దైవాంకిత జీవితములోని పరమార్ధం

 దైవాంకిత జీవితములోని పరమార్ధం

ఫా. ప్రవీణ్ కుమార్ గోపు OFM Cap.
STL Biblical Theology, పెద్దావుటపల్లి

దైవాంకిత జీవిత మార్గం అసాధారణమైనది. ప్రస్తుత కాలములో చాలామంది (మన కతోలికులతో సహా), ఇది ఒక వింతయైన జీవితముగా, విచిత్రమైన జీవితముగా, సాధ్యంకాని జీవితముగా భావిస్తున్నారు. అలాగే, వెర్రితనముగా భావిస్తున్నారు. ఈ జీవితం నేటి సంస్కృతికి విరుద్ధం (counter-cultural) అని కొంతమంది అంటున్నారు. మఠవాస జీవితం ఖటినమైనదని, ఎన్నో విధాలుగా నియంత్రించబడిన (controlled) జీవితమని, అనగా స్వేచ్చలేని జీవితమని అంటూ ఉన్నారు.

          అయితే, మఠవాస (సన్యాస) జీవితం క్రమశిక్షణతో కూడిన జీవితం. స్వతంత్రము కలిగిన జీవితము. ప్రేమ పొంగిపొరలు జీవితం! ఒంటరి జీవితమే అయుండవచ్చు, కాని తోటి సహోదరీసహోదరులతో, (సార్వత్రిక) సోదరభావముతో ఒకటిగా జీవించు జీవితం. ఇదే వారి శ్వాస! ఇదే వారి ప్రయత్నం! ఈ లోకములోనే జీవించు జీవితం, కాని ఈ లోకసంబంధమైన జీవితం కాదు. ఇది త్యాగపూరితమైన జీవితం. లోకాశలతో, సాతాను శోధనలతో, అవినీతి-అన్యాయముతో పోరాడు జీవితం. కనుక, దైవాంకిత జీవితం – క్రీస్తుకొరకు జీవించి, మరణించుటకై సిద్దపడు జీవితం. వ్యక్తిగత విషయాల కొరకుగాక, వ్యక్తిగత ప్రయోజనాల కొరకుగాక, క్రీస్తు మార్గములో నిస్వార్ధ, త్యాగపూరిత జీవితాన్ని జీవించడం. త్రిత్వైక దేవుని ప్రేమలో జీవించడం.

          ఈ పిలుపులో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నను, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నను, ఒకరినొకరం అర్ధంచేసుకుంటూ, పునీతుల అడుగుజాడలలో నడుస్తూ, క్రీస్తు సువార్తనుసారం జీవిస్తూ ఉంటారు. వారు చేసిన నిర్ణయం స్వతహాగా, యిష్టపూర్తిగా, స్వచ్చంధముగా ఎన్నుకున్న జీవితం. ఇది వారు వ్యక్తిగతముగా నిర్ణయించుకున్న జీవితం! ఇది దేవుని కృపానుగ్రహము! యోహాను సువార్త 15:16లో ఇలా చదువుచున్నాము: “మీరు నన్ను ఎన్నుకొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకున్నాను... మిమ్ము నియమించితిని.”

ఈ పిలుపు, ఈ జీవితం, క్రీస్తువలె, పునీతులవలె, ప్రేమ కలిగి జీవించుట కొరకే! దేవున్ని, తోటివారిని, ప్రేమించు జీవితం! కనుక, ఈ పిలుపును గొప్ప నిరీక్షణతో జీవించాలి. సహనము, ఓర్పుతో జీవించాలి. ఈ పిలుపులో జీవించు విధేయత, పేదరికం, బ్రహ్మచర్యం అను మూడు వ్రతాలలోని, అతీంద్రియ విలువను (transcendental value) గ్రహించినపుడే, వాటి విలువ, అర్ధం, పరమార్ధం తెలుస్తుంది! కనుక, మఠవాస జీవితం ఫలభరితం కావాలంటే, దేవునికి ప్రధమ స్థానాన్ని ఇవ్వాలి. దేవునిరాజ్యం, దాని స్థాపన ప్రధాన అంశముగా మారాలి.

1 సమూ 3:1-10 – సమూవేలు నిద్రించుచుండగా, దేవుడు అతనితో మాట్లాడాడు. పిలిచాడు. ఈ పఠనములో, రెండు వాక్యాలు గమనించదగినవి: ఒకరి, 3:1 – “ఆ రోజులలో యావే వాక్కు చాల అరుదుగా విన్పించెడిది.” రెండు, 3:3 – “ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు.” దేవుడు మనందరినీ పిలుస్తూనే ఉంటాడు. దేవుడు మరల మరల మనలను పిలుస్తూనే ఉంటాడు. సమూవేలువలె మనలో చాలామందిమి దేవుడు మొదటిసారి పిలిచినప్పుడు ఆలకించము. ఏలీ సమూవేలుకు సహాయం చేసిన విధముగా, మనకు కూడా అనేకమంది సహాయం చేస్తూ ఉంటారు (తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు, సేమినరీలో తర్ఫీదు ఇచ్చువారు...). చివరిగా, దేవుని పిలుపును అర్ధంచేసుకున్న సమూవేలు సమాధానం చాల గొప్పది. 3:10 – “ఆనతి యిమ్ము, నీ దాసుడు ఆలించుచునే యున్నాడు.”

1 కొరి 1:26-29 – 1:26 – “సోదరులారా! దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసికొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తివంతులు, సాంఘికముగ ఉన్నత జీవనము కలవారు కొలదిమంది మాత్రమే.” దేవుడు సాధారణమైన వారిని పిలచుకొని, వారిని అసాధారణమైన వారిగా మలుస్తాడు. చేపలు పట్టువారిని తన శిష్యులుగా పిలుచుకున్నాడు. ఒక పాపి, సుంకరిని శిష్యునిగా పిలుచుకున్నాడు. హింసితుడు సౌలును తన సేవకు పిలుచుకున్నాడు.

మత్త 19:18-30 – యువకుడు – ధనికుడు, మంచివాడు, ఆసక్తిగలవాడు, సరియైన ప్రశ్నలే అడిగాడు. సరియైన వ్యక్తినే అడిగాడు. సరియైన సమాధానమే వచ్చింది. కాని, ఆ పిలుపుకు సరిగా బదులు ఇవ్వలేక పోయాడు. మన నేటి యువత కూడా ఈవిధముగానే యున్నది. 19:21 – “నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము. అపుడు పరలోక మందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము” అని ప్రభువు పిలిచినపుడు, (22) “ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను.”

బీదలకు ఇచ్చిన యెడల, క్రీస్తుకు ఇచ్చినట్లే అని అర్ధం చేసుకుంటారు. మత్త 25:40 – “ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి” అని ప్రభువు చెప్పియున్నారు. పేదరికం అనేది వారికి కేవలం ఆర్ధిక పరిస్థితికి సంబంధించినది మాత్రమే కాదు. పేదరికం అనగా స్వేచ్చ! క్రీస్తును అనుసరించు మార్గములో అడ్డుగా ఉన్నవాటిని విదిచిపెట్టగల స్వేచ్చ! ఈ స్వేచ్చ మఠవాసులకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే, నిస్వార్ధముగా అందరిని ప్రేమించే శక్తిని కలిగి యుంటాము కనుక! ఈ స్వేచ్చ యొక్క ఫలమే ప్రేమ! ఆ యువ ధనికుడు స్వేచ్చగా జీవిస్తున్నాను అని అనుకున్నాడు, కాని అతనిలో ఉన్న ఒకేఒక్క లోటు, క్రీస్తు కొరకు వాటిని విడిచిపెట్టగల స్వేచ్చ లేకపోవడం. మరో మాటలో చెప్పాలంటే, అతనిలో ఇతరులను ప్రేమించగలిగే శక్తి లేదు. అందుకే, వారికి నిజమైన పేదరికం అనగా ప్రేమ / ప్రేమించడం. పేదరికం అనగా సువార్తానుసారం జీవించడం. సువార్తానుసారం జీవించడం అనగా ప్రేమాజ్ఞను జీవించడం. “నేను మిమ్ము ప్రేమించునట్లు, మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు.” యేసు ప్రేమ అనంతమైనది. యేసు ప్రేమ నిస్వార్ధమైనది. యేసు ప్రేమ తన ప్రాణమిచ్చునది. యేసు ప్రేమ క్షమించునది. “మనము పాపములో ఉండగనే ఆయన మనలను ప్రేమించాడు.”

తన పిలుపును అర్ధంచేసుకున్న క్షణాన, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు పలికిన మాటలు: “నేను ఆశించుచున్నది ఇదియే! నేను వెదుకుచున్నది ఇదియే! నేను మనసారా జీవించాలనుకుంటున్నది ఇదేయే! దైవ పిలుపులకొరకు ప్రార్ధన చేద్దాం! దైవ పిలుపులను ప్రోత్సహిద్దాం!

No comments:

Post a Comment