20వ సామాన్య శనివారము
రూతు. 2:1-3,
8-11, 4:13-17, 22; మత్త. 23:1-12
ధ్యానాంశము: హెచ్చరిక
ధ్యానమునకు
ఉపకరించు వాక్యములు: “మీ అందరిలో
గొప్పవాడు మీకు సేవకుడై యుండవలయును. తననుతాను హెచ్చించుకొను వాడు తగ్గింపబడును.
తననుతాను తగ్గించుకొను వాడు హెచ్చింప బడును” (మత్త. 23:11-12).
ధ్యానము: యేసు
యెరూషలేము దేవాలయములో ప్రవేశించి బోధించుచున్నారు (మత్త. 21:23). ధర్మశాస్త్ర
బోధకులు, పరిసయ్యుల గురించి, వారి ఆధ్యాత్మిక వైఫల్యాన్ని గురించి ప్రజలను,
శిష్యులను యేసు
హెచ్చరించుచున్నారు. వారు “మోషే ధర్మాసనమున
కూర్చొని ఉన్నారు” (23:2). అనగా
ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, వివరించడానికి
అధికారాన్ని కలిగియున్నారు. అయితే, వారు ఉపదేశములను
చేయుదురు, కాని పాటింపరు (23:3).
వారి వ్యక్తిగత జీవితం
అసహ్యకరమైనది. వారిని వంచకులు అని యేసు సంబోధిస్తున్నారు (23:13). వారు మోయసాధ్యముకాని భారములను ప్రజల భుజములపై
మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేలైనను కదపరు (23:4).
కాని యేసు, “నా కాడిని మీరెత్తుకొనుడు... ఏలన, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది” (మత్త. 11:29-30) అని అన్నారు. మీరు తమ పనులెల్ల ప్రజలు చూచుటకై
చేయుదురు. అగ్రస్థానములను, ప్రధానాసనములను
కాంక్షింతురు (23:5-6). కాని యేసు,
“ప్రజలు మీ సత్కార్యములను చూచి
పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు”
(మత్త. 5:16) అని అన్నారు.
వారు ‘బోధకుడా’
(రబ్బీ, గురువా) అని పిలిపించు కొనుటకు తహతాహ
లాడుచున్నారు (23:7-8). యూదా ఇస్కారియోతు
మాత్రమే యేసును ‘గురువా’
(26:25), ‘బోధకుడా’ (26:49) అని సంబోధించాడు. ‘తండ్రీ’,
‘గురువా’, ‘బోధకుడా’ అను సంబోధనలను యేసు తృణీకరిస్తున్నారు (23:8-12).
ఎందుకన, మనమంతా సహోదరీ సహోదరులము. యూదులు అబ్రహమును ‘తండ్రీ’ అని భావించేవారు (మత్త. 3:9; లూకా. 16:24, 30; యోహాను 8:53). కాని యేసు, “మీ తండ్రి ఒక్కడే. ఆయన పరలోకమందున్నారు”
(23:9) అని అన్నారు. క్రీస్తు
ఒక్కడే మన గురువు (23:10). “మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై యుండవలయును.
తనను తాను హెచ్చించుకొను వాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొను వాడు హెచ్చింప
బడును” (23:11-12; 19:30; 20:16; మత్త. 20:25-28). ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు చట్టాన్ని ఎరిగియున్నారు, కాని పాటించుటలేదు. వారి స్వలాభం కొరకు మతాన్ని
వాడుకొనుచున్నారు. చట్టాన్ని వారి స్వలాభం కొరకు వివరించారు. ప్రజలను మోసము
చేయుచున్నారు. అందుకే వారిని యేసు తీవ్రముగా గద్దించారు (23:13-33). యేసు శిష్యులు వారివలె ఉండకూడదు.
మన జీవితాలను ఆత్మపరిశీలన చేసుకుందాం! బాహ్యపరమైన విషయాలకు ప్రాముఖ్యతను ఇస్తూ అంత:ర్గత, ఆధ్యాత్మిక విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇంటిని అనేక స్వరూపాలతో, పటాలతో అలంకరిస్తున్నాము, కాని అనుదినం ప్రార్ధన చేస్తున్నామా? కార్లలో, బైకులకు, మెడలో జపమాలలు ఉంటున్నాయి, కాని రోజు జపమాలను ప్రార్దిస్తున్నామా? బైబులును ఇంటి గూటిలో అలంకరించి పెడుతున్నాము, కాని రోజు దేవుని వాక్యాన్ని చదువుచున్నామా, ధ్యానిస్తున్నామా? ప్రతీరోజు పూజలో పాల్గొంటున్నాము, కాని అవసరతలోనున్న పొరుగువారికి సహాయం చేస్తున్నామా?
No comments:
Post a Comment