పాస్కా రెండవ శనివారము
అ.కా. 6:1-7; యోహాను
6:16-21
ధ్యానం: యేసు
నీటిపై నడక
‘ఐదు వేల మందికి ఆహారము’ అద్భుతము తరువాత, ప్రజలు వెళ్ళాక, శిష్యులు ఒక పడవపై
ఎక్కి, సరస్సు ఆవలివైపున
ఉన్న ‘కఫర్నామునకు’ పయనమయ్యారు.
ప్రార్ధించుటకై యేసు ఏకాంతముగా పర్వత ప్రాంతమునకు వెళ్ళారు. ప్రార్ధన అనగా తన
తండ్రి దేవునితో సంభాషించుట, తండ్రితో తన బంధాన్ని బలపరచుకొనుట, తన ప్రేషిత
కార్యమునకు బలమును చేకూర్చుకొనుట.
సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరినది. యేసు మాత్రము
తీరముననే ఒంటరిగ ఉన్నాడు. గాలి ఎదురుగా వీచుచుండుటచే శిష్యులు శ్రమపడుట యేసు చూసాడు.
ఈ సన్నివేశం మన జీవితాలలోకూడా తరుచుగా సంభవిస్తూ ఉంటుంది. మన విశ్వాసం
ఊగిసలాడుతున్నప్పుడు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు, దేవుడు లేడని, మనకు ఎక్కడో
దూరముగా ఉన్నాడని, మన ప్రార్ధనలను ఆలకించడం లేదని భావిస్తూ ఉంటాము.
ఇలాంటి సమయములో మొదటిగా మనం చేయాల్సినది ప్రార్ధన. ప్రభువు ఎల్లప్పుడు మన
చేరువలోనే, దరిలోనే ఉన్నారు.
సముద్రముపై వచ్చు యేసును చూచి శిష్యులు భయభ్రాంతులైనారు. కాని యేసు వారితో, “నేనే, భయపడకుడు” అని చెప్పారు.
ఒక్కోసారి భయము మన విశ్వాసాన్ని జయిస్తుంది! అలాంటి సమయములో విశ్వాసం కొరకు
ప్రార్ధన చేయాలి!
“ప్రేమయందు భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమి వేయును” (1 యో 4:18).
భయపడువారు, క్రీస్తును, ఆయన ప్రేమను
గుర్తించలేరు. శిష్యుల హృదయములు కఠీనమాయెను, అందుకే ఐదు రొట్టెల అద్భుతములోని అంతర్యమును
గ్రహింపలేక పోయారు. నీటిపై నడచి వచ్చిన యేసును గుర్తింపలేక పోయారు.
“శిష్యులు యేసును పడవలోనికి ఎక్కించుకొన కోరిరి. ఇంతలో వారు వెళ్ళవలసిన స్థలము వచ్చి చేరెను.” యేసు మన జీవితములో ఉంటే, ఎలాంటి కష్టమైనా కరిగిపోతుంది. శాంతి, సమాధానాలు ఉంటాయి. ఆయన సన్నిధి మనలోని భయాలను తొలగిస్తుంది. క్రీస్తుతో నడచిన, ఎన్ని తుఫానులనైనను మనం దాటవచ్చు. యేసు నీటిపై నడచుట యేసులోని దైవీక శక్తిని ప్రదర్శిస్తుంది. దేవుడు మోషేతో “నేను ఉన్నవాడను” (నిర్గమ 3:14) అన్న మాటలు గుర్తుకొస్తాయి. శ్రీసభలోను, మనలోను ఉన్న పెనుగాలి వంటి భయాలను యేసు క్రీస్తు తొలగించునని విశ్వసించుదాం. వ్యక్తిగత జీవితములో బలమైన సందేహాలకు, ప్రలోభాలకు, భయాందోళనలకు, చింతలకు లోనైనప్పుడు, రక్షింపుమని యేసును వేడుకుందాం.
No comments:
Post a Comment