పాస్కా రెండవ బుధవారము
అ.కా. 5:17-26; యోహాను
3:16-21
ధ్యానం: దేవుడు
ప్రేమస్వరూపుడు
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని
ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్యజీవము పొందుటకై
అట్లు చేసెను” (3:16). ఈ వాక్యం సువార్త సారాంశం అని చెప్పవచ్చు. నిజమైన
ప్రేమికులు తమ సమస్తాన్ని వారు ప్రేమించే వారికొరకు త్యాగం చేయడానికి సిద్ధపడతారు.
దేవుడు మనలను మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. దీనికి ఋజువు, మన పాపాల
పరిహార్ధమై, తన రక్షణ నిమిత్తమై, దేవుడు తన ప్రియ కుమారున్ని
మనకోసం సిలువపై బలిగా అర్పించాడు. ఎంత గొప్ప ప్రేమ మన దేవుని ప్రేమ! మనం ఆయన
దరిచేరే వరకు ఆయన విశ్రాంతి నొందడు. తన రక్షణను ఏదీ అడ్డుకొనలేదు.
దేవుడు ఈ లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? అది ఈ లోకం
గొప్పతనం వలననా? ఎంతమాత్రము కాదు. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమించడం
దేవుని స్వభావం. అతని ప్రేమ లోతైనది, విశాలమైనది. పునీత అగుస్తీను గారు అన్నట్లు, లోకములో దేవున్ని
ప్రేమించేవారు ఒక్కరు ఉన్నను, దేవుడు ప్రతీ ఒక్కరిని ప్రేమిస్తాడు. దేవుడు ఈ
లోకాన్ని ఖండిస్తాడా? “దేవుడు తన కుమారున్ని లోకమును రక్షించుటకు
పంపెనే కాని, దానిని ఖండించుటకు
పంపలేదు”. “తండ్రి ఎవనికిని తీర్పు విధించడు” (యో 5:22). కుమారుడు
కూడా తీర్పు విధింపడు, ఎందుకన ఆయన రక్షించుటకే పంపబడ్డాడు.
విశ్వసింపని వారు ఖండింపబడియేఉన్నారు. దుష్క్రియలు చేయువాడు వెలుగును (క్రీస్తు) ద్వేషించును. సత్యవర్తనుడు వెలుగును సమీపించును. కనుక, ఎవరికివారే తీర్పును విధించుకుంటున్నారనే సత్యం మనకు బయల్పడు చున్నది. మంచి చెడులను ఎన్నుకొను లేదా నిర్ణయం చేయు శక్తిని దేవుడు మనకొసగి యున్నాడు. మనపై ప్రతీకారం తీర్చుకోవడం దేవుని ఉద్దేశ్యం కాదు.
మనం విశ్వాసులం. క్రీస్తు సిలువను విశ్వసిస్తున్నాము. మన సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరిస్తున్నాము. యేసుక్రీస్తు సిలువ మనలను నిత్యజీవమునకు నడిపించునని విశ్వసిస్తున్నాము. దేవుని ప్రేమకు, కుమారునకు, రక్షణకు కృతజ్ఞతలమై జీవించుదాం.
No comments:
Post a Comment