పాస్కా ఐదవ మంగళవారము (I)

 పాస్కా ఐదవ మంగళవారము
అ.కా. 14:19-28; యోహాను 14:27-31
ధ్యానం: ప్రభువు ఒసగు శాంతి

          ప్రతీ క్రైస్తవుడు నేటి సువిషేశమును తప్పక ధ్యానించాలి. దేవుడు ఒసగు శాంతి తన అనంతమైన ప్రేమనుండి వెలువడును. నేడు అనేక కుటుంబాలలో, సంఘాలలో శాంతి లేదు. దీనికి కారణం నిజప్రేమ, షరతులులేని ప్రేమ లేకపోవడమే! శాంతి ఆత్మ ఫలము (గలతీ 5:22). యేసు సాన్నిధ్యం మనలో ఉండాలి. మన జీవితాలను సంపూర్ణముగా క్రీస్తుకు అంకితం చేసుకోవాలి. ఒకరినొకరు ప్రేమించు కోవాలి. క్రీస్తుద్వారా మనం తండ్రి దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎందుకన, క్రీస్తే మార్గం, సత్యం, జీవం.

          “నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను” అని ప్రభువు పలుకుచున్నారు. ప్రభువు ఒసగు శాంతి భిన్నమైనది. లోకము ఒసగు శాంతికి ప్రభువు ఒసగు శాంతి భిన్నమైనది. మామూలుగా మనం యుద్ధ వాతావరణము లేనిచో శాంతి యున్నదని భావిస్తూ ఉంటాము. లోకము దృష్టిలోని శాంతిని నేను ఇచ్చుట లేదు అని ప్రభువు స్పష్టం చేయుచున్నారు. ప్రభువు ఒసగు శాంతి అత్యున్నతమైన మంచిని కలిగి యుంటుంది.

          శాంతి అనగా మనస్సులో ప్రశాంతత కలిగి యుండటం. మన మనస్సు ప్రశాంతముగా యున్నప్పుడు, యేసు మన ఆలోచనలను, భయాలను, చింతలను తన ఆదీనమున ఉంచుటకు అనుమతి ఇవ్వగలదు. శాంతి అనగా మన హృదయం యొక్క నిరాడంబరత. మనకు ఉన్న వాటితో, దేవుడు ఒసగు వాటితో సంతృప్తి చెందడం. శాంతి అనగా ఆత్మయొక్క ప్రశాంతత. అనగా దేవునితోను, ఇతరులతోను సఖ్యత కలిగి జీవించడం. దీనిని బట్టి, శాంతి మనలోనే యున్నదని అర్ధమగుచున్నది. శాంతి అంత:ర్గతమైనది. వివాదాలు లేకపోవడం శాంతి కాదు. మన జీవితాలలో క్రీస్తు లేకపోవడమే శాంతి లేకపోవడము. ఎందుకన, క్రీస్తే మన శాంతి.

          ఈరోజు ఐదవ భక్తినాధ (పయస్) పోపుగారిని స్మరించుకొను చున్నాము. గొప్ప సంస్కరణవాది. కార్డినలు, మతసాక్షి. దృఢవిశ్వాసం, గొప్పభక్తి, ధర్మనిష్టతో జీవించారు. ప్రార్ధన, ధ్యానం అనుదిన జీవితములో భాగం. రోగులను స్వయముగా పరామర్శించేవారు. పేదలకు భూవిరాళాలు ప్రకటించారు.

No comments:

Post a Comment