పాస్కా మూడవ బుధవారము
అ.కా. 8:1b-8; యోహాను
6:35-40
ధ్యానం: జీవాహారము – వాక్కు
నేటి సువార్తలో ప్రభువు తననుతాను “నేనే జీవాహారమును” అని అంటున్నాడు. ‘జీవాహారము’ అనగా ఏమి? మనం ఆహారము లేకుండా
ఉండలేము. అది మన జీవితాన్ని నిలబెడుతుంది. ‘జీవితము’ అనగా ఏమి? జీవితం అనగా భౌతిక జీవితముకన్న ఉన్నతమైనది.
దేవునితో సహవాసము కలిగిన జీవితము. నమ్మకము, ప్రేమ, విధేయత కలిగిన జీవితము. యేసు మన జీవాహారము.
ఎందుకనగా, మనలో స్వయముగా
దేవుని జీవితాన్ని కలిగించే ఆధ్యాత్మిక భోజనముగా తననుతాను సమర్పించుకున్నారు.
దేవునినుండి దూరమవుతామేమో అన్న భయాన్ని మనలనుండి తొలగించాడు. పునరుత్థానములో
పాలుపంచుకొనే నిరీక్షణను మనకు ఒసగాడు.
జీవాహారమగు యేసు క్రీస్తును మనం అనుసరించాలి. ఆయనను
అనుసరించాలంటే తప్పనిసరిగా ఆయనయందు విశ్వాసము కలిగి యుండాలి. సాధారణముగా, “జీవాహారము” అనగా యేసుక్రీస్తు
శరీర రక్తములని లేదా దివ్యసత్ర్పసాదమని అర్ధము చేసుకున్నను, ఆయన జీవముగల మాటలు, ‘దేవుని వాక్కు’ అని కూడా అర్ధము
చేసుకోవాలి. ఎందుకన, “మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు. కాని
దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును” (మత్త 4:4). యేసు దేవుని వాక్కు. (యో 1:1).
వాక్కు దైవీకమైనది. “ఆ వాక్కు మానవుడై మనమధ్య నివసించెను (యో 1:14). ‘వాక్కు’ అనగా పరిశుద్ధ
గ్రంథ లేఖనాలు అని, (రోమీ 9:6; హెబ్రీ 4:12), క్రీస్తు బోధనలు అని (లూకా 5:1), సువార్త సందేశము
అని (అ.కా. 4:31) అర్ధము. “పవిత్ర గ్రంథమంతయు దైవప్రేరణ వలననే కలిగి బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు
సరిదిద్దుటకు, నీతియందు
నడిపించుటకు ఉపయోగపడును” (2తిమో 3:16). “వాక్యము నందలి ముఖ్య గుణము సత్యము” (కీర్త 119:160).
యేసు మాటలకు కట్టుబడి యున్నచో, మనం సత్యమును గ్రహించెదము. సత్యము మనలను
స్వతంత్రులను చేయును (యో 8:31-32). క్రీస్తు వాక్కు మనలో విశ్వాసాన్ని కలిగించును
(రోమీ 10:17).
ముఖ్యమైన విషయం ఏమిటంటే, క్రీస్తు సజీవ వాక్కును, మన అనుదిన జీవితములో ఎలా జీవిస్తున్నాము అని ఆత్మపరిశీలన చేసుకుందాం.
No comments:
Post a Comment