పాస్కా మూడవ శుక్రవారము (I)

 పాస్కా మూడవ శుక్రవారము
అ.కా. 9:1-20; యోహాను 6:52-59
ధ్యానం: దివ్యసత్ర్పసాదం

“మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి, ఆయన రక్తమును త్రాగిననే తప్ప, మీలో జీవము ఉండదు” (యో 6:53). దివ్యసత్ప్రసాదములో క్రీస్తు సాన్నిధ్యం నెలకొన్నదని నేటి సువిశేష పఠనం తెలియజేయు చున్నది. “నా శరీరము నిజమైన ఆహారము. నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందును” (యో 6:55-56).

దివ్యసత్ర్పసాదం యొక్క ప్రభావాలు నాలుగు: 1. నిత్య జీవితం: నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును(యో 6:54). దివ్యసత్ర్పసాదంతో మనకు లభించే కృపానుగ్రహము మనల్ని కడవరకు నడిపిస్తుంది. పౌష్టికాహారం ఏ విధముగా అయితే మనకు బలాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందో, “దివ్యసత్ర్పసాదంకూడా దైవ జీవమును అనగా దేవునిలో ఐక్యతను ప్రసాదించునంత వరకు, శాశ్వత జీవము ఇచ్చునంత వరకు, ఈ భోజన ప్రభావము ఏ మాత్రం ఆగిపోదు.

2. పునరుత్థానము: పై వచనాన్ని మనం పరిశీలిస్తే భక్తి, విశ్వాసాలతో ‘దివ్యసత్ర్పసాదాన్ని’ స్వీకరించే వారు, నిత్య జీవితాన్ని పొందుకుంటారని ప్రభు వాగ్దానం చేసియున్నారు. దేవునితో బసచేయబడిన మహిమ కొరకు అనగా మరణాంతరం పునరుత్థాన మహిమతో మనలను లేవనెత్తి పరలోక బహుమానమైన నీతి కిరీటము మనకు అందించు వరకు ఈ దివ్య భోజనం మనలో తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది.

3. ప్రభువుతో సహవాసం: నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నా యందు, నేను వానియందు ఉందును” (యో 6:56). ‘దివ్యసత్ర్పసాదం’ స్వీకరించడం ద్వారా మన శరీరం క్రీస్తు శరీరముగా, మన హృదయం క్రీస్తు హృదయముగా రూపాంతరం చెందుతుంది. ‘దివ్యసత్ర్పసాద’ రూపంలో క్రీస్తు మన హృదయంలోనికి వచ్చిన తర్వాత మనము ఆయనతో ఏకమవుతున్నాము. క్రీస్తుతో పాటు మనము జీవిస్తున్నాం.

4. క్రీస్తు ద్వారా నూతన జీవితం: పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను” (యో 6:51). భౌతిక ఆహారం మనకు శక్తిని, బలాన్ని ఇస్తుంది. రోజువారీ పనులను చేసుకోవటానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది. మన ఆత్మలను పోషించటానికి ఆహారం అవసరం. ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రీస్తు భగవానుడు ‘దివ్యసత్ర్పసాదముగా’ మనకు అనుగ్రహించారు.

అయితే భౌతికాహారాన్ని జీర్ణించుకుని శక్తిని పొందడానికి ఆరోగ్యకరమైన దేహం ఎంత అవసరమో, అలాగే క్రీస్తు నాథుడు ప్రసాదించే ‘దివ్యసత్ర్పసాదాన్ని’ స్వీకరించి ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని పొందటానికి మన ఆత్మలు ఆరోగ్యంగా ఉండటానికి పవిత్రంగా ఉండటానికి కూడా ఈ జీవాహారం అంతే అవసరం. పరిపూర్ణ విశ్వాసముతో యోగ్యమైన రీతిలో నిండు పూజలో పాల్గొని ‘దివ్యసత్ర్పసాదాన్ని’ స్వీకరించుదాం.

No comments:

Post a Comment