పాస్కా మూడవ మంగళవారము (I)

 పాస్కా మూడవ మంగళవారము
అ.కా. 7:51-8:1; యోహాను 6:30-35
ధ్యానం: నేనే జీవాహారము

“నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించు వాడు ఎన్నడును దప్పిక గొనడు” (యో 6:35). “నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును” (6:32). తండ్రి దేవుడు పరలోకమునుండి ఒసగు నిజమైన ఆహారము యేసు క్రీస్తు ప్రభువే.

ఆ జీవాహారాన్ని దివ్యపూజా బలిలో స్వీకరిస్తున్నాము. ఇది దైవరాజ్యాన్ని సూచిస్తుంది. ప్రభువు ఇలా అన్నారు, “మీరు నా రాజ్యములో నాతోకూడా విందు ఆరగించెదరు” (లూకా 22:29). “ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వానితో భుజింతును. అతడు నాతో భుజించును” (దర్శన 3:20). మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చు కొంటిమి: (అ.కా. 10:41) అని శిష్యులు సాక్ష్య మిచ్చిరి.

యూదులు, ఎడారిలో దేవుడు ఒసగిన మన్నాను దేవుని రొట్టెగా/ఆహారముగా భావించారు (కీర్త 78:24; నిర్గ 16:15). మెసయ్య వచ్చినప్పుడు పరలోకము నుండి మన్నా ఒసగుతాడని బలముగా నమ్మారు. యేసు తానే మెస్సయ్య అని చెప్పారు. అయినను వారు ఆయనను విశ్వసింపక, “నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గురుతు నిచ్చెదవు? ఏ క్రియలు చేసెదవు? అని ప్రశ్నించారు. అందుకు యేసు, “వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను. మీకిచ్చినది మోషే కాదు. తండ్రి నిజమైన ఆహారమును ప్రసాదించును. నేనే జీవాహారమునుఅని సమాధానమిచ్చాడు. మన్నా నిజమైన ఆహారము కాదు. అది రాబోయే జీవాహారమునకు సూచనగా మాత్రమే ఉన్నది.

యేసు తననుతాను జీవాహారముగా బహిర్గత పరచాడు. ఆయన వద్దకు వచ్చిన యెడల ఎన్నటికి ఆకలి గొనరు. ఆయనను విశ్వసించువారు ఎన్నటికి దప్పిక గొనరు. ఈ జీవాహారము మనకొసగబడిన దేవుని జీవమే. ఇది మన హృదయ ఆకలిని తీర్చగల జీవాహారము.

దేవుని కొరకు, నిత్య జీవితాన్ని ఒసగు జీవాహారము కొరకు ఆకలి గొన్నామా? పరలోకము నుండి దిగివచ్చిన నూతన మన్నాఅయిన యేసుక్రీస్తును విశ్వసించుదాం. నిత్యజీవపు ఆహారముగా యేసును ప్రేమగా స్వీకరించుదాం. విశ్వాసముతో సత్ప్రసాదములో కొలువైన క్రీస్తును స్వీకరించుదాం. యేసు బోధనలు ఆహారముకన్న ముఖ్యమైనవి. మనకు ఆధ్యాత్మిక పోషణ ఒసగును. ఆయన మాటలను ఆలకించి విశ్వసించుదాం.

No comments:

Post a Comment