పాస్కా మూడవ శనివారము (I)

 పాస్కా మూడవ శనివారము
అ.కా. 9:31-42; యోహాను 6:60-69
ధ్యానం: జీవవాక్కు

అనేక మంది ప్రజలు యేసు చేసిన అద్భుతములను చూచి ఆకర్షితులయ్యారు. తన శరీరమును భుజించి, రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదు (యో 6:51-59) అని ఎప్పుడైతే బోధించాడో, అనేకమంది ప్రజలు దానిని అంగీకరించలేక పోయారు. కడరాత్రి భోజన సమయములో ప్రభువు వాగ్ధానము చేసిన దివ్యసత్రసాదమును వారు అర్ధము చేసుకోలేక పోయారు, గ్రహించలేక పోయారు. అందుకే వారు ఆయనను అనుసరించడం మానేసారు. యేసును వారు విడిచి పెట్టారు. మరెన్నడు ఆయనను వెంబడింపరైరి. ఆ సమయములో యేసు తన బోధనను మార్చుకోలేదు. కాగా, తన శిష్యులను సవాలు చేసారు, “మీరును వెళ్లి పోయెదరా?” అప్పుడు పేతురు, “ప్రభూ! మేము ఎవరి యొద్దకు పోయెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమిఅని సమాధానం చెప్పాడు (యో 6:67-68).

యేసు మాటలు ఆత్మ, జీవము కలవి. అన్నీ అర్ధమైతేనే విశ్వసిస్తామని కాదుగాని, విశ్వసిస్తే అన్నీ గ్రహించగలము. దేవుని వాక్యాన్ని చదవడం ఆదివార ప్రార్ధనలో ఒక ముఖ్యమైన భాగముగా అనాధి కాలముగా వస్తున్నది. బైబులు గ్రంథాన్ని మనం ఎంతో గౌరవిస్తాము. దానిని ప్రదక్షిణలో తీసుకు వెళ్తాము. అయితే, ఆ వాక్కును మనం అనుసరించాలి, పాటించాలి. ఆ వాక్కును ఇతరులకు తెలియ జేయాలి. మనం బోధించే వాటిని పాటించాలి. శిష్యులవలె యేసును విశ్వసించుదాం. జీవవాక్కుగల యేసును ప్రభువుగ మన హృదయాలలో ప్రతిష్టించు కోవాలి. ఆ జీవవాక్కును మనం అనుదిన జీవితములో ఆచరించాలి. గొప్ప నమ్మకముతో, విశ్వాసముతో ప్రభువును అనుసరించాలి. మనం ఎవరి యొద్దకు పోయెదము? సర్వము ఆయనే! ప్రేమ, క్షమ, శాంతి, నిరీక్షణ, రక్షణ.... సర్వం ఆయనయే!

No comments:

Post a Comment