యూత్ జూబ్లీ దివ్యబలిపూజ, పోప్ లియో XIV ప్రసంగం, టోర్ వెర్గాటా, 3 ఆగస్టు 2025

యూత్ జూబ్లీ
దివ్యబలిపూజ
పరిశుద్ధ పోప్ లియో XIV గారి ప్రసంగం
టోర్ వెర్గాటా
18వ సామాన్య ఆదివారం, 3 ఆగస్టు 2025

పవిత్ర దివ్యబలి పూజకు ముందు యువతకు పరిశుద్ధ పోప్ లియో XIV గారి శుభాకాంక్షలు:

శుభోదయం! ఆదివారం శుభాకాంక్షలు! మీరంతా కాస్త విశ్రాంతి తీసుకున్నారని ఆశిస్తున్నాను. మరికాసేపట్లో క్రీస్తు మనకు ప్రసాదించిన అతి గొప్ప కానుకయైన ఆయన సన్నిధిని దివ్యసత్ప్రసాద రూపంలో మనం అనుభవించబోతున్నాం. ఈ క్షణం మనందరి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోవాలి. క్రీస్తు సంఘంగా మనమంతా ఒక్కటై, ఆయనతో కలిసి నడుస్తూ, జీవిస్తూ ఈ వేడుకను ఘనంగా జరుపుకుందాం.

-------------------

గత రాత్రి జరుపుకున్న ప్రార్థనా జాగరణ తర్వాత, మరికాసేపట్లో, క్రీస్తు మనకు ప్రసాదించిన అతి గొప్ప కానుక, అయిన దివ్యసత్ప్రసాద విందును (యూకరిస్ట్) మనం ప్రారంభించబోతున్నాం. ఈ ప్రత్యేకమైన సమయాన్ని పురస్కరించుకుని, ఎమ్మావుస్ గ్రామానికి వెళ్లే శిష్యుల ప్రయాణాన్ని మన మనసుల్లోకి తెచ్చుకుందాం (లూకా 24:13-35). యేసు మరణంతో నిరాశ, భయంతో యెరూషలేము నుండి బయలుదేరిన ఆ శిష్యులు, ఇక ఏ ఆశా మిగలలేదని భావించారు. అయితే, ఆ మార్గంలో యేసు వారిని కలుసుకున్నారు. వారు ఆయన్ని తమ తోడుగా ఆహ్వానించి, ఆయన లేఖనములను వివరిస్తుంటే శ్రద్ధగా ఆలకించారు. చివరికి రొట్టెను విరిచే సమయంలో ఆయన్ని గుర్తించారు. ఆ క్షణంలో వారి కళ్ళు తెరుచుకున్నాయి. ఈస్టర్ శుభవార్త వారి హృదయాలను ఆనందంతో నింపింది. ఈ రోజు, మనం కూడా ఈ దివ్యబలి పూజలో, క్రీస్తు మనతో ఉన్నారని గ్రహించి ఆనందంతో నిండిపోదాం.

దివ్య గ్రంథ ఆరాధనలో ఈ సంఘటన గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఇది మన జీవితాలను పూర్తిగా మార్చివేసే ఒక ప్రత్యేకమైన కలయిక గురించి ఆలోచించమని మనల్ని ప్రోత్సహిస్తుంది. పునరుత్థానం చెందిన క్రీస్తుతో మనకు కలిగే ఈ సమావేశం మన ప్రేమ, ఆశలు, ఆలోచనలను ప్రకాశవంతం చేస్తుంది, సరికొత్త దృక్పథాన్ని అందిస్తుంది.

ఉపదేశకుని గ్రంథంనుండి తీసుకున్న మొదటి పఠనంలో, ఎమ్మావుస్ గ్రామానికి వెళ్లే శిష్యుల వలె, మనలోని పరిమితులను, అలాగే ఏదీ శాశ్వతం కాదని, అన్నీ క్షణికమైనవేనని (1:2; 2:21-23) అంగీకరించమని కోరుతుంది. కీర్తన 90:5-6 లో కూడా “ఉదయమున మొలకెత్తు గడ్డి వంటివారము; సాయంకాలమున వాడి ఎండి పోవును” అని గడ్డితో పోల్చి మానవ జీవితం యొక్క అస్థిరతను వివరిస్తుంది. ఈ రెండు వాస్తవాలు మనల్ని కలవరపెట్టవచ్చు. అయితే, వీటిని మనం భయపడి పక్కన పెట్టాల్సిన అంశాలుగా చూడకూడదు. ఎందుకంటే, వాటి సున్నితత్వం సృష్టిలోని అద్భుతాలలో భాగం. గడ్డి పూల పొలం గురించి ఆలోచించండి: దాని అందం ఎంత అద్భుతమైనదో! ఆ గడ్డి సున్నితమైన కాండాలతో బలహీనంగా ఉన్నప్పటికీ, త్వరగా వాడిపోవచ్చు, విరిగిపోవచ్చు. అయినప్పటికీ, వాడిపోయిన ఆ పూల నుండి వచ్చే పోషకాలతో మళ్ళీ కొత్త పూలు మొలకెత్తుతాయి. ఈ నిరంతర పునరుత్పత్తి ప్రక్రియ ద్వారానే ఆ పొలం జీవిస్తుంది. చలికాలంలో అంతా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించినా, దాని శక్తి భూమిలో నిక్షిప్తమై ఉంటుంది. వసంతం వచ్చినప్పుడు వేల రంగులతో వికసించడానికి అది సిద్ధంగా ఉంటుంది.

ప్రియమైన మిత్రులారా, మనం కూడా అదే విధంగా సృష్టించబడ్డాం. కేవలం ఒకేలా ఉండే జీవితం కోసం కాదు, ప్రేమతో మనల్ని మనం ఇతరులకు అర్పించుకోవడం ద్వారా నిరంతరం నూతనమయ్యే ఉనికి కోసం మనం సృష్టించబడ్డాం. అందుకే, ఈ సృష్టిలో ఏదీ ఇవ్వలేని ఏదో 'గొప్ప' దాని కోసం మనం నిరంతరం తపిస్తూ ఉంటాం. ఈ లోకంలోని ఏ పానీయం తీర్చలేని లోతైన దాహాన్ని మనం అనుభవిస్తుంటాం. ఈ సత్యాన్ని గ్రహించి, మన హృదయాలను చవకబారు వాటితో నింపి మోసపోవద్దు. బదులుగా, మన అంతరాత్మ మాట విందాం! ఆ దాహాన్ని దేవునితో మనల్ని కలిపే ఒక మెట్టుగా మారుద్దాం. పిల్లలు ఎలాగైతే కాలి వేళ్లపై నిలబడి కిటికీలోంచి తొంగి చూస్తారో, అలాగే మనం కూడా ఆయన్ని చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు, మన ఆత్మ తలుపును సున్నితంగా తడుతున్న ఆయన (దర్శన 3:20) ఎదుట మనం నిలబడతాం. ముఖ్యంగా యుక్తవయసులో మన హృదయాలను పూర్తిగా తెరిచి, ఆయనను లోపలికి రానిచ్చి, ఆయనతో కలిసి నిత్యత్వం వైపు ఈ సాహసయాత్రను ప్రారంభించడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం.

పునీత అగుస్తీనుగారు తన లోతైన దైవాన్వేషణ గురించి ఆలోచిస్తూ తనను తాను ఇలా ప్రశ్నించుకున్నారు: “మరి, మన ఆశ దేనిపై ఉండాలి? ఈ భూమి పైనా? కాదు. భూమి నుండి వచ్చే బంగారం, వెండి, చెట్లు, పంటలు, లేదా నీరు వంటి వాటి పైనా? ఇవన్నీ మనసుకు ఆనందాన్ని, అందాన్ని, మంచిని ఇస్తాయి. కానీ వీటిపై కాదు.” ఆ తర్వాత అగుస్తీనుగారు ఈ నిర్ధారణకు వచ్చారు: “వాటిని సృష్టించిన ఆయన్నే వెదకండి, ఆయనే మీ నిజమైన నిరీక్షణ.” తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్మరించుకొంటూ ఇలా ప్రార్థించారు: “ఓ ప్రభూ, నువ్వు నాలోనే ఉన్నావు, కానీ నేను వెలుపల ఉండి నిన్ను వెదికాను... నీవు పిలిచావు, బిగ్గరగా అరిచావు, నా చెవుడును పోగొట్టావు. నీవు మెరిసావు, ప్రకాశించావు, నా అంధత్వాన్ని తొలగించావు. నీ పరిమళాన్ని నాపై వెదజల్లావు; నేను శ్వాస తీసుకున్నాను, ఇప్పుడు నీ కోసం ఆరాటపడుతున్నాను. నిన్ను నేను రుచి చూశాను (కీర్తన 34:8; 1 పేతురు 2:3), ఇప్పుడు మరింత ఆకలి, దాహంతో ఉన్నాను (మత్త 5:6; 1 కొరి 4:11); నువ్వు నన్ను తాకావు, నీ శాంతి కోసం నేను తపించాను” (కన్ఫెషన్స్, 10, 27).

మన హృదయాలలో ఒక మండుతున్న ప్రశ్న, మనం విస్మరించలేని ఒక సత్యం కోసం ఒక అవసరం ఉంది. ఇది మనల్ని మనం ఇలా ప్రశ్నించుకునేలా చేస్తుంది: నిజమైన ఆనందం అంటే ఏమిటి? జీవితం యొక్క నిజమైన అర్థం ఏమిటి? అర్థం లేనితనం, విసుగు, మామూలుతనం నుండి మనల్ని ఏది విముక్తి చేస్తుంది?

ఇటీవలి రోజుల్లో మీరు ఎన్నో అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకున్నారు. ప్రపంచం నలుమూలల నుండి, విభిన్న సంస్కృతుల నుండి వచ్చిన యువతను కలుసుకున్నారు. కళలు, సంగీతం, సాంకేతికత, క్రీడల వంటి వాటి ద్వారా మీ అనుభవాలను, ఆశయాలను పరస్పరం పంచుకున్నారు. అలాగే, సర్కస్ మాక్సిమస్‌లో, మీరు పాప క్షమాపణ దివ్యసంస్కారాన్ని కూడా స్వీకరించి, మంచి జీవితాన్ని గడపడానికి దేవుని దయను కోరారు.

ఈ అనుభవాలన్నిటి ద్వారా మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోగలరు. మన జీవిత పరిపూర్ణత అనేది మనం కూడబెట్టుకునే వాటిపై, లేదా సువార్తలో చెప్పినట్లుగా, మనం కలిగి ఉండే వాటిపై ఆధారపడి ఉండదు (లూకా 12:13-21). బదులుగా, ఆ పరిపూర్ణత మనం సంతోషంగా స్వీకరించే, మరియు పంచుకునే వాటిపై ఆధారపడి ఉంటుంది (మత్తయి 10:8-10; యోహాను 6:1-13). కేవలం కొనడం, నిల్వ చేయడం, మరియు వినియోగించడం మాత్రమే సరిపోదు. మనం మన కళ్ళను పైకి ఎత్తి, “పైనున్న వాటి”వైపు చూడాలి (కొలొస్సీ 3:2). అప్పుడే ఈ ప్రపంచంలోని ప్రతిదీ మనల్ని దేవునితో, మన సహోదరీ, సహోదరులతో ప్రేమలో ఏకం చేయడానికి ఉపయోగపడుతుందని తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం “కరుణ, దయ, వినయం, సాత్వికం, ఓర్పు’ (కొలొస్సీ 3:12), క్షమ (కొలొస్సీ 3:13), మరియు శాంతి (యోహాను 14:27)లలో ఎదగగలం. ఇదంతా క్రీస్తును అనుసరించడం ద్వారానే సాధ్యమవుతుంది (ఫిలిప్పీ 2:5). విధంగా, మనకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో నింపబడింది కాబట్టి, మన నిరీక్షణ ఎప్పటికీ నిరాశపరచదు అనే లోతైన అవగాహనలోకి మనం ఎదుగుతాం (రోమీ 5:5).

ప్రియమైన యువ మిత్రులారా, యేసు మన నిరీక్షణ. రెండవ పోప్ జాన్ పాల్ గారు చెప్పినట్లు, “మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనే కోరికను, సమాజాన్ని మరింత మానవీయంగా, సౌభ్రాతృత్వంగా మార్చడానికి మనల్ని ప్రేరేపించేది ఆయనే” (15వ ప్రపంచ యువజన దినోత్సవం, ప్రార్థనా జాగరణ, 19 ఆగస్టు 2000). మనం ఎల్లప్పుడూ ఆయనతో ఐక్యంగా, ఆయన స్నేహంలో నిలిచి ఉందాం. ప్రార్థన, ఆరాధన, దివ్యసత్ప్రసాద స్వీకరణ, తరచుగా పాపక్షమాపణ మరియు దానధర్మాల ద్వారా ఈ స్నేహాన్ని పెంచుకుందాం. త్వరలో పునీతులుగా ప్రకటించబడనున్న ధన్యులైన పియర్‌జార్జియో ఫ్రస్సాతి, ధన్యులైన కార్లో అకుటిస్ వంటివారిని స్ఫూర్తిగా తీసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నా సరే, గొప్ప విషయాల కోసం, పరిశుద్ధత కోసం ఆరాటపడండి. తక్కువతో సంతృప్తిపడకండి. అప్పుడే సువార్త వెలుగు మీలో, మీ చుట్టూ ప్రతిరోజూ పెరుగుతూ ఉండటాన్ని మీరు చూస్తారు.

మీరు మీ దేశాలకు తిరిగి వెళ్తున్నప్పుడు, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో, రక్షకుని అడుగుజాడల్లో ఆనందంగా నడవాలని, మీరు కలిసే ప్రతి ఒక్కరికీ మీ ఉత్సాహాన్ని, మీ విశ్వాసాన్ని చాటిచెప్పాలని నిరీక్షణ మాత అయిన కన్య మరియకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/homilies/2025/documents/20250803-omelia-giubileo-giovani.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

No comments:

Post a Comment