త్రికాల ప్రార్ధన, లియో XIV, 3 ఆగష్టు 2025

 లియో XIV
త్రికాల ప్రార్ధన
పునీత పేతురు బసిలికా ప్రాంగణం
ఆదివారము, 3 ఆగష్టు 2025

 

ప్రియమైన మిత్రులారా,

మన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య, మనలోని ప్రతి ఒక్కరిలో ఉన్నారు. ఆయనతో కలిసి, ఈ ప్రత్యేకమైన రోజులనుబట్టి, ఈ సువర్ణోత్సవానికి మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది మన సంఘానికి, యావత్ ప్రపంచానికి ఒక గొప్ప వరంగా నిలిచిపోయింది. మీలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే, నా హృదయం నిండా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మరణించిన ఇద్దరు యువ యాత్రికులను నేను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాను. ఒకరు స్పెయిన్‌కు చెందిన మరియ, మరొకరు ఈజిప్ట్‌కు చెందిన పాస్కల్. వారి ఆత్మలను నేను ప్రభువుకు అప్పగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన బిషప్‌లు, గురువులు, మఠవాసులు, మఠకన్యలు, విద్యావేత్తలు, మరియు ఈ కార్యక్రమం కోసం ప్రార్థించి, ఆత్మీయంగా భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.

క్రీస్తుతో మన ఐక్యత, సహవాసము ద్వారా, ఈ ప్రపంచానికి శాంతి, ఆశలను అందిస్తూ, ఇతరుల వల్ల కలిగే తీవ్రమైన కష్టాలను అనుభవిస్తున్న యువతకు మనం గతంలో కంటే ఇప్పుడు మరింత దగ్గరగా ఉన్నాము. గాజా, ఉక్రెయిన్, మరియు యుద్ధాలతో రక్తసిక్తమైన ప్రతి దేశంలోని యువతకు మేము అండగా ఉన్నాము. నా ప్రియ యువతీయువకులారా, వేరే ప్రపంచం సాధ్యమని నిరూపించేది మీరే. ఆ ప్రపంచంలో సోదరభావం, స్నేహం ఉంటాయి. అక్కడ సమస్యలు ఆయుధాలతో కాకుండా, చర్చల ద్వారా పరిష్కరించబడతాయి.

అవును, క్రీస్తుతో ఇది సాధ్యమే! ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన ఆత్మ శక్తితో ఇది తప్పక సాధ్యమవుతుంది. నా ప్రియ స్నేహితులారా, మీరు ద్రాక్షతీగకు అంటుకట్టబడిన కొమ్మలవలే యేసుతో ఐక్యంగా ఉంటే, మీరు గొప్ప ఫలాలను ఫలిస్తారు. మీరు ఈ భూమికి ఉప్పులా, లోకానికి వెలుగులా మారతారు. మీరు మీ కుటుంబాలలో, స్నేహితులలో, పాఠశాలలో, కార్యాలయాలలో, క్రీడలలో, మీరు నివసించే ప్రతి చోటా ఆశకు విత్తనాలుగా ఉంటారు. మన ఆశయానికి మూలమైన క్రీస్తుతో కలిసి మీరు ఆశాజ్యోతులుగా నిలబడతారు.

ఈ జూబిలీ తరువాత, యువత యొక్క ఆశతో కూడిన యాత్ర కొనసాగుతుంది, అది మనల్ని ఆసియాకు తీసుకువెళ్తుంది! రెండు సంవత్సరాల క్రితం లిస్బన్‌లో పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన ఆహ్వానాన్ని నేను మరోసారి గుర్తుచేస్తున్నాను. ప్రపంచం నలుమూలల నుండి యువతీ యువకులు 2027 ఆగస్టు 3 నుండి 8 వరకు దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగే ప్రపంచ యువజన దినోత్సవంలో పునీత పేతురు వారసుడితో కలిసి పాల్గొంటారు. ఆ వేడుకల అంశం ధైర్యంగా ఉండండి! నేను ఈ లోకాన్ని జయించాను!(యోహాను 16:33). మన హృదయాలలో నిండిన ఆశే, చెడు మరియు మరణంపై క్రీస్తు సాధించిన విజయాన్ని ప్రకటించడానికి మనకు శక్తిని ఇస్తుంది. ఆశతో కూడిన యువ యాత్రికులైన మీరు, ఈ సత్యానికి భూమి నలుమూలలా సాక్షులుగా నిలుస్తారు. మిమ్మల్ని సియోల్‌లో కలవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మనం కలిసి కలలు కనడం, కలిసి ఆశించడం కొనసాగిద్దాం.

పవిత్ర కన్య మరియ మాతృత్వ రక్షణలో మనల్ని మనం అప్పగించుకుందాం.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250803-angelus.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

No comments:

Post a Comment