పాస్కా రెండవ శుక్రవారము (I)

 పాస్కా రెండవ శుక్రవారము
అ.కా. 5:34-42; యోహాను 6:1-15
ధ్యానం: అయిదు వేలమందికి ఆహారము

నేటి సువిశేషంలో యేసుక్రీస్తు అయిదు వేలమందికి అయిదు రొట్టెలను, రెండు చేపలను అద్భుతరీతిన పంచినట్లుగా వింటున్నాము. స్త్రీలు, పిల్లలు మినహాయించి అయిదు వేలమంది యుండిరి. యేసు ఎందుకు ఈ అద్భుతాన్ని చేసారు? మొదటిగా, ప్రజలు దేవుని వాక్యము కొరకు ఆధ్యాత్మిక ఆకలితో యుండిరి. అధ్యాత్మికముగా తమను పోషించగల మరియు జీవముగల వాక్కు కొరకు వారు యేసు వద్దకు వచ్చిరి. యేసును ఆలకించుట కొరకు వారు వచ్చిరి. అయినను వారు శారీరక ఆకలిని గొనుట యేసు చూచెను. కనుక రెండవదిగా, వారు భౌతిక ఆకలితో ఉండిరి. భోజనము మనందరికి ప్రాధమిక అవసరము. తినకుండా ఉండలేము, జీవించలేము. వారి ఆధ్యాత్మిక ఆకలితో, వారియొద్ద నున్న ఐదు రొట్టెలు, రెండు చేపలను తీసుకొని, దేవునకు ధన్యవాదములు అర్పించి, వారి భౌతిక ఆకలిని కూడా తీర్చాడు.

మనవద్ద నున్న కొద్దిపాటిని ప్రభువునకు ఇవ్వడానికి సిద్ధపడితే, ఆయన మనకు సమృద్ధిగా ఒసగుతారు. అద్భుతములో ప్రభువు మనలను కూడా భాగస్తులుగా చేస్తారు. మనం ఉదారస్వభావము కలిగి యుండాలని ప్రభువు ఆశిస్తున్నారు. యేసు చేసిన ఈ అద్భుతము యొక్క ఉద్దేశాన్ని వారు గ్రహించలేక పోయారు. యేసే జీవముగల ఆహారము అని వారు అర్ధం చేసుకోలేక పోయారు.”ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన జీవించెదము” (ద్వితీ 8:3).

దివ్యసత్ప్రసాదం ప్రభువు మనతో పంచుకొనే దివ్యాహారము. ఇది మన ఆత్మలకు ఆహారం. ఇది మనలను ఐఖ్యం చేస్తుంది. దివ్యసత్ప్రసాదంద్వారా మనం ప్రభువు సన్నిధిలోనికి ప్రవేశిస్తాం. ప్రభువు మన చేరువలోనే ఉంటారు. ఆయన మనలను స్వేచ్చలోనికి నడిపిస్తారు. ఆయన లోకపాపాలను పరిహరించు దేవుని దివ్య గొర్రెపిల్ల.

అవసరములోనున్న సోదరీ సోదరులకు సహాయం చేయాలని ఈ అద్భుతం మనలను సవాలు చేయుచున్నది. యేసు మనకు ఆదర్శముగా ఉన్నారు. ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు మనకు అనేక అవకాశాలను ఇస్తూ ఉంటాడు. మనకున్న దానిని ఇతరులతో పంచుకున్నప్పుడు, మన జీవితములో కూడా అధ్బుతాలు జరుగుతాయి.

No comments:

Post a Comment

Pages (150)1234 Next