పాస్కా మొదటి గురువారము (I)

 పాస్కా మొదటి గురువారము
అ.కా. 3:11-26; లూకా 24:35-48
ధ్యానం: యేసు శిష్యులకు దర్శనం

యేసు తన పదకొండుగురు శిష్యులకు దర్శనమిచ్చాడు. యేసు వారి మధ్య నిలిచి, “మీకు శాంతి కలుగునుగాక!” అని పలికాడు. అప్పుడు శిష్యులు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించారు. తాను భూతమును కానని, “నేను ఆయననే” అని ప్రభువు వారికి భరోసా ఇచ్చారు. ప్రభువు శిష్యులతో తన పునరుత్థానము వాస్తవమని పునరుద్ఘాటించు చున్నారు. తన గాయాలను చూడమని, తనను తాకమని వారిని అడుగుచున్నాడు. తన మరణము, ఉత్థానము గూర్చిన లేఖనములలోని ప్రవచనాలను వివరించాడు. అయినను వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ప్రభువు తన ఉత్థానానికి చివరి ఋజువుగా, “తినడానికి ఏమైన ఉన్నదా?” అని అడిగాడు. మహిమాన్వితమైన తన శరీరమునకు భోజనము అవసరము లేదు. అయినను ప్రభువు తన శిష్యులకొరకు వారితో భుజించాడు. వారు ప్రభువును గుర్తించారు. కలిసి భుజిస్తే బంధాలు బలపడతాయి. స్నేహితులతో కలిసి భుజిస్తే, వారు దగ్గరవుతారు. తనను గూర్చిన లేఖనములన్నియు నెరవేరినందున, శిష్యులు వీటన్నింటికి సాక్షులు.

ఉత్థానం అద్భుతమైన సంఘటన. ఇది మరణం మరియు పాపముపై అంతిమ విజయము. అందువలన, మనం సంతోషించాలి. కృతజ్ఞత కలిగి యుండాలి. అలాగే, క్రీస్తు ఉత్థానం హృదయపరివర్తనను, పాపక్షమాపణను కలిగించ వలయును. మనలో ప్రతీ ఒక్కరికీ పాపక్షమాపణ అవసరమే. ఎందుకన, హృదయపరివర్తన చెంది, దేవునివైపు మరలిన యెడల, ఆయన మన పాపములను తుడిచివేయును (అ.కా.3:19). అలాగే, హృదయపరివర్తన, పాపక్షమాపణ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలి. క్షమను పొందిన అపోస్తలులు ధైర్యముగా, ఉత్సాహముతో సువార్త సందేశాన్ని ప్రకటించారు. 

క్షమించడం దైవిక లక్షణం. కనుక, వినయపూర్వకమైన హృదయముతో, యేసు నామమున క్షమాపణ స్వస్థత కొరకు దేవుని సహాయమును వేడుకుందాం. ఉత్థాన క్రీస్తుకు సాక్ష్యులై జీవించుదాం.

No comments:

Post a Comment