పాస్కా నాలుగవ సోమవారము
అ.కా. 11:1-18; యోహాను
10:1-10
ధ్యానం: గొర్రెల మంద దృష్టాంతము
నేడు సువిశేష పఠనములో, కాపరి, గొర్రెల గురించి వింటున్నాము. యోహాను సువార్తికుడు, తన సువార్తలో, ఉత్థాన క్రీస్తును వివిధ
బిరుదులతో మనకు పరిచయం చేస్తున్నాడు: “జీవాహారము, జగతికి జ్యోతి... మొ.వి.
ఈరోజు క్రీస్తును “మంచి కాపరి”గా సువార్తలో
చూస్తున్నాము. ప్రతీ బిరుదుకూడా సూక్ష్మముగా, గొప్పగా, అద్భుతముగా పరిచయం చేయబడింది. అలాగే, నేటి సువిశేషములో, యోహాను యేసును “ద్వారము”గా పరిచయం చేస్తున్నారు.
యేసు ఒక నూతన జీవితానికి ‘ద్వారము’. యేసు ‘గొర్రెల మంద దృష్టాంతము’ చెప్పినప్పుడు, విన్నవారు గ్రహించలేక పోయారు. “గొర్రెల దొడ్డిలోనికి ‘ద్వారము’న ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు, దోపిడికాడునై ఉన్నాడు” (10:1) అని యేసు చెప్పాడు.
గొర్రెల కాపరులు, గొర్రెల మందలను రాత్రులలో రక్షించుకోవడానికి, కంచెలను ఏర్పాటు చేస్తారు. దానికి ఒకే ద్వారము ఉంటుంది. “ద్వారమున ప్రవేశించువాడు గొర్రెలకాపరి” (10:2). వేరొక మార్గమున
వచ్చువాడు దొంగ, దోపిడికాడు. సంరక్షణ కొరకు, కొన్నిసార్లు వివిధ మందలను ఒకే చోట ఉంచుతారు. అలాంటప్పుడు, గొర్రెలు తప్పిపోక ఉండుటకు, వేరే మందలలో కలిసిపోకుండా, కావలివాడు తలుపు తీసినప్పుడు, కాపరి ముందుగ నడుచుచుండగా, గొర్రెలు కాపరి స్వరమును విని, గుర్తుపట్టును. కనుక అవి
వాని వెంట పోవును (10:3-4). పరాయి వాని (దొంగ, దోపిడికాడు) స్వరమును
ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్లక దూరముగా పారిపోవును (10:5).
నేడు గొర్రెలను, ఏకము చేయుటకు బదులుగా, వాటిని చెల్లాచెదురు చేసే కాపరులు ఎక్కువై పోయారు. వీరు నిజమైన క్రీస్తు అనుచరులు కానేరరు. వారి మహిమ కొరకు ప్రాకులాడువారు. స్వప్రయోజనాల కొరకు సువార్తలను నిర్దేశిస్తారు. వారి స్వంత ఆలోచనలను గుడ్డిగా నమ్ముతారు. వాస్తవానికి, వారు కాపరిలేని గొర్రెలవంటి వారు. సువర్తా బోధనలకు తిరిగి రావాలి. సువార్తా విలువల ప్రకారం జీవించాలి. క్రీస్తే నిజమైన ‘మార్గము’ అని గుర్తించాలి, విశ్వసించాలి. లోకమునకు వెలుగువలె, ఉప్పువలె, సువార్త సందేశాన్ని మనం ఈ లోకములో, జీవించాలి, ప్రకటించాలి. క్రీస్తు గొర్రెలను (విశ్వాసులు) సన్మార్గములో నడిపించుటకు మనము ప్రయత్నం చేయాలి. ఇది మనందరికి ఒక గొప్ప సవాలు! బాధ్యత!
No comments:
Post a Comment