వేదవ్యాపక దినోత్సవం 2022
పొప్ ఫ్రాన్సిస్ సందేశము
“పవిత్రాత్మ మీపైకి వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు.
కనుక మీరు యెరూషలేములోను, యూదయా, సమరియా సీమల యందు అంతటను, భూదిగంతముల వరకు నాకు
సాక్షులై ఉండెదరు” (అ.కా. 1:8).
సహోదరీ, సహోదరులారా!
ఉత్థాన ప్రభువు మోక్షారోహణమునకు ముందుగా తన శిష్యులతో
పలికిన మాటలు (అ.కా. 1:8). “శ్రీసభ స్వభావ సిద్ధముగనే ఒక వేద బోధక సంఘము”
(లోకరక్షా ఉద్యమం – శ్రీసభ ధర్మం, 2). ప్రభువు మాటలలోని, శ్రీసభ యొక్క జీవితం
మరియు వేదవ్యాపకమును ప్రతిబింబించే మూడు అంశాలను ధ్యానిద్దాం:
1. “మీరు నాకు సాక్షులై ఉండెదరు” – క్రీస్తుకు
సాక్ష్యమివ్వడం ప్రతీ క్రైస్తవుని పిలుపు
శిష్యులను వేదవ్యాపకమునకు పంపుదృష్ట్యా, వారికి బోధించే
ప్రధాన అంశం: క్రీస్తుకు సాక్ష్యులుగా ఉండటం. సాక్ష్యమిచ్చుటకు వారు పరిశుద్ధాత్మ
శక్తిని పొందెదరు. యేసు మొదటిగా దేవునిచేత పంపబడినాడు (ప్రధమ మిషనరీ). “నా తండ్రి
నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను (యోహాను. 20:21). ఆయన “విశ్వాసపాత్రుడగు
సాక్షి” (దర్శన. 1:5). అదేవిధముగా, ప్రతీ క్రైస్తవుడు/రాలు క్రీస్తుకు
సాక్ష్యమిచ్చుటకు పిలువబడియున్నారు. సర్వలోకమునకు, సువార్తను ప్రబోధించడం,
క్రీస్తుకు సాక్ష్యమివ్వడం, శ్రీసభ ప్రధాన ధర్మనిర్వహణం (mission).
లోతుగా పరిశీలిస్తే, “మీరు” అన్న బహువచన పదం సువార్త ప్రబోధ
ధర్మనిర్వహణం అందరిదీ అని స్పష్టమగుచున్నది. కనుక, జ్ఞానస్నానం పొందిన ప్రతీ
ఒక్కరి బాధ్యత, నిర్వహణ కర్తవ్యం. స్వంత చొరవతోగాక, శ్రీసభ సహవాసములో, ఈ సువార్త
ప్రబోధ ధర్మనిర్వహణను కొనసాగించాలి. కొన్ని పరిస్థితులలో, ఒకవ్యక్తి సువార్త
ప్రభోధాన్ని చేయుచున్నను, ఆ వ్యక్తి శ్రీసభ సహవాసములో ఉండవలయును. “సువార్త ప్రభోధం
వ్యక్తిగత, ఒంటరి బాధ్యత కాదు. ఇది శ్రీసభ కార్యము. అందరిది. ఒక గురువు, బోధకుడు,
ఉపదేశి, దూరదేశములో ఒంటరిగా సువార్తను బోధించుచున్నను, దివ్యసంస్కారములను
నిర్వహించుచున్నను, అతని నిర్వహణ, శ్రీసభ ధర్మనిర్వహణలో భాగమే అవుతుంది (Evangelii Nuntiandi, 60). యేసు తన శిష్యులను “ఇద్దరిద్దరి చొప్పున
పంపెను” (లూకా 10:1). కనుక, సువార్త ప్రచారం శ్రీసభ సామూహిక ఉనికిని కలిగియుంటుంది.
శిష్యులు తమ వ్యక్తిగత జీవితాలను, సువార్త ప్రచారములో గడపాలని ప్రభువు
కోరియున్నారు. అలాగే, వారు ప్రప్రధమముగా శ్రీసభ ధర్మనిర్వహణను సమూహముగా జీవించడానికి
పంపబడియున్నారు. “యేసు యొక్క జీవము మా శరీరములందు ప్రత్యక్ష పరచబడుటకై ఆయన మరణమును
మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము” అని పౌలు అపోస్తలుడు ఉద్ఘాటించాడు.
సువార్త ప్రభోధ సారాంశం, ఉత్థాన ప్రభువుకు సాక్ష్యమివ్వడం. ఆయన,
జీవితం, శ్రమలు, పునరుత్థానములకు సాక్ష్యమివ్వడం (అ.కా. 1:21). యేసు నిజముగా
మృతులలోనుండి సజీవుడాయెను. కనుక, ఉత్థాన క్రీస్తుకు మనం సాక్ష్యులమవ్వాలి. మన
మాటలద్వారా, జీవితాదర్శముద్వారా క్రీస్తును ప్రకటించాలి. ఆయన రక్షణ సువార్తను
ఆనందముతో, ధైర్యముతో ప్రకటించాలి. నిజమైన సాక్షి ప్రభువు కొరకు ప్రాణాలను సైతము
అర్పించేవాడు (“martyr”). “మనం పొందిన యేసు
ప్రేమానుభవమే మనం సువార్తా ప్రబోధం చేయడానికి ప్రధాన కారణం (సువార్తానందం, 264). ప్రామాణిక
క్రైస్తవ జీవిత సాక్ష్యం, విశ్వాస వికాసానికి దోహదకరముగా ఉంటుంది. అలాగే, “వినుట
వలన విశ్వాసం కలుగుతుంది” (రోమీ 10”17), కనుక, మౌఖిక బోధన ఎల్లప్పుడూ అనివార్యమైనదే.
విన్నటువంటి వాక్యం, విశ్వాసాన్ని కలిగిస్తుంది.
నూత్న సువార్తీకరణలో (evangelization), జీవితాదర్శం మరియు మౌఖిక ప్రబోధం విడదీయరానివి. కనుక, చేతలలోను, మాటలలోనూ క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి.
2. “భూదిగంతముల వరకు” – శ్రీసభ
సార్వత్రిక సువార్త ప్రబోధ ధర్మనిర్వహణ
శిష్యులను సాక్ష్యులుగా ఉండమని
కోరుతూ, వారు ఎచ్చటికి పంపబడుచున్నారో కూడా ప్రభువు స్పష్టం చేయుచున్నారు. యెరూషలేములోను, యూదయా,
సమరియా సీమలయందు అంతటను, భూదిగంతముల వరకు ...” (అ.కా. 1:8). సార్వత్రిక
సువార్తీకరణ స్వభావం దీనిలో స్పష్టమగుచున్నది. ప్రభువు తన శిష్యులను పంపినది
మతమార్పిడి చేయుటకు కాదు. వారిని సువార్త ప్రబోధానికి పంపియున్నారు. క్రైస్తవులు
మతమార్పిడి చేయరు. ఈ వాస్తవాన్ని అ.కా. 8:1, 4లో స్పష్టముగా చూడవచ్చు: “క్రూరహింసల
వలన, విశ్వాసులు నలుమూలలకు చెల్లాచెదురైరి. వారు సువార్తను ఎల్లెడల
బోధించుచుండిరి.” నేడుకూడా ఇలాంటి పరిస్థితులు నెలకొనుచున్నాయి. మతపరమైన హింసలవలన,
యుద్ధవాతావరణము వలన, అనేకమంది క్రైస్తవులు యితర ప్రదేశాలకు వలసలుగా
వెళ్ళుచున్నారు. వారు అచ్చట క్రీస్తుకు, దేవుని ప్రేమకు సాక్ష్యమివ్వడం
అభినందించదగిన విషయము. వారి బాధ్యతను గుర్తించి, ప్రోత్సహించాలి (Evangelii Nuntiandi, 21). అలాగే ఈ వలసదారుల
సంరక్షణ శ్రీసభ యొక్క ప్రధాన ధర్మనిర్వహణగా పరిగణించాలి. క్రైస్తవ విశ్వాసం యొక్క
ఆనందాన్ని తిరిగి పొందుటలో స్థానిక విశ్వాసులకు సహాయపడుతుంది.
సకల ప్రయాణ సౌకర్యాలు కలిగిన ఆధునిక కాలములోకూడా,
క్రీస్తునుగూర్చి ప్రకటింపబడని ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈవిధముగా, ద్వితీయ
వాటికన్ మహాసభ తెలిపినట్లుగా, శ్రీసభ ధర్మనిర్వహణయైన సువార్తీకరణ కొనసాగుతూనే
ఉంటుంది. క్రీస్తుకు సాక్ష్యమిచ్చుటకు, శ్రీసభ తన పరిమితులను దాటి నిరంతరం ముందుకు
సాగుతూనే ఉండాలి.
3. “మీరు శక్తిని పొందుదురు” – మనం ఎల్లప్పుడు ఆత్మచేత
బలోపేతులమై నడిపించబడదాం
ఉత్థాన ప్రభువు తన శిష్యులను తనకు
సాక్ష్యులుగా ఉండమని ఆదేశించినపుడు, వారికి కావలసిన కృపానుగ్రహాన్ని వాగ్దానం
చేసియున్నారు. “పవిత్రాత్మ మీపైకి
వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు. కనుక, మీరు నాకు సాక్షులై ఉండెదరు” (అ.కా.
1:8). ‘అపోస్తలుల కార్యములు’లో చెప్పబడినట్లుగా ఆత్మ శిష్యులపైకి వచ్చినపుడు, వారు
ఉత్థాన క్రీస్తుకు సాక్ష్యమిచ్చి యున్నారు. పేతురు క్రీస్తునుగూర్చి ప్రకటించి,
సాక్ష్యమిచ్చాడు (అ.కా. 2).
“పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు, ‘యేసే ప్రభువు’ అని
అంగీకరింప జాలడు” (1 కొరి. 12:3). కనుక ఆత్మప్రేరణ, సహాయం లేకుండా క్రీస్తు
గురించి ఎవరుకూడా సాక్ష్యమీయలేరు. ఆత్మ కార్య ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. ఆయన
సన్నిధిలో జీవిస్తూ బలాన్ని, మార్గదర్శకాన్ని పొందాలి. మనం అలిసిపోయినప్పుడు,
ప్రేరేపించబడనప్పుడు, ప్రార్ధనలో పరిశుద్ధాత్మను వేడుకోవాలి. సువార్త ప్రబోధకులకు
ప్రార్ధన ప్రాధమికం. ప్రార్ధనలో దేవుని శక్తితో, బలోపేతులవుతారు. క్రీస్తుకు
సాక్ష్యమిచ్చుటకు నూతనోత్తేజాన్ని, శక్తిని పొందుతారు.
పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందడం ఒక వరం. అంతేగాక, సువార్తను
బోధించడానికి, విశ్వాసాన్ని ప్రకటించడానికి సహాయపడు ఏకైక శక్తి పరిశుద్ధాత్మ. కాబట్టి,
శ్రీసభ సువార్త ప్రబోధ ధర్మములో ముఖ్య పాత్రధారి పరిశుద్ధాత్మయే! ఆత్మయే మనలను
సరియైన మార్గములో నడిపించును.
సహోదరీ, సహోదరులారా!
శ్రీసభ తన ధర్మనిర్వహణయైన సువార్తీకరణను ఎల్లప్పుడూ
కొనసాగించాలని ఆశిస్తున్నాను. సువార్తీకరణలో ఒక కొత్త శకాన్ని చూడాలని కలలు
కంటున్నాను. “ఈ ప్రజలందరికి ఆత్మను అనుగ్రహించి వీరిచేగూడ ప్రవచనములు పల్కించిన
ఎంత బాగుండెడిది!” (సంఖ్యా. 11:29) అన్న మోషే పలుకులను జ్ఞప్తికి చేయుచున్నాను.
జ్ఞానస్నానముద్వారా, శ్రీసభలో ఇప్పటికే మనం ప్రవక్తలుగా, ప్రభువునకు సాక్ష్యులమై
యున్నాము. పరిశుద్ధాత్మ శక్తివలన “భూదిగంతముల వరకు” ప్రభువుకు సాక్ష్యులమై
జీవిద్దాం.
No comments:
Post a Comment