పాస్కా మొదటి శనివారము
అ.కా. 4:13-21; మార్కు
16:9-15
ధ్యానం: యేసు
దర్శనము
నేటి సువిశేష పఠనములో, ‘విశ్వాసం’ అన్న మాట నాలుగు సార్లు ప్రస్తావించబడినది.
శిష్యుల అవిశ్వాసమునకు, వారి హృదయ కాఠీన్యమునకు గాను యేసు వారిని గద్దించాడు.
విశ్వాసము దేవుని వరము. ఆయనను తెలుసుకొనుటకు మరియు పునరుత్థాన పరమ రహస్యాన్ని
అర్ధంచేసుకొనుటకు విశ్వాసం అనే బహుమానమును దేవుడు మనకొసగాడు. మనలో చాలామందిమి
విశ్వాసం ఉన్నదని భావిస్తాము. కాని ఆ విశ్వాసాన్ని ఆచరణలోను, కార్యరూపం దాల్చుటలో
విఫలమవుతూ ఉంటాము.
ఈరోజు పాస్కా మొదటి వారాన్ని ముగిస్తున్నాము. క్రీస్తు మనకు ఇచ్చిన ప్రేషిత బాధ్యతను గుర్తుకు చేసుకుందాం. “మీరు ప్రపంచమందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు” (16:15). మన జ్ఞానస్నానమందును, భద్రమైన అభ్యంగనమందును మరియు ఇతర దివ్యసంస్కారములందును “ప్రపంచమందంతట” వెళ్ళుటకు ప్రభువు మనలను ప్రత్యేకముగా నియమించాడు. ప్రభువునుండి పొందిన ఈ ఆజ్ఞను మన అనుదిన జీవితములో పాటించాలి. ఇతరులకు సువార్తను బోధించాలి. క్రీస్తు రక్షణను ప్రకటించాలి. మనం సువార్తను ప్రకటించుటకే ఈ లోకములో నున్నట్లుగా జీవించాలి.
ప్రతీ కార్యానికి దివ్యసత్ప్రసాదము కేంద్రబిందువుగా ఉండాలి. ప్రపంచములో సువార్తను వ్యాప్తిచేసే లక్ష్యములో, మన విశ్వాసము, జీవితము ఏకమై యుండాలి. అయితే, సువార్తను ప్రకటించుటకు, క్రీస్తుకు సాక్ష్యమిచ్చుటకు ముందుగా మనం దృఢవిశ్వాసమును కలిగి యుండాలి. విశ్వాస జీవితములో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఒకటి మనలోని గర్వం అయుండవచ్చు. గర్వమువలన, శిష్యులు ఉత్థాన క్రీస్తును చూసినవారి సాక్ష్యాన్ని కూడా నమ్మలేదు. మరొకటి ప్రేమ కలిగి లేకపోవడం. మనలో ప్రేమ లేనప్పుడు స్వార్ధముతో జీవిస్తూ ఉంటాము. విశ్వాసం సన్నగిల్లుతుంది. పునీత అగుస్తీను గారి మాటలను జ్ఞాపకం చేసుకుందాం, “విశ్వాసం అనగా మనం చూడని వాటిని నమ్మడం. మరియు మనం విశ్వసించే వాటిని చూడటమే విశ్వాసము యొక్క ప్రతిఫలం.”
No comments:
Post a Comment