పాస్కా మూడవ గురువారము
అ.కా. 8:26-40; యోహాను
6:44-51
ధ్యానం: నేను ఇచ్చు
ఆహారము నా శరీరమే
“నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు
రాలేడు” (యో 6:44). దేవునిలో జీవించడం
దైవానుగ్రహమే. మన పిలుపు దేవుని కృపయే. హృదయపరివర్తన దేవుని దయతో కూడిన పని. “ప్రప్రధంగా
పరివర్తనం దేవుని క్రుపావర చర్య” (సత్యోపదేశం,
1432). పాపియొక్క అంత:ర్గత
జీవితాన్ని దేవుడు ఆకర్షిస్తాడు. దేవుడే మనకోసం ఎల్లప్పుడు వెదుకుతూ ఉంటాడు. “గాఢమైన
ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని” (హోషే 11:4). అయితే, దేవునికి మన సహకారం
అవసరం. తండ్రి పిలిచినప్పుడు, మనం క్రీస్తు వద్దకు వెళ్ళాలా వద్దా అన్న
నిర్ణయం ఎవరికివారే చేయాల్సి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు నిర్ణయం
చేయలేక పోయారు. “వారు నా యొద్దకు వచ్చుటకు అంగీకరింపరైరి. కావున వారు ఐగుప్తునకు
వెళ్లి పోవలెను” (హోషే 11:5).
మనము విశ్వాసము కలిగి జీవించాలని కూడా ఈ వాక్యం తెలియజేస్తున్నది.
క్రీస్తును, శ్రీసభను
విశ్వసించాలి. క్రీస్తును విశ్వసించడం కూడా దేవుని కృపయే అని తెలుసుకుందాం. అలాగే
ఈ వాక్యం, మనం పవిత్రముగా
జీవించాలని పిలుపు నిస్తుంది. మనకున్నదంతా దేవుని నుండియే వచ్చినది కనుక, మనం పవిత్రముగా
ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడే పవిత్రతకు మూలం. మనం దేవుని రూపములో, పోలికలో
చేయబడ్డాము. దేవుని యందు భయభక్తులు, వినయ విధేయతలు కలిగి జీవించాలి.
“ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును” (యో 6:51). యేసు నిజమైన ఆహారము, నిజమైన పానము. రొట్టె విరచినప్పుడు శిష్యులు ఆయనను గుర్తించారు. మనం దివ్యసత్ప్రసాదములో యేసును గుర్తించాలి. ఆయనను ఆరాధించాలి. ఆయన మన విశ్వాసాన్ని పదిల పరచును. దివ్యసత్ప్రసాదము మన ఆధ్యాత్మిక పోషణ. శాశ్వత జీవితమును ఒసగును. యేసుక్రీస్తులో ఐఖ్యమగునట్లు చేయును. ప్రతీరోజు కొనియాడు దివ్యబలిపూజ ద్వారా, మనం నిత్య జీవితములోనికి నడిపింప బడాలని ప్రార్ధన చేద్దాం.
No comments:
Post a Comment