పాస్కా మొదటి బుధవారము
అ.కా. 3:1-10; లూకా
24:13-35
ధ్యానం: ఎమ్మావు
మార్గములో యేసు దర్శనం
ఎమ్మావు మార్గములో వెళ్ళుచున్న ఇరువురు శిష్యులు ఉత్థాన
ప్రభువును మొదటగా గుర్తించలేక పోయారు. వాస్తవానికి, వారు నిరాశతో
వెనుదిరుగుచున్నారు. యేసు మరణం వారి ఆశలను, కలలను చెదరగొట్టింది. అలాంటి సమయములో,
యెరూషలేములో జరిగిన సంఘటనలను అర్ధంచేసుకోవడానికి, ప్రభువు వారితో పయనిస్తూ, వారికి
లేఖనాలను వివరించాడు. క్రీస్తును గురించిన ప్రవచనాలను మళ్ళీ వారికి వివరించాడు.
ఇదే విషయాన్ని పౌలుగారు, సిలువ లేకుండా క్రీస్తు లేడని చెప్పారు. “క్రీస్తుతో పాటు
నేనును సిలువవేయ బడితిని. కనుక ఇక జీవించునది నేను కాదు. క్రీస్తే నాయందు
జీవించుచున్నాడు” (గలతీ 2:19-20).
శిష్యులు ప్రభువును గుర్తించక పోవడానికి కారణం ఏమిటి? యేసు సిలువపై వేలాడదీయ బడటం చూసి వారు కలవర పడ్డారు. ఆయన బోధనలను మరచిపోయారు. వారు పునరుత్థానం కొరకు వేచియుండలేదు. ప్రభువు వాగ్దానాలను గుర్తుంచు కోవడములో విఫలమయ్యారు. వారు స్వయముగా సత్యాన్ని గ్రహించలేక పోయారు. ప్రభువు రొట్టెను విరిచినప్పుడు మాత్రమే వారు ఆయనను గుర్తించారు.
మన సంగతేమిటి? వాక్యములోను, దివ్యపూజాబలిలోను ప్రభువును గుర్తిస్తున్నామా? పవిత్ర బైబులు గ్రంథము మరియు దివ్యసత్ర్పసాదము రెండు కూడా ప్రభువును గూర్చి తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గాలు. ‘వాక్యం’లో ప్రభువును తెలుసుకోవడం ద్వారా ఆయన ప్రేమకు పరాకాష్ట అయిన అతని శరీరరక్తాలు, ఆయన గూర్చి పూర్తిగా తెలుసుకునేలా చేస్తుంది. దివ్యసత్ర్పసాదములోనున్న ప్రభువు సాన్నిధ్యం మనతో ఉంటుంది. మనలను నడిపిస్తుంది. సత్యం వైపుకు మనలను నడిపించ ఉత్థాన ప్రభువును వేడుకుందాం.
No comments:
Post a Comment