17వ సామాన్య మంగళవారము
నిర్గమ. 33:7-11;
34:5-9, 28; మత్త. 13:36-43
ధ్యానాంశము: నీతిమంతులు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “నీతిమంతులు తండ్రి
రాజ్యములో సూర్యునివలె ప్రకాశింతురు” (మత్త. 13:43).
ధ్యానము: ఈ ప్రపంచములో మంచి-చెడులు రెండు ఉంటాయి. దేవుని రాజ్యము మరియు సాతాను
రాజ్యము. దేవుని రాజ్యము ఇచ్చట కొనసాగుతుంది. సాతాను ఎప్పుడు కూడా విధ్వంసాన్ని
సృష్టిస్తుంది. చెడు, మంచిలా వ్యవహరిస్తూ
ఉంటుంది, నటిస్తూ ఉంటుంది.
తననుతాను దేవదూతగా ప్రదర్శించుకుంటుంది. మనలో ఒకటిగా ఉండగలదు. జీవితం అనేది
మంచి-చెడుల మిశ్రమం మాత్రమేగాక, మంచి-చెడుల మధ్యన పోరాటం.
ఈ పోరాటం చివరివరకు కొనసాగుతూనే ఉంటుంది. మనలోనే మంచి-చెడు స్వభావాలు రెండూ
ఉంటాయి. ఒకటి జీవము వైపునకు నడిపించునది, రెండవది వినాశనము వైపునకు
నడిపించునది. ఇది జీవము-మరణముల మధ్యన చేయు నిర్ణయము. మంచినుండి చెడును
గుర్తించగలగాలి. మన బలహీనతలను మనం పరిష్కరించుకోవాలి. చెడు మార్గమునుండి
సన్మార్గములో నడచుటకు దేవుడు మనకు రోజు అనేక అవకాశాలను ఇస్తూ ఉన్నారు.
చెడును మంచితో జయించాలి. విశ్వాసము కలిగి జీవించాలి. దేవుని చిత్తాన్ని
తెలుసుకోగలగాలి. అప్పుడే, మనం దేవుని రాజ్యములో
ప్రకాశింతము. అయితే, మనం అంతిమ నిర్ణేతలము
కాము. గోధుమ-కలుపు గింజలను చివరి వరకు పెరగనిచ్చి, అంత్యకాలమున
వేరుచేయబడతాయి. అలాగే, క్రీస్తు మన అంతిమ
నిర్ణేత. న్యాయం దేవునికే చెందుతుంది. అంతిమముగా, మంచే విజయాన్ని
పొందునని నమ్మాలి. అనుకూల సమయములో పాపము, చెడు శాశ్వతముగా
నిర్మూలించబడతాయి. కనుక, మనవంతుగా మనం చెడును
నిర్మూలించి, మంచిని పోషించాలి.
చివరివరకు, ఓర్పు, సహనము, పట్టుదలతో ఉండాలి.
చివరివరకు, మన మంచితనాన్ని
నిలబెట్టుకోవాలి.
మొదటి పఠనములో, మోషే దేవునితో ముఖాముఖి సంభాషించెనని వింటున్నాము. ఇది మోషే గొప్పతనం కాదు. దేవుడే మోషేను ఎన్నుకున్నారు, మోషే దేవుని మాటను విశ్వసించాడు. ప్రజలుకూడా మోషేద్వారా దేవునితో సంభాషించారు. దేవుడు మోషేద్వారా ప్రజలతో సంభాషించారు. జ్ఞానస్నానంద్వారా, మనం దేవుని బిడ్డలమైనాము. ఇంతటి గొప్ప భాగ్యానికి దేవునకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలి.
No comments:
Post a Comment