పాస్క పరమ రహస్యం - గెత్సెమని ప్రార్ధన
"యేసు బాధతో ఇంకను దీక్షగా ప్రార్ధన చేయసాగెను" - లూకా 22:44
ఈస్టర్ పండుగకు సంపూర్ణముగా సిద్ధపడి, అర్ధవంతముగా కొనియాడాలంటే, గెత్సెమని తోటలో యేసుతో కలిసి మనం ప్రార్ధన చేయాలి మరియు కలవరి కొండకు యేసు సిలువ యాత్రలో పాల్గొనాలి. క్రీస్తు పాస్క పరమ రహస్యం - శ్రమలు, మరణం, ఉత్థానం - జ్ఞానస్నాన కొలను లాంటిది. యోహాను 5వ అధ్యాయములో, 'బెత్సతా' కొలనులో నీరు కదలగనే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి యైనను స్వస్థత పొందును అని చదువుచున్నామో, అలాగే, ఆత్మలో మనం 'క్రీస్తు శ్రమలు' అను కొలనులో దిగి మునగాలి. మన జ్ఞానస్నానములో, "క్రీస్తు మరణమునందు జ్ఞానస్నానము పొందితిమి"; కనుక "క్రీస్తుతో సమాధి చేయబడితిమి" (రోమీ 6:3-4). మన జీవితం పునరుద్దరించబడుటకు, రూపాంతరం చెందుటకు, రక్షింపబడుటకు, క్రీస్తు శ్రమలలో ఆత్మసబంధమైన స్నానాన్ని చేయాలి.
గెత్సెమని తోట - చారిత్రక వాస్తవం
ఓలీవు కొండ యెరూషలేమునకు తూర్పు వైపున ఉన్నది. అది 808 మీటర్లు సముద్ర మట్టానికి పైన ఉన్నది. నేడు ఈ పర్వతముపై 'దోమినుస్ ఫ్లేవిత్' దేవాలయము, మొక్షారోహణ దేవాలయము మరియు 'పాతెర్ నోస్తెర్' దేవాలయములు ఉన్నవి.
యేసు తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులతో కేద్రోను లోయ దాటి, ఓలీవు కొండపై గెత్సెమని తోటకు వెళ్ళారు. అక్కడ యేసు ప్రార్ధన చేసారు మరియు బందీగావింప బడ్డారు. శోధనలకు గురికాకుండునట్లు ప్రార్ధన చేయమని యేసు శిష్యులను కోరారు. అపుడాయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగెను. "నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది" అని పలికారు. నేలపై సాగిలపడి, "ఓ నా తండ్రీ! సాధ్యమైన యెడల ఈ పాత్రను నా నుండి తొలగి పోనిమ్ము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము" అని ప్రార్ధించారు. మరల ఆయన, "ఓ తండ్రీ! నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యముకాని యెడల నీ చిత్తము నెరవేరనిమ్ము" అని ప్రార్ధించారు. ప్రార్ధన చేయు సమయములో ఆయన చెమట రక్త బిందువులవలె భూమిమీద పడుచుండెను (చదువుము మార్కు 14:32-42; మత్తయి 26:36-46; లూకా 22:39-46; యోహాను 18:1-11). "ఇపుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను! ఓ తండ్రీ! ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు. నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా! ఓ తండ్రీ! నీ నామమును మహిమ పరుపుము" అని తన మరణమును గూర్చిన ప్రస్తావనలో యేసు అనెను (యోహాను 12:27-28). "తన ఇహలోక జీవితమున, మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవునిగూర్చి, యేసు ఏడ్పులతో, కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్ధించెను" (హెబ్రీ 5:7).
వాస్తవముగా, గెత్సెమని తోటలో, మహావేదనలో, యేసు తండ్రి దేవునికి ప్రార్ధన చేయుచున్నారు. శ్రమల సమయం దగ్గర పడుతున్న కొలది, ఒక మానవునిగా యేసు పడిన ఆవేదనను, బాధను మనం ఇక్కడ గమనించవచ్చు: "నేలపై సాగిలపడి" ప్రార్ధన చేసారు; "లేచి శిష్యుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు"; "ఆయన చెమట రక్త బిందువులవలె భూమిమీద పడుచుండెను" (లూకా 22:44).; "అబ్బా! తండ్రీ! నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. ఈ పాత్రమును నా నుండి తొలగింపుము..." (మార్కు 14:36) అని ప్రార్ధించారు. యేసు ఏడ్పులతో, కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్ధించెను" అని హెబ్రీ 5:7లో చదువుచున్నాము.
యేసు ఒంటరిగా మహావేదన చెందారు. ఆయన ఏ పాపము చేయలేదు. మన పాపములను తనపై వేసుకున్నారు. "మనము పాపమునకు మరణించి, నీతికి జీవించునట్లుగ. ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి" (1 పేతురు 2:24). "క్రీస్తు పాపరహితుడు. కాని, దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగ చేసెను. ఏలయన, ఆయనతో ఏకమగుటవలన, మనము దేవుని నీతిగ రూపొంద వలెనని అట్లు చేసెను" (2 కొరి 5:21).
గెత్సెమని తోటలో ఒక సాధారణ మానవునిగా యేసు తన మహావేదనలను పొందటం ధ్యానించాం! మానవ శ్రమలను ఆయన అనుభవించారు. మన శ్రమలలో, వేదనలలో, ప్రార్ధన ఎంత ధైర్యాన్ని ఇస్తుందో ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. ఆయన తనకోసమేగాక, మనందరి కొరకు ప్రార్ధన చేసారు. గెత్సెమని తోటలో, యేసు ప్రార్ధన మనకు ఏమి నేర్పుతుంది? "క్రీస్తు మీ కొరకు బాధపడి, ఆయన అడుగుజాడలలో మీరును అనుసరించుటకు గాను, ఒక ఆదర్శమును ఏర్పరచెను" (1 పేతురు 2:21). కనుక, యేసు ప్రార్ధన మనందరికి ఆదర్శం.
గెత్సెమని తోటలో ప్రార్ధన - దేవునితో కుస్తీ, పోరాటం
గెత్సెమని తోటలో ప్రార్ధన చేయుచున్న యేసునకు, "బాధ" అనే పదం ఆపాదించబడింది - "యేసు బాధతో ఇంకను దీక్షగా ప్రార్ధన చేయసాగెను" (లూకా 22:44). ఇది మరణానికి నడిపించే 'బాధ'గా మనం చూడకూడదు. ఇది ఒక 'పోరాటం'. కొన్నిసార్లు ప్రార్ధన పోరాటములా, కృషిలా మారుతుంది. ఇది శోధనలతో పోరాటం కాదు! ఇది దేవునితో పోరాటం! దేవుడు మనలనుండి కోరేదానిని చేయడానికి మన స్వభావం సిద్ధముగా లేనప్పుడు మరియు దేవుడు మనకు అర్ధముకానివి, దిగ్భ్రాంతి కలిగించేవి చేసినప్పుడు, దేవునితో ఈ పోరాటం జరుగుతుంది.
ఇలాంటి సంఘటనను, బైబులులో మరొక చోట కూడా చూడవచ్చు. "యాకోబు దేవునితో కుస్తీపట్టుట" గురించి ఆదికాండము 32:23-32లో చూడవచ్చు. ఒకానొక నరుడు [దేవదూత] తెల్లవారు వరకు యాకోబుతో కుస్తీ పట్టెను. ఆ మనుష్యుడు యాకోబునెంత సేపటికి ఓడింపలేక పోవుటచే అతని తుంటి మీద కొట్టెను. అంతట వారు పెనుగులాడు చుండగా, యాకోబుకు తుంటి తొలగెను. ఆ మనుష్యుడు, 'తెల్లవారుచున్నది నన్నిక పోనిమ్ము' అనెను. దానికి యాకోబు, 'నన్ను దీవించుదాక నిన్ను వెళ్ళనీయను' అని పలికెను. 'నీవు దేవునితో మానవులతో పోరాడి గెల్చితివి కావున నీకు 'యిస్రాయేలు' అని పేరు కలుగును' అని అతడు యాకోబుతో చెప్పెను. అప్పుడు యాకోబు, 'దయచేసి నీ పేరు చెప్పుము' అని అడిగెను. ఆ మనుష్యుడు, పేరు చెప్పక యాకోబును దీవించెను.
యాకోబు కుస్తీ లేదా పోరాటం రాత్రివేళ, యబ్బోకు రేవు ఆవలివైపు జరిగెను. యేసు పోరాటం కూడా రాత్రివేళ, కేద్రోను యేటి ఆవలవైపున జరిగెను. యాకోబు, తన భార్యలనుండి, దాసీ స్త్రీలనుండి, కుమారులనుండి "ఒక్కడే మిగిలిపోయెను'. అలాగే, యేసు కూడా తన ముగ్గురు శిష్యులనుండి "కొంత దూరము వెళ్లి" ప్రార్ధన చేసెను.
యాకోబు, దేవునితో ఎందుకు కుస్తీ పడ్డాడు? "నన్ను దీవించుదాక నిన్ను వెళ్ళనీయను" (ఆ.కాం. 32:26) అని యాకోబు దూతతో పలికాడు. అనగా, నేను అడిగేది, నాకు ఒసగేవరకు నేను నిన్ను పోనివ్వను అని యాకోబు ఉద్దేశ్యం. దేవుడు తన చిత్తానికి తలొగ్గాలని యాకోబు దేవునితో కుస్తీ పడ్డాడు. కాని, యేసు తన మానవ స్వభావీయ చిత్తాన్ని దేవునికి తలొగ్గటానికి పోరాటం [ప్రార్ధన] చేసారు. "ఆత్మ ఆసక్తి కలిగి యున్నను, దేహము దుర్భలముగా ఉన్నది" (మార్కు 14:38) అని యేసు శిష్యులతో అన్నారు.
ప్రార్ధన దేవునితో 'కుస్తీ', 'పోరాటం' అయితే, మన శ్రమలలో మనం ఎవరివలె ప్రార్ధన చేయుచున్నాము? యాకోబువలెనా లేక యేసువలెనా? మనం అనేకసార్లు యాకోబువలె ప్రార్ధన చేస్తాం: దేవుని చిత్తము నెరవేరాలని గాక, మన చిత్తమే నెరవేరాలని కోరుతాం; మన చిత్తాన్ని మార్చుకొని, దేవుని చిత్తం నెరవేరాలని కోరుటకు బదులుగా, దేవుడే తన మనసును, చిత్తాన్ని మార్చుకోవాలని ఆశిస్తాం. యేసుతో కలిసి సిలువను మోయు శక్తిని ఇవ్వుమని కోరుటకు బదులుగా, సిలువనే తీసివేయమని కోరుతూ ఉంటాము. మనలను మనం సంపూర్ణముగా దేవుని చిత్తానికి సమర్పించుకున్న యెడల, మనం యేసువలె ప్రార్దిస్తాం. ఇరువురి ప్రార్ధన ఫలితాలు వేరువేరుగా ఉన్నాయి. పేరును అడిగిన యాకోబుకు, దేవుడు తన పేరు చెప్పలేదు. కాని యేసు విషయములో, "దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటె ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. పరలోక, భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులును క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్ధమై, యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను" (ఫిలిప్పీ 2:9-11).
దేవున్ని ఏదైనా అడగటానికి ప్రార్ధనలు చేస్తాం. ప్రార్ధనలో మన చేతులను దేవుని వైపు చాపుతాం. అయితే, మనం ప్రార్ధన చేయు కొలది, నెమ్మదిగా, దేవుడే తన చేతులను మన వైపుకు చాపుతారు. ఎందుకన, తన చిత్తమును చేయుమని మనలను కోరుతూ ఉంటారు. మన ప్రార్ధనలో... సిలువను, పరిస్థితిని, స్థానాన్ని, వ్యక్తిని... తీసివేయమని కోరతాం. కాని, దేవుడు ఆ సిలువను, పరిస్థితిని, స్థానాన్ని, వ్యక్తిని... అంగీకరించమని కోరుతూ ఉంటారు.
టాగూరు చెప్పిన ఈ చిన్న కథ, పై భావాలను అర్ధం చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది: ఒక భిక్షగాడు గడప గడపకు వెళ్లి భిక్షం ఆడుకుంటున్నాడు. అలా వెళుతూ ఉండగా, బంగారు రధముపై రాజకుమారుడు రావడం చూస్తాడు. 'అబ్బ! ఈ రోజు నా పంట పండింది; అడగకుండానే, రాజకుమారుడు నా జోలె నిండా కాసులు కురిపిస్తాడు' అని భావించి, వెళ్లి రాజకుమారుని ముందు, తన జోలెను చాపాడు. ఆపుడు, రాజకుమారుడు, 'నాకు ఇవ్వడానికి నీ దగ్గరం ఏమున్నది?' అని భిక్షగాడిని అడగటం జరిగింది. అయోమయములో పడిపోయిన భిక్షగాడు, తన జోలె నుంచి ఒక చిన్న మొక్కజొన్న గింజను ఇస్తాడు. చాలా విచారముగా ఇంటికి వెళ్లి, ఆ రాత్రి, తన జోలెను ఖాళీ చేయుచుండగా, ఒక చిన్న బంగారు గింజను చూస్తాడు. అప్పుడు వాస్తవాన్ని గ్రహించి, ధైర్యము చేసి జోలెలో నున్న గింజలన్నింటిని ఇస్తే బాగుండేది అని ఆ భిక్షగాడు వాపోయాడు.
యేసు "తండ్రీ! నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము" అని ప్రార్ధించారు. కాని తండ్రి, లోక రక్షణార్ధమై, ఆ పాత్రను పానము చేయమని తిరిగి యేసును కోరారు. అప్పుడు యేసు, "తండ్రీ! నా యిష్టము కాదు. నీ చిత్తమే నెరవేరును గాక!" అని ప్రార్ధించారు. అపుడు స్వర్గము నుండి దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్ధన చేయసాగెను. ఆయన చెమట రక్తబిందువుల వలె భూమిమీద పడుచుండెను (లూకా 22:42-44). తన రక్తాన్నంతటిని సిలువపై చిందించడానికి యేసు సిద్ధపడ్డారు.
ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్ధన చేయసాగెను
ఈ వచనాలను లూకా సువార్తీకుడు వ్రాసాడు 22:44. ఈ వచనాలు, మన ప్రార్ధన జీవితం ఎలా ఉండాలో నేర్పుతున్నాయి. మనకు ఆదర్శముగా ఉంటున్నాయి. లూకా తన సువార్తను వ్రాసే నాటికి, క్రైస్తవ సంఘం ఎన్నో వేదహింసలను పొందుతుంది. శ్రీసభ శ్రమలలో, హింసలలో, యేసు ప్రార్ధన ఆదర్శం! ప్రతీ విశ్వాసి, తన జీవితములో గెత్సెమని అనుభవాలను చిన్న మొత్తములో కలిగే ఉంటారు - అనారోగ్యం, ఇతరులు మనలను సరిగా అర్ధంచేసికోక పోవడం, ఆర్ధిక సమస్యలు, కుటుంబ సమస్యలు, దైవభీతి లేకపోవడం, పాపభీతి లేకపోవడం, విశ్వాసలేమి - ఒక్క మాటలో చెప్పాలంటే హృదయాంధకారం. ఇలాంటి పరిస్థితులలో, మనం మొట్టమొదటిగా చేయవలసినది, ప్రార్ధనలో దేవుని వైపునకు మరలటం అని యేసు నేర్పిస్తున్నారు. కనుక, మనలను మనం మోసం చేసికోకూడదు. దేవునిపై ఆధారపడి జీవించుదాం.
"అబ్బా! తండ్రీ! నీకు అసాధ్యమైనది ఏదియు లేదు" (మార్కు 14:36). దేవునకు సమస్తము సాధ్యమే! మానవుడు, ఇక చేయడానికి ఏ అవకాశం లేనప్పుడు, నిరాశ, నిస్పృహలో నున్నప్పుడు, ఇలాగే ప్రార్ధిస్తాడు. కష్టాలను తొలగించమని ప్రార్ధిస్తాడు. కాని, యేసువలె, "తండ్రీ! నా ఇష్టము కాదు. నీ చిత్తమే నెరవేరనిమ్ము" అని ప్రార్ధించగలగాలి.
ఒక విశ్వాసికి ఎల్లవేళలా సాధ్యమైనది - ప్రార్ధన చేయడం. ప్రార్ధనలో అడిగినది నెరవేరక పోతే మనం ఏమి చేయాలి? ... మళ్ళీ ప్రార్ధన చేయాలి! యేసు ప్రార్ధనను దేవుడు ఆలకించలేదని, మనకి సువార్తలను చదివినప్పుడు అనిపిస్తూ ఉండొచ్చు! అయితే, హెబ్రీ 5:7లో "యేసు భక్తి, విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్ధనను ఆలకించెను" అని చదువుచున్నాము. ఈ విషయములో, యేసు తండ్రి నుండి సహాయాన్ని పొందినట్లుగా, లూకా సువార్తీకుడు వివరించాడు: "అపుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను" (22:43). అయితే, ఈ సహాయం నిరీక్షణ మాత్రమే; యేసు ప్రార్ధనకు తండ్రి దేవుని అసలైన సమాధానం - యేసు క్రీస్తు ఉత్థానం.
ప్రార్ధనలో వేడుకున్నది వెంటనే జరుగకపోతే, దేవుడు మన ప్రార్ధనలను ఆలకించడం లేదని భావిస్తూ ఉంటాము. ప్రతీ ప్రార్ధనను దేవుడు తప్పక ఆలకిస్తారు. దేవుడు ఇంకా ఎక్కువగా మనకొసగాలని, ఆలస్యం చేస్తూ ఉంటారు. మనం క్రమం తప్పకుండా ప్రార్ధన చేయడమే, దేవుని ఆశీర్వాదాలు పొందటం! గెత్సెమని తోటలోని సంఘటన చివరిలో యేసు తన శిష్యులతో, "లెండు, పోదాము రండు" (మత్త 26:46) అని చెప్పారు. యేసు పేతురుతో, "నేను నా తండ్రిని ప్రార్ధింపలేనను కొంటివా? ప్రార్ధించిన ఈ క్షణమున ఆయన పండ్రెండు దళముల కంటె ఎక్కువమంది దూతలను పంపడా? ఇట్లు కాదేని, ఈ విధముగా జరుగవలెనను లేఖనములు ఎట్లు పరిపూర్ణమగును?" అని అన్నట్లుగా, యేసు మనకోసం మరణించడానికే సిద్ధపడ్డాడని, దేవుని చిత్తమే, తన చిత్తముగా భావించారని స్పష్టమగుచున్నది.
యేసు తన శిష్యులకు నేర్పిన 'పరలోక ప్రార్ధన'కు, గెత్సెమని తోటలో యేసు చేసిన ప్రార్ధనకు స్పష్టమైన సారూప్యత ఉన్నది. "పరలోక ప్రార్ధన"వలె, గెత్సెమని తోటలోప్రార్ధనను యేసు కూడా, "అబ్బా! తండ్రీ!" (మార్కు 14:36) అని లేదా "ఓ నా తండ్రీ!" (మత్త 26:39) అని ప్రారంభించారు. "నీ చిత్తమే నెరవేరనిమ్ము" అని యేసు ప్రార్ధించారు. "కీడులలో నుండి మమ్ము రక్షింపుము" అని ప్రార్ధించునట్లుగా, యేసు "ఈ పాత్రము నానుండి తొలగి పోనిమ్ము" అని ప్రార్ధించారు. శోధనలకు గురికాకుండు నట్లు ప్రార్ధించమని యేసు తన శిష్యులను కోరారు.
మన ప్రార్ధనలో, బలహీనులమైన మనకు ఆత్మ కూడ సాయపడును. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్ధించును (రోమీ 8:26). దేవుని ఆత్మ యేసుకు కూడ సాయపడినది: "యేసు ఏడ్పులతో, కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్ధించెను" (హెబ్రీ 5:7).
యేసు శ్రమలు, లోకాంతము వరకు కొనసాగును
యేసు ప్రభువుతో మనం గెత్సెమని తోటను వీడే ముందు, మరొక విషయాన్ని మనం నేర్చుకోవాలి. యేసు శ్రమలు, లోకాంతము వరకు కొనసాగును. "దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు మరణించి, సజీవుడాయెను. ఆయన సదా జీవించి ఉండును" (దర్శన 1:18). "సింహాసనము మధ్య గొర్రెపిల్ల నిలిచి యుండెను. అది వధింప బడినట్లు ఉండెను" (దర్శన 5:6). వధింప బడుచున్న గొర్రెపిల్లను మనం దివ్యపూజా బలిలో కలుసుకుంటున్నాము. గెత్సెమని తోటకు వెళ్లేముందుగానే, యేసు దివ్యసత్ర్పసాదమును స్థాపించారు, తద్వారా, ఆయన శిష్యులు, యుగయుగముల వరకు, ఆయన శ్రమలను స్మరింతురుగాక! తప:కాలములో, యేసుతో గంటపాటు గెత్సెమని తోటలో ఉండటం అనగా, పవిత్ర గురువారం రోజున ఒక గంటపాటు దివ్యసత్ప్రసాద సన్నిధిలో ఉండటం! అలాగే, ఈ లోకములో తన శరీరములో భాగస్థులైన వారి శ్రమలలో, యేసు శ్రమలు కొనసాగుతూనే ఉన్నాయి. నాడు ఆయన శరీరము బాధలకు గురియైనట్లు, నేడు యేసు తిరు హృదయం వేదనలననుభవించు చున్నది. గుప్తమైన గెత్సెమని తోటలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి! అలాంటి వారిని చేరుకుంటే, యేసు ప్రభువును చేరుకున్నట్లే!
"నేను సానుభూతిని ఆశించితిని. కాని అది లభ్యము కాదయ్యెను. ఓదార్పును అభిలషించితిని కాని అది లభింపదయ్యెను" (కీర్తన 69:20) అని ప్రభువు మనతో చెప్పకుండును గాక! దానికి బదులుగా, ఈ నా సోదరులలో అత్యల్పుడైన వారికి నీవు ఇవి చేసియున్నావు కనుక, "అవి నాకు చేసితివి" (మత్త 25"40) అని చెప్పాలి.
No comments:
Post a Comment