17వ సామాన్య శనివారము
పరిశుద్ధ మరియమాత మహా ఆలయ ప్రతిష్ట
లేవీ. 25:1,
8-17; మత్త. 14:1-12
ధ్యానాంశము: బప్తిస్త యోహాను మరణము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “అతడు ప్రవక్తయని
ప్రఖ్యాతి గాంచుటచే హేరోదు ప్రజలకు భయపడెను”
(మత్త. 14:5)
ధ్యానము: హేరోదు తన భార్యను త్యజించి, తన సోదరుడైన ఫిలిప్పు
భార్య హేరోదియను వివాహమాడాడు. ఇది యూదుల చట్ట ప్రకారము నేరము (లేవీ. 18:16).
ఈ సందర్భములో, యోహాను హేరోదును మందలించడానికి వెనుకాడలేదు. సోదరుని
భార్యను వివాహం చేసుకోవడం సరికాదని తెలియజేసాడు. అందుకు హేరోదు యోహనును బంధించి
చెరలో వేయించాడు. బహుశా, యోహానును చంపాలన్న
ఉద్దేశం హేరోదుకు లేకపోయినను, ఎప్పుడైతే, అహంకారం, కుతంత్రం వలయములో
చిక్కుకున్నాడో, శిరచ్చేదనమను భయంకరమైన
ఆదేశాన్ని జారీచేసాడు. దీనికి కారణం ముగ్గురు వ్యక్తులు: హేరోదియ, ఆమె కూతురు, హేరోదు. హేరోదుతో తన
అనైతిక సంబంధాన్ని ఎత్తిచూపిన యోహానుపై హేరోదియ పగను పెంచుకున్నది. ఆ పగ తన
కూతురుని పావులా వాడుకొనేలా చేసింది. తన ప్రమాణముల కారణముగా, అతిధుల కారణముగా హేరోదు చెరసాలలోనున్న యోహాను శిరచ్చేదనము
గావించాడు.
మనం కూడా అనేకసార్లు చేయకూడదన్న పనినే చేస్తాము. చాలా సులువుగా పాపాలను చేస్తూ
ఉంటాము. చేసిన తప్పును కప్పిపుచ్చుకొనుటకు,
మరో తప్పు
తేలిగ్గా చేస్తూ ఉంటాము. హేరోదువలె పిరికివారముగాగాక, యోహానువలె ధైర్యముగా చెడును ఖండించేవారిగా జీవిద్దాం.
యోహానువలె సత్యమును మాత్రమే పలుకుదాం. అబద్ధాలకు స్వస్థిపలుకుదాం. మన మాటలతోకూడా
మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వాగ్దానం చేసేప్పుడు వివేకము కలిగియుండాలి. సామాజిక
సౌలభ్యం కోసం, ప్రజాదరణ కోసం, నైతిక జీవిత విలువలను తృణీకరించకూడదు.
నేటి మొదటి పఠనం జూబిలీ గురించి ప్రస్తావిస్తుంది. గత కొన్ని సం.లుగా అందరు జూబిలీ వేడుకలు ఘనముగా చేసుకోవడం ఆనవాయితీ అయిపొయింది. కంప్యూటరులో ‘రీసెట్ బటన్’వలె, గతములో చేసిన తప్పులను సరిదిద్దుకొని, ముందుకు పోవడానికి జుబిలీలు మనకు తోడ్పడతాయు. శ్రీసభ (మేత్రాసనం, విచారణ) జూబిలీ వేడుకలు, ప్రజల విశ్వాసము, ప్రార్ధనా జీవితమునుబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. వ్యక్తిగత (వివాహము, గురుత్వ, మాటపట్టు) జూబిలీలు, దేవునితోను, తోటివారితోను బంధాన్ని పునరుద్దరించుకుంటూ, మనలో నిజమైన స్వేచ్చను కనుగొనడానికి తోడ్పడాలి.
No comments:
Post a Comment