దివ్యావిష్కరణం - పవిత్ర గ్రంథము

 దివ్యావిష్కరణం - పవిత్ర గ్రంథము

దివ్యావిష్కరణం అనగా దేవుడు తననుతాను బయలు పరచుకొనుట. వెల్లడించుకొనుట లేదా తెలియ బరచుకొనుట. గతములో తెలియని, రహస్య సమాచారాన్ని తెలియజేయడం. దివ్యావిష్కరణం అనగా దేవుడు తన చిత్తమును, దైవీక సత్యాలను, వెల్లడి చేయడం. సాధారణముగా, దేవుడు లోకసృష్టిద్వారా, తన వాక్యముద్వారా, పరిశుద్ధాత్మద్వారా తననుతాను బహిర్గత మొనర్చుతాడు. దివ్యావిష్కరణం యేసుక్రీస్తునందు సంపూర్ణం అయినది. అలాగే, ఈ సృష్టిలో జరుగు చారిత్రక సంఘటనలద్వారా, వ్యక్తులద్వారా తెలియ బరుస్తున్నాడు. గతములో దూతలద్వారా, ప్రవక్తలద్వారా, అపోస్తలులద్వారా వెల్లడి చేసాడు. దేవుడు తననుతాను ఎక్కడ బహిర్గత మొనర్చు కొనుచున్నాడు? ఈ భూమిపైనయున్న మానవాళికి దేవుడు తననుతాను బహిర్గత మొనర్చుకొనుచున్నాడు. దేవుడు అనేక సమయాలలో, విభిన్న పద్ధతులలో తననుతాను తెలియపరచు కొనుచున్నాడు (హెబ్రీ 1:1-2). దేవుడు తననుతాను ఎప్పుడు బహిర్గత మొనర్చు కొనుచున్నాడు? మొదటిగా ఆదాము, అవ్వ అయిన మన ఆదితల్లిదండ్రులకు దేవుడు తననుతాను బహిర్గత మొనర్చు కున్నాడు. ఆతరువాత మోషేకు, ప్రవక్తలకు అపోస్తలులకు తననుతాను వెల్లడించాడు (యో 6:45). దివ్యావిష్కరణ ఎప్పుడు పూర్తయినది? అపోస్తలులలో చివరివాని మరణముతో ఈ దివ్యావిష్కరణ పూర్తయినది. పునీత యోహాను, యేసు ప్రియ శిష్యుడు క్రీ.శ. 101వ సం.లో ఎఫెసు నగరములో మరణించాడు. అయితే, ఈ దివ్యావిష్కరణ నేటికీ కొనసాగు చున్నదని చెప్పవచ్చు. దివ్యావిష్కరణ అనగా గతములో తెలియని, రహస్య సమాచారాన్ని తెలియజేయడం. మరి, గతములో ఏది దాచిపెట్ట బడినది? దైవసంకల్పం మరియు దైవీక సత్యాలు. ఎందుకు దాచిపెట్ట బడ్డాయి? దీనికి కారణం, ఆదితల్లిదండ్రులు చేసిన పాపము. వారి పాపము వలన పరలోకం మూయబడినది. దైవసంకల్పం మరియు దైవీక సత్యాలు వారినుండి దాచబడ్డాయి. రోమీ 3:23లో ఇలా చదువుచున్నాము: మానవులందరు పాపము చేసిరి. అందరు దేవుని మహిమకు కొరత బడిరి”.

ఎందుకు దేవుడు తన సంకల్పాన్ని, దైవీక సత్యాలను, ప్రణాళికను మానవులకు వెల్లడి చేసాడు? దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి. మనం సత్యాన్ని తెలుసుకొని రక్షింప బడాలని (యో 8:32; రోమీ 15:4; 2 తెస్స 2:10). “దేవుడు సత్యశీలి” (రోమీ 3:4). “సత్యమునందు వారిని ప్రతిష్టింపుము. నీ వాక్కు సత్యము (యో 17:17). సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు ఎందుకు కోరుచున్నాడుమనం రక్షింప బడాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి (1 తిమో 2:3-4). దేవుడు మనలను ఎందుకు రక్షించాలని అనుకొను చున్నాడు? దేవుని ప్రేమ వలన (యిర్మి 31:3; యో 3:16). దేవుని ప్రేమను పొందుటకు, మనం ఏమిచేయాలి? దేవుని సంకల్పాన్ని, దైవీక సత్యాలను, దేవుని ప్రణాళికను తెలుసుకోవడానికి ప్రయత్నం, కృషి చేయాలి (ఎఫెసీ 5:15-17). బైబులు గ్రంథమును చదివి అందులో వాటిని తెలుసుకోవాలి (యో 34:16; రోమీ 15:4).

పవిత్ర గ్రంథము

పవిత్ర గ్రంథము దేవుడు మనకు ఒసగిన గొప్ప వరము. దివ్యావిష్కరణ బైబులులో మనకు స్పష్టమగు చున్నది. బైబులు మన విశ్వాస వికాసానికి ఎంతగానో దోహద పడుచున్నది. బైబులులో చూస్తున్న సంఘటనలు, చరిత్ర, దైవకార్యాలు, క్రియలు అన్నియుకూడా దేవునిగూర్చి వెల్లడి చేయుచున్నాయి. బైబులు పవిత్రాత్మచే ప్రేరేపింపబడి వ్రాయబడినది. కనుక బైబులు దేవుని ప్రత్యేకమైన దివ్యావిష్కరణము (2 తిమో 3:15-17). పవిత్ర గ్రంథము (బైబులు) దేవునివాక్కు. ఆ వాక్కు దేవుడే. “వాక్కు దేవుడై ఉండెను” (యో 1:1; చూడుము. 1 యో 1:1-3). ఆ వాక్కు క్రీస్తువే. ఆ వాక్కు మానవుడై (యేసుక్రీస్తు) మనమధ్య నివసించెను” (యో 1:14, 17:2-3). ఈ వాక్కు సర్వమానవాళికి తండ్రియైన దేవుని యొద్దకు చేర్చు గొప్ప రక్షణ సందేశం. “నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మూలమున తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు” (యోహాను 14:6) అని యేసు పలికి యున్నారు. “నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక గొనడు” (యో 6:35) అని యేసు పలికి యున్నారు. మరల, “కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు, నిత్యజీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును” (యో 6:40) అని యేసు చెప్పియున్నారు. దేవుడు తననుతాను ప్రత్యక్షపరచుకొని, తన రక్షణ ప్రణాళికను మనకు వెల్లడించారు. ప్రతి ఒక్కరుకూడా రక్షింప బడవలయుననియు, సత్యమును గూర్చిన జ్ఞానమును కలిగియుండ వలయుననియు రక్షకుడైన దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే! దేవునకు మానవులకు మధ్యన ఒకే మధ్యవర్తి యేసుక్రీస్తు. మానవాళి రక్షణకై యేసుక్రీస్తు తననుతాను అర్పించుకొనెను (1 తిమో 2:4-6). దీనినిమిత్తమై, “నేను ప్రచారకునిగాను, అపోస్తలునిగాను, బోధకునిగాను నియమింప బడితిని” (1 తిమో 2:7) అంటూ పౌలుగారు సువార్తా బోధనను తన ప్రధాన బాధ్యతగా స్వీకరించాడు. అలాగే నేడు మనమందరమును పిలువబడుచున్నాము.

కనుక మనం ఈ రక్షణ సందేశాన్ని సాధ్యమైనంత వరకు లోతుగా అర్ధం చేసుకోవడానికి తప్పకకుండా ప్రయత్నం చేయాలి. అందులకు, పవిత్ర గ్రంథమును శ్రద్ధగా పఠనం చేయాలి, ఉత్సాహ పూరితముగా అధ్యయనం చేయాలి. తద్వారా, పవిత్ర గ్రంథమైన దేవుని పరిశుద్ధ వాక్కు సందేశము, మనలను రక్షకుడి దరికి చేర్చగలదు. పాపాత్ములకు ఏకైక రక్షకుడు క్రీస్తు! కనుక పవిత్ర గ్రంథమును చదవడం, నేర్చుకోవడం, అధ్యయనం చేయడం, ప్రతీ క్రైస్తవ విశ్వాసియొక్క బాధ్యత. పవిత్ర గ్రంథము తరగని సత్యనిధి. అది మానవాళికి లభించిన గొప్ప కృపానుగ్రహము, ఆశీర్వాదము. మనం ఏమి చేయవలయునో, ఎలా జీవించవలయునో తెలుసుకోవాలంటే తప్పక పవిత్ర బైబులు గ్రంథమును (దేవునివాక్కు) చదవాలి. దేవునివాక్కు మనకు ఏమి బోధించునో తెలుసుకోవాలంటే, మన గురించిన దేవుని ప్రణాళికను, చిత్తమును తెలుసుకొన వలయునంటే, దేవునివాక్కును శ్రద్ధగా చదవాలి, ఆలకించాలి, ధ్యానించాలి, మన జీవితాలకు అన్వయించుకోవాలి, విశ్వాసముతో ప్రకటించాలి.

పవిత్ర గ్రంథము దేవుని ప్రేరణ వాక్కు శక్తి

“దేవునివాక్కు సజీవమును, చైతన్యవంతమునైనది. అది పదునైన రెండంచుల ఖడ్గముకంటెను పదునైనది. జీవాత్మల సంయోగస్థానము వరకును, కీళ్ళు, మజ్జ కలియు వరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింప గలదు” (హెబ్రీ 4:12). “మానవుడు దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును” (మత్త 4:4). “భూమ్యాకాశములు గతించిపోవునుగాని నా మాటలు ఎన్నడును గతించిపోవు” (మత్త 24:35). “నీ వాక్కు సత్యము” (యో 17:17). “దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు” (లూకా 11:28). “గడ్డి ఎండిపోవును, పూవు వాడిపోవును. కాని మన దేవుని వాక్కు కలకాలము నిలుచును” (యెష 40:8). “దేవుని మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి” (యో 6:63). ‘నూతనముగా జన్మించిన శిశువుల వలె కల్మషములేని వాక్కు అను పాలకొరకై దాహముతో ఉండుడు. దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింప బడుదురు” (1 పేతు 2:2). “క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను” (కొలొస్సీ 3:16). “దేవుని వాక్కును ఆత్మయొసగు ఖడ్గముగను గ్రహింపుడు” (ఎఫెసీ 6:17). “నా నోటినుండి వెలువడు వాక్కు నిష్ఫలముగా నా యొద్దకు తిరిగిరాక, నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును” (యెష 55:11). “మీరు నా మాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నాశిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును” (యో 8:31-32). “ప్రభువు పలుకులు సత్యమైనవి” (కీర్తన 33:4). “క్రీస్తును గూర్చిన వాక్కు వలన విశ్వాసము కలుగును” (రోమీ 10:17). “సువార్త విశ్వసించు వారందరకు రక్షణ నొసగు దేవుని శక్తి” (రోమీ 1:16).

దేవుని ప్రేరణ పవిత్ర బైబులు గ్రంథము దేవుని వాక్కు అయినప్పటికిని, ఇది దైవప్రజలచేత పవిత్రాత్మ ప్రేరణ శక్తితో లిఖించబడిన అనేక గ్రంథాల (పుస్తకాల) కలయిక. కనుక, ఇవి పవిత్ర రచనలు. ఈ రచనలకు సాక్షాత్తు దేవుడే రచయిత. ఇవి తిరుసభ చట్టప్రకారం ఆమోదయోగ్యమైన పవిత్ర గ్రంథాలు (Canonical Books).

బైబులు దేవుని ప్రేరణ అని చెప్పడానికి రుజువులు బైబులులోనే చూడవచ్చు: “పవిత్ర గ్రంథమంతయు దైవప్రేరణ వలననే కలిగి బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు నీతియందు నడిపించుటకును ఉపయోగ పడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైన చేయుటకు సంపూర్తిగ సంసిద్ధుడగుటకు అది తోడ్పడునుఅని 2 తిమో 3:16లో చదువుచున్నాము. “కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగ మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలయన, ఉష:కాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపువరకు, అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది మాత్రము తప్పక జ్ఞాపకము ఉంచుకొనుడు. తనంతట తానుగా, ఏ ఒక్కడును లేఖనము నందలి ప్రవచనమును వివరింపలేడు. ఏలయన, ఏ ప్రవచన సందేశమును కేవలము మానవ సంకల్పముచే జనించలేదు. ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రభావితులై దేవుని నుండి జనించిన సందేశమునే  పలికిరిఅని 2 పేతు 1:19-21లో చదువుచున్నాము. “యేసు మరెన్నియో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నియు ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవిఅని యోహాను. 20:30-31లో యోహాను తన సువార్తను ముగించుచున్నాడు. “ఎవరైన ఏమైన ఈ గ్రంథపు ప్రవచన వాక్కులనుండి తొలగించినచో, ఈ గ్రంథమున వివరింప బడినట్లు వాని భాగమగు జీవవృక్ష ఫలములను, వాని పవిత్ర నగర భాగస్వామ్యమును దేవుడు తొలగించును. ఈ విషయములను గూర్చి సాక్ష్యము ఇచ్చు వ్యక్తి అది నిజము! నేను త్వరలో వచ్చుచున్నాను!అని దర్శన 22:19-20లో ముగింపులో హెచ్చరికను చూస్తున్నాము. “మీరు పూర్వ సంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కునే అనాదరము చేయుచున్నారు” (మార్కు 7:13) అని యేసు పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు చెప్పెను. “దేవుడు తన సందేశమును యూదులకు అప్పగించెను” (రోమీ 3:2) అని పౌలు రోమీయులకు వ్రాసెను. “గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగ ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను” (హెబ్రీ 1:1). కనుక బైబులు గ్రంథాలకు దేవుడే రచయిత అని స్పష్టమగు చున్నది.

పునీత 1వ పెద్ద గ్రెగోరి (64వ పోపు, శ్రీసభ పండితుడు, క్రీ.శ. 540-604) క్రీ.శ. 595వ సంవత్సరములో బైబులును దేవుని లేఖగా వర్ణించారు. యూద, క్రైస్తవ సంప్రదాయాలు బైబులును దేవుని ప్రేరణగా అంగీకరిస్తున్నాయి. హీబ్రూ బైబులులో ఉన్న పవిత్ర గ్రంథాలద్వారా దేవుడు తననుతాను బయలు పరచుకున్నాడని యూదులు పరిగణిస్తారు. అయితే, పాత నిబంధనలోని పవిత్ర గ్రంథాల దృష్టి, కేంద్ర బిందువు క్రీస్తు అని అనాధి క్రైస్తవులు వివరించారు: “మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవి అన్నియు వారికి వివరించెను” (లూకా 24:27). అవన్నియు కూడా క్రీస్తు గురించి వ్రాయబడినట్లుగా, సంపూర్ణ దివ్యావిష్కరణము యేసుక్రీస్తులో నేరవేరినట్లుగా అనాధి క్రైస్తవులు అర్ధం చేసుకున్నారు (లూకా 4:18-19; యో 5:39; 1 పేతు 1:10-12; హెబ్రీ 1:1-2).

రెండవ శతాబ్దానికి చెందిన శ్రీసభ పితరులు బైబులును దైవప్రేరణతో కూడిన దేవుని డిక్టేషనుగా భావించారు. పవిత్ర గ్రంథము దేవునివాక్కుగా పవిత్రాత్మ చెబుతూ ఉండగా దేవునిచేత ఎన్నుకొనబడిన పవిత్ర రచయితలు వ్రాసారని వారు విశ్వసించారు. మూడు, నాలుగు శతాబ్దాలకు చెందిన శ్రీసభ పితరులు రెండు నిబంధనలను కూడా పవిత్రాత్మచేత ప్రేరిపింప బడినవిగాను, తద్వారా దేవుడే రచయిత అని నొక్కిచెప్పియున్నారు. దేవునిచేత ఎన్నుకొనబడిన పవిత్ర రచయితలు దేవుని సాధనాలుగా భావించారు. ఏవిధముగానైతే, దైవవాక్కు (క్రీస్తు ప్రభువు) నిరాడంబర మానవ స్థితిన మానవునిగా వెలసినదో, అలాగే మహోన్నతుడైన దేవుడు తన మనోభావాలను తెలియజేయుటకు, ఈ మానవ రచయితలద్వారా, మానవ స్వభావమునకు అనుగుణముగా అనువర్తించి యున్నాడని శ్రీసభ విధ్వాంసుడు, పునీత యోహాను క్రిసోస్తం వీక్షించారు. దైవవాక్కు మానవ భాషలో ఇమిడిపోవడం అనేది గొప్ప విశేషం. బైబులు ద్వారా దేవుడు వెల్లడి చేయుచున్న సత్యము, సందేశము తెలియాలంటే, ఆయా గ్రంథ రచయితలు చెప్పదలచుకున్న వాస్తవ సందేశము ఏమిటో గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. వారు ఎంచుకున్న సాహిత్య ప్రక్రియలను అర్ధం చేసుకోవాలి. బైబులు వ్యాఖ్యాతలు వారు ఉపయోగించిన రచనా ప్రక్రియలను బట్టి, అందులో అంతర్లీనముగా దాగియున్న సందేశాలను వెలికి తీయాలి. అందులకు, రచనల కాలం, స్థలం, సాహితీ సాంస్కృతిక నేపధ్యం, ఆచార వ్యవహారాలూ, సంభాషణ విధానం, కథాకదన పద్ధతులు, మానవ సంబంధాలు మొదలైనవన్నీ క్షుణ్ణముగా తెలిసి యుండాలి.

బైబులు పవిత్రాత్మ ప్రేరణ శక్తితో దైవప్రజలచేత లిఖించబడినదని చెప్పుకున్నాము. కనుక, పవిత్ర గ్రంథములోని విషయాలు, సత్యాలపట్ల, వారి జీవితము, విశ్వాసము దృఢముగా ప్రభావితము చేశాయని చెప్పడములో ఎలాంటి సందేహము లేదు. బైబులును క్షుణ్ణముగా అర్ధము చేసుకోవడానికి ఈ పరిశీలన మనకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందుకే, బైబులును విశ్వాసముతోను, అలాగే తార్కికముతోను పరిగణింప వలయును. ఈ రెండింటి మధ్య ఎలాంటి విబేధాలను చూడవలసిన అవసరము లేదు. ఎందుకన, విశ్వాసము దేవుడు మనకొసగిన వరము. అలాగే, తార్కికం దేవుడు మనకొసగిన శక్తి. బైబులు పఠన అధ్యయనములో ఈ రెండింటిని ఆపాదించినపుడు, సంపూర్ణ సామరస్యము, సంపూర్ణ ఆధ్యాత్మిక పోషణ కలుగుతుంది.

బైబులు దైవప్రేరణచే వ్రాయబడిన పవిత్ర గ్రంథము. యేసు, క్రీస్తు రూపమున శరీరధారియైన దేవుని వాక్కు. దేవుని వాక్కు మనకు పవిత్ర సంప్రదాయముద్వారా, ‘శ్రీసభ బోధనలద్వారా అందించ బడుచున్నది. దేవునివాక్కుగా బైబులు దైవార్చనా సాంగ్యాలలో (దివ్యబలిపూజలో), ఇతర ప్రార్ధనలలో ఉపయోగించ బడుచున్నది. అధ్యాత్మికముగా బలపడటానికి వ్యక్తిగతముగా కూడా బైబులు ఎంతగానో మనకు ఉపకరిస్తుంది. అందుకే, పునీత జేరోము పవిత్ర గ్రంథము గూర్చి తెలియక పోవడమంటే, క్రీస్తును గురించి తెలియక పోవడమేఅని అన్నారు.

దేవునిచేత ప్రేరేపింపబడిన దేవునివాక్కు మానవ భాషలో మానవులచేత లిఖింప బడినది. నూతన నిబంధన రచయితలు, పాత నిబంధన గ్రంథమును కూడా దేవుని వాక్కుగా పరిగణించారు: “దేవుడే స్వయముగా పలికెను” (2 కొరి 6:16), “పవిత్రాత్మ పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము” (అ.కా 1:16) అని చదువుచున్నాము. కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథము దేవునితో సమానముగా చెప్పబడినది: పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది” (గలతీ 3:8), “లేఖనము (దేవుడు) ఫరోతో పలుకుచున్నది” (రోమీ 9:17) అని చదువుచున్నాము. ఈవిధముగా, నూతన నిబంధన రచయితలు పాత నిబంధనమును దేవునివాక్కుగా ఆపాదించి యున్నారు. అలాగే, నూతన నిబంధన రచయితలు, వారి బోధనలనుకూడా స్వయముగా దేవునినుండి వచ్చిన ప్రామాణికమైన, అధికారపూర్వకమైన రచనలుగా సమర్పించి యున్నారు (1 తిమో 2:7). పునీత పౌలు కూడా తన బోధనలను దేవుని వాక్కుగా భావించాడు: దేవుని వాక్కును మేము మీకు తీసికొని వచ్చితిమిఅని 1 తెస్స 2:13లో చదువుచున్నాము. పౌలు మరియు ఇతర రచయితలు తమనుతాము దేవునికి మరియు క్రీస్తుకు రాయబారులుగా, సాక్షులుగా పరిగణించారు. వారు బోధించిన సువార్తను అందరకు రక్షణ నొసగు దేవుని శక్తిగ” (రోమీ 1:16) చూసారు.

“తన సంపూర్ణ జ్ఞానము చేతను, విషయ పరిచయము చేతను, దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక, క్రీస్తుద్వారా తాను పరిపూర్తి చేయదలచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను” (ఎఫెసీ 1:9). బైబిలు, దేవుని వాక్కు. అలాగే, ఈ దేవుని వాక్కు, ఆమోదయోగ్యమైన గ్రంథాలుగా దివ్యావిష్కరణమునకు (Divine Revelation) మూలము. ఆమోదయోగ్యమైన గ్రంథాలతోపాటు అపోస్తోలిక సంప్రదాయం’ (Tradition) శ్రీసభను ఎంతగానో ప్రభావితం చేసినది. నిజానికి, అపోస్తోలిక సంప్రదాయంఆధారంగానే బైబులులో ఉండదగిన ప్రామాణిక రచనల నిర్ధారణ జరిగింది. కనుక, పవిత్ర గ్రంథాన్ని, పవిత్ర సంప్రదాయాన్ని సమానమైన భక్తి భావనతో గౌరవప్రపత్తులతో ఆదరించాలి, అనుసరించాలి. అపోస్తలులు అందజేసిన దైవసందేశాలలో సంప్రదాయము, బైబులు గ్రంథ భాగాలు సమపాళ్ళలో ఉంటాయి. దైవవాక్కునకు, సంప్రదాయ దైవోపదేశాలకు భాష్యం చెప్పే అధికారం శ్రీసభ అధిష్టానం (పాలక వర్గం) వారికి మాత్రమే ఉంటుంది. అది దైవవాక్కులోని అంతరార్ధాలను వెల్లడి చేస్తుంది.

బైబులు సందేశము: బైబులు ప్రధాన సందేశము ఏమనగా, మానవాళికి దేవుని రక్షణ ప్రణాళిక సందేశము. ఈ రక్షణ సత్యము దైవకుమారుడైన యేసులో సంపూర్ణముగా బయలుపరచ బడినది. కనుక, శాస్త్రీయ ఖచ్చితత్వము కొరకు బైబులులో వెతక కూడదు.

బైబులు నామము: “దేవుని వాక్కుపవిత్ర గ్రంథము, నిబంధనము, బైబులు... మొదలగు పేర్లతో పిలువబడుచున్నది. ‘బైబులుఅనే పదం గ్రీకు పదాలు తా బిబ్లియా” (the books) నుండి ఉద్భవించినది. ‘తా బిబ్లియాఅనగా గ్రంథాలులేదా పుస్తకాలుఅని అర్ధము. తరువాతి కాలములో, లతీను భాషలో, గ్రీకు పదమైన బిబ్లియాను గ్రంథాలుఅని బహువచనములోగాక, “గ్రంథముఅని ఏకవచనములో తీసుకొనబడినది. అందుకే, నేడు బైబులు గ్రంథాలుఅని గాక, ‘బైబులు గ్రంథంఅని పిలువబడుచున్నది.

No comments:

Post a Comment