19వ సామాన్య బుధవారము
ద్వితీయ. 34:1-12;
మత్త. 18:15-20
ధ్యానాంశము: సఖ్యతపడుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ఎక్కడ ఇద్దరు లేక
ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను” (మత్త. 18:20)
ధ్యానము: ప్రేమ, క్షమ, సేవ క్రైస్తవ జీవితం. కనుక, నేడు యేసు
చెప్పునది మనం చేయాలి: “నీ సోదరుడు నీకు
విరుద్ధముగ తప్పిదము చేసిన యెడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి
బుద్ధి చెప్పుము” (మత్త. 18:15). మనం ఎల్లప్పుడు
ఇతరులతో సఖ్యపడాలి. మనతప్పయితే, క్షమించమని వేడుకోవాలి.
మొదటిగా తప్పిదము చేసిన వారితో ఒంటరిగా హృదయపూర్వకమైన వ్యక్తిగత సంభాషణ ఉండాలి.
సఖ్యత కొరకు కృషిచేయాలి. “భూలోకమున ఇద్దరు
ఏక మనస్కులై ఏమి ప్రార్దించినను, అది వారికి ఒసగబడును” (మత్త. 18:19). నీ మాటలను ఆ వ్యక్తి
ఆలకింపనిచో, రెండవ ప్రయత్నముగా, ఒకరిద్దరు సాక్ష్యుల సమక్షములో (ద్వితీయ. 19:15-21), అతని తప్పిదము గురించి మాట్లాడటం. అబద్ద సాక్ష్యము పలుకక, సఖ్యత పడుటకు సహాయం చేయడానికి వారు కృషిచేయాలి. సాక్షుల
మాటలుకూడా విననియెడల, మూడవ ప్రయత్నముగా, స్థానిక సంఘమునకు తెలియజేయాలి. ఎందుకన, “భూలోకమందు వేనిని బంధింతురో, అవి పరలోకమందును
బంధింపబడును. భూలోకమందు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును” (మత్త. 18:18). ఇప్పటికీ ఆ
వ్యక్తి క్షమించకపోతే, అతనిని అవిశ్వాసిగా, సుంకరిగా పరిగణించాలి. గమనించండి! యేసు అటువంటివారితో
స్నేహం చేసారు. పాపాత్ములు విశ్వసించి, వారి పాపాలకు పశ్చాత్తాప పడినప్పుడు, ప్రభువు, వారిని తండ్రి దేవునితో
సఖ్యపరచియున్నారు. కనుక, మనంకూడా, అటువంటివారితో స్నేహాన్ని కొనసాగించాలి. మనం ఇవేవి ప్రయత్నం
చేయక, చివరిదాన్నే మొదటగా
అనుసరిస్తాం. సఖ్యత కొరకు ప్రయతించక వదిలివేస్తాం. మనలను బాధపెట్టిన వ్యక్తితో
ఎక్కువసార్లు మాట్లాడితే, మనం బాధనుండి విముక్తిని
పొందుతాము, జరిగిన సంఘటనను
అర్ధంచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ప్రభువు మనందరి పాపాలకోసం సిలువ మరణాన్ని
పొందారు. మనం ఒకరికోసం ఒకరం పాటుపడాలని ప్రభువు కోరుచున్నారు. ఇతరులపట్ల మనం
బాధ్యత కలిగియున్నామని ప్రభువు గుర్తుచేయుచున్నారు.
మనకు సాధ్యమైనది మనం చేయాలి. మిగతా దేవునిపై భారం వేయాలి. నేటి మొదటి పఠనములో చూస్తున్నట్లుగా, మోషే వాగ్ధత్త భూమి దరివరకు చేరుకున్నాడు, కాని, దానిలోనికి ప్రవేశించే భాగ్యాన్ని అతను పొందలేదు. నాయకత్వం యొహోషువాకు ఇవ్వబడింది. కనుక, రక్షణ చరిత్రలో, దైవరాజ్య నిర్మాణానికి మన పాత్రను మనం విశ్వసనీయముగా పోషించాలి. మిగతాది, మన తరువాతి వారితో కొనసాగింపబడుతుంది.
No comments:
Post a Comment