17వ సామాన్య బుధవారము
నిర్గమ. 34:29-35;
మత్త. 13:44-46
ధ్యానాంశము: పరలోక రాజ్యము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “పరలోక రాజ్యము పొలములో
దాచబడిన ధనమువలె ఉన్నది. ఇంకను ఆణిముత్యములు వెదకు వర్తకునివలె ఉన్నది” (మత్త. 13:44, 45).
ధ్యానము: నీ జీవితములో అత్యంత విలువైనది ఏమిటి? అని అడిగితే, కొంతమంది కుటుంబము అని,
జ్ఞానము అని, సంపద అని లేదా ఇంకేమైనా అని సమాధానం చెప్తారు. పరలోక
రాజ్యము దాచబడిన ధనముతోను, ఆణిముత్యముతోను
పోల్చబడినది. ఈ ఉపమానాలు, దేవుని రాజ్యమును
వెదకుటనుగూర్చి తెల్పుచున్నాయి. మన జీవితములో దేవుని రాజ్యాన్ని పొందటం అత్యంత
విలువైనదని బోధిస్తున్నాయి. దేవుని రాజ్యాన్ని కనుగొన్నప్పుడు, గొప్ప సంపదయైన ప్రభువునే మనం పొందుతాము. ప్రభువుకన్న మించిన
సంపద మనకేమున్నది!
ఆ దైవరాజ్యం మానవునిగా జన్మించిన దైవకుమారుడు యేసుక్రీస్తు ప్రభువే! మన
రక్షణకు తండ్రి దేవుడు ఒసగిన అత్యంత విలువైన బహుమతి ఆయనే! కనుక, మన జీవితములో యేసుక్రీస్తు ప్రభువును కనుగొనాలి. అప్పుడు
ఆయనకోసం సమస్తాన్ని విడిచి అనుసరిస్తాము. దేవుని రాజ్యమును వెదుకుటలో ఎంతో సంతోషం
ఉన్నది. అయితే, ఇచ్చట మూడు విషయాలను
గమనించాలి: ఒకటి కష్టపడటం. మన విశ్వాసాన్ని జీవించడం అంటే దాచబడిన నిధిని కష్టపడితవ్వడం లాంటిదే! దేవుని రాజ్యాన్ని
కనుగొనాలంటే మనం కష్టపడి పనిచేయాలి.
విలువైన ముత్యాన్ని వెలికితీయడానికి, మన ఆధ్యాత్మిక జీవితములో
కష్టపడాలి. అప్పుడే, శాశ్వత జీవితమును గూర్చిన
దేవుని వాగ్దానం నెరవేరుతుంది. ఆ అమూల్యమైన నిధిని పొందినప్పుడు సంతోషాన్ని, సంతృప్తిని, శాంతిని పొందుతాము. రెండు
అత్యంత విలువైనది. మన హృదయాలు లోకాశలకు పడిపోకూడదు. దేవునిరాజ్యం పొందాలంటే, ఎంతో వెచ్చించాల్సి ఉంటుంది. దేవునిరాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి, సమస్తాన్ని త్యాగంచేయాల్సి ఉంటుంది. ప్రాపంచిక విషయాలను
విడిచిపెట్టాల్సి యుంటుంది. మూడు గొప్ప ఫలితాలు. దేవుని రాజ్యాన్ని
పొందాలంటే, ఈ లోకములో విలువైన
జీవితాన్ని జీవించాలి. సువార్త సందేశానికి,
విలువలకు
కట్టుబడి జీవించాలి. క్షమాగుణముతో జీవించాలి. నీతి, న్యాయము, శాంతిని స్థాపించాలి. మన హృదయాలు ప్రేమతో జీవించాలి. ఈ లోకములోని అశాశ్వతమైన సంపదలపైగాక, శాశ్వత సంపదయైన పరలోక రాజ్యము అనగా క్రీస్తుపట్ల ఆసక్తిని
కలిగి జీవించాలి. దేవునితో మన వ్యక్తిగత అనుబంధాన్ని బలపరచుకోవాలి.
మొదటి పఠనములో, మోషే దేవునితో మాటలాడి వచ్చుటవలన, అతని ముఖము
ప్రకాశించుచుండెను అని వింటున్నాము. ప్రజలు దైవసాన్నిధ్యాన్ని మోషేలో చూడగలిగారు.
ఆ దేవుని వెలుగు మనలో కూడా ప్రకాశించాలని ఆశిద్దాం. ప్రార్ధనలో క్రీస్తుకు
దగ్గరైనచో, ఆ దేవుని వెలుగును ఇతరులకుకూడా ప్రకాశింపచేయుదము. మన జీవితమునుండి
విలువైన దైవరాజ్య సంపదను కలిగియున్నామా, లేదా అని ఇతరులు గుర్తించగలరు.
No comments:
Post a Comment