18వ సామాన్య శుక్రవారము
పునీత క్లారమ్మ
ద్వితీయ. 4:32-40;
మత్త. 16:24-28
ధ్యానాంశము:
శిష్యరికము
ధ్యానమునకు
ఉపకరించు వాక్యములు: “మానవుడు
లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో ప్రయోజనమేమి?” (మత్త. 16:26)
ధ్యానము: శిష్యరికములో మూడు ముఖ్యమైన అంశాలు అవసరమని యేసు స్పష్టంచేయుచున్నారు: 1. ఆత్మ/స్వీయ త్యజింపు: యేసును అనుసరించాలంటే మొదటిగా మనం చేయవలసినది, త్యజింపు. ఆత్మ త్యజింపు, నిత్యం అహంపై యుద్ధం చేయడం లాంటిది! ఆత్మత్యజింపు అనగా తండ్రి దేవుని, యేసుక్రీస్తు కుమారుల అధికారమునకు లోబడటం; శారీరక సుఖాలను త్యజించడం; అహంభావమును, స్వార్ధమును త్యజించడం. హృదయశుద్ధి కలిగియుండటం. ఆత్మ త్యజింపు అనగా తననుతాను కోల్పోవడం కాదు లేదా తాను నశించి పోవడం కాదు. ‘సంపాదన’, లోకసంపదలను, వ్యాపారాలను సూచిస్తుంది. ‘తననుతాను కోల్పోవడం’ ఆత్మత్యజింపు; తననుతాను తగ్గించుకోవడం, తద్వారా ఇతరులకు సేవచేయడానికి సమయం, శక్తి, అంకితభావం కలిగియుండటం. తననుతాను ప్రేమించునట్లు ఇతరులను ప్రేమించడం. సిలువను ఎత్తుకొని యేసును వెంబడించడం. లోకసంపాదనలతో, బాధ్యతారహితమైన, స్వార్ధపూరితమైన బ్రతుకులతో క్రీస్తు ఒసగు నిత్యజీవమును కోల్పోకూడదు. 2. సిలువను ఎత్తుకొనుట: మన సిలువనుండి మనం తప్పించుకోలేము, కనుక ‘అనుదినము’ మోయవలసినదే! సిలువ అనగానే, ముందుగా మనకు గుర్తుకు వచ్చేది మన అనుదిన కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానాలు, అపార్ధాలు, ద్వేషం, తిరస్కరణలు, చీత్కారాలు, హింస..! వీటితోపాటు, ముందుగా సిలువ మన పాపాలకు, అవిశ్వాసమునకు, స్వార్ధానికి మరణం అని గుర్తుంచుకోవాలి! సిలువ మరణం తిరిగుబాటుదారులకు, దేశద్రోహులకు విధించే శిక్షగా మొదట పర్షియన్లు అమలుచేసారు. ఆ వ్యక్తి చేసిన నేరాన్ని సిలువపై లిఖించేవారు. ఆ తరువాత దానిని గ్రీకులు, రోమనులు అనుసరించారు. సిలువ మరణం, అత్యంత దౌర్భాగ్యమైన శిక్షగా పరిగణించబడేది. సిలువ మరణాన్ని, యూదులు ఆటంకముగాను, అన్యులు అవివేకముగాను భావించారు (1 కొరి 1:23). అయితే యేసు పునరుత్థానము సిలువకున్న అర్ధాన్ని మార్చివేసింది. సిలువపై యేసు మరణం, లోకరక్షణార్ధముగా మారింది. ప్రాయశ్చిత్తముగా, త్యాగానికి, దైవప్రేమకు నిదర్శనముగా మారింది. కనుక సిలువ ఎత్తుకోవడం అనగా క్రైస్తవులముగా బాధ్యతాయుతముగా జీవించడం; ఇతరులను, ముఖ్యముగా అవసరములోనున్న వారిని చేరువవడము. స్వార్ధపూరితమైన ఉద్దేశ్యాలు, ప్రయోజనాలను వీడినప్పుడే, ఇతరులకు సేవచేయగలం! ఇతరులకు సేవచేసే క్రమంలో పొందే బాధలను అంగీకరించడం కూడా మన సిలువను ఎత్తుకోవడమే! కనుక, సిలువను, ప్రేమించాలి; సిలువను ధరించాలి. సిలువను మోయాలి. పవిత్రాత్మ శక్తితో మన సిలువలను రక్షణ సాధనాలుగా మార్చుకోవాలి. 3. క్రీస్తును అనుసరించుట: నిజమైన శిష్యరికం క్రీస్తును మాత్రమే అనుసరించడం! దేవుని వాక్యానికి, ఆజ్ఞలకు లోబడి జీవించడం. శ్రీసభ బోధనలకు కట్టుబడి జీవించడం. ప్రభువును అనుసరించాలంటే, తప్పక మనలను మనం త్యజించుకొని, మన సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించాలి. ఈ అనుసరణ క్రీస్తుతోపాటు మన మరణానికి నడిపిస్తుంది. క్రీస్తును అనుసరించేవారు దీనిని తప్పక గుర్తించాలి. ‘మరణమొందినప్పుడే, నిత్యజీవమును పొందెదము’. క్రీస్తు అనుకరణలో, మరణంనుండి తననుతాను కాపాడుకొన జూచిన, లోకముతో సర్దుబాటు కలిగి తన జీవితాన్ని కాపాడుకొన జూచిన, నిత్యజీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాని, దేవుని విషయాలపట్ల, తన జీవితాన్ని కోల్పోవడానికి సిద్ధపడినవారు నిత్యజీవమును పొందుదురు.
No comments:
Post a Comment