త్రికాల ప్రార్ధన
లియో XIV
పునీత పేతురు బసిలికా ప్రాంగణం
ఆదివారము, 27 జూలై 2025
ప్రియ
సహోదరీ సహోదరులారా! శుభ ఆదివారం!
ఈ రోజు సువార్తలో, యేసు తన శిష్యులకు
ప్రార్థన గురించి బోధిస్తూ ‘పరలోక తండ్రి’ ప్రార్థనను నేర్పించారు (లూకా 11:1-13).
ఈ ప్రార్థన క్రైస్తవులందరినీ ఏకం చేస్తుంది. ప్రభువు మనలను దేవున్ని
“అబ్బా, తండ్రి” అని
పిలవమని ఆహ్వానిస్తున్నారు. ఈ పిలుపులో ఒక బిడ్డకు ఉండే సహజమైన సరళత, నమ్మకం, ధైర్యం మరియు తాను ప్రేమించబడుతున్నాననే
నిశ్చయత కనిపిస్తుంది (కతోలిక శ్రీసభసత్యోపదేశం 2778).
ఈ విషయాన్ని సత్యోపదేశం చాలా చక్కగా వివరిస్తుంది: “ప్రభువు ప్రార్థన మనల్ని
మనకే బయలుపరుస్తుంది, అలాగే తండ్రిని మనకు బయలుపరుస్తుంది” (నం. 2783). ఇది నిజంగా ఎంతో సత్యం!
మనం పరలోక తండ్రిని ఎంత నమ్మకంతో ప్రార్థిస్తే, మనం ఆయనకు
అత్యంత ప్రీతిపాత్రమైన బిడ్డలమని అంత ఎక్కువగా గ్రహిస్తాము. అలాగే, ఆయన లోతైనప్రేమ కూడా మరింతగా అనుభవించగలుగుతాము (రోమా 8:14-17 చూడండి).
నేటి సువార్తలో, యేసు తండ్రి దేవుని స్వభావాన్ని
కొన్ని ఉదాహరణలతో మనకు వివరిస్తున్నారు: ఒకటి, అర్ధరాత్రి తన
ఇంటికి అకస్మాత్తుగా వచ్చిన అతిథికి సహాయం చేసిన తండ్రి; మరియు,
తమ పిల్లలకు మంచి వరాలు ఇవ్వడానికి శ్రద్ధ చూపే తండ్రి.
ఈ ఉపమానాలు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తున్నాయి. మనం తలుపు
తట్టినప్పుడు దేవుడు ఎప్పుడూ మనలను తిరస్కరించరు. మనం చేసిన తప్పులు, కోల్పోయిన అవకాశాలు, వైఫల్యాల
తర్వాత ఆలస్యంగా వచ్చినా ఆయన మనల్ని స్వాగతిస్తారు. కొన్నిసార్లు మనల్ని
ఆహ్వానించడం కోసం, ఇంట్లో నిద్రపోతున్న తన పిల్లలను కూడా “లేపాల్సి”
వచ్చినా ఆయన వెనుకాడరు (లూకా 11:7 చూడండి). నిజానికి,
శ్రీసభ అనే మహా కుటుంబంలో, తండ్రి తన
ప్రేమయుక్తమైన ప్రతి చర్యలో మనమందరినీ భాగస్వాములను చేయడానికి వెనుకాడరు. మనం
ప్రార్థించినప్పుడు ప్రభువు మనలను ఎల్లప్పుడూ ఆలకిస్తారు. ఆయన సమాధానం కొన్నిసార్లు
మనకు అర్థంకాని రీతిలో లేదా మనం ఊహించని సమయాలలో రావచ్చు. ఎందుకంటే ఆయన జ్ఞానం,
దూరదృష్టి మన అవగాహనకు అతీతమైనవి. అలాంటి సందర్భాలలో కూడా మనం
విశ్వాసంతో ప్రార్థించడం ఆపకూడదు, ఎందుకంటే ఆయనలో మనం ఎల్లప్పుడూ వెలుగును,
బలాన్ని పొందుకుంటాము.
‘పరలోక తండ్రి’ ప్రార్థనను జపించేప్పుడు, మనం దేవుని బిడ్డలమనే గొప్ప అనుగ్రహాన్ని గుర్తు
చేసుకోవడమే కాకుండా, ఈ వరానికి ప్రతిస్పందనగా క్రీస్తులో సోదరీ
సోదరులుగా ఒకరినొకరు ప్రేమించుకోవడానికి మనకున్న అంకితభావాన్ని కూడా
వ్యక్తపరుస్తాము. దీనిపై శ్రీసభ పితరులు ఇలా అన్నారు: పునీత సిప్రియన్: “మనం
దేవుడిని ‘మన తండ్రి’ అని పిలిచినప్పుడు, మనం నిజమైన దేవుని బిడ్డలముగా
ప్రవర్తించాలి.” పునీత జాన్ క్రిసోస్టమ్: “నీవు క్రూరమైన, దయలేని
హృదయాన్ని కలిగి ఉంటే, సర్వ దయామయుడైన దేవుడిని నీ తండ్రి
అని పిలవలేవు. ఎందుకంటే అలాంటి హృదయంలో పరలోకపు తండ్రి దయ యొక్క ముద్ర ఉండదు”. కాబట్టి,
మనం దేవుడిని “తండ్రి” అని పిలిచి, మన
తోటివారి పట్ల కఠినంగా, సున్నితత్వం లేకుండా ఉండలేము. అందుకు
బదులుగా, ఆయన దయ, సహనం మరియు కరుణల
ద్వారా మనం మార్చబడాలి, తద్వారా ఆయన స్వరూపం అద్దంలో లాగా మన
జీవితాల్లో ప్రతిబింబిస్తుంది.
ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి దైవార్చన మనలను
ప్రార్థన, ప్రేమ అనే మార్గాల ద్వారా దేవుని ప్రేమను
అనుభవించమని ఆహ్వానిస్తోంది. ఆ ప్రేమను పొందుకొని, ఆయనలాగే
ఇతరులను ప్రేమించమని కూడా పిలుస్తోంది. ఆ ప్రేమ నిష్కపటమైనది, వినయంతో కూడినది, పరస్పర శ్రద్ధను చూపించేది,
మరియు నిజాయితీతో నిండినది. ఈ గొప్ప పిలుపుకు మనం
ప్రతిస్పందించేందుకు, మరియు తండ్రి యొక్క దయగల ముఖాన్ని
ఇతరులకు ప్రతిబింబించేందుకు, కన్య మరియమ్మ మనకు సహాయం
చేయాలని ప్రార్థిద్దాం.
మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250727-angelus.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.
No comments:
Post a Comment