క్రైస్తవ గృహాశీర్వాదము
లూకా 10:38-42
ఇల్లుకి, గృహానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇల్లు సిమెంటు, ఇటుకలతో కూడిన నిర్మాణము. గృహము దైవప్రజలతో, వ్యక్తులతో, కుటుంబముతో నిర్మించబడినది. ఇల్లు మనం నివసించే చోటు. గృహము మన నివాస స్థలము. ఇల్లు పైకప్పును అందిస్తుంది. గృహము ఆశ్రయాన్ని కల్పిస్తుంది. ఇల్లు మన వస్తువులను ఉంచుకునే ప్రదేశం. గృహము నిజముగా మనకు చెందినది. ఇల్లు తినడానికి, నిదురించడానికి ఒక ప్రదేశం. గృహము ఒక వ్యక్త్తి పోషణ, విశ్రాంతి పొందు ప్రదేశము. ఇల్లు అనేది మనం కొన్నిసార్లు పరిమితులుగా భావించే స్థలం, అందుకే మనకు “గృహ నియమాలు” వంటివి ఉంటాయి, అయితే గృహము అంటే మనకు స్వేచ్ఛగా ఉంటుంది. ఇల్లును మించిన ఇల్లులు ఉంటాయి కాని, "గృహానికి సమానమైన స్థలం ఉండదు."
ప్రియ సహోదరీ, సహోదరులారా! ఈ ఇల్లుని, గృహముగా మార్చాలని ప్రార్ధన చేయడానికి ఈ రోజు ఇక్కడ మనం సమావేశమయ్యాము. మార్తమ్మ, మరియమ్మలు యేసు ప్రభువును తన గృహానికి స్వాగతించిన విధముగా, ఈ రోజు మనం ఈ ఇల్లును తన నివాస స్థలంగా చేయమని ప్రభువును వేడుకోవాలి. దేవుడు మన మధ్యలో ఉన్నాడని గ్రహించడం కంటే గొప్ప ఆనందం మరొకటి లేదు. అతని ఉనికి గురించి తెలుసుకోవడం వల్ల మనమందరం మంచి వాతావరణాన్ని కలిగి ఉన్నవారమవుతాము. కనుక, యేసు ప్రభువు ఈ గృహానికి అధిపతి కావాలని ప్రార్ధన చేద్దాము!
కుటుంబ జీవితము, బంధాలులేని ఇళ్లు గృహము కాలేదు. ఒకరిమధ్య ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు ఉండాలి. ఒకరినొకరు అర్ధంచేసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. మార్తమ్మ, మరియమ్మల జీవితం మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది.
(1). మొదటిగా, వారు ప్రభువును వారి గృహానికి ఆహ్వానించారు. మనం కూడా ప్రభువును మన జీవితాలలోనికి, హృదయాలలోనికి, గృహాలలోనికి ఆహ్వానించాలి. కేవలం ఆహ్వానిస్తే సరిపోదు. మార్తమ్మవలె ప్రభువు అవసరాలను తీర్చాలి. మరియవలె ప్రభువు పాదముల చెంత కూర్చుని ఆయన వాక్కును, బోధనలను ఆలకించాలి. అయితే, మార్తమ్మ అనేక విషయాల గురించి చింతించడం ప్రభువు గమనించారు. అందుకే, ప్రభువు అంటున్నారు: "మార్తమ్మా! మార్తమ్మా! నీవు ఎన్నో పనులను గురించి విచారించుచు ఆతురపడుచున్నావు. కాని అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. అది ఆమెనుండి తీసివేయబడదు".
శారీరక పోషణ ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో, ఆధ్యాత్మిక పోషణ కూడా అంతే ముఖ్యమని ప్రభువు తెలియజేయుచున్నారు. దేవుని వాక్కుచేత మన ఆత్మలు పోషింపబడతాయి. దివ్యసత్ప్రసాదముద్వారా, మన ఆధ్యాత్మిక జీవితం పోషింపబడుతుంది. కనుక మనకున్న ఆందోళనలు, చింతలు, వేదనల వలన మన ఆధ్యాత్మిక పోషణ నిర్లక్ష్యం కాకూడదు.
దర్శన 3:20 - "వినుము! నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వారితో భుజింతును. వారును నాతో భుజించును."
(2). దేవునిపై నమ్మకముంచాలి. కీర్తన 127:1 - "ప్రభువు ఇల్లు కట్టని యెడల దానిని కట్టిన వారి శ్రమ వ్యర్థమగును."
సామె 24:3-4 - "ఇల్లు కట్టవలెనన్న విజ్ఞానము అవసరము. పునాదులెత్తవలెనన్న వివేకము ఉండవలెను. ఇంటి గదులను అరుదైన ప్రశస్త వస్తువులతో నింపవలెనన్న తెలివితేటలు ఉండవలెను." - విజ్ఞానము, వివేకము, తెలివితేటలు...
(3). దేవుడు ఆశీర్వదించే కుటుంబం ఆయనపై ఆధారపడి ఉంటుంది. మన గృహాలలో, కుటుంబాలలో స్థిరత్వం ఉండాలంటే, ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడి యుండాలి.
(4). మార్తమ్మ వలె యేసు బోధనలను ఆలకించాలి. మత్త 7:24-25 - నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు... అది ఎప్పటికి కూలిపోదు. రోమీ 10:17 - "వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును."
(5). క్రైస్తవ గృహాలను నిర్మించాలి. ఇల్లు కట్టాలంటే, స్థలం కొనాలి, అన్ని అనుమతులు తీసుకోవాలి, ఇంటి ప్లాన్ వేసుకోవాలి, బ్లూ ప్రింట్ తీసుకోవాలి, నిర్మాణానికి తగిన ఇంజనీరు, మేస్త్రీ, పనివారు, మెటీరియలు .... ఇంకా ఎన్నో ఎన్నెన్నో చూసుకోవాలి.
మరి క్రైస్తవ గృహాలను నిర్మించే మాటేమిటి? చాలా సార్లు ఇది సుళువైనపనిగా భావిస్తాం. జ్ఞానస్నానం ఇప్పిస్తే అయిపోయిందని అనుకుంటాం. 'దేవుని ప్రణాళిక లేదా దేవుని చిత్తం' అనే బ్లూ ప్రింట్ కావాలి. మనంతట మనం నిర్మించలేము. మాస్టర్ బిల్డర్ అయిన ప్రభువు కావాలి. ఆయన మాత్రమే మన కుటుంబాలను నిర్మించగలడు. మన కుటుంబాలు దృఢముగా ఉండాలంటే, మన గృహాలకు ఆయనే అధిపతి కావాలి. ఆయనే మన 'శిరస్సు' కావాలి. ఆయనే మనలను నిర్మించువాడు. కనుక ఆయనను విధేయించాలి. మనం ఆయన పనివారము. ప్రభువు సేవకులము. తల్లిదండ్రులుగా, పిల్లలపట్ల మన బాధ్యతలను నెరవేర్చాలి. ప్రభువుతో మనం కలిసి పనిచేసినప్పుడే, మన గృహాలు దృఢముగా ఉంటాయి. చదువుము: 1 కొరి 3:10-12 - "యేసు క్రీస్తు అను దేవుడు వేసిన పునాది"పై మన క్రైస్తవ గృహాలు నిర్మించబడాలి. ఇంటికి పునాది చాలా ముఖ్యం. క్రైస్తవ జీవితాలకు, గృహాలకు క్రీస్తు ప్రాధాన్యం, మూలం, సర్వం! సత్కార్యములు (ఇటుకలు) చేయాలి - రోమీ 2:10 - "సత్కార్యములు చేయు ప్రతి వ్యక్తికి దేవుడు వైభవమును, గౌరవమును, శాంతిని ప్రసాదించును."
నిజమైన క్రైస్తవ గృహాలను నిర్మించాలంటే, నిత్యం ప్రార్ధనలు చేయాలి. క్రైస్తవ విశ్వాస సత్యాలను తెలుసుకోవాలి. క్రీస్తును గూర్చిన జ్ఞానమును కలిగి యుండాలి. దైవాజ్ఞలను పాటించాలి. క్రీస్తు బోధనలను జీవించాలి. దేవునివలె పవిత్రముగా జీవించాలి. సత్ప్రవర్తన కలిగి జీవించాలి. కనుక, ఇల్లు కట్టడములో చూపే శ్రద్ధ, మన క్రైస్తవ గృహాలను నిర్మించడములో కూడా చూపాలి.
(6). "నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది" (లూకా 19:9). ప్రతీ క్రైస్తవ కుటుంబానికి క్రీస్తు రక్షణ ఎంతో అవసరం. క్రీస్తు రక్షణ రావాలంటే, జక్కయ్యవలె, పాపజీవితాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తును వెదకాలి, క్రీస్తును కనుగొనాలి. దేవునితోను, తోటివారితో సఖ్యత కలిగి జీవించాలి. పాపమున్నచోట ప్రభువు ఉండలేరు కనుక, మారుమనస్సు పొంది పవిత్రమైన జీవితాన్ని జీవించినపుడు, క్రీస్తు రక్షణ మన కుటుంబాలలో ఉంటుంది.
ఈ గృహాన్నిబట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. దేవుని కృప, ఆశీర్వాదాలు, ఈ ఇంటిపై, ఈ గృహముపై, సభ్యులందరిపై ఉండాలని ప్రార్ధన చేద్దాం! అన్ని అపాయములనుండి, ప్రమాదములనుండి ఈ ఇంటిని, గృహమును కాపాడమని ప్రార్ధన చేద్దాం! ప్రభువు సాన్నిధ్యం, శాంతి సమాధానాలు, పవిత్రాత్మ శక్తి ఈ కుటుంబముతో కలకాలం ఉండాలని ప్రార్ధన చేద్దాం!
No comments:
Post a Comment