకుంది. తను అర్ధం చేసుకున్నది వెంటనే ఆచరణలో పెట్టుటకు బయలు దేరారు. ఇలా దైవ చిత్తాన్ని అన్వేషింఛి, దాని ప్రకారంగా జీవించారు. ఇదే స్ఫూర్తి మనలో కూడా కలగాలి.

ముఖ్యంగా మూడు విషయాలను మనం నేర్చుకోవాలి: మొదటిగా, ధ్యానం, ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి – ఈనాడు మనం ‘కోరికలు’ అనే వలయంలో చిక్కుకోవడానికి ప్రధాన కారణం, మన చుట్టూ ఉన్న డిజిటల్ శబ్దం మరియు నిరంతర వినోదం. దైవచిత్తాన్ని వినడానికి అవసరమైన నిశ్శబ్దం, ఏకాంతం మన జీవితాల్లో లేకపోవడమే! ఫ్రాన్సిస్ గారు ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్లి ప్రార్థించడం ద్వారానే, దేవుని వాక్యంపై ప్రేమను పెంచుకోగలిగారు. పునీత దమియాను దేవాలయంలోని సిలువ ముందు ఆయన చేసిన ప్రార్థన, దేవుని పిలుపును స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కేంద్రంగా మారింది. దైవచిత్తాన్ని తెలుసుకోవాలంటే, మనం మొదట దైవ కార్యానికి మరియు దేవుని వాక్యానికి సమయాన్ని కేటాయించాలి. నేడు మనకు ‘డిజిటల్ ఫాస్టింగ్’, అనగా రోజు కొంతసేపు ఫోనును పక్కన పెట్టేయడం ఎంతో అవసరం. ఆ సమయంలో, ప్రశాంతమైన చోట కూర్చొని, బైబిలులోని ఒక చిన్న భాగాన్ని చదివి, ‘ప్రభూ, నేడు నేను ఏమి చేయాలో నాకు తెలియజేయుము’ అని ధ్యానించాలి.

రెండవదిగా, దైవచిత్తాన్ని తక్షణమే ఆచరణలో పెట్టాలి – క్రీస్తు విశ్వాసులముగా, మనం దేవుని చిత్తం ప్రకారంగా జీవించాలని మనందరికీ తెలుసు! అయినప్పటికీ, దానిని ఆచరించడంలో వెనుకబడి పోతున్నాం. చాలామంది క్రైస్తవులు దేవుని చిత్తాన్ని ‘తెలుసుకోవాలని’ మాత్రమే కోరుకుంటారు, కానీ దానిని ఆచరించడానికి అవసరమైన త్యాగం, కృషి చేయడానికి మాత్రం సిద్ధంగా ఉండరు. ఫ్రాన్సిస్ గారు సువార్త పఠనం విన్న వెంటనే, ఆచరణలో పెట్టడానికి వెంటనే బయలుదేరారు. ఆయనకు ఉన్నత విద్య లేదా శిక్షణ అవసరం రాలేదు. దేవుడు పిలిచిన వెంటనే, సంకోచించకుండా తమకున్నదంతా విడిచిపెట్టి, అక్షరాలా క్రీస్తును అనుసరించారు. కనుక, దేవుని చిత్తం చిన్నదైనా సరే (ఉదా: ఎవరికైనా సహాయం చేయడం, క్షమించడం, పేదలకు దానం చేయడం), ఆలస్యం చేయకుండా, తక్షణమే ఆచరించాలి. తెలుసుకోవడం అనేది దైవచిత్తం యొక్క మొదటి అడుగు మాత్రమే; ఆచరించడం అనేది దైవచిత్తంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని పొందే మార్గం.

మూడవదిగా, సిలువ ద్వారానే దైవపిలుపును, చిత్తాన్ని అర్థం చేసుకోగలం – నేడు మనలో ఉన్న సమస్య ఏమిటంటే, దైవచిత్తం అంటే మన జీవితంలో కేవలం సుఖం, విజయం, వ్యక్తిగత సంతోషం అని చాలామంది భావిస్తున్నాము. అందుకే కష్టాలు, నిరుత్సాహం వచ్చినప్పుడు సానుభూతి, ఓదార్పుకు నోచుకోలేక నిరాశ పడుతున్నాము. ఫ్రాన్సిస్ గారు తమ పిలుపును, సిలువలో వ్రేలాడుతున్న క్రీస్తు ప్రతిమ నుండే అర్థం చేసుకున్నారు. దైవచిత్తాన్ని అన్వేషించాలంటే, అది క్రీస్తు యొక్క త్యాగం, బాధ, పేదరికం యొక్క మార్గం గుండా వెళుతుందని మనం గ్రహించాలి. నిజమైన దైవచిత్తం ఎల్లప్పుడూ స్వీయ-త్యాగాన్ని కోరుతుంది. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, నిరుత్సాహాలను సిలువలో క్రీస్తు భాగస్వామ్యంగా చూడాలి. మన బాధలను కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా, క్రీస్తు యొక్క దైవచిత్తానికి విధేయత చూపడానికి ఒక అవకాశంగా భావించాలి. దైవచిత్తం ప్రకారంగా జీవించడంలో ఉన్న ఆనందం, లోకాశలలో, సౌకర్యాలలో ఉండదు; ఆ ఆనందం మన సమర్పణలో ఉంటుంది! ఈ విధంగా, పునీత ఫ్రాన్సిస్ గారిని ఆదర్శంగా తీసుకోవడంద్వారా, మనం కోరికల వలయం నుండి బయటపడి, దైవచిత్తాన్ని అన్వేషించడంలోనూ, ఆచరించడంలోనూ ఉండే నిజమైన ఆనందాన్ని అనుభవించగలం.

5. ఫ్రాన్సిస్‌: ప్రకృతి ప్రేమికుడు

ఫ్రాన్సిస్‌ ప్రకృతి ప్రేమికులు. ప్రకృతిద్వారా దేవుని మహిమను పొగడేవారు. ప్రకృతిపట్ల గాఢమైన ప్రేమనుగౌరవాన్ని పెంచుకున్నారు. ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసారు. సమస్తమును తన సహోదరీసహోదరులుగా పిలిచారు. నేడు మనం కూడా ప్రకృతి పట్ల ప్రేమనుదాని నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకొనేట్టు జీవించే అవసరం ఎంతగానో ఉంది. పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారి దృష్టిలో, ప్రకృతి కేవలం ఒక వనరు లేదా ఒక దృశ్యం కాదు; అది దేవుని మహిమను, మంచితనాన్ని ప్రతిబింబించే ఒక జీవన దేవాలయంగా భావించారు. ఆయన ప్రకృతిని చూసే విధానం, లోకానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పాఠాన్ని అందించింది.

మొదటిగా, ప్రకృతి ద్వారా దేవుని మహిమను కీర్తించాలి - ఫ్రాన్సిస్ గారు ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూశారు. ఒక పుష్పం, పారే నది లేదా మెరిసే నక్షత్రంప్రతిదీ దేవుని ప్రేమ యొక్క చిహ్నంగా, దేవుని హస్తకళగా వారికి కనిపించింది. దీనికి బైబులునే ప్రేరణగా తీసుకున్నారు. ఆదికాండము మొదటి అధ్యాయంలో చెప్పబడిన విధంగా దేవుడు సమస్తమును సృష్టించి, అది ‘మంచిది’ అని పలికారు. అలాగే 148వ కీర్తనలో, సృష్టి అంతా ప్రభువును స్తుతించాలని చెప్పబడింది. సృష్టిలో ఉన్న సమస్తాన్ని సోదరుడు, సోదరీ అని సంబోధించడం ద్వారా, దేవుని సృష్టిలో ఉన్న ఏకత్వాన్ని, సహోదరత్వాన్ని దృఢముగా నమ్మారు. మనం ప్రకృతి నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకోవాలి. ప్రకృతి నాశనానికి ప్రధాన కారణం మన వినియోగ సంస్కృతి. మనం నిరంతరం ఎక్కువ కావాలని, కొత్తవి కావాలని కోరుకుంటాం. ఈ కోరికలను తీర్చడానికి పరిశ్రమలు, ఫ్యాక్టరీలు భూమి వనరులను అత్యంత వేగంగా దోచుకుంటాయి. ఫ్రాన్సిస్ గారు జీవించిన పేదరికం, నిరాడంబర జీవనం దీనికి ఒక సమాధానం అని చెప్పవచ్చు. తక్కువ వాడుకోవడం, అవసరానికి మించి కోరుకోకపోవడం అనేది ప్రకృతిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మనం వనరులను ‘సమస్య’గా కాకుండా, దేవుడిచ్చిన ‘వరం’గా చూసినప్పుడే వాటిని గౌరవించగలం. నిజమైన అభివృద్ధి అనేది ఎంత సంపాదించాం అనేదానిపై కాదు, ఎంత త్యాగం చేశాం, ఎంత సమతుల్యంగా జీవించాం అనేదానిపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధిని కోరుకోవడం అంటే ప్రకృతిని దోచుకోవడం కాదు, దానికి సంరక్షకులుగా ఉండడం.

6. ఫ్రాన్సిస్‌: శాంతిదాత

ఫ్రాన్సిసువారు తన జీవితముద్వారా ఈ లోకాన్నే మార్చేసారు. యుద్ధాలు, విద్వేషాలు రాజ్యమేలుతున్న కాలంలో ప్రేమ, కరుణ, ధైర్యం అనే బలమైన ఆయుధాలతో ఈ లోకాన్ని మార్చారు. క్రూసేడుల కాలములో, శాంతిని నెలకొల్పుటకు మధ్యవర్తిగా ఫ్రాన్సిస్ ధైర్యముగా ఈజిప్టుకు వెళ్లి అక్కడి సుల్తానును కలిసారు. యుద్ధాన్ని ఆపాలని కోరారు. చరిత్రలో, పునీత ఫ్రాన్సిస్ గారు శాంతి కోసం చేసిన అత్యంత ధైర్యమైన చర్యలలో ఒకటి, క్రీ.శ. 1219లో ఈజిప్ట్‌కు ప్రయాణించడం మరియు అక్కడ ఉన్న సుల్తాన్ అల్-కామిల్‌ను కలవడం. ఆ సమయంలో క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య క్రూసేడుల పేరిట తీవ్రమైన యుద్ధాలు జరుగుతున్నాయి. రెండు వర్గాలు విద్వేషంతో, హింసతో రగిలిపోతున్న సమయమది. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో, ఫ్రాన్సిస్ గారు యుద్ధాన్ని ఆపడానికి, మరియు క్రీస్తు సువార్తను ప్రేమపూర్వకంగా ప్రకటించడానికి నిరాయుధుడిగా శత్రు శిబిరంలోకి వెళ్లారు. ఆయన శక్తిని, ఆయుధాన్ని నమ్ముకోలేదు; దేవునిపై విశ్వాసాన్ని మరియు ప్రేమ శక్తిని మాత్రమే నమ్ముకున్నారు. సుల్తాన్ అల్-కామిల్‌తో ఫ్రాన్సిస్ గారు చేసిన సంభాషణ, పరస్పర గౌరవాన్ని మరియు మానవత్వాన్ని తెలియజేసింది. ఈ సంఘటన మతపరమైన తేడాలు ఉన్నప్పటికీ, సకల మానవాళిపట్ల ఫ్రాన్సిస్ వారికి ఉన్న అపారమైన ప్రేమ, కరుణను మరియు సంభాషణ పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ చర్య, లోకంలో సహోదరత్వం సాధ్యమేనని నిరూపించింది. ఈ సంఘటన సకల మానవాళిపట్ల ఫ్రాన్సిసువారికున్న ప్రేమ, కరుణను తెలియజేస్తుంది.

ఫ్రాన్సిస్ గారి శాంతి సందేశం కేవలం మాటల్లో లేదు; అది వారి ఆచరణలో, ధైర్యంలో మరియు ప్రార్థనలో ఉంది. ఫ్రాన్సిస్ గారి ‘శాంతి ప్రార్థన’ అనేది ఆయన ప్రపంచ శాంతిదూత అని చెప్పడానికి గొప్ప నిదర్శనం.

శాంతి ప్రార్ధన:

ప్రభువా! నీ శాంతి సాధనముగా నన్ను మలచుమయా!

ద్వేషమున్న చోట, ప్రేమను వెదజల్ల నీయుము

గాయమున్న చోట, క్షమాపణను చూప నీయుము

అవిశ్వాసమున్నచోట, విశ్వాసమును నింపనీయుము

నిరాశయున్నచోట, ఆశను పెంచనీయుము

అంధకారమున్నచోట, జ్యోతిని వెలిగింప నీయుము

విచారము నిండినచోట, సంతోషము పంచనీయుము

ఓ దివ్యనాధా,

పరుల ఓదార్పును వెదుకుటకంటె

పరులను ఓదార్చు వరము నీయుము

పరులు నన్ను అర్ధము చెసుకొన గోరుటకంటె

పరులను అర్ధము చేసుకునే గుణము నీయుము

పరులు నన్ను ప్రేమించాలని కోరుటకంటె

పరులను ప్రేమింప శక్తినీయుము

ఎందుకనగా,

యిచ్చుట ద్వారానే, పొందగలము

క్షమించుట ద్వారానే, క్షమింప బడగలము

మరణించట ద్వారానే, నిత్యజీవము పొందగలము.

ఈ ప్రార్థన కేవలం ప్రపంచంలో శాంతిని కోరుకోవడమే కాకుండా, అంతకంటే ముందు తనను తాను దైవ శాంతికి సాధనంగా మార్చమని దేవున్ని వేడుకోవడం. నిజమైన శాంతి బయటి పరిస్థితుల నుండి కాకుండా, మన హృదయాల నుండి మరియు మన చేతల నుండి మొదలవ్వాలని ఇది స్పష్టంగా బోధిస్తుంది. మన అంతరంగంలో శాంతిని స్థాపించుకున్నప్పుడే, మనం దానిని ఇతరులకు పంచగలం. ప్రార్థనలోని ప్రతి అంశం ద్వేషాన్ని ప్రేమతో జయించడం, గాయాన్ని క్షమించడం, నిరాశకు ఆశను అందించడం క్రీస్తు యొక్క గుణాలను  ప్రతిబింబిస్తుంది. ఈ లక్షణాలన్నీ సిలువ త్యాగం నుండి ఉద్భవించిన విమోచన శాంతిని తెలియజేస్తాయి. ఫ్రాన్సిస్ గారు తమ ప్రార్థనను ఆచరణలో చూపినందుకే ప్రపంచ శాంతిదూతగా గౌరవించబడుతున్నారు. అందుకు, ఆయన జీవితమే గొప్ప నిదర్శనం: ఫ్రాన్సిస్ గారు యుద్ధాన్ని నమ్మకుండా, ప్రేమను, సేవను నమ్మారు. శత్రువులను ద్వేషించమని కాకుండా, కౌగిలించుకోమని బోధించారు. ఈ దృఢ సంకల్పమే ఆయన్ను నిరాయుధుడిగా క్రూసేడుల సమయంలో ఈజిప్టు సుల్తానును కలవడానికి ధైర్యాన్ని ఇచ్చింది. ఇది సకల మానవాళి పట్ల ఆయనకు ఉన్న నిస్వార్థ కరుణను తెలియజేస్తుంది. అందుకే, నేటికీ మనం ఫ్రాన్సిసు గారిని కేవలం ఒక పునీతుడిగా కాకుండా, మన హృదయాలలో శాంతిని, సమతుల్యతను నెలకొల్పడానికి, ద్వేషాన్ని ప్రేమతో జయించడానికి నిరంతరం ప్రేరేపించే ఒక గొప్ప శాంతిదూతగా గౌరవిస్తున్నాము. ఆయన ప్రార్థన, ప్రతి విశ్వాసికి తమ జీవితాన్ని ఒక శాంతి వంతెనగా మార్చుకోవడానికి నిత్య మార్గదర్శకం.

ముగింపు:

          జీవితం ఒసగే సుఖసంపదలను ఒడిసి పట్టుకోవాలని పరుగులు తీస్తున్నప్పుడు, ఫ్రాన్సిస్ వారు క్రిందకు త్రోయబడ్డారు. అప్పుడు జీవితంలో ఏది విలువైనది, ఏది నిరుపయోగమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది? ఈ ప్రశ్నలు ఫ్రాన్సిస్ వారిని వెంటాడాయి. బానిసను వదిలి యజమానికి సేవ చేయడం మొదలు పెట్టారు. లోకాన్ని వీడి దేవునికి సేవ చేయడం ప్రారంభించారు. “క్రీస్తు లేకుండా ధనవంతునిగా ఉండుట కంటే, క్రీస్తు కొరకు నిరుపేదగా ఉండుట మేలు” అని ఫ్రాన్సిస్ గారు గ్రహించారు. అలాగే జీవించారు. “నన్ను అనుసరింపగోరువాడు, సమస్తమును అమ్మి పేదలకు దానము చేయుము. మీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింప వలయును” అన్న క్రీస్తు ప్రభువు మాటలను అక్షరాల జీవించారు. క్రీస్తున పరిపూర్ణతలో అనుసరించిన క్రైస్తవుడు పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు. సార్వత్రిక సోదరభావంతో జీవించాడు. సృష్టిలో సకలం ఆయన సోదరీ సోదరులే! సకల సృష్టిలో దేవుని సాన్నిధ్యాన్ని చూడాలని ఫ్రాన్సిస్ లోకానికి నేర్పించారు. దెబ్బతిన్న భూమాతను, నయంచేయు స్పర్శను మనం అందించాలని ఫ్రాన్సిస్ గారి స్ఫూర్తి మనలను కోరుచున్నది.

          ఫ్రాన్సిస్ గారు కలలు కన్నారు. తన త్యాగమయ జీవితం ద్వారా, వాటిని సాకారం చేసుకున్నారు. వారు క్రీస్తుయందే జీవించారు. సంచరిచారు, ఉనికిని కలిగి యున్నారు. “క్రీస్తు వలె జీవించు’ అన్నది ఫ్రాన్సిస్ ఏకైక ధ్యాస. అలాగే జీవించారు. వారు పొందిన బాధలు వర్ణనాతీతం. వారి త్యాగం అమోఘం! అందుకే వారిని “రెండవ క్రీస్తు” అని పిలుస్తున్నాం.

          పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ నడచిన మార్గంలో, ఆయనవలె విభిన్నంగా ఆలోచించుటకు నీవు ధైర్యం చేయగలవా? ఫ్రాన్సిస్ వారి వలె దేవుని పిలుపుకు స్పందించుటకు, దేవున్ని అన్వేషించుటకు సిద్ధంగా ఉన్నావా? ఫ్రాన్సిస్ గారివలె, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, శ్రీసభను, మన సమాజాన్ని, ఈ లోకాన్ని, పునర్నిర్మించుటకు, పునరుద్ధరించుటకు సాహసం చేయగలవా? ఫ్రాన్సిస్ వారి కలలను, వివిధ రకాల సేవలద్వారా, సాకారం చేయడానికి సిద్ధంగా ఉన్నావా?

          దేవుడు ప్రతీ ఒక్కరికి ఒక కలను కలిగియున్నారు. ఆ కలను సాకారం చేయడానికి మనలో ప్రతీ ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ఈ లోక బాగుకోసం, శాంతి, ప్రేమ, న్యాయం, సామరస్యం కోసం కలలు కనడం నీకు ఇష్టమేనా? ఒక్క క్షణం ఆలోచించుదాం! రండి అందరం కలిసి దేవుని కలను నిజం చేద్దాం! ఫ్రాన్సిస్ వారి జీవన్ స్పూర్తితో, ప్రార్ధన సహాయంతో అసాధ్యమైనదానిని సుసాధ్యం చేద్దాం! మన నుండే ప్రారంభించి, ఈ లోకాన్ని మరింత మానవత్వం కలదిగా, మరింత అందముగా తయారు చేద్దాం!

ఓ పునీత ఫ్రాన్సిస్ గారా! మేము నీ వైపు చూస్తున్నాము, నిన్ను వేడుకుంటున్నాము:

సిలువ ముందు నిలబడి యుండడం ఎలాగో మాకు నేర్పించు.

సిలువ వేయబడిన క్రీస్తు దృష్టి మాపై పడేలా చేసి, ఆ చూపులో మేము లీనమైపోయేలా మాకు సహాయం చేయుము.

క్రీస్తు ప్రేమ ద్వారా మేము క్షమించబడేలా, నూతనంగా సృష్టించబడేలా మమ్మల్ని అనుమతించమని మాకు నేర్పించు. ఆమెన్.

 

No comments:

Post a Comment