21వ సామాన్య సోమవారము
పునీత అగుస్తీను
1 తెస్స. 1:1-5, 8-10; మత్త. 23:13-22
ధ్యానాంశము: యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను గద్దించుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “కేవలము మాటలచే
మాత్రమేగాక, శక్తితోను, పవిత్రాత్మతోను, దాని సత్యము నందలి సంపూర్ణమగు నమ్మకముతోను
మేము సువార్తను మీకు అందించితిమి” (1 తెస్స. 1:5).
ధ్యానము: నేటి సువిషేశములో, యేసు ఆధ్యాత్మిక, మత నాయకులైన ధర్మశాస్త్ర
బోధకులను, పరిసయ్యులను తీవ్రముగా, గద్ధిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. వారి జీవిత
విధానమును, పద్ధతులను తీవ్రముగా ఖండిస్తున్నారు. వారు కపట భక్తులు, అంధులైన
మార్గదర్శకులు, అవివేకులు, గ్రుడ్డివారు, మోసగాండ్రు, వంచకులు, సర్పసంతానము అని
ప్రభువు వారిని గద్ధిస్తున్నారు. ఎందుకన, వారు ప్రజలను, సన్మార్గములో దేవునివైపుకు
నడిపింపక, తప్పుత్రోవలో నడిపిస్తున్నారు. “మీరు మనుష్యుల యెదుట పరలోక ద్వారమును
మూసివేసియున్నారు. మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశింప ప్రయత్నించు వారిని
ప్రవేశింప నీయరు.” వారు నిత్యమూ అసత్యములు పలుకుచున్నారు. దేవుడు దయామయుడు అనిగాక,
శిక్షించేవానిగా చెబుతున్నారు. దేవునిపేర, ఆజ్ఞలపేర, అనేకమైన కటిన నిబంధనలు
విధించారు. వారుమాత్రము వాటిని పాటింపరు. వారు బోధించినది, వారు పాటింపరు. వారు
ఇతరులు చూడవలెనని దీర్ఘ జపములు జపించుచు, వితంతువుల యిండ్లను దోచుకొను చున్నారు. మతములో
చేర్చుకొనుటకు ఇతరులను ఆకర్షిస్తున్నారు, కాని సువార్తను బోధింపక, వారిని నరకము
పాలుచేయుచున్నారు. ప్రమాణముల గురించి, యేసు కొండమీద ప్రసంగములో (మత్త. 5:34-37)
స్పష్టంచేసియున్నారు. అటువంటివారు కటిన శిక్షకు గురియగుదురు. వీటన్నింటికిగాను,
శిక్షను అనుభవించి తీరుదురని యేసు నిశ్చయముగా చెప్పుచున్నారు.
అనేకసార్లు, మనము కూడా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులువలె ప్రవర్తిస్తూ ఉంటాము. చిత్తశుద్ధి కలిగి జీవిస్తున్నామా? చిత్తశుద్ధి అనగా సత్యమునలో జీవించటం. సత్యమునే పలుకవలెనని, సత్యమునే జీవించవలెనని ప్రభువు ఆశిస్తున్నారు. అధికారములోనున్నవారు (రాజకీయ, ఆధ్యాత్మిక నాయకులు) ప్రజలను, ముఖ్యముగా పేదవారిని మోసం, దోపిడీ చేయరాదు. మన వ్యక్తిగత స్వలాభము కొరకు, మన అధికారాన్ని వినియోగిస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. ఇతరులను మంచి మార్గములో, పరలోకద్వారమైన యేసు వద్దకు నడిపిస్తున్నామా లేక తప్పుత్రోవలో నడిపిస్తున్నామా? మన జీవితాలద్వారా ఇతరులకు ఆదర్శముగా ఉంటున్నామా? మనం చెప్పేది, మనం పాటిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం.
No comments:
Post a Comment