19వ సామాన్య శుక్రవారము (I)

19వ సామాన్య  శుక్రవారము
యెహోషు. 24:1-13; మత్త. 19:3-12

ధ్యానాంశము: విడాకుల సమస్య

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరప రాదు” (19:6).

ధ్యానము: యేసు యోర్దాను నదికి ఆవలనున్న యూదయా ప్రాంతమునకు వచ్చెను (19:1). పరిసయ్యులు పరీక్షార్ధము [సాతాను శోధన వంటిది], యేసును తప్పుబట్టుటకు, ఆయన యొద్దకు వచ్చి విడాకుల గురించి, భార్యను పరిత్యజించుట చట్టబద్దమా?” (19:3) అని ప్రశ్నించారు. ధర్మశాస్త్రములోనున్న విషయాన్ని యేసు పరిసయ్యులచేతనే చెప్పించారు: విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఏల ఆజ్ఞాపించెను?” (19:7). ఈ చట్టం మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ బార్యలను విడనాడుటకు మోషే అనుమతించెనే కాని, ఆరంభము నుండి ఇట్లు లేదు” (10:5) అని పరిసయ్యులకు స్పష్టం చేసారు. ఈ విడాకుల గురించి ద్వితీయ. 24:1-4లో చెప్పబడింది. విడాకులకు కారణం – “ఆమె [భార్య] యేదో అనుచిత కార్యముకు పూనుకొనినఅని చెప్పబడినది. ఆ అనుచిత కార్యముయేదో వివరించబడలేదు; బహుశా, లైంగిక దుష్ప్రవర్తన, వ్యభిచారం అయుండవచ్చు. యేసు ఈ చట్టమును తప్పుబట్టడము లేదు. ఎందుకన, వాస్తవానికి ద్వితీయ. 24:1-4 విడాకులను ఇవ్వటం గురించి చెప్పడం లేదు; విడాకులను ఇవ్వటాన్ని ఖండిస్తుంది.

యేసు కాలములో, ద్వితీయ. 24:1-4లో చెప్పబడిన చట్టం రెండు విధాలుగా వివరించబడినది: ఒకటి, ‘శమ్మాయివివరణ - వ్యభిచార కారణమున మాత్రమే విడాకులు ఇవ్వవలెను; రెండవది, ‘హిల్లెల్వివరణ - ఏ కారణం చేతనైనను విడాకులు ఇవ్వవచ్చు. గమనించండి! మోషే చట్టం భర్త మాత్రమే విడాకులు ఇవ్వటం గురించి చెబుతుంది. స్త్రీలను భర్తల ఆస్థిగపరిగణించేవారు. చట్టపరమైన హక్కులు కేవలం కొన్ని మాత్రమే ఉండేవి! అందుకే, పరిసయ్యులు యేసును పరీక్షింప గోరారు!

ఆరంభమునుండి దేవుడు ఏర్పాటు చేసిన వివాహ జీవితమునకు విడాకులు అనుగుణమైనవి కావు. అనగా దేవుని ఉద్దేశ్యము ఎంతమాత్రము కాదు. సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి యున్నాడు [ఆ.కాం. 1:27]. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు [ఆ.కాం.2:24]. కనుక వారు భిన్న శరీరులు కాక, ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరప రాదు (10:6-9). వివాహము ఒక దివ్యసంస్కారముగా యేసు మనకు ఒసగారు. వివాహము జీవితకాల బంధము, శాశ్వత బంధము. అందుకే యేసు, విడాకులను, మరల వివాహము చేసుకొనుటను నిషేధించారు. మార్కు 10:1-12 లేదా లూకా 16:18 ప్రకారం, ప్రభువు విడాకుల విషయములో ఎలాంటి మినహాయింపును ఇవ్వలేదు. అయితే, మత్తయి 5:32 మరియు 19:9 ప్రకారం మాత్రం ఒక మినహాయింపు ఇవ్వబడినది: వ్యభిచార కారణమున తప్పతన భార్యను విడనాడు ప్రతివ్యక్తి ఆమెను వ్యభిచారిణిని చేసిన వాడగును. మరియొకతెను వివాహమాడినవాడు వ్యభిచారియగును.

రోమను కతోలిక శ్రీసభ చట్టం ప్రకారం, వివాహ బంధములో ఏకమైన వారిని విడదీయకూడదు. అయితే, ‘వివాహ రద్దు ప్రక్రియ’ (the annulment process) చట్టములో ఉన్నది. ఆర్థడాక్స్ సంఘము, మత్తయ సువార్తను సారముగ, ‘వ్యభిచార కారణమున’ (5:32; 19:9), విడాకులకు అనుమతిని యిస్తారు. నిర్దోషియగు వ్యక్తి మరల వివాహమాడవచ్చును. ప్రొటెస్టంటు సంఘాలు అనేక కారణాల వలన, విడాకులకు, మరల వివాహమునకు అనుమతిని యిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికిని, ప్రభువు ఉద్దేశములో వివాహము అనేది విచ్చిన్నంకాని ఐక్యత’ (indissoluble union) అని, భార్యాభర్తలు ఇరువురు సమానులే అని అర్ధమగుచున్నది. నేడు అనేక వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి ఎందుకంటే, భార్యాభర్తలు ఇరువురు సమానమే అన్న విషయాన్ని గ్రహించక పోవడమే! వివాహితులు వారి సమస్యలలో ఎప్పుడూ ఒంటరివారు కాదు; ప్రభువు వారితో ఉన్నారు అని తెలుసు కోవాలి. వారి జీవితాలలో ఆశను కలిగి, విశ్వాసము, ప్రేమ కలిగి జీవించాలి.

No comments:

Post a Comment