20వ సామాన్య మంగళవారము (I)

20వ సామాన్య మంగళవారము
పరిశుద్ధ మరియరాణి మహోత్సవం
న్యాయా. 6:11-24; మత్త. 19:23-30

ధ్యానాంశము: నూరంతల ప్రతిఫలము

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు:  మొదటివారు అనేకులు కడపటి వారు అగుదురు. కడపటి వారు మొదటి వారు అగుదురు” (మత్త. 19:30).

ధ్యానము: ధనవంతుడైన యువకుడు, ధనాపేక్షవలన యేసును అనుసరించలేక వెళ్ళిపోయిన తరువాత (19:22), శిష్యులు, “అట్లయిన యెవడు రక్షణము పొందగలడు?” (19:25) అని యేసును ప్రశ్నించారు. అందుకు యేసు శిష్యులతో, “మానవులకు ఇది అసాధ్యము. కాని దేవునికి సమస్తము సాధ్యమే” (మత్త. 19:26) అని పలికెను. అప్పుడు, పేతురు యేసుతో, “మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి. మాకు ఏమి లభించును?” (19:27) అని అనెను. అవును అది నిజమే! పేతురు, ఇతర అపోస్తలులు, సమస్తమును విడచి యేసును అనుసరించారు. కనుక, పేతురు ఉద్దేశం ఏమిటంటే, “మాకు ఏమి లభించును?” (మత్త 19:27) అని అడుగుచున్నాడు. అందుకు యేసు, “పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనపుడు నన్ను అనుసరించిన మీరును పండ్రెండు ఆసనములపై కూర్చుండి, యిస్రాయేలు పండ్రెండు గోత్రములకు తీర్పు తీర్చెదరు... నిత్య జీవమునకు వారసులగుదురు” (19:28-29). కేవలము ధనమును మాత్రమేకాదు, బంధాలనుకూడా ప్రభువు కొరకు త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ త్యజింపుకు, త్యాగానికి, “ఈ లోకములోనే నూరంతలుగా ప్రతి ఫలమును పొందును.దీనికి చక్కటి ఉదాహరణ, అ.కా. 4:34-35: సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఎందుకన, పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి, వచ్చిన పైకమును, అపోస్తలుల పాదముల యొద్ద ఉంచు చుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగునట్లు పంచి పెట్టుచుండిరి.” “పరులకు ఒసగుడు. మీకును ఒసగ బడును. కుదించి, అదిమి, పోర్లిపోవు నిండు కొలమానముతో ఒసగబడును” (లూకా 6:38). దేవుని దీవెనలు నిండుగా, మెండుగా ఉంటాయి.

నేడు మరియరాణి మహోత్సవం. భూలోక జీవిత యాత్రను విశ్వాసముతో ముగించుకొని "మోక్షారోపణం" చెందిన మరియతల్లిని, తండ్రి కుమార, పరిశుద్ధాత్మలు ఆమెను ఇహఃపరలోకాలకు రాజ్ఞిగా నియమించి కిరీటం ఉంచారు. శ్రీసభ ఆమెను రాజ్ఞిగా ఎన్నుకొని "మరియ రాజ్ఞి" మహోత్సవాన్ని నెలకొల్పింది. మరియమాత పిత,సుత, పవిత్రాత్మ అను ముగ్గురు దైవ వ్యక్తుల సమక్షంలో ఇహ:పరలోకాలకు రాజ్ఞీగా నియమింపబడింది. సర్వసృష్టిప్రాణులందరికీ ఆమె రాజ్ఞి. కృపారసముగల మాతయై యుండెడి రాజ్ఞి వందనముమొదలైన ప్రాచీన జపములు ఆమెను రాజ్ఞిగా పేర్కొంటాయి. కనుక బహుప్రాచీన కాలంనుండే, క్రైస్తవ భక్తజనులు ఆమెను రాజ్ఞిగా కొనియాడుతూ వచ్చారని విశదమవుతుంది. మరియతల్లి రాజ్ఞిత్వం పరిపాలన కొరకు కాదు. మన కొరకు తన ప్రియ కుమారునికి మనవి చేయటం కొరకు. ఆ తల్లి మానవులందరి కొరకు క్రీస్తుకు మనవి చేస్తుంది. క్రీస్తుద్వారా మన క్రైస్తవ జీవితానికి కావలసిన వర ప్రసాదాలను అర్ధించి పెడుతోంది. ఆమె రాజ్యం క్రీస్తురాజ్యం-దైవరాజ్యం.

No comments:

Post a Comment