పాస్కా నాలుగవ మంగళవారము (I)

 పాస్కా నాలుగవ మంగళవారము
అ.కా. 11:19-26; యోహాను 10:22-30
ధ్యానం: కాపరి స్వరము

నా గొర్రెలు [విశ్వాసులు] నా స్వరమును వినును. ఇచట యేసు తననుతాను ఒక కాపరిగా తెలియజేయు చున్నారు (యో 10:11). గొర్రెల కాపరివలె, ఆయన మనలను నడిపించును, మార్గము చూపును. మనలను ప్రేమించును. అపాయములనుండి రక్షించును. ఆయన మనలను వ్యక్తిగతముగా ఎరిగి యున్నారు. మన పేర్లు కూడా ఆయనకు తెలుసు. మనం నిజముగా ఆయన గొర్రెలమైతే, ఆయన మందకు చెందినవారమైతే, ఆయన స్వరమును గుర్తిస్తాము, ఆలకిస్తాము, వింటాము. అయనను అనుసరిస్తాము. ఈ లోకములోనే ఏ ఇతర స్వరములు మనలను బంధింపలేవు. యేసు స్వరమును నేడు మన మనస్సాక్షిలో, హృదయములో వినగలగాలి. ఆయనను అనుసరిస్తే మనకు నిత్యజీవితము లభిస్తుంది. శ్రమలను, బాధలను తట్టుకొని జీవించగలము. తండ్రిలో, యేసులో ఏకమై, ఐఖ్యమై జీవించగలము.

యేసు, తాను మెస్సయ్య అని స్పష్టముగా చెప్పినను, యూదులు ఆయనను తిరస్కరించారు. ఎందుకన, వారు ఆయనను ఆలకించలేదు, తద్వార ఆయనను విశ్వసించలేదు. వారు ఆయన గొర్రెలు కారు కనుక ఆయనను నమ్మలేదు. యూదులకు ప్రభువు మాత్రమే కాపరి (కీర్తన 23:1). కాని, యేసు గొర్రెలు ఆయన మాట వినును. ఆయనను వెంబడించును. ఆయనను ఆలకించి, విశ్వసించి, అనుసరించు వారికి నిత్యజీవమును ప్రసాదింతునని వాగ్దానం చేసారు. వారు ఎన్నటికి నాశనం చెందరు. ఎవరిచేత అపహరించబడరు (10:27-29). యేసు గొర్రెలమైన మనము, ఆయనతో సహవాసము కలిగి (ఐఖ్యమై, ఏకమై) జీవించినచో, ఆయన మనలను తండ్రి యొద్దకు నడిపించును. "నేనును, నా తండ్రియు ఏకమై యున్నాము" (10:30) అని యేసు పలికారు. యేసు నిజ దేవుడు.

“నేను నా తండ్రి వినినదంతయు మీకు విశదపరచితిని (యో 15:15). యేసు తండ్రి స్వరమును విన్నారు. మాట రావాలన్న, మాటలాడాలన్నా - వినగాలగాలి. వినటంద్వారా ఏం జరుగుతోంది? వినటంద్వారా తెలుసుకుంటాం. తెలుసుకొనటం ద్వారా అర్ధం చేసుకొంటాం. అర్ధం చేసుకొనటంద్వారా ఎదుగుతాం, అభివృద్ది చెందుతాం! ఆ ఎదుగుదల ఆత్మయందు, సత్యమందు, ఆయనయందై ఉండాలి! అందుకే పౌలుగారు, రోమీయులకు వ్రాసిన లేఖలో, "వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును" (10:17) అని స్పష్టముగా చెప్పియున్నారు.

No comments:

Post a Comment