20వ సామాన్య శుక్రవారము
రూతు. 1:1,
3-6, 14-16, 22; మత్త. 22:34-40
ధ్యానాంశము: ప్రముఖ శాసనము: దైవప్రేమ, సోదరప్రేమ
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండాజ్ఞల పైననే ఆధారపడి
యున్నవి” (మత్త. 22:40)
ధ్యానము: ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును పరీక్షింపగోరి, “బోధకుడా! ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది?” అని అడిగెను. అందుకు యేసు, “నీ దేవుడైన
ప్రభువును నీవు పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ.
నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు, నీ పోరుగువానిని
ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే” అని ప్రత్యుత్తరమిచ్చెను.
ఆనాటి యూదపెద్దలు యేసును నాశనంచేయ చూసారు. కాని యేసు జ్ఞానముతోను, అధికారముతోను
వారికి సమాధానమిచ్చారు. మన జీవితములో అన్నింటికన్న ముఖ్యమైనది ప్రేమ. పది ఆజ్ఞలలో
నిమిడియున్న సందేశముకూడా ఇదియే. మొదటి నాలుగు ఆజ్ఞలు దేవున్ని ప్రేమించాలని,
తరువాత ఆరు ఆజ్ఞలు తోటివారిని ప్రేమించాలని తెలియజేయుచున్నాయి. నిజమైన ప్రేమ అంటే
ఏమిటో, సువార్తలలో యేసు జీవితమునుండి మనం నేర్చుకోవచ్చు. “తన సోదరుని ప్రేమింపని
వాడు దేవుని బిడ్డడు కాదు” (1 యోహాను. 3:10). “పరస్పరము ప్రేమించువాడు దేవుని
ఎరిగినవాడగును” (1 యోహాను. 4:7). “దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు, తన సోదరుని
ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది” (1 యోహాను. 4:20). “మీరు పరస్పరము ప్రేమ కలిగి
ఉన్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు” (యోహాను 13:35) అని
యేసు తెలిపియున్నారు.
సోదరప్రేమకు రూతు గ్రంథము ఓ చక్కటి ఉదాహరణము. రూతు గాధ న్యాయాధిపతుల కాలములో జరిగింది. న్యాయాధిపతుల కాలం ఇశ్రాయేలు చరిత్రలో క్రూరమైన కాలం. యుద్ధాలు, హింసతో కూడిన కాలం. అయినను, దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేయుచున్నారు. ఈ గ్రంథం దేవుని రక్షణ ప్రణాళికను, అనుగ్రహాన్ని తెలియజేస్తుంది. రూతు అన్యురాలు. ఒక యూదున్ని వివాహం చేసుకున్నది. అతను చనిపోయిన తరువాత, తన అత్త నవోమి, రూతును తన స్వంతదేశానికి తిరిగి వెళ్ళమని చెబుతుంది. కాని, రూతు, నవోమితోపాటే ఉండటానికి నిర్ణయించుకున్నది. “మృత్యువు తప్ప మరియొకటి మనలను వేరుపరపరాదు” (1:17) అని రూతు నవోమితో ఖరాఖండిగా చెప్పినది. ఆతరువాత, రూతు, నవోమిలు బెత్లెహేమునకు తిరిగి వచ్చినప్పుడు, యూదుడైన బోవాజును వివాహమాడి, యేసుక్రీస్తు పూర్వికురాలు అయినది. ఈవిధముగా, రూతు గ్రంథము సోదరప్రేమకు, దేవుని రక్షణ ప్రణాళికకు తార్కాణం. అలాగే, మన జీవితాలలో దైవసాన్నిధ్యం కొలువైయున్నదని తెలియుచున్నది.
No comments:
Post a Comment