సబ్బాతు దినము

 సబ్బాతు దినము: పూర్వ-నూతన నిబంధనల ఆధారితం

సబ్బాతు అంటే ఏమిటి? సబ్బాతు శనివారమా లేక ఆదివారమా? శనివారమునునుండి, ఆదివారమునకు ఎలా మారింది?

"సబ్బాతు" అనే పదం హీబ్రూ పదమైన "షబాత్" అనే పదమునుండి వచ్చినది. "షబాత్" అనగా, 'నిలిపివేయుట', 'మానుకొనుట', 'విశ్రాంతి పొందుట', 'పనిమానుట', 'కొనియాడుట' అని అర్ధము. ఇది యూదుల వారదినముల పండుగ. పవిత్రమైన దినము. వారములో యేడవ దినము (శనివారము). బైబులు ప్రకారం, ఆ రోజు, ఏ పని చేయక, విశ్రాంతి తీసుకొను రోజు. రబ్బీల సాహిత్యంలో, సబ్బాతు ఆచారం గురించి గట్టిగా నొక్కిచెప్పబడింది. సబ్బాతు దిన సాధారణ ఆచరణ ఏమిటంటే, ఇంటి యజమానురాలు సబ్బాతు ప్రారంభానికి ముందు ఒకటి నిర్గమ 20:8ని గుర్తుచేయుటకు, మరొకటి ద్వితీ 5:12కి ప్రతిస్పందనగా చేయుటకు, రెండు కొవ్వొత్తులను వెలిగించును.

పూర్వ నిబంధనము
'సబ్బాతు దినము' అనగా 'విశ్రాంతి దినము'. ఇది యిస్రాయేలు ప్రజలకు చాలా ప్రాముఖ్యమైన దినము. దీనిని గూర్చిన ఆజ్ఞను నిర్గమ 20:8-11; 23:12; 31:12-17; 34:21; 35:2-3; లేవీ 19:3, 30; 23:3; 26:2; ద్వితీ 5:12-15లో చూడవచ్చు: "విశ్రాంతి దినమును గుర్తుంచు కొనుడు. దానిని పవిత్రము చేయుడు. ఆరు రోజులపాటు మీ పనులెల్ల చేసికొనవలయును. ఏడవ రోజు మాత్రము (శనివారము) మీ దేవుడయిన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. ఆ రోజు ఏ పని చేయ కూడదు." కనుక, యూదులు లేదా ఇశ్రాయేలు ప్రజలు, 'సబ్బాతు దినము'ను శనివారమున కొనియాడెదరు.

సినాయి కొండ వద్ద జరిగిన సంఘటనకు ముందుగా, సబ్బాతు నియమము పరిచయం చేయబడినది. సబ్బాతు నియమము ఒక ఆజ్ఞగా మొదటిసారిగా నిర్గమ 20వ అధ్యాయములో చూస్తున్నాము. సబ్బాతు దినమున (1) ఎవరు ఏ పనికూడా చేయకూడదు (నిర్గమ 20:10); (2) దానిని పవిత్రముగా ఎంచని వారికి మరణశిక్ష విధింపవలయును (నిర్గమ 31:14); (3) దుక్కులు దున్నకూడదు, కోతలు కోయకూడదు (నిర్గమ 34:21); (4) యిండ్లలో నిప్పు రగిలించరాదు (నిర్గమ 35:3).

ఈ ఆజ్ఞకు మూలం ఆ.కాం. 2:2-3: "ఏడవ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తిచేసి యేడవ నాడు పనిని మాని వేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని 'పవిత్ర రోజు'గా చేసెను." [పవిత్రము చేయడం అనగా 'వేరుపరచడం' అనే అర్ధం ఉన్నది]. దేవుడు ఏడవ దినమున విశ్రాంతి పొందెను. అయితే, 'సబ్బాతు' అను పదం ఆది కాండములో ఎక్కడా ప్రస్తావించబడలేదు. అలాగే, ఆదాము, అవ్వలు 'విశ్రాంతి' పొందిన విషయం, లేదా విశ్రాంతి దినమును పాటించిన విషయము గూర్చి చెప్పబడలేదు. వాస్తవానికి, దేవుడు సమస్తమును వారికి సమకూర్చారు. వారు 'శాశ్వతమైన విశ్రాంతి'లో యున్నారు. 'శాశ్వతమైన విశ్రాంతి'లో యున్నవారికి, విశ్రాంతి దినము గూర్చి ప్రస్తావించడం అప్రస్తుతం! 'పని' [కష్టపడి కండలు కరిగించడం; నొసటి చెమటోడ్చడం] మానవుని పాపము [అవిధేయత] చేసిన తరువాత వచ్చినది.

దినము సూర్యాస్తమయముతో ప్రారంభమై మరుసటి రోజు సూర్యాస్తమయముతో ముగుస్తుంది - "అంతట సాయంకాలమై, ఉదయమాయెను" (ఆ.కాం. 1:5, 7, 13, 19, 23). కనుక, 'సబ్బాతు దినము' శుక్రవారం రోజు సూర్యాస్తమయముతో ప్రారంభమై, శనివారము రోజు సూర్యాస్తమయముతో ముగుస్తుంది. యేడవ రోజును 'పవిత్ర రోజు'గా చేయుట వలన (ఆ.కాం. 2:3), దేవుడు తన సృష్టిని పవిత్ర పరచినారు. దేవుడు పరిపూర్ణమైన సృష్టిని చేసి, దానిని దీవించారు. విశ్రాంతి దినము "పవిత్రమైనది" (నిర్గమ 31:13-14); "దానిని పవిత్రము చేయుడు" (నిర్గమ 20:8); "విశ్రాంతి దినము" (నిర్గమ 31:15); నిత్య నియమముగా పాటింప వలయును" (నిర్గమ 31:16); "దానిని సంతోషకరమైన దానినిగాను, గౌరవార్థమైన దానినిగాను భావింపుడు" (యెష 58:13).

సబ్బాతు దినము గూర్చిన మొదటి ప్రస్తావనను నిర్గమ 16:22-30లో చూడవచ్చు. 'మన్నా'ను గురించి చెప్పబడిన సందర్భమున విశ్రాంతి దినము గూర్చి ప్రస్తావించబడినది: "మోషే వారితో, ఇది యావే ఆజ్ఞ. రేపు పూర్తిగా విశ్రాంతి దినము. అది యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనగోరిన దానిని కాల్చుకొనుడు. వండుకొనగోరిన దానిని వండుకొనుడు. మిగిలిన దానిని రేపటికి అట్టిపెట్టుకొనుడు. అని చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లుగా వారు మిగిలిన దానిని మరునాటికి అట్టిపెట్టుకొనిరి. అది కంపుకొట్టలేదు. పురుగు పట్టలేదు. మోషే వారితో ఈ దినము దానిని తినుడు. ఇది యావేకు సమర్పితమయిన విశ్రాంతి దినము." ఆతరువాత, సబ్బాతు గురించి పది ఆజ్ఞలలో పున:ప్రస్తావించ బడినది (నిర్గమ 20:8-11). విశ్రాంతి దినమున నిషేధించ బడిన పనులను నిర్గమ 16:19; 16:23; 20:10; 35:1, 3; యిర్మీయా 17:27; నెహె 1:15; 10:31; యెష 58:13-14లో చూడవచ్చు.

సబ్బాతు నియమం ఎందుకు? ముందుగా, ఇది దైవీక కాలపట్టికను గుర్తుకు చేస్తుంది. ఏడు రోజుల వారమును సూచిస్తుంది. పనివారికి విశ్రాంతి అవసరమని సూచిస్తుంది. ఆదాము, అవ్వలు పాపము చేయకముందు వారున్న స్థితిని అనగా 'శాశ్వత విశ్రాంతి'ని గురించి యిస్రాయేలు ప్రజలకు గుర్తుచేయును. అలాగే, ఐగుప్తులో బానిసలుగానున్న యిస్రాయేలు ప్రజలను, ప్రభువు వారిని బానిసత్వమునుండి తోడుకొని వచ్చిన సంఘటనను గుర్తుచేయును, అందుకే వారు విశ్రాంతి దినమును పాటించవలయును (ద్వితీ 5:15). అన్నింటికన్న ముఖ్యముగా, సబ్బాతు 'శాశ్వత నిబంధనకు' సూచన. కనుక ఇది దేవుని పవిత్రతకు సూచన; అది ప్రజలను పవిత్రీకరించును; దానిని తప్పక విధేయించవలెను.

అలాగే, భవిష్యత్తులో మెస్సయ్య [యేసు క్రీస్తు] ద్వారా దేవుడు ఒసగబోవు 'శాశ్వత విశ్రాంతి దినము'ను, ఈ విడుదల మరియు వాగ్దత్త భూమి సూచిస్తున్నాయి. దీనికి సూచనగానే, వారు వారములో యేడవ రోజున విశ్రాంతి దినమును కొనియాడాలి.

సబ్బాతు పాటించు వారికి వాగ్దానములు: దేవుడు వారిని దీవించును (యెష 56:2); నపుంసకులు దేవాలయమునను, ప్రజలలోను స్మరింపబడును; విస్మరింపబడరు (యెష 56:4-5); అన్యజాతి ప్రజలను దేవుడు పవిత్ర పర్వతమునకు కొనివచ్చును; సంతోషచిత్తుల గావించును; వారి బలులు స్వీకరించును (యెష 56:6-7); దేవుడు వారికి ఆనందము దయచేయును; భూమి యందంతట మాన్యుల చేయును; వారసభూమిని అనుభవింతురు (యెష 58:13-14).

సబ్బాతు దుర్వినియోగము - యిస్రాయేలు ప్రజలు సబ్బాత్తు దినమును దుర్వినియోగం చేశారు. అది దేవుని ఆగ్రహానికి గురిచేసింది. ఈ దుర్వినియోగాన్ని ప్రవక్తలు తీవ్రముగా ఖండించారు (యెహెఙ్కే 20:13, 16, 21, 24; 22:8, 26; 23:38; నెహె 13:17-18; యెష 1:13; ఆమో 8:5-6; హోషే 2:11). సబ్బాతు నియమాన్ని అతిక్రమించిన వారికి మరణశిక్ష విధింపబడేది (సంఖ్యా 15:32-36). సబ్బాతు దుర్వినియోగము వలననే, యిస్రాయేలు ప్రజలు బానిసత్వములోనికి వెళ్ళారని యెహెఙ్కేలు ప్రవక్త తెలిపాడు (22:8, 26, 31). సబ్బాతును కొనియాడు విధానమును గూర్చిన కొన్ని సూచనలు యెహెఙ్కే 46:1-3; కీర్తన 92; సంఖ్యా 28:9-10లో  చెప్పబడినవి.

నూతన నిబంధనము - సువార్తలు
యేసు సబ్బాతు నియమమును పాటించారు. అయితే, అనేకసార్లు యేసు విశ్రాంతి దినమును పాటించలేదని నిందింపబడినారు (యోహాను 9:16; 7:23; మార్కు 3:4). విశ్రాంతి దినమున 'పని' చేసినందులకు, యూదులు యేసును హింసింప మొదలిడినారు, ఆయనను చంపుటకు ప్రయత్నించారు (యోహాను 5:16-18). "కాని సబ్బాతు పవిత్రతను గౌరవాన్ని యేసు ఎన్నడూ కాదనలేదు" (మార్కు 1:21; సత్యోపదేశం 2173). యేసు తన బోధనలలో, సబ్బాతు అను ఆజ్ఞను తప్ప, మిగతా ఆజ్ఞలన్నిటిని ప్రస్తావించారు (మత్త 19:18-19; 4:10; 5:34). విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని తన శిష్యులు చేసినప్పుడు, పరిసయ్యులు వారిని ప్రశ్నింపగా, యేసు వారిని సమర్ధించారు (మత్త 12:1-8; మార్కు 2:27). 

యేసు సబ్బాతు చట్టాన్ని పాటించారు; బోధనలు చేసారు; ప్రార్ధనలలో పాల్గొన్నారు (మార్కు 6:12; లూకా 4:16, 31). అయితే పరిసయ్యుల సంకుచిత మనస్తత్వాన్ని, హృదయ కాఠిన్యతను తీవ్రముగా ఖండించారు. ప్రత్యేకముగా, విశ్రాంతి దినమున స్వస్థత పరిచర్యను వారు అడ్డుకున్నప్పుడు, తోటి మానవులకు సహాయం, మేలు చేయడానికి ఏ సమయమైన సరియైనదేనని నొక్కిచెప్పారు. విశ్రాంతి దినమున స్వస్థత పరచుట చట్టబద్ధమేనా అని ప్రశ్నించినప్పుడు, యేసు, “ఏమీ! మీలో ఎవడైన విశ్రాంతి దినమున తన గొర్రె గోతిలో పడినచో దానిని పట్టి వెలుపలకు తీయడా? గొర్రెకంటే మనుష్యుడు ఎంతో విలువగల వాడు కదా! కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట తగును” (మత్తయి 12:10-12) అని సమాధానమిచ్చారు. యేసు తన అభిప్రాయాన్ని నొక్కిచెప్పడానికి, విశ్రాంతి దినమున తన స్వస్థత పరిచర్యను అనేకసార్లు కొనసాగించారు (మార్కు 1:21-28; 1:29-31; లూకా 13:10-17; 14:16; యోహాను 5: 1-18; 9:1-41). సబ్బాతు చట్టం ప్రాధమికముగా మానవ శ్రేయస్సు, సంక్షేమం కొరకని యేసు బోధించారు. సబ్బాతు చట్టానికి బానిసలుగాక, సబ్బాతు విశ్రాంతి నుండి ప్రయోజనం పొందాలని యేసు కోరుచున్నారు.

పరిసయ్యులు సబ్బాతు చట్టాన్ని తప్పుగా వివరించారు. విశ్రాంతి దిన నియమము గూర్చిన తప్పుడు వివరణలను యేసు తీవ్రముగా ఖండించారు (లూకా 13:10-16; 14:1-5; యోహాను 5:9-18; 7:22). విశ్రాంతి దిన నియమమును పాటించు విధానం యేసుకు సంతోషం కలిగించలేదు. కనుక, యేసు ప్రవక్తలవలె సబ్బాతు నియమ దుర్వినియోగాన్ని తీవ్రముగా, బాహాటంగా ఖండించారు (మత్త 15:6-9). "మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింప బడినది గాని, విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింప బడలేదు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడ ప్రభువే" (మార్కు 2:27-28) అని యేసు పలికారు. ప్రామాణికమైన, అధికారికమైన అర్ధవివరణను యేసు ఇచ్చారు (సత్యోపదేశం 2173). కాబట్టి, ప్రతిరోజూ సర్వశక్తిమంతుడైన ప్రభువును ఆరాధించే రోజుగా ఉండాలి. “మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడ ప్రభువే” అన్న పలుకులు యేసు మన జీవితాలకు, కుటుంబాలకు, బంధాలకు కేంద్రం అని తెలియుచున్నది. 

ప్రధానముగా యేసు క్రీస్తు ప్రభువు మన ఆరాధనలాన్నింటికీ కేంద్రము. దీని గురించి, ద్వితీయ వాటికన్ మహాసభ అధికార పత్రమైన, “పవిత్ర దైవార్చనా చట్టం”లో ఇలా చదువుచున్నాము: శ్రీసభ ఒంటరి కాదు; ప్రభు క్రీస్తు ఎప్పుడూ శ్రీసభతోనే ఉన్నారు, శ్రీసభలోనే ఉన్నారు. ఆయన సన్నిధానం, సాన్నిహిత్యం దైవార్చనా సాంగ్యాలలో సదా ప్రత్యక్షమవుతూ ఉంటాయి. దివ్యపూజలో ప్రభువు ప్రత్యక్షమవుతున్నారు. పూజలో సమర్పించబడే “అప్పద్రాక్షరస” రూపాల్లోనూ మన మధ్య సాక్షాత్కరిస్తున్నారు. దివ్యసంస్కారాల ద్వారా కూడా మనకు ప్రభువు సాక్షాత్కారం లభిస్తోంది. అదేవిధముగా ప్రభువు తన “వాక్కు”లో స్వయముగా తానే కొలువై ఉంటారు. పవిత్ర గ్రంథాన్ని పటించేటప్పుడు, స్వయాన ప్రభువే పలుకుతారు. చివరిగా, శ్రీసభ ప్రార్ధించే వేళల్లోనూ, స్తుతిగానాలతో ప్రభువును కీర్తించే గడియల్లోనూ అక్కడ ప్రభువు ఉంటారు. “ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడుదురో అక్కడ నేను వారి మధ్య” ఉంటానని (మత్తయి 18:20) ఇచ్చిన మాట ప్రకారమే ప్రార్ధానా పరుల మధ్య ప్రభు సాక్షాత్కారం జరుగుతుంది.

మన వ్యతిగత ప్రార్ధనకు యేసు క్రీస్తు ప్రభువు కేంద్రం. మనం చేసే ప్రార్ధనలు అన్నీకూడా (జపమాలతో సహా) క్రీస్తు కేంద్రీకృతమైన ప్రార్ధనలు. ఆయన మన ఆధ్యాతిక జీవితాలకు, ప్రయాణానికి ప్రభువు. కనుక ఆయన ప్రతీరోజు మనతో ఉండాలి. మన నైతిక జీవితాలకు యేసు క్రీస్తు ప్రభువు కేంద్రము, పునాది. “మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింప బడినది గాని, విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింప బడలేదు.” నైతికత అనేది మనిషియొక్క స్వభావం. మన రోజువారి నైతిక నిర్ణయాలలో, ఏది మంచో, ఏది చెడో నిర్ణయించుటలో క్రీస్తే అంతిమ ప్రధానం. మన మంచి-చెడు చర్యలకు తీర్పు విధించునది క్రీస్తే! మన మంచి కార్యాలు క్రీస్తునందు నిత్యజీవితానికి నడిపిస్తాయి.

ప్రభువు 'శాశ్వత సబ్బాతు దినము' గురించి ఇలా పలికారు: "నేను సృజింపబోవు నూత్న దివి, నూత్న భువి నా శక్తి వలన సదా నిల్చియుండునట్లే మీ సంతతియు మీ పేరును శాశ్వతముగా నిల్చును. ప్రతి అమావాస్య నాడు, ప్రతి విశ్రాంతి దినమున సకల జాతి ప్రజలు నా సమక్షమునకు వచ్చి నన్నారాధింతురు" (యెష 66:22-23). ఇది యేసు క్రీస్తునందు నెరవేరుచున్నది!

కడరాత్రి భోజన సమయములో, నూతన నిబంధనను ప్రకటించిన తరువాత, యేసు ప్రాధాన్యత ఆదివారముపై యున్నట్లుగా అనిపిస్తున్నది. యేసు ఆదివారము రోజున ఉత్తానమయ్యారు. యేసు ఉత్తానమయ్యాక తరువాతి రెండు ఆదివార రోజులలో తన శిష్యులకు దర్శన మిచ్చారు (యోహాను 20:19; 20:26). మరల ఐదు వారాల తరువాత, ఆదివారమున, పెంతకోస్తు దినమున, పరిశుద్ధాత్మ శిష్యులపైకి దిగివచ్చినది. 

క్రైస్తవులు 'సబ్బాతు దినము'ను [శనివారము] కొనియాడే కట్టుబాటు అవసరం లేదని, ఆదివారము అయిన 'ప్రభువు దినము'న వారు ఆరాధన చేయాలని నూతన నిబంధనలోనే స్పష్టముగా తెలియజేయడమైనది (ఆ.కా. 20:7; 1 కొరి 16:2; కొలొస్సీ 2:16-17; దర్శన 1:10). 

పునీత పౌలు
జంతు బలివలె, సబ్బాతు నియమాన్ని పాటించే కట్టుబాటు క్రైస్తవ విశ్వాసులకు లేదు. "మీరు ఏమి భుజింప వలెనో, ఏమి త్రాగవలెనో, శాసించుటకు గాని, లేక పండుగ దినముల విషయమును గూర్చి నిర్ణయించుటకు గాని లేక క్రొత్త చంద్రోత్సవమును గూర్చి చెప్పుటకు గాని, విశ్రాంతి దినమును గూర్చి నిర్ణయించుటకు గాని, ఎవ్వరును ప్రయత్నింపకుండ చూచు కొనుడు. ఇవి అన్నియును భవిష్యత్తులో రాబోవు వానికి నీడలు మాత్రమే. కాని మూలాధారము క్రీస్తుకే చెందుతుంది (కొలొస్సీ 2:16-17; గలతీ 4:10-11). సున్నతి మరియు సబ్బాతు కలిగిన పాత చట్టము తప్పని సరి అని బోధించే [అసత్య] బోధనల నేపధ్యములో పౌలు వ్రాశాడు. సబ్బాత్తు దినము యేసు క్రీస్తులో పరిపూర్ణము గావింపబడినది. కనుక మన జీవితాలు క్రీస్తుకు సంపూర్ణముగా సమర్పింపబడాలి. రోమీ 14:5-6 ప్రకారం, ఆరాధన రోజును నిర్ణయించుకునే విషయం ఒక్కో వ్యక్త్తిపై ఆధారపడియున్నది.

హెబ్రీ 4:9 ప్రకారం, యూదుల సప్తమదిన విశ్రాంతి 'వేరొక రోజున' పరిపూర్ణము గావించబడినది. హెబ్రీయులకు వ్రాసిన లేఖలో, ఏ రోజు అన్నది గాక, "ఆకాశ మండలము గుండ వెళ్లిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు' ప్రధానమని తెలియజేయుచున్నది (4:4f.).

క్రైస్తవులు "ప్రతి దినము" (ఆ.కా. 2:46; లూకా 9:23; 2 తిమో 4:2; రా.ది.చ. 16:23) లేదా "ఆదివారము"న [వారములో మొదటి రోజు] ఆరాధనకు, ప్రభువు భోజనము కొరకు సమావేశమయ్యేవారు (ఆ.కా. 20:7; 1 కొరి 16:2). క్రీ.శ. 49లో జరిగిన 'యెరూషలేము సమావేశము'లో సున్నతిని మినహాయించడం జరిగింది. అయితే, సబ్బాత్తు గురించి మాత్రం ఎలాంటి చర్చ జరగలేదు. బహుశా, ఆ కాలములో సబ్బాత్తు - ఆదివారం ఆరాధన పెద్ద సమస్యగా వుండి యుండక పోవచ్చు! క్రైస్తవమార్గం, యూద మతములో భాగం లేదా శాఖ కాదని గుర్తించి, క్రీ.శ. 60 నుండియే రోమీయ క్రైస్తవ సంఘము ఆదివారమున ఆరాధనలు ప్రారంభించారు. క్రీ.శ. 80-90 కాలములో, క్రైస్తవులు యూదుల ప్రార్ధనా మందిరములనుండి వెలివేయబడినారు.

అపోస్తోలిక కాలము తరువాత 
క్రైస్తవులు ఆరాధనకు ఆదివారమున సమావేశమయ్యేవారు. ఆదివారం ఆరాధన అపోస్తలుల కాలము లేదా ఆ తరువాత, యేసు ఉత్థాన జ్ఞాపకార్థముగా స్థాపించబడినది. అనాధి క్రైస్తవులు ఆదివారము సమావేశమయ్యేవారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వాటిలో - డిడాకే (క్రీ.శ. 70), బర్నబాసు లేఖ (క్రీ.శ. 74), శ్రీసభ పితరులు - ఇగ్నేషియస్ అంతియోకు (క్రీ.శ. 110), జుస్తీను (క్రీ.శ. 155), డిడాస్కాలియ (క్రీ.శ. 225), ఓరిజెన్ (క్రీ.శ. 229), అతనాసియస్ (క్రీ.శ. 345), యెరూషలేము సిరిల్ (క్రీ.శ. 350), జాన్ క్రిసోస్తము (క్రీ.శ. 387, 395, 402), అగుస్తీను (క్రీ.శ. 412), గ్రెగొరీ జగద్గురువులు (క్రీ.శ. 597).

కాన్స్తంటిన్ చక్రవర్తి కాలము - క్రీ.శ. 321లో, ఆదివారమును ప్రజా సెలవుగా ప్రకటించి యున్నాడు. కాన్స్తంటిన్ చక్రవర్తి క్రైస్తవత్వాన్ని అంగీకరించక పూర్వము సూర్య దేవున్ని పూజించేవాడు (SUN day). క్రీ.శ.363-364లో జరిగిన లావోదిషియా సమావేశములో, సబ్బాత్తు నియమాన్ని నిషేధించడమైనది.  

సత్యోపదేశము
"'వారములోని మొదటి రోజున', యేసు మృతులలోనుండి లేచాడు. అది 'మొదటి రోజు' కావడం వలన, మొదటి సృష్టిని క్రీస్తు ఉత్థానదినం గుర్తుకు తెస్తుంది. ఇది సబ్బాతు తర్వాత 'ఎనిమిదవ దినం' కాబట్టి, క్రీస్తు ఉత్థానం ప్రవేశపెట్టిన క్రొత్త సృష్టికి సంకేతం. క్రైస్తవులకు ఇది అన్నిరోజులకు మొదటి రోజుగా, అన్ని పండుగలకు మొదటిదిగా, ప్రభువు దినముగా ఆదివారం మారింది" (2174). "క్రైస్తవులకు ఆదివారం జరిపే కర్మకాండల ఆచరణ సబ్బాతు కర్మకాండల స్థానమాక్రమిస్తుంది. క్రీస్తు విమోచనలలో యూదుల సబ్బాతులో వున్న ఆధ్యాత్మిక సత్యాన్ని ఆదివారం నేరవేర్చుతుంది. దేవునిలో మనిషి నిత్యవిశ్రాంతిని ప్రకటిస్తుంది" (2175). "మొదటి సృష్టికి పూర్తికి ప్రతీకగానున్న సబ్బాతును ఆదివారం నెరవేరుస్తుంది. క్రీస్తు పునరుత్థానం ప్రవేశపెట్టిన క్రొత్త సృష్టిని ఆదివారం గుర్తుకు తెస్తుంది" (2190). "కుటుంబ సంబంధమైన, సాంస్కృతిక, సాంఘిక, మతపరమైన జీవితాలను పోషించుకోటానికి, సరిపడినంత విశ్రాంతిని, విరామమును అందరు పొందుటకు, ఆదివారం తోడ్పడుతుంది" (2194).

ముగింపు: క్రీస్తు మృతులలో నుండి ఆదివారము లేపబడెను. కనుక, ఆదివారము "ప్రభువు దినము." "ప్రభువు దినము" అని నూతన నిబంధనములో కేవలము దర్శన 1:10లో మాత్రమే ప్రస్తావించబడినది. ఇది నూతన జీవితాన్ని లేదా సృష్టిని సూచిస్తుంది. కనుక, ఆదివారము పూర్వ నిబంధన సబ్బాతు దినమును పరిపూర్ణము చేయుచున్నది. 

ఆదివారం – దివ్యపూజాబలిలో పాల్గొనడం వలన ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకొని, తద్వారా, చెడును నివారించి, ఇతరులకు మంచి చేయగలం. దేవునికి బలిపీఠము మీద మన జీవితాలను అర్పించాలి. మన పాపాలకు దేవుని క్షమాపణ కోరుకోవాలి. మన మనవులను దేవునికి విన్నవించుకోవాలి. దివ్యసత్ప్రసాదాన్ని లోకొనడంద్వారా దైవీక జీవితములో పాలుపంచుకుంటాము. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి. విచారణ కార్యకలాపాలలో పాలుపంచుకోవాలి. 

No comments:

Post a Comment