19వ సామాన్య గురువారము
యెహోషు. 3:7-11,
13-17; మత్త. 18:21-19:1
ధ్యానాంశము:
క్షమాధర్మములు
ధ్యానమునకు
ఉపకరించు వాక్యములు: “ఏడు కాదు,
ఏడు డెబ్బది పర్యాయములు
క్షమింపవలెను అని యేసు సమాధాన మిచ్చెను” (మత్త 18:22).
ధ్యానము:
క్షమించడం అనగా చేసిన పాపము, తప్పునుండి ఒక
వ్యక్తికి విడుదలను, మన్నింపును
ఇవ్వడం. ప్రతీకారాన్ని వదులుకోవడం! బైబిలులో ఐదు రకాల క్షమాపణ గురించి
చెప్పబడినది: మొదటిగా, ‘శాశ్వత క్షమాపణ’:
క్రీస్తునందు విశ్వాసము
వలన పాపములు క్షమింపబడును. క్రీస్తు రక్తము వలన మనము విముక్తుల మైతిమి; ఆయన కృపైశ్వర్యములచే మన పాపములు క్షమింప బడినవి
(అ.కా. 26:18; ఎఫె. 1:7).
రెండవదిగా, ‘తండ్రి క్షమాపణ’: తండ్రి దేవునితో సహవాసాన్ని
పునరుద్ధరించుకోవడం. దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో, ఆయన మన పాపములను క్షమించును. మన పాపములను
దేవుడు శుద్ధిచేయనిచో, ఆయనతో మనకు భాగము
ఉండదు (1 యోహాను 1:9; యోహాను 13:4-10).
మూడవదిగా, ‘వ్యక్తిగత క్షమాపణ’: ఇతరులతో మన సహవాసాన్ని పునరుద్ధరించుకోవడం.
పరులు చేసిన దోషములను మీరు క్షమించిన యెడల, పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును.
పరులు చేసిన తప్పులను మీరు క్షమించని యెడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు (మత్త.
6:14-15). నాలుగవదిగా,
‘సామాజిక క్షమాపణ’:
ఇది సమాజముతో మన
సహవాసాన్ని పునరుద్ధరించుకోవడం. ఐదవదిగా, ‘శ్రీసభ క్షమాపణ’: ఇది శ్రీసభతో
సహవాసాన్ని పునరుద్ధరించుకోవడం. సంఘములో (శ్రీసభ) ఎవరైనా ఒకవ్యక్తి పట్ల దోషము
చేసినచో, అది కేవలము ఆ
వ్యక్తిపట్ల మాత్రమేగాక, కొంతమట్టుకు
అందరకు దోషము చేసినట్లగును. అట్టి వ్యక్తిని క్షమించి ఓదార్చవలెను. ఆ వ్యక్తితో
మరల ప్రేమపూర్వకంగా వ్యవహరింపవలెను (2 కొరి. 2:5-11).
యూదులు క్షమించడం
ఒక విధిగా భావించేవారు. “నీవు తోడి నరుని అపరాధములను మన్నించినచో,
నీవు మొరపెట్టినప్పుడు దేవుడు
నీ అపరాధములను మన్నించును” (సీరా. 28:2). అయితే, తోటివారిని ఎన్నిసార్లు క్షమించాలి? ఓ నాలుగుసార్లు క్షమిస్తే సరిపోతుందని యూదులు
భావించేవారు! అందుకే, నేటి సువార్తలో,
పేతురు యేసు వద్దకు వచ్చి,
“ప్రభూ! నా సహోదరుడు నాకు
ద్రోహము చేయుచుండ నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? ఏడు పర్యాయములా?” (18:21) అని అడిగాడు. ఆ కాలములో యూదులు నాలుగు సార్లు
క్షమిస్తే సరిపోతుందని భావించేవారు కాబట్టి, పేతురు ఇంకో మూడుసార్లు ఎక్కువగా చెబుతూ
ప్రభువును ప్రశ్నించాడు. యూదులకు ఏడు సంఖ్య పరిపూర్ణతకు సూచన కనుక, ఏడుసార్లు సరిపోతుందని పేతురు భావించాడు. కాని
యేసు, “ఏడు కాదు,
ఏడు డెబ్బది పర్యాయములు క్షమింపవలెను”
(మత్త 18:22) అని సమాధాన మిచ్చారు. పరిమితులు లేకుండా మనం
ఇతరులను క్షమించాలి. క్షమాపణ అనేది ప్రేమకు సంబంధించిన విషయం, ఎన్నిసార్లు అని కాదు! పశ్చాత్తాపముతో
క్షమించమని అడిగిన వారిని ఎన్నిసార్లయినా క్షమించడానికి సిద్ధముగా ఉండాలి. ప్రభువు
చెప్పిన ఉపమానములో (18:23-35), రాజు లేదా యజమాని
అనంతముగా చూపించిన దయను, క్షమను సేవకుడు
లేదా ఋణస్థుడు గ్రహించలేక పోయాడు. “మీలో సోదరుని హృదయ పూర్వకముగా క్షమింపని యెడల
పరలోక మందలి నా తండ్రియు మీ యెడల అట్లే ప్రవర్తించును” (18:35). క్షమించడం అనే
మంచి లక్షణాన్ని అలవర్చుకుందాం! క్షమాగుణం దైవస్వభావం. మనం దేవుని బిడ్డలం కనుక,
దేవుడు మనలను
క్షమించునట్లుగా, మనం ఒకరినొకరం
క్షమించుకుందాం! క్షమించడానికి మనసులో సంకల్పం కలిగియుండాలి. క్షమించినప్పుడు,
కోపం, ద్వేషం అనే సంకెళ్లనుండి విడుదల పొందుతాం!
No comments:
Post a Comment