17వ సామాన్య గురువారము (I)

17వ సామాన్య  గురువారము
నిర్గమ. 40:16-21, 34-38; మత్త. 13:47-53

ధ్యానాంశము: అంత్యకాలము

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: పరలోక రాజ్యము వలను పోలియున్నది” (మత్త. 13:47)

ధ్యానము: జాలరులు, చేపలను వలతో పట్టిన తరువాత, మంచి చేపలను వేరుచేసి, చెడుచేపలను పారవేస్తారు. అలాగే, అంత్యకాలమున జరుగునని ప్రభువు తెలియజేయుచున్నారు. దూతలు దుష్టులను, నీతిమంతులనుండి వేరుపరచి, అగ్నిగుండములో పడద్రోయుదురు. నీతిమంతులు, దేవుని చిత్తప్రకారం, దేవుని అంచనాల ప్రకారం, దేవుని మార్గాల ప్రకారం జీవించేవారు. నైతికముగా జీవించేవారు. నేటి సువిశేషం ఒక ప్రవచానాత్మక హెచ్చరిక! మనలో పరివర్తన కలుగక, చెడు మార్గములోనే జీవిస్తే, మన ఆత్మలను నాశనం చేసుకున్న వారమవుతామని, దేవుని రాజ్యాన్ని కోల్పోతామని ప్రభువు హెచ్చరిస్తున్నారు. కనుక, ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను! మనస్సాక్షి దేవుని తీర్పు యొక్క రుచిని ముందస్తుగా తెలియజేస్తుంది. క్రీస్తుకు దగ్గరచేసే వాటిని ఆలింగనం చేసుకొని, ఆయననుండి మనలను దూరంచేసే ప్రతీదానిని తిరస్కరించాలి. మనస్సాక్షిలో నైతిక చట్టాన్ని దేవుడు రాసాడు. మనస్సాక్షి లేదా అంతరాత్మ చేసే నీతిప్రబోధాలే తుదితీర్పున దేవుడు మనలనుండి మంచి-చెడులను నిర్ధారించడానికి పరమ ప్రమాణాలుగా నిలుస్తాయి.

తీర్పు దినమున మనం దేవునికి జవాబు చెప్పాలనే విషయాన్ని గ్రహించాలి. దేవుడు అందరినీ రక్షించాలనే కాంక్షిస్తారు. అయితే, తుదితీర్పు తప్పనిసరియని మనం గ్రహించాలి. అచట, దుష్టులు, నీతిమంతులనుండి వేరుచేయబడతారు. ఏవి మంచి చేపలో, ఏవి చెడు చేపలో దేవుడు నిర్ణయిస్తారు. చేపలను పట్టు వలశ్రీసభను సూచిస్తుంది. శ్రీసభలో మంచివారు, చెడువారు ఉంటారు. పునీతులు, పాపాత్ములు ఉంటారు. అందరూ పరిపూర్ణతవైపునకు పయణం చేస్తున్నారు. శ్రీసభలో నుండగా, మన విశ్వాసం బలపడుతుంది. సువార్తా విలువలను జీవించగలము. పాపముయొక్క వేతనము గురించి నేర్చుకొనవచ్చు. దేవుని అనుగ్రహ వరమును పొందవచ్చు. శ్రీసభ సంభ్యులముగా విశ్వాసపాత్రులముగా జీవించినపుడు, ఇతరులుకూడా క్రీస్తు సాంగత్యములోనికి నడిపించబడతారు. కాలముతోపాటు శ్రీసభ బోధనలు మారినను, అంతమముగా, ప్రేషితకార్యము ఒక్కటే. అదే సమస్త మానవాళి రక్షణ. అంత్యదినమున దేవుడు తీర్పును విధిస్తారు. అంత్యదినము వరకు మనకు సమయం, అవకాశం ఇవ్వబడినది. కనుక, మారుమనస్సు చెంది దేవుని వైపునకు మరలుదాం.

మోషే ప్రభువు ఆజ్ఞలను పాటించగా, ప్రభువు తేజస్సు, అతనిపై, ప్రజలపై ఉండెను. దేవుడు వారిని నడిపించెను. మనం కూడా దేవుని ఆజ్ఞలను పాటించి, దేవుని అనుగ్రహాన్ని పొందుదాం.

No comments:

Post a Comment