20వ సామాన్య సోమవారము (I)

 20వ సామాన్య సోమవారము
న్యాయా. 2:11-19; మత్త. 19:16-22

ధ్యానాంశము: ధనాపేక్ష - నిత్యజీవము (యేసు)

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు:  నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము” (మత్త. 19:21).

ధ్యానము: ఒక ధనికుడు యేసును సమీపించి, “బోధకుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయవలసిన మంచిపని యేమి?” అని ప్రశ్నించాడు.  నిత్యజీవము అనగా దేవుని రాజ్యము’. ఆ నిత్యజీవితం పొందుటకు ఎలాంటి అర్హతలు కలిగియుండాలో తెలుసుకోవాలని వచ్చాడు. మొదటిగా, ఆ వ్యక్తి యేసును బోధకుడాఅని సంబోధించాడు. అనగా, యేసును బోధకునిగా (రబ్బయి) గుర్తించాడు. యేసు దైవాజ్ఞలను గురించి చెప్పినప్పుడు, ఆ వ్యక్తి దైవాజ్ఞలను అనుసరించుచున్నాను. ఇంకను నాకు లోటు ఏమి? అని యేసుతో అన్నాడు. అయితే, ఆ వ్యక్తి చేయవలసినది ఇంకొకటి ఉన్నదని యేసు స్పష్టం చేసారు. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము” (19:21). నిత్యజీవము కొరకు ధనాపేక్షను త్యజించాలని యేసు కోరారు. ధనం, సంపదలు, అత్యాశ, దైవరాజ్యమునకు, సువార్తకు విరోధకాలు. దైవరాజ్యమా? ధనమా? అని యేసు ఆ వ్యక్తిని కోరారు.

ఆ యువకుడు, నిత్యజీవము, దైవరాజ్యము లేదా యేసు కొరకు తన సంపదలను వదులుకోలేక పోయాడు, లోకాశలను త్యజించుకోలేక పోయాడు. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను” (19:22). ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము! ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించట కంటె, ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము!(19:24). యేసు ఆ యువకుని సంపదలను కోరుకోలేదు కాని, ఆ యువకుని హృదయాన్ని కోరారు; అతని మారుమనస్సును ఆశించారు. నిత్యజీవము అనగా ఏకైక సత్య దేవుడును, ఆయన పంపిన యేసు క్రీస్తును తెలుసుకొనుటయే నిత్య జీవము” (యోహాను 17:3). అయితే, ఈ బోధన కేవలం ధనవంతులకు మాత్రమే కాదు; అత్యాశ, దురాశ కలిగిన వారందరికి ఈ సందేశం. ఇచ్చుటలోనే మనం పొందెదము’ (అస్సీసి ఫ్రాన్సిస్). సంతోషముతో దానమొనర్చువానిని దేవుడు ప్రేమించును” (2 కొరి. 9:7). ఎందుకు ధనం, పరలోకం కలిసిపోలేవు? పరలోకం దైవానుగ్రహము; ధనముతో దానిని కొనలేము లేదా సంపాదించలేము.

యేసును అనుసరించుటకు, శిష్యులు సమస్తమును త్యజించాలి, త్యాగం చేయాలి; చివరికి వారి ప్రాణములను సైతము అర్పించడానికి సిద్ధముగాయుండాలి. నేను నిజముగా నిత్యజీవమును పొందాలని అనుకుంటున్నానా? అయితే, దేవున్ని, క్రీస్తును తెలుసుకోవాలి; దైవాజ్ఞలను జీవించాలి; లోకాశలను, ఆకర్షణలను విడనాడాలి; పేదలకు దానము చేయాలి; యేసును అనుసరించాలి.

No comments:

Post a Comment