పాస్కా మూడవ సోమవారము (I)

 పాస్కా మూడవ సోమవారము
అ.కా. 6:8-15; యోహాను 6:22-29
ధ్యానం: జీవాహారము

‘ఐదు వేల మందికి ఆహారముఅద్భుతము తరువాత, ప్రజలు యేసు కొరకు వెదకు చుండిరి. వారు యేసును కనుగొని, “బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?” అని అడిగిరి. బహుశా వారు భౌతిక ఆహారము కొరకు వచ్చి యుండవచ్చు. ఐదు రొట్టెలు, రెండు చేపలను ఐదు వేలమందికి పంచిన ప్రభువు, ఇంకా ఎంతో ఆహారాన్ని ఇవ్వగలడని వచ్చి యుండవచ్చు. అందుకే యేసు, “మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా అద్భుత చిహ్నములను చూచి కాదుఅని వారిని మందలించాడు. ఆయన వారి భౌతిక ఆకలిని తీర్చాడు కాబట్టి, ఆయనను వెతుకుతూ వచ్చారు. భౌతిక ఆకలికన్న, ఆధ్యాత్మిక ఆకలి కలిగియుండాలి. అందుకే ప్రభువు అంటున్నారు, “అశాశ్వతమైన భోజనమునకై శ్రమింప వలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడుఅని చెప్పియున్నారు. ఉన్నతమైన వాటికొరకు ప్రయత్నం చేయమని ప్రభువు కోరుచున్నారు. అందుకే ప్రభువు ఇలా అన్నారు, “మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు. అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింప బడును” (మత్త 6:33). అలాగే, “నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము” (యో 4:34) అని చెప్పియున్నాడు.

నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనము, యేసుక్రీస్తు శరీర రక్తములే అని మనం గుర్తించాలి. ఆయనే నిజమైన, శాశ్వత జీవాహారము. అందుకే, దివ్యబలిపూజా మనకు చాలా ప్రాముఖ్యము. మన్నా అశాశ్వతమైనది. కాని, దివ్యపూజలోని క్రీస్తు శరీర రక్తములు నిత్యజీవమును ఒసగు దివ్యాహారము. ఆయన స్వయముగా తండ్రి నుండి దిగివచ్చిన జీవాహారము. నిత్య జీవితానికి నడిపించే సజీవ ఆహారము.

నేడు మనం ప్రభువును దేనికోసం వెదుకుచున్నాము, అనుసరిస్తున్నాము? కేవలం ఆయన అద్భుతాల కొరకు వెదుకుచున్నామా? మన భౌతిక అవసరాల కొరకు మాత్రమే క్రీస్తు వైపుకు ఆకర్షితులమవు చున్నామా? విశ్వాస కన్నులతో ప్రభువును వెదుకుదాం. దృఢవిశ్వాసముతో ఆయనను అనుసరించుదాం. ఆయన మాత్రమే మనలను తండ్రి యొద్దకు నడిపించ గలడు. మన విశ్వాసమే మనలను నిత్యజీవమునకు నడిపించగలదు. మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా, క్రీస్తు అనుచరులుగా జీవించుదాం. మనకు ఆశ్చర్యం కలిగించే విధముగా మన భౌతిక అవసరాలకు కూడా ఎలాంటి లోటు ఉండదు.

No comments:

Post a Comment