17వ సామాన్య శుక్రవారము (I)

17వ సామాన్య  శుక్రవారము
పునీత జాన్ మరియ వియాన్ని
లేవీ. 23:1, 4-11, 15-16, 27, 34-37; మత్త. 13:54-58

ధ్యానాంశము: విశ్వాసము

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: ఆ ప్రజల అవిశ్వాసము వలన యేసు అచట ఎక్కువగా అధ్బుతములను చేయలేదు” (మత్త. 13:58).

ధ్యానము: ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన లోకములో దేవునిమీద విశ్వాసం సన్నగిల్లుతున్నది. దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందాలంటే, విశ్వాసము కలిగియుండాలి. యేసు తన పట్టణమునకు ఒక బోధకునిగా తన శిష్యులతో వచ్చారు. ప్రార్ధనా మందిరములో ఉపదేశించారు. ఆయన చేసిన అద్భుతములను గురించి నజరేతు ప్రజలు విన్నారు. ఇక్కడకూడా అద్భుతాలు చేస్తారని ఎదురు చూసారు. కాని ప్రభువు, “ప్రవక్త స్వదేశమందును, స్వహృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడుఅని పలికారు. అందుకు నజరేతు వాసులు అవమానముగా తలంచారు. ఆయనను తృణీకరించారు. ఆయన బోధనలను ఆలకించలేదు.

రక్షణ సందేశాన్ని బోధించుటకు ఎంతగానో శ్రమిస్తున్న యేసుకు, తనవారు ఎంతో అండగా ఉంటారని భావించిన యేసుకు వారు తిరస్కరించడం ఎంతగానో నిరాశకలిగించే విషయమే! కాని యూదుల తిరస్కరణతో యేసు నిరాశ చెందక ముందుకు సాగిపోయి అన్యులమధ్యన ఎన్నో అద్భుతాలు చేశారు. అలాగే, క్రైస్తవ సువార్తా బోధనను యూదులు తిరస్కరించినపుడు, అన్యజనులకు క్రీస్తు సువార్త ప్రకటింపబడినది (అ.కా.13:46; 18:6).

- అనుదిన జీవితములో తిరస్కరణలు, ఛీత్కారాలు, ద్రోహం, నిర్లక్ష్యం, వెన్నుపోటు... ఎదురైనప్పుడు ధైర్యముతో, ఆశాభావంతో ముందుకు సాగుదాం!

- నజరేతు వాసులవలె మనం దేవున్ని నిరాకరించ కూడదు, తిరస్కరించ కూడదు. ఒక్కోసారి మన గర్వము, అహం వలన మన దరికి వస్తున్న దేవుని సహాయాన్ని పొందుకోలేక పోవుచున్నాము.

- దృఢమైన విశ్వాసాన్ని కలిగియుండాలి. మంచిని మాత్రమే మనం చేస్తూ ఉండాలి. ఇతరులద్వారా కలిగే చెడును కూడా దేవుడు మనకోసం దానిని ఆశీర్వాదకరముగా మార్చగలరు.

మొదటి పఠనములో చెప్పబడినట్లుగా, పండుగలు మన రక్షణ చరిత్రను గుర్తుచేస్తాయి. అవి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడతాయి. నేడు పునీత జాన్ మరియ వియాన్ని స్మరణ. ఫ్రాన్స్ దేశములోని ఆర్స్ అను ప్రదేశములో విచారణ గురువుగా పనిచేసారు. అతని పుణ్యజీవితం, ఇతరులకు సహాయం చేయాలన్న ఆయన సంకల్పం నేడు మనకు ఆదర్శనీయం. అనేక గంటలు ప్రజల పాపసంకీర్తనాలను వినేవారు. సువార్త బోధనలకు, సత్యోపదేశ బోధనకు తన సమయాన్ని వెచ్చించాడు. అనేకమందిని విశ్వాసములో నడిపించడానికి దేవుడు ఈ గురువును సాధనముగా వినియోగించు కున్నారు. సమస్త గురువుల కొరకు ప్రార్ధన చేద్దాం!

No comments:

Post a Comment