పాస్కా మొదటి సోమవారము (I)

 పాస్కా మొదటి సోమవారము
అ.కా. 2:14,22-33; మత్త 28:8-15
ధ్యానం: మృత్యుంజయుడు క్రీస్తు

యేసు మృత్యుంజయుడాయెను. క్రీస్తు పునరుత్థానం సువార్తలను తేటతెల్లము చేస్తుంది. క్రీస్తు ఉత్థానం మన విశ్వాసం. ఈ వారంమంత, ఉత్థాన క్రీస్తు దర్శనాలను ధ్యానిస్తాం. మన దైనందిన జీవితములో క్రీస్తును వెదకాలి అన్నదే ఈ దర్శనాల సారాంశం. ఇతరులలో మనం క్రీస్తును కనుగొనాలి. యేసు ఉత్థానం గూర్చిన రెండు వేర్వేరు సాక్ష్యాలను నేటి సువిషేశములో చూస్తున్నాము. మొదటిగా,  స్త్రీల సాక్ష్యం. వారు వెళ్లి శిష్యులతో యేసు ఉత్థానం గూర్చి సాక్ష్యమిచ్చారు. వారు ఉత్థాన క్రీస్తుకు ప్రధమ సాక్ష్యులు. వారి సాక్ష్యం సత్యమైనది. దీనికి “మేము అందరము సాక్ష్యులము” (అ.కా. 2:32) అని పేతురుకూడా సాక్ష్యమిచ్చాడు. ఈ స్త్రీలు గలిలియనుండి సిలువ వరకు యేసును అనుసరించారు. ఆయన అవసరాలలో సహాయముగా యున్నారు. చివరి శ్వాసవరకు విశ్వాసముగా క్రీస్తుతోనే యున్నారు.

రెండవదిగా, సమాధిని కావలి కాయుచున్న సైనికుల సాక్ష్యం. వారి సాక్ష్యం అబద్ధం, మోసం, నిజాయితీ లేనిది. ప్రధానార్చకులు, పెద్దలు ఆ సైనికులకు చాల ధనమిచ్చి, ‘వారు నిదురించు చుండగా శిష్యులు రాత్రివేళ వచ్చి యేసు శరీరమును ఎత్తుకొని పోయిరి’ అని యేసు ఉత్థానం గూర్చి అబద్ద సాక్ష్యము పలికించారు. సైనికులు లంచం తీసుకొని వారు చెప్పినట్లు చేసారు. ఇంత చేసి ఇంకను ప్రధానార్చకులు, పెద్దలు, తమనుతాము నీతిమంతులుగా భావించారు.

క్రమం తప్పకుండా, మన స్వలాభం కొరకు, అబద్ధ సాక్ష్యములు పలకడం మనలోకూడా చాలా మందికి సర్వసాధారణమై పోయింది. లంచం తీసుకోవడం, లంచం ఇవ్వడం తప్పని తెలిసికూడా చేస్తున్నాము. అలా చేస్తే, మన గౌరవాన్ని పణంగా పెట్టడమే! మన బాధ్యతలను, విధులను నిర్లక్ష్యం చేయక, సక్రమముగా, నిజాయితీగా నిర్వహించాలి. ఉత్థాన క్రీస్తు శాంతి, సంతోషం మన హృదయాలలో నింపబడినది. కనుక, క్రీస్తుకు, సువార్తకు మనం నిజ సాక్ష్యులమై జీవించ ప్రయత్నం చేయాలి.

No comments:

Post a Comment