19వ సామాన్య శనివారము
యెహోషు. 24:14-29;
మత్త. 19:13-15
ధ్యానాంశము: పసిబిడ్డలకు దీవెనలు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “చిన్న బిడ్డలను నా
యొద్దకు రానిండు. వారలను ఆటంక పరపకుడు. ఏలయన,
అట్టి వారిదే
పరలోక రాజ్యము. (మత్త. 19:14).
ధ్యానము: వాస్తవానికి, నేటి పఠనం పరలోక రాజ్యము
గురించి, దానిలో ఎవరికి ప్రవేశం
అన్న విషయంగూర్చి బోధిస్తుంది. కొందరు తమ పసిబిడ్డలను దీవింపుడని యేసు చెంతకు
తీసుకొని రాగా, శిష్యులు వారిని
గద్దించారు. యేసు శిష్యులపై కోపించి, “చిన్న బిడ్డలను నా
యొద్దకు రానిండు. వారలను ఆటంక పరపకుడు. ఏలయన అట్టి వారిదే పరలోక రాజ్యము” అని పలికారు. ఆతరువాత,
యేసు వారిమీద
చేతులుంచి, ఆశీర్వదించి యేసు అచటనుండి వెడలి పోయెను.
ప్రజలు ఇప్పటివరకు స్వస్థత కొరకు రోగులను యేసు వద్దకు తీసుకొని వచ్చారు. ఇచ్చట, కొంతమంది తమ పిల్లలను స్వస్థత కొరకుకాదుగాని, యేసు దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు, తమ పిల్లలను తీసుకొని వచ్చారు. కాని శిష్యులు వారిని
ఆటంకముగా భావించారు. యేసుకు, ఆయన బోధనలకు భంగం
కలిగించరాదని శిష్యులు వారిని వారించారు. యేసు తన ప్రేషిత ప్రయాణములో ఎల్లప్పుడు
బలహీనులపట్ల, పాపాత్ములపట్ల శ్రద్ధను
చూపారు, కాని శిష్యులు ఈ
విషయాన్ని గ్రహించలేక పోయారు! అందుకే, యేసు శిష్యులపై
కోపపడ్డారు. చివరిగా, చిన్న బిడ్డల మీద
చేతులుంచి వారిని దీవించారు.
చిన్న బిడ్డల మనస్తత్వం కలవారిదే దేవుని రాజ్యము! చిన్నబిడ్డలను యేసు
శిష్యులకు, ఇతరులకు ఆదర్శముగా
చూపుచున్నారు. చిన్నబిడ్డల సుగుణాలను శిష్యులు,
విశ్వాసులు
పుణికిపుచ్చుకోవాలి. చిన్నారులు బలహీనులు, అమాయకులు, నమ్మదగినవారు, నిజాయితీపరులు. వారు
ఇతరులపై ఆధారపడి జీవిస్తారు. ఇలాంటి సుగుణాలతో ప్రతీ ఒక్కరు జీవించాలి. చిన్న
బిడ్డలకున్న నమ్మకం కలిగియుండాలి; చిన్నబిడ్డలవలె సంతోషముగా
ఉండాలి.
చిన్నబిడ్డల విశ్వాసముతో యేసు యొద్ధకు వెళదాం. ఆయన దీవెనలను పొందుదాం! అలాగే, చిన్నబిడ్డలను యేసు వద్దకు (దేవాలయానికి) తీసుకొనివద్దాం.
యేసును వారికి పరిచయం చేద్దాం! వారిని క్రైస్తవ విశ్వాసములో పెంచుదాం!
నేటి మొదటి పఠనములో, వాగ్ధత్త భూమిలోనున్న ప్రజలు దేవునితో తమ నిబంధనను నూత్నీకరించు కొనమని, అన్యదైవములను విడనాడమని యొహోషువా వారిని కోరుచున్నాడు. ఐగుప్తు బానిసత్వం గతం. మరో బానిసత్వమునకు పోరాదని యొహోషువా ఉద్దేశం!
No comments:
Post a Comment