18వ సామాన్య శనివారము
ద్వితీయ. 6:4-13;
మత్త. 17:14-20
ధ్యానాంశము: ఆవగింజంత విశ్వాసము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ఆవగింజంత విశ్వాసము
మీకుండిన యెడల ... మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదు” (మత్త. 17:20)
ధ్యానము: మూర్ఛరోగము వలన తీవ్రముగ బాధపడుచున్న లేదా పిశాచగ్రస్తునకు యేసు
స్వస్థత చేకూర్చియున్నారు. మొదటిగా, పిశాచము పట్టిన బాలుని
శిష్యుల వద్దకు తీసుకొనిరాగా, శిష్యులు ఆ దయ్యమును
వెడలగొట్టలేక పోయారు. శిష్యులకు స్వస్థత సాధ్యపడక పోవడానికి కారణాలు: అవిశ్వాసము,
ప్రార్ధనలేమి! శిష్యులు దేవుని వాక్యమును ఆలకించుటలో, వాక్యమునకు స్పందించుటలో వారి వైఫల్యానికి పిశాచము
సూచనగాయున్నది. దేవుని వాక్యములోని నిగూఢ అర్ధాలను తెలుసుకొనుటలో వారు
విఫలమయ్యారు. దేవుని శక్తి మాత్రమే దయ్యములను వెడలగొట్టగలదు. విశ్వాసము లేకుండా ఏ
కార్యాలు దయ్యములను వెడలగొట్టలేవు. యేసు, తన అద్భుత శక్తివలన, కార్యాలవలన దయ్యములను,
పిశాచ శక్తులను
జయించారు. తన ఉత్థానంద్వారా సాతాను శక్తిని జయించారు. శిష్యులు ప్రార్ధనను
నిర్లక్ష్యం చేయుట వలన, సాతాను శక్తులను జయించలేక
పోయారు. ఏ దుష్టత్వమునైనను విశ్వాసము, ప్రార్ధనతో జయించవచ్చు.
విశ్వాసము, ప్రార్ధన, సంఘముయొక్క మద్దతు ఉంటె,
పరిపూర్ణ
పరివర్తన సాధ్యమని నిరూపితమైనది. బాధల సమయములో శిష్యులు విశ్వాసం కలిగియుండాలని
అర్ధమగుచున్నది. వారి నమ్మకం బలపడాలంటే, ప్రార్ధన తప్పనిసరి!
విశ్వాసము దేవుని వరము, అనుగ్రహము. విశ్వాసము
మనలను ఐఖ్యతగా ఉంచుతుంది. ఒకరి విశ్వాసమును ఒకరము ప్రోత్సహించు కొనవలెను. అలాగే, మన ఆవగింజంత విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు బలపరచుకొనవలెను. మన
విశ్వాసం, ఇతరులకు ఆశ్రయాన్ని
కల్పించాలి. అయితే, అక్కడ జరిగింది కేవలం
స్వస్థత మాత్రమే కాదు; క్రీస్తు తన ఉత్థాన
మహిమను ఈ స్వస్థతద్వారా ముందుగానే ప్రదర్శించారు! నేడు మనలోనున్న పిశాచాలనుండి
(గర్వం, ద్వేషం, కామం, అసూయ, స్వార్ధం...) విముక్తి,
విడుదల, స్వస్థత కావాలి! విశ్వాసముతో ప్రార్ధన చేద్దాం!
నేటి మొదటి పఠనం, యూదుల విశ్వాస సంగ్రహము: “ఇస్రాయేలీయులారా వినుడు! మన ప్రభుడైన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభువైన దేవుని పూర్ణహృదయముతో, పూర్ణమనస్సుతో, పూర్ణశక్తితో ప్రేమింపుడు.” దీనిని వారు మూడుసార్లు ప్రార్ధిస్తారు. ఇది కేవలం వ్యక్తిగత ప్రార్ధన మాత్రమేగాక, ఈ విశ్వాసం యూదులను ఒకటిగా, ఐఖ్యముగా ఉంచుతున్నది.
No comments:
Post a Comment