పాస్కా రెండవ గురువారము (I)

 పాస్కా రెండవ గురువారము
అ.కా. 5:27-33; యోహాను 3:31-36
ధ్యానం: పరలోకమునుండి వచ్చువాడు

నేటి సువిశేషం యేసుక్రీస్తు తండ్రియొద్దనుండి వచ్చిన రక్షకుడని తెలియజేయు చున్నది. “పైనుండి లేదా పరలోకము నుండి వచ్చువాడు అందరి కంటె అధికుడు”. ఆయన చూచిన, వినిన పరలోక విషయములగూర్చి సాక్ష్యమిచ్చును. క్రీస్తు సాక్ష్యమును తిరస్కరించడం దేవున్ని తిరస్కరించడమే. ఆయనను విశ్వసించువారు నిత్యజీవమును పొందుదురు. యేసును విశ్వసించువారు దేవుని ప్రేమను అంగీకరించువారు. విశ్వసించనివారు దేవుని ప్రేమను నిరాకరించువారు. దేవుని ప్రేమను నిరాకరించడం అనగా దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి పంపిన తన కుమారుడు, రక్షకుడైన క్రీస్తును నిరాకరించడమే! అట్టివారు తమనుతాము ఖండించుకున్నవారగుదురు. అవిశ్వాసము వలన మరణాన్ని, చీకటిని ఎన్నుకుంటారు. వారిపై దేవుని కోపము నిలిచి యుంటుంది. దేవుని కోపము తన ప్రేమను తిరస్కరించడం నుండి వచ్చే తీర్పు. అట్టివారు నిత్యజీవమును కోల్పోవుదురు. “దేవుని కుమారుడైన క్రీస్తును విశ్వసించుట వలన మనం జీవము పొందెదము” (యో 20:31). నిత్యజీవమును పొందుటకు దేవుని ఆజ్ఞలను పాటించాలి. “ఈ లోకమున తన ప్రాణమును ప్రేమించువాడు నిత్యజీవమును కోల్పోవును. తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును” (యో 12:25).

తండ్రి సమస్తమును ఆయనకు అప్పగించి యున్నాడు. ఆయనను మనం విశ్వసించాలి, విధేయించాలి. “మనుష్యులకు కాక, దేవునికి విధేయులము కావలయును” (అ.కా. 5:29) అని పేతురు తెలియజేయుచున్నారు. సర్వాధికారం దేవుని యొద్దనుండి వచ్చును. దేవుని చట్టానికి లోబడి మనం జీవించాలి. ‘విధేయత’ అనగా అధికారానికి, చట్టానికి లొంగడం. క్రీస్తును విశ్వసించడం అనగా ఆయనకు విధేయులమై జీవించడం. క్రీస్తును విశ్వసించడం అనగా ఆయనను వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించడం మాత్రమేగాక, ఆయన మనకొరకు చేసిన త్యాగములో ఆయను అనుసరించడం. క్రీస్తును సంపూర్ణముగా అంగీకరించడం. వ్యక్తిగత సౌలభ్యానికి, కీర్తికి, పేరుప్రతిష్టలకు, సంపదలకు ప్రాముఖ్యతను ఇచ్చిన యెడల, దేవునికి మనం సంపూర్ణ విధేయతను చూపలేము. దేవునితో స్నేహాన్ని, సహవాసాన్ని, నిత్యజీవితాన్ని కోల్పోతామేమో అన్న భీతి మనలో ఉండాలి. యేసునందు సంపూర్ణ రక్షణ కలదని, ఆయన నిత్యజీవపు మాటలు కలవాడని దృఢముగా విశ్వసించుదాం.

ఈరోజు పునీత స్తనిస్లావుస్ (బిషప్, వేదసాక్షి, క్రీ.శ. 1030-1079) గారిని స్మరించుకుంటున్నాము. పోలండు దేశములో సువార్తా ప్రచారకునిగా, మంచి ఆధ్యాత్మిక సలహాదారుగా పేరు గడించారు. ఆనాటి రాజు క్రూరత్వాన్ని, పాపపు పనులను ఖండించాడు. అతనికోసం ప్రార్ధించాడు. చివరికి ఆ రాజు చేతిలోనే వేదసాక్షి మరణాన్ని పొందాడు.

No comments:

Post a Comment