పాస్కా మొదటి మంగళవారము (I)

 పాస్కా మొదటి మంగళవారము
అ.కా. 2:36-41; యోహాను 20:11-18
ధ్యానం: ఉత్థాన క్రీస్తు మగ్దల మరియకు దర్శనం

మగ్దల మరియమ్మ ప్రభువును వెదికినది. మొదట, ఆమె ఉత్థాన ప్రభువును గుర్తించలేదు. ఎందుకన ఆమె దృష్టి ప్రభువుపైగాక, ఖాళీ సమాధిపై, ఆమె శోఖముపై ఉండినది. వాస్తవానికి, ఖాళీ సమాధికి మనం చాలా ప్రాముఖ్యతను ఇస్తాము. అది ప్రభువు ఉత్థానమునకు సూచన. పౌలుగారు అన్నట్లు, “క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే” (1 కొరి 15:14). విశ్వాసానికి మకుటాయమన సత్యం, యేసు పునరుత్థానం (సత్యోపదేశం, 638). “మరియమ్మా” (20:16) అన్న ప్రభువు పిలుపు ఆయనను గుర్తించేలా చేసింది. ఆతరువాత, పునరుత్థానం గూర్చిన శుభవార్తను శిష్యులకు ప్రకటించే ఆమె లక్ష్యాన్ని గుర్తుకు చేసింది. మగ్దల మరియమ్మ శిష్యులకు అందించిన శుభసందేశం, “నేను ప్రభువును చూచితిని” (20:18). ప్రభువును కేవలం తెలుసుకుంటే సరిపోదు. ఆయనను వ్యక్తిగతముగా తెలుసుకోవాలి. ఆయన గూర్చి వాదిస్తే సరిపోదు, ఆయనను కలుసుకోవాలి. మనలను వ్యక్తిగతముగా మిక్కిలిగా ప్రేమించే ప్రభువును, తన మహిమను మనతో పంచుకొనే సజీవ దేవుడైన ప్రభువును పునరుత్థానములో కలుసుకుంటాము. 

మగ్దల మరియమ్మవలె మనంకూడా చేయవలసిన లక్ష్యం ఉంది. తోటి సహోదరీ సహోదరులకు, ప్రభువు పునరుత్థానం గురించిన శుభవార్తను ప్రకటించాలి. మొదటిగా, సువార్తను ప్రకటించాలి. మన విశ్వాసాన్ని ప్రకటించడానికి మనం ఎల్లప్పుడు సిద్ధముగా ఉండాలి. రెండవదిగా, యేసు పునరుత్థానమే మన నిరీక్షణ. అంతిమముగా ప్రభువును ముఖాముఖిగా చూస్తామని, అతని శాశ్వత మహిమలో పాలుపంచుకుంటామని మన గొప్ప ఆశ. పునీత పేతురు ఇలా అన్నారు: “మీరు ఆయనను చూడక పోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు ఫలితముగ మీ ఆత్మ రక్షణను మీరు పొందుచున్నారు” (1 పేతురు 1:8-9). మన పిలుపు విశ్వాసం సాతాను దుష్టశక్తులనుండి రక్షించబడాలని ప్రార్ధన చేద్దాం.

No comments:

Post a Comment