18వ సామాన్య సోమవారము (I)

18వ సామాన్య  సోమవారము
సంఖ్యా. 11:4-15; మత్త. 14:13-21

ధ్యానాంశము: సంపూర్ణ సమర్పణ

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: మా వద్ద ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప మరేమియు లేవు... వాటిని ఇచటకు తీసికొని రండు” (మత్త. 14:17-18)

ధ్యానము: యేసు పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు తమ పట్టణములనుండి కాలి నడకన ఆయనను వెంబడించిరి. సమర్ధవంతమైన, ప్రభావితం చేయగల సువార్తా ప్రచారం, ప్రజలను కదిలిస్తుంది, నడిపిస్తుంది. ప్రభువువైపుకు వచ్చుటయనగా, మారుమనస్సుకు సంసిద్ధతను సూచిస్తుంది. హృదయపరివర్తనము ఆలకించే హృదయాలలోనికి, విశ్వాసం చొచ్చుకొనిపోయేలా చేస్తుంది. యేసునుండి దూరముగా వెళ్ళేవారు అంధకారములోనికి నెట్టబడతారు. వారు అంత:ర్గత శూన్యతను కలిగియుంటారు. వారు విశ్రాంతి కొరకు ఏకాంత స్థలమునకు వెళ్ళుచున్నప్పటికిని, సువార్తా ప్రచారం కొరకు ఎల్లవేళలా సంసిద్ధముగా ఉండాలని యేసు తన శిష్యులకు బోధించారు. దానికి సూచనగా, యేసు జాలిపడి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచారు. యేసు దైవరాజ్యమును గురించిన సువార్తను ప్రకటించారు. యేసు వారిపై కనికరము కలిగియుండుట, వారిని హృదయపరివర్తనములోనికి, విశ్వాస పథములోనికి నడిపించు ప్రక్రియ.

నేటి సువిషేశములో పాత నిబంధన అంశాన్ని చూడవచ్చు: నిర్జనప్రదేశము లేదా ఏకాంత స్థలము. దేవుడు తన ప్రజల హృదయాలనుండి వినగల, మాట్లాడగల ప్రదేశము. ఐగుప్తు దేశమునుండి విడుదల తరువాత, దేవుడు తన ప్రజలను ఎడారిలో (నిర్జన ప్రదేశము) 40 సం.లు ధర్మశాస్త్రముతో సంసిద్ధపరచెను. అలాగే యేసుకూడా ప్రజలకు నిర్జన ప్రదేశములో తన మార్గాన్ని బోధించారు.

ఐదువేల మందికి ఆహారము వడ్డించుట, తండ్రి దేవుడు తన ప్రజలకు ఎడారిలో మన్నాను కురిపించే సంఘటనను తలపించును (నిర్గమ. 16:14). మానవ అవసరతలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభువును ఇక్కడ చూస్తున్నాం. ఆయన జాలి, దైవప్రేమను తెలుపుచున్నది. అధ్యాత్మికముగా, తన వాక్కుతో ప్రజలను పోషించిన ప్రభువు వారి శారీరక ఆకలిని కూడా తీర్చుచున్నారు. ఆయనను వెదకువారికి, దేవుడు సమృద్ధిగా ఒసగును. మనదగ్గర ఉన్నదానితో ఇతరులకు సహాయం చేయవచ్చు. ఇతరులపై కేవలం జాలి పడితే సరిపోదు; చేతులు చాచి వారికి సహాయం చేయాలి.

“మా వద్ద ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప మరేమియు లేవు” అన్న మాటలు, మనకు ఉన్నవానిపైకన్న, మనకు లేనివాటిపై మనం ఎక్కువ దృష్టిని సారిస్తామని తెలియజేస్తుంది. నేటి మొదటి పఠనములోకూడా, ఎడారిలో పయనిస్తున్న ప్రజలు, దేవుడు వారికి చేయుచున్న గొప్ప కార్యములను మరచారు. దేవుడు వారికి ఉచితముగా ఒసగు మన్నా వలన సంతృప్తి చెందక, వారికి లేనివాటిని తలచి, దేవునిపై మోషేతో ఫిర్యాదు చేయుచున్నారు. ఐగుప్తు బానిసత్వాన్ని మరచి, అక్కడ తిన్న కూరగాయలను గుర్తుచేసుకుంటున్నారు. ఉన్నవానితో సంతృప్తి చెందుతూ, దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుందాం. ఆయనపై ఆధారపడి జీవించుదాం.

No comments:

Post a Comment