గుణదలమాత చరిత్ర (విజయవాడ)

 గుణదలమాత చరిత్ర
9, 10, 11 ఫిబ్రవరి

ఫాదర్ ప్రవీణ్ గోపు OFM Cap.; విజయవాడ

విజయవాడలో అనేక మతపరమైన ప్రదేశాలలో గుణదల మరియమాత పుణ్యక్షేత్రానికి తప్పకుండా ప్రత్యేక స్థానం ఉన్నది. ఎక్కువగా సందర్శించే దేవాలయాలలో గుణదల మరియమాత దేవాలయము ఒకటి. గుణదల మరియమాత మహోత్సవాలను ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఘనముగా కొనియాడుతారు. ఈ పుణ్యక్షేత్రము గురించి తెలుసుకుందాం.

పుణ్యక్షేత్ర చరిత్ర

గుణదల మాత చరిత్ర 1923వ సంవత్సరము నాటిది! మోన్సిగ్నోర్ H. పెజ్జోని గారు గుణదలలో 1923లో 23 ఎకరాల స్థలాన్ని పొందారు. దానిలో కొంత స్థలం కొనగా, కొంత స్థలం విరాళముగా ఇవ్వబడినది.  అచ్చట మొదటిగా ఒక అనాధాశ్రమాన్ని స్థాపించారు. తరువాత ఒక స్కూలును ప్రారంభిచారు. ఇది అప్పటి బెజవాడ విచారణకు జోడించబడినది. అప్పట్లో గుణదల ప్రదేశమంత, ముళ్ళపొదలతో నిండి యుండెడిది. ఎవరూ ఆ ప్రాంతానికి వచ్చేవారు కాదు. ఎవరినీ ఆహ్వానించడానికి కూడా వీలుగా ఉండెడిది కాదు. ప్రాంతమంత పాములతో నిండి ఉండెడిది. ప్రక్కనేనున్న కొండపై చిరుత పులులు సంచరిస్తూ ఉండేవి. గుణదల సంస్థల మొట్టమొదటి మేనేజరుగా రెవ. ఫాదర్ P. అర్లాటి గారు 1924లో నియమించ బడినారు. బాధ్యతలు చేపట్టిన రోజునుండే ఎన్నో కష్టాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. యాభైమంది పనివాళ్ళతో అడివినంతా శుభ్రం చేయించారు. పూర్తవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. మంచి నీటి కోసం ఒక బావిని అక్కడ త్రవ్వించారు. సెయింట్ జోసఫ్ అనాధాశ్రమం 15 జూన్ 1924లో ప్రారంభించడం జరిగింది. అదే సంవత్సరములో అచ్చట పారిశ్రామిక పాఠశాలను ప్రారంభించారు. మోన్సిగ్నోర్ విస్మారా గారు కొంతమంది బాలురను అక్కడికి తీసుకొని రావడం జరిగింది.

సంస్థలకు మరియమాత యొక్క ఆశీర్వాదాలు, సంరక్షణ పొందేందుకు రెవ. ఫాదర్. P. ఆర్లాటి గారు 1924లో కొండపైన సహజ సిద్ధమైన ప్రదేశములో మరియమాత స్వరూపాన్ని నెలకొల్పారు. ఇదే గుణదల మరియమాత భక్తికి నాంది పలికింది. 1927లో రెవ. ఫాదర్ P. అర్లాటి గారు ప్రహరీ గోడను నిర్మించారు. 1928లో వారు భోజనశాలను, 1931లో దేవాలయమును నిర్మించారు. మోన్సిగ్నోర్ విస్మారా గారు వీటిని ఆశీర్వదించారు. పాఠశాలలో పిల్లల అడ్మిషన్లు పెరగడముతో, రెవ. ఫాదర్ P. అర్లాటి గారు మరో భవనానికి పునాదులు వేసారు. 1933లో గుణదల సంస్థల ప్రధమ శతాబ్ది పూర్తిచేసుకున్న సందర్భముగా, రెవ. ఫాదర్ P. అర్లాటి గారు గుణదల కొండ అంచుపై 18 అడుగుల ఎత్తైన ఇనుప సిలువను ఏర్పాటు చేసారు. సిలువ యొద్దకు మరియమాత గుహనుండి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక TO JESUS THROUGH MARY (మరియమాత ద్వారా యేసు చెంతకు) అన్న సత్యాన్ని చక్కగా మనకు స్పురిస్తుంది. ఇది కతోలిక బెజవాడకు గర్వకారణమైనది.

1937 నాటికి గుణదల పండుగ మేత్రాసణ పండుగగా ప్రసిద్ధి గాంచినది. 1937లో, రెవ. ఫాదర్ P. అర్లాటి గారు, ప్రస్తుతం మనం గుణదల కొండపై చూస్తున్న, 300 కిలోలుగల మరియమాత స్వరూపాన్ని ఇటలీ దేశమునుండి తీసుకొని వచ్చి నెలకొల్పడం జరిగింది. ఈ స్వరూపాన్ని మోన్సిగ్నోర్ అంబ్రోస్ ది బత్తిస్త గారు సమర్పించారు. స్వరూపాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి గుహలో ప్రతిష్టించడం జరిగింది. ఆరంభములో ఈ పండుగను 8 సెప్టెంబరు మాసములో జరిపేవారు. సెప్టెంబరులో కురిసే వర్షాలు యాత్రికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుండగా, ఈ పండుగను 11 ఫిభ్రవరి లూర్దుమాత పండుగగా మార్పు చేయడం జరిగింది.

1944-1946 మధ్య కాలములో, గుణదల కొండ రాయిని పేల్చి, గుహను చెక్కడం జరిగింది. అక్కడ ఒక బలి పీఠమును కూడా నిర్మించడం జరిగింది. అప్పటినుండి, ప్రతీ సంవత్సరం లూర్దుమాత పండుగను స్థానిక కతోలిక క్రైస్తవులతో కలిసి కొనియాడటం జరిగింది. కొండపైన మరియమాత గుహ వరకు ప్రదక్షిణగా వెళ్లి, అక్కడ దివ్యపూజా బలిని సమర్పిస్తారు.

గుహకు వెళ్ళు మార్గములో పదిహేను జపమాల రహస్యాలను చిత్రపటాలతో అందముగా ఏర్పాటు చేయబడ్డాయి. 1951లో యాత్రికులు మరియ మాత స్వరూపమును దగ్గరకు వెళ్ళుటకు,  తాకి ముద్దిడుటకు, కానుకలు చెల్లించుటకు మెట్లమార్గమును ఏర్పాటు చేయబడినది. అలాగే, గుహపైన అందమైన తోరణం నిర్మించడ మైనది. 1971లో దేవాలయం నిర్మించడ మైనది.

విజయవాడ మేత్రాసణ మూడవ మేత్రాణుల కాలములో, గుణదల పుణ్యక్షేత్రములో అనేక వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. బిషప్ గ్రాసి స్కూల్ ఆవరణలో, పూజ, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు వేదిక నిర్మించడమైనది. యాత్రికుల బస కొరకై షెడ్’లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడ్డాయి. కొండపైన విద్యుత్, మంచినీరు వసతులు కల్పించ బడ్డాయి. కొండపైకి సులువుగా చేరుకోవడానికి మరిన్ని మార్గాలు ఏర్పాటు చేయబడినవి. మరియమాత గుహనుండి సిలువ వరకు సిలువ మార్గము ప్రతిమలతో ఏర్పాటు చేయబడినది.

మరియమాత దర్శనం

11 ఫిబ్రవరి 1858లో మరియమాత గుణదల కొండపై దర్శన మిచ్చినట్లుగా ఒక విశ్వాసం. క్రైస్తవ చరిత్రలో, దైవకుమారుడు యేసుతల్లి అనేకచోట్ల అనేకమందికి దర్శనాలను ఇచ్చినట్లు మనకు తెలిసినదే! ఆమె దర్శనాలలో, తన దివ్యకుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించమని కోరుతూ ఉన్నది. పాప జీవితానికి స్వస్థిచెప్పి, పుణ్య జీవితాన్ని జీవించమనేదే ఆమె సందేశం.

పండుగ యొక్క ప్రసిద్ధ ఆచారాలు

గుణదల మరియమాత పండుగ కొన్ని ఆచార పద్ధతులను పొందినది. వాటిలో ప్రాముఖ్యమైనవి: యాత్రికులు తలనీలాలు సమర్పించడం. తలనీలాలు త్యాగానికి గురుతు. మరియమాత మధ్యస్థ ప్రార్ధనల ద్వారా పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని, అలాంటి శక్తులు గుణదల మరియ మాతకు ఉన్నట్లు ప్రజల విశ్వాసం, నమ్మకం. మరియమాతకు కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తారు.

       లూర్దుమాత వ్యాధిగ్రస్తులకు మంచి ఆరోగ్యమాతగా ప్రకటింప బడినది. ఫ్రాన్సు దేశములోని లూర్దు నగరములో, మరియ మాత మధ్యస్థ ప్రార్ధనల ద్వారా, అనేక స్వస్థతలు జరగడం దీనికి ముఖ్య కారణం. పేరుకు తగ్గట్టుగానే, గుణదల లూర్దుమాత స్వస్థతకు మరోపేరుగా ప్రసిద్ధి చెందినది. ఫాతిమా మాత, లూర్దుమాత, వేళంగని మాతవలె, గుణదల మాతగా భక్తులపై స్వస్థత, కృపానుగ్రహ జల్లులను కురిపిస్తుంది. నిజమైన, దృఢమైన విశ్వాసముతో ప్రార్ధించే వారిని గుణదల మరియమాత ఎప్పటికీ విడిచి పెట్టదు. ఆమె దయగల హృదయాన్ని గ్రహించిన భక్తులు, విశ్వాసులు ఏడాది పొడవునా పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మరియమాత ఆశీర్వాదాలను పొందుతూ ఉంటారు.

 ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే గుణదల మరియమాత ఉత్సవాలలో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండియే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక నుండి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. మూడు రోజుల ఉత్సవాల కోసం, నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మూడురోజులు ప్రధాన దేవాలయములో ప్రత్యేక పూజలు, ఆరాధనలు, ప్రార్ధనలు జరుగుతాయి.

 నేడు గుణదల మరియమాత పుణ్యక్షేత్రం బహుళ-మత కేంద్రముగా మారింది. ఎందుకన, క్రైస్తవేత్తరులు కూడా అనేకమంది ఈ తిరునాళ్ళలో పాల్గొంటారు. ఈ పండుగను ఎంతో ఉత్సాహముతో, భక్తితో జరుపుకుంటారు. గుణదల మరియమాత వార్శికోత్సవాలకు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారు.

No comments:

Post a Comment