పాస్కా నాలుగవ బుధవారము (I)

 పాస్కా నాలుగవ బుధవారము
అ.కా. 12:24-13:5; యోహాను 12:44-50
ధ్యానం: యేసు వాక్కు – తీర్పు

“తండ్రి ఎవనికిని తీర్పు విధించడు. తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను అని యోహాను 5:22లో చదువుచున్నాము. అలాగే నేటి సువిషేశములో, తాను కూడా ఎవరికిని తీర్పు విధించనని యేసు స్పష్టం చేయుచున్నాడు. “నా మాటలు ఆలకించి, ఆచరించని వానిని ఖండించునది నేను కాదు. నేను వచ్చినది లోకమును రక్షించుటకేగాని, ఖండించుటకు కాదు” (యో 12:47). అట్లయినచో, దుర్మార్గులను ఎవరు ఖండిస్తారు? దీనికి సమాధానముగా, “నన్ను తృణీకరించి, నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నేను పలికిన నా వాక్కే అంతిమ దినమున వానిని ఖండించును” అని యేసు చెప్పెను. యేసు రక్షకుడు. ఆయనను విశ్వసిస్తే రక్షింప బడుదురు. లేనిచో నాశనమగుదురు. కనుక, మనం క్రీస్తును అంగీకరించాలి. ఆయన వాక్కును ఆలకించాలి. వాక్కును మన అనుదిన జీవితములో పాటించాలి.

తండ్రి ఆజ్ఞాపించిన దానిని కుమారుడు చేయును. ఎందుకన, లోకమును రక్షించుటకు తండ్రిచేత పంపబడినాడు. తండ్రి ఆజ్ఞ నిత్య జీవము. యేసు వినయమును, మహిమను చూడవచ్చు. తండ్రియును, కుమారుడును ఒక్కరేనని స్పష్టమగుచున్నది. మనం కూడా తండ్రి దేవునికి, ఆయన చిత్తానికి విధేయులమై జీవించాలి. దేవుని వాక్కు మన జీవితములకు వెలుగు కావాలి. “లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించు వాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును” (యో 8:12) అని యేసు పలికెను.

No comments:

Post a Comment