పాస్కా మొదటి శుక్రవారము
అ.కా. 4:1-12; యోహాను
21:1-14
ధ్యానం: యేసు
సరస్సుతీరమున దర్శనము
యేసు తిబేరియా సరస్సు తీరమున ఏడుగురు శిష్యులకు మరల దర్శనము
ఇచ్చాడు. శిష్యులు చేపలు పట్టుకొనుచుండగా, ప్రాత:కాలమున యేసు వారికి దర్శనమిచ్చాడు.
సాధారణ జీవితములో కూడా ప్రభువు విశ్వాసులకు తననుతాను తెలియ బరచుకొనుననే విషయాన్ని మనం
అర్ధం చేసుకోవాలి. మనం ఎక్కడ ఉన్నను, మన విశ్వాసం ఎల్లవేళలా ప్రభువునందు మాత్రమే
ఉండాలన్నది ఆయన కోరిక. ప్రభువును విశ్వసించిన యెడల, ఆశ్చర్యకరమైన అద్భుతములు మన
జీవితములో జరుగుతాయి.
శిష్యులు లోకములో మరొకసారి వైఫల్యాన్ని చవిచూసారు.
రాత్రంతయు శ్రమపడినను, వారికి ఏమియు దొరకలేదు. అలాంటి సమయములో, “పడవకు కుడివైపున
వల వేయుడు. చేపలు దొరుకును” అన్న దైవిక ప్రేరణ అవసరం. దేవుని స్వరాన్ని మనం
వినగలగాలి. విధేయించాలి. అప్పుడు మనం కూడా సమృద్ధిగా ఫలిస్తాము. ఆత్మ ప్రేరణకు, మన
మనస్సు, హృదయాలను ఎల్లప్పుడు తెరచి ఉంచాలి.
యేసు శిష్యులకొరకు ఒడ్డున వేచియున్నాడు. ప్రభువు వారిపైనున్న ప్రేమ, శ్రద్ధ కనిపిస్తున్నది. అలసిపోయిన తన శిష్యులకు రుచికరమైన భోజనమును వడ్డించుటకు వేచియున్నాడు. తన సేవకు సర్వస్వం విడిచి పెట్టిన వారికి తాను తోడుగా ఉంటానని భరోసాని ఇవ్వడానికి వేచియున్నాడు. ఇక వారికి ఏ కొరత యుండదు. యేసు ఇచ్చు ధైర్యముతో లోకాన్ని ఎదుర్కుంటారు.
ఉత్థాన ప్రభువు సాన్నిధ్యాన్ని మన అనుదిన జీవితములో గుర్తిస్తున్నామా? ప్రభువును గూర్చిన మన వ్యక్తిగత అనుభవమేమి? యేసు ప్రేమించిన శిష్యుడు “ఆయన ప్రభువే” అని గుర్తించాడు. అప్పుడు ఇతర శిష్యులు కూడా ఆయనను గుర్తించారు. ప్రియమైన శిష్యుడు ప్రభువు కదలికలను గుర్తిస్తాడు. భగవంతుని ఉనికిని గ్రహిస్తాడు. నీవు యేసుకు ప్రియమైన శిష్యుడివి, శిష్యురాలివేనా?
No comments:
Post a Comment