19వ సామాన్య సోమవారము
ద్వితీయ. 10:12-22;
మత్త. 17:22-27
ధ్యానాంశము: దేవాలయపు పన్ను
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “వారు మనలను అన్యధా భావింపకుండుటకై
... సుంకము చెప్పింపుము” (మత్త. 17:27)
ధ్యానము: నేటి సువిషేశములో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రభువు రెండవసారి తన శ్రమలు, మరణము, పునరుత్థానము గురించి ప్రస్తావించడం (17:22-23). మొదటిసారి
మత్త. 16:21లో ప్రస్తావించారు. రెండు, యేసు దేవాలయపు పన్ను చెల్లించడం
(17:24-27). ప్రభువు తన శ్రమల గురించి ప్రస్తావించగా, శిష్యులు మిక్కిలిగా కలవరపడ్డారు,
దు:ఖించారు. మొదటి ప్రస్తావనలో, పేతురు శ్రమలు ఎన్నటికి సంభవింపకుండునుగాక అని గట్టిగా
వారించాడు. రెండవ ప్రస్తావనలో అలా వారించలేదు. బహుశా, సిలువ యేసు ప్రయాణములో ఒక
భాగమని శిష్యులకు మెల్లగా తెలియవచ్చుచున్నది.
యేసు, ఆయన శిష్యులు కఫర్నాము వచ్చినప్పడు, పన్నులు వసూలు చేయువారు పేతురు
దగ్గరకు వచ్చి, “మీ గురువు పన్ను చెల్లింపడా?” అని ప్రశ్నింపగా, “చెల్లించును” అని
పేతురు చెప్పెను. ఈ సంఘటన కేవలం సుంకరి అయిన మత్తయి సువార్తలో మాత్రమే చూస్తాం. నెహెమ్యా
కాలమున, బబులోనియానుండి తిరిగివచ్చిన తరువాత, యాజకుల పోషణకొరకు, దేవాలయ నిర్మాణముకొరకు
ప్రజలు గుడిపన్ను చెల్లించడం ప్రారంభించారు. అందరి యూదుల వలెనె, యేసుకూడా
గుడిపన్ను చెల్లించారు. అయితే, క్రైస్తవులు గుడిపన్ను చెల్లించాలా అన్న ప్రశ్న ఆ
తరువాత రావడం; “పుత్రులుగా” క్రైస్తవులు బద్దులు కాకున్నను, అపవాదు కలిగించకుండా
ఉండుటకు, వారు పన్ను చెల్లించాల్సిందని ఈ సంఘటన తెలియజేయుచున్నది.
నేటి సమాజములో పన్నులు, కొన్ని న్యాయబద్ధము కాకున్నను, ప్రభుత్వానికి కడుతూ ఉంటాము. అలాగే, వివిధ రూపాలలో, మన విచారణ దేవాలయాలకు సహాయం చేస్తూ ఉంటాము. దేవాలయపుపన్ను గురించి నిర్గమ 30:11-16లో చూడవచ్చు. ఇది తప్పనిసరిగా కట్టవలసిన పన్ను. ఆలయపన్ను చెల్లింపు మూడు విషయాలు మనకు బోధిస్తుంది: ఒకటి, దేవాలయ నిర్వహణలో సహాయపడుచున్నాము. సంఘస్తులుగా, పౌరులుగా మన బాధ్యతలను నెరవేర్చాల్సి యుంటుంది. లోతైన భావం ఏమిటంటే, పన్ను చెల్లించడం ద్వారా, పైఅధికారులకు లోబడి ఉంటున్నామని అర్ధం. ఇది దేవునిపట్ల, అధికారంపట్ల గౌరవాన్ని సూచిస్తుంది. కనుక, ప్రేమతో, ఇష్టపూర్వకంగా దేవాలయానికి వివిధ రూపాలలో సహాయం చేయాలి. రెండు, ఇతరులు మనలను అన్యధా భావింపకుండుటకై చెల్లించాలి. మన జీవితాలద్వారా, ఇతరులకు ఉదాహరణగా ఉండాలి. మెస్సయ్యగా, యేసు పన్ను చెల్లించాల్సి లేకున్నను, ఇతరులకు ఆదర్శముగా ఉండుటకు, యేసు పన్ను చెల్లించారు. మూడు కష్టపడి పనిచేయాలని బోధిస్తుంది. చేపలు ఊరికే వచ్చి మన ఒడిలో పడవు. అద్భుతాలకై వేచిచూడక, కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలి.
No comments:
Post a Comment