2. సువార్తలు - భౌగోళిక స్వరూపము - ప్రదేశాలు

2. సువార్తలు: భౌగోళిక స్వరూపము - ప్రదేశములు

సువార్తలు: భౌగోళిక స్వరూపము - ప్రదేశములు, గలిలీయ మరియు యెరూషలేమునకు పరిమితమై యున్నది. సువార్తల ప్రకారం, యేసు బెత్లేహేములో జన్మించి, తన తల్లిదండ్రులతో నజరేతులో స్థిరపడినారు. యెరికో దగ్గరలోని యోర్దాను నదిలో, బప్తిస్త యోహాను చేత జ్ఞానస్నానమును పొందియున్నారు. గలిలీయ ప్రాంతములో తన శిష్యులను ఎన్నుకొని, తన బహిరంగ ప్రేషిత కార్యమును అక్కడ ప్రారంభించారు. యేసు తన శిష్యులతో కలిసి, చుట్టుప్రక్కల గ్రామాలలోను, పట్టణాలలోను, సువార్తను ప్రకటిస్తూ, స్వస్థత అద్భుతాలను చేసియున్నారు. కొన్ని సందర్భాలలో, తూరు, సిదోను (మార్కు 7:24), గెరాసేను (మార్కు 5:1), దెకపొలి (మార్కు 7:31-35), కైసరయా ఫిలిప్పు (మార్కు 8:27) వంటి అన్యుల ప్రదేశాలలోనికి కూడా వెళ్ళారు. యేసు తన బహిరంగ జీవితాన్ని ఎక్కువగా గలిలీయ తీర ప్రాంతములో గడిపారు. బహిరంగ ప్రేషిత జీవితములో, తన స్వగ్రామమైన నజరేతును వీడి, కఫర్నాములో తన నివాస స్థానమును ఏర్పరచుకున్నారు (మార్కు 2:19; మత్త 4:13; 13:1). గలిలీయ ప్రాంతమునుండి యెరూషలేము పవిత్ర పట్టణమునకు రెండు మార్గాలు ఉన్నాయి: ఒకటి సమరియా గుండా, రెండవ మార్గము యెరికో, యోర్దాను లోయ గుండా.

మార్కు, మత్తయి, లూకా సువార్తల (సినాప్టిక్ గాస్పల్స్) ప్రకారం, యేసు తన బహిరంగ ప్రేషిత జీవితములో, యెరికో గుండా యెరూషలేమునకు ఒకేఒక్క, చివరి ప్రయాణం చేసారు (మత్త 20:29; మార్కు 10:32, 46; లూకా 18:35; 19:1). యోహాను సువార్త ప్రకారం, యేసు సమరియా గుండా పలుసార్లు యెరూషలేమును సందర్శించారు.

క్రీస్తుకాలం నాటి పాలస్తీనా
క్రీ.పూ. 40 లో, రోమను చక్రవర్తులు అగుస్తు, అంటోని మరియు రోమను సెనేటు చేత 'యూదా రాజ్యము' ఏర్పాటు చేయబడింది. వాస్తవానికి, క్రీ.పూ. 37కల్ల, ఈ 'యూదా రాజ్యము', ఇదూమయ అంతిపాతెర్ కుమారుడైన హేరోదు పరిపాలనలో కేంద్ర పాలనలోనికి తీసికొనిరాబడింది. యూదా, సమరియ, ఎస్ద్రేలోను మైదానం, గలిలీయ, పెరియ, ఇదూమయ ప్రాంతాలు 'యూదా రాజ్యము'లో భాగం. క్రీ.పూ. 30లో, అగుస్తు చక్రవర్తి, మరిన్ని ప్రాంతాలను హేరోదుకు ఇచ్చియున్నాడు. యూదా రాజ్యమంతయు 24 మండలాలుగా విభజించ బడింది. వీటిలో యెరూషలేము అతిప్రధానమైనది. రాజ్యము యొక్క రక్షణను బలపరచడానికి బలమైన కోటలు ఏర్పాటు చేయబడ్డాయి. హేరోదు (ది గ్రేట్) అనేక స్మారక కట్టడాలను నిర్మించారు: యెరూషలేము దేవాలయము, యెరూషలేములో తనకోసం రాజభవనం; విశాలమైన రాజభవనంలాంటి అంటోనియా కోట; బెత్లెహేము దరిలోని హీరోదియోను; మసదలో ఎడారి కోట (సంక్షోభములో ఆశ్రయం కొరకు); మాచెరస్ కోట.

క్రీ.పూ. 4లో, హేరోదు (ది గ్రేట్) మరణించన తరువాత, అగుస్తు యూదా రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి, హేరోదు ముగ్గురు కుమారులకు పంచాడు. వారు రాజులుగా గాక, దేశాధిపతులుగా ('టెట్రార్క్') పిలువబడినారు. సమరియ, యూదయా, ఇదూమయ ప్రాంతాలు అర్కెలాసుకు (క్రీ.శ. 4 - క్రీ.శ. 6) అప్పగించబడెను; గలిలీయ, పెరియ, హేరోదు అంతిపకు (క్రీ.శ. 4 - క్రీ.శ. 39) అప్పగించబడెను; హూలె లోయ, ఎగువ గలిలీయ, సిరియా ఎగువ మైదానము హేరోదు ఫిలిప్పునకు (క్రీ.శ. 4 - క్రీ.శ. 34) అప్పగించబడెను. తరువాత, ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపి, రోమను ప్రావిన్సుగా హేరోదు అగ్రిప్ప I (+ క్రీ.శ. 44) కు ఇవ్వబడెను.

1. నజరేతు
"నజరేయుడగు యేసు, యూదుల రాజు" - యోహాను 19:19
యేసు జనన సూచన - దూత ప్రకటన (Annunciation) - లూకా 1:26-38
తిరు కుటుంబము నజరేతునకు తిరిగి వచ్చిరి - లూకా 2:39
యేసు తన తల్లిదండ్రులతో నజరేతునకు తిరిగి వచ్చెను - లూకా  2:51
యేసు నజరేతులోని ప్రార్ధనా మందిరమున బోధించెను - లూకా 4:15-30
నజరేతు నివాసి యేసు - మార్కు 14:67
యోసేపు, అతని కుటుంబము నజరేతు నగరమున నివాస మేర్పరచు కొనెను - మత్త 2:22-23
యేసు నజరేతునకు తిరిగి వెళ్ళుట - మత్త 13:53-58
యేసు నజరేతు నుండి వచ్చిన ప్రవక్త - మత్త 21:11

సృష్టి ఆరంభమున ప్రారంభమైన రక్షణ చరిత్ర, నజరేతు నగరములోని కన్య మరియకు, యేసు జనన సూచన - గబ్రియేలు దూత ప్రకటనతో (Annunciation), నిశ్చయ దశలోనికి చేరుకుంది. పాత నిబంధనలో, నజరేతు గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఎప్పుడైతే, దేవుని ప్రణాళిక ప్రకటింపబడినదో, అల్పమైన కుగ్రామము నజరేతు శాశ్వతముగా ప్రాముఖ్యమైన ప్రదేశముగాను, ప్రపంచ దృష్టికి కేంద్రముగా మారింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రముగా మారింది.

"నజరేతు" అను నామము (అరబిక్ - ఎన్-నస్రా; హీబ్రూ - నజరత్; గ్రీకు మరియు లతీను - నజరేత్) హీబ్రూ మూలపదం "నెట్జర్" (నెజెర్) నుండి వచ్చింది. "నెట్జర్" (నెజెర్) అనగా "చిగురు" అని అర్ధం. ఇది అభిషిక్తుని పేరు. నజరేతు వ్యవసాయ భూమి.

"నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా?" (యోహాను 1:46) అని నతనయేలు ఫిలిప్పును అడిగాడు. దీనిని బట్టి, నజరేతు గ్రామానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదని, గుర్తింపు లేదని, అల్పమైన గ్రామమని అర్ధమగుచున్నది. యోసేపు, మరియల స్వగ్రామం నజరేతు. నజరేతు గ్రామము తూర్పు, పడమరల వైపున, లోతైన లోయలతో కూడిన ఒక పర్వతముపై నిర్మింప బడినది. ప్రస్తుతం ఈ లోయలు  దాదాపు పూడ్చ బడినవి. ఈ పరవతముపై నిల్చొని యుండగా, లూకా 4:29లోని వచనాన్ని మనం జ్ఞప్తికి చేసుకోవచ్చు: "వారు లేచి యేసును [ప్రార్ధనా మందిరము నుండి] నగరము వెలుపలకు నెట్టుకొని పోయి, తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసికొని వెళ్లి, అచట నుండి తలక్రిందుగా పడత్రోయ తలచిరి."

నజరేతులో, యేసు జనన సూచన చేయబడిన గృహము మీద పెద్ద దేవాలయము [Church of Annunciation] నిర్మించ బడినది. మధ్య-తూర్పు దేశాలలోనే ఇది అతి పెద్ద దేవాలయము. ప్రస్తుతం నజరేతు ఆధునిక నగరం. అచట, మహమ్మదీయులు (పట్టణానికి తూర్పున), గ్రీకులు (ఉత్తరం), కథోలిక క్రైస్తవులు మరియు ఇతరులు (పశ్చిమం మరియు దక్షిణం) నివసిస్తున్నారు.

2. కానా
యేసు కానా పల్లె పెండ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చారు - యోహాను 2:1-11
ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిని స్వస్థపరచుట - యోహాను 4:46-54
కానా నివాసియగు నతనయేలు - యోహాను 21:2

మొదటి శతాబ్దాల నుండియే కానాలో యూద మరియు క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. ఎవరి ప్రార్ధనాలయాలు వారికి ఉన్నాయి. కానా అద్భుతము జరిగిన స్థలములో దేవాలయము ఉండేది. తవ్వకాల్లో నాలుగవ శతాబ్దానికి చెందిన యూదుల ప్రార్ధనాలయం (సినగోగు) కనుగొన బడింది. క్రీ.శ. 1641లో ఫ్రాన్సిస్ సభకు చెందిన మఠ సభ్యులు, కానాకు వచ్చారు. క్రీ.శ. 1879వ సం.లో, అచట నూతన దేవాలయాన్ని నిర్మించారు.

3. తిబేరియా
యేసు 'తిబేరియా'అనెడి గలిలీయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను - యోహాను 6:1
తిబేరియా నుండి ప్రజలు కొన్ని పడవలలో యేసును వెదుకుతూ వచ్చెను - యోహాను 6:23
యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరల దర్శనము ఇచ్చెను - యోహాను 21:1

తిబేరియా, నజరేతు నుండి 31 కిలోమీటర్ల దూరములో ఉన్నది. 'తిబేరియా'అనెడి గలిలీయ సరస్సునకు పశ్చిమ తీరమున, ప్రవక్త యోనా జన్మస్థలమైన ప్రాచీన గాత్హెఫేరు (గాతు హేఫేరు)ను చూడవచ్చు (యెహోషువ 19:13; 2 రాజు 14:25). గాత్హెఫేరు, నజరేతు నుండి 4 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ప్రస్తుతం అది 'మషాద్'గా పిలువబడుచున్న అరబ్ గ్రామము. ముస్లీములు ఇప్పటికీ అక్కడ ఒక మసీదులో యోనా ప్రవక్త (Nebi Yunes) సమాధిని చూపుతూ ఉంటారు.

ప్రాచీన తిబేరియా పట్టణమును క్రీ.పూ. 18-22 మధ్య కాలములో, రక్కాత్తు స్మశానవాటికపై [నెక్రోపోలిస్], హేరోదు అంతిప  స్థాపించి, రోమను చక్రవర్తి తిబేరియ (లూకా 3:1) పేరును పెట్టారు. అక్కడ ఎక్కువగా అన్యులు నివసించేవారు. ఈ పట్టణం స్మశానవాటికపై నిర్మించ బడుట వలన, యూదులు అక్కడ నివసించడానికి ఇష్టపడలేదు. రోమను సంస్కృతిలో పెరిగిన హేరోదు అంతిప, రోమను శైలిలో, ఫోరమ్, స్నానాల గదులు, తనకోసం రాజ భవనముతో ఈ పట్టణాన్ని నిర్మించాడు. క్రీ.శ. 61 కల్ల, ఈ పట్టణం అగ్రిప్ప II భూభాగములో విలీనం చేయ బడింది.

ఆరంభములో యూదులచేత తృణీకరించబడిన ఈ పట్టణం, ఆ తరువాత యూదులకు ప్రధాన కేంద్రముగా మారింది. క్రీ.శ. 132-135 మధ్య కాలములో జరిగిన బార్-కోచ్బా తిరుగుబాటు విఫలమైనప్పుడు, యూదులు పెద్ద సంఖ్యలో అక్కడకి వచ్చారు. మతపరమైన కేంద్రముగా మరియు అధ్యయన కేంద్రముగా మారింది. క్రీ.శ. 200లలో, యూదుల అత్యన్నత పరిపాలన సంస్థ అయిన న్యాయస్థానము (సన్హెడ్రిన్ - Sanhedrin), 'మిష్నా'ను (రబ్బినిక్ వివరణ లేదా వ్యాఖ్యానము అయిన మిద్రాష్ ప్రతుల సేఖరణ లేదా మౌఖిక వ్యాఖ్యానము) సంకలనం చేసిన రబ్బీ యూదా కోదేష్ న్యాయకత్వములో తిబేరియాకు మార్చబడినది.

ప్రస్తుతం, తిబేరియా ఒక పర్యాటక కేంద్రముగా వెలుగుచున్నది. తిబేరియా 600 సెల్షియస్ ఉష్ణోగ్రతలు గల వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి. ఈ నీటిలో రేడియో-యాక్టివ్ ఖనిజ లవణాలు ఉన్నందున, ఔషధముగా పరిగణిస్తారు.

4. గలిలీయ సముద్రము / తిబేరియా / కిన్నెరోతు సరస్సు / గెన్నెసరేతు
యేసు 'తిబేరియా' అనెడి గలిలీయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను - యోహాను 6:1
యేసు పడవనెక్కి, సరస్సును దాటి, నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. అది విని ప్రజలు సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి - మత్త 14:13; మార్కు 6:32
గెన్నెసరేతు సరస్సు తీరమున అద్భుత రీతిలో చేపలు పడుట - లూకా 5:1-11
యేసు గలిలీయ సరస్సు తీరమున బెస్తలను పిలచుట - మార్కు 1:16-20; మత్త 4:18-22
యేసు సరస్సు తీరమున పేతురు పడవ నుండి బోధించుట - మార్కు 3:7-9
యేసు గెన్నెసరేతు సరస్సు తీరమున స్వస్థతలు చేయుట - మార్కు 6:54-56; మత్త 14:34-36
యేసు సముద్ర తుఫానును ఆపుట - మత్త 8:23-27; మార్కు 4:35-41; లూకా 8:22-25
యేసు  నీటిపై నడచుట - మత్త 14:22-23; మార్కు 6:45-52; యోహాను 6:16-21

ఈ సరస్సుకు అనేక పేర్లు కలవు. నూతన నిబంధనలో గలిలీయ సముద్రముగా మరియు తిబేరియా సముద్రముగా పిలువబడు చున్నది. ఇది ఓవల్ (కోల) ఆకారములో ఉండుట వలన, కిన్నెరోతు సరస్సుగా పిలువబడు చున్నది. ఇది హీబ్రూలో 'కిన్నోర్'గా (Kinnor) పిలువబడే 'వీణ' ఆకారమునును పోలి ఉంటుంది. బబులోనియ ప్రవాస కాలము ముగిసిన తరువాత, గెన్నెసరేతు సముద్రము పిలువబడింది. యోసేఫుస్ చరిత్రకారుడు దీనిని  గెన్నెసరేతు సరస్సుగా పిలిచాడు. ఇది సముద్ర మట్టమునకు 212 మీటర్లు దిగువన ఉంటుంది; 21 కిలోమీటర్ల పొడవు, 13 కిలో మీటర్ల వెడల్పు మరియు 54 మీటర్ల లోతు ఉంటుంది. తీరం చాలా ఇరుకైనది. ఈ సరస్సు చుట్టూ అనేక పట్టణాలు ఉన్నాయి: పశ్చిమ తీరమున - తిబేరియ, మగ్దల, గిన్నోసర్, కఫర్నాము, బెత్సయిదా, కొరాజీను పట్టణాలు ఉన్నాయి; తూర్పు తీరమున - బెత్సయిదా జూలియస్, గెర్ఘేసా, గమల, హిప్పోస్ పట్టణాలు ఉన్నాయి.

గలిలీయ సరస్సుతో యేసుకు అవినాభావ సంబంధం ఉన్నది. దీనిలో ఎన్నోసార్లు పడవ ప్రయాణం చేసారు. తీరమున నడిచారు; అచట ఎన్నో అద్భుతాలు చేసారు. అద్భుత రీతిన చేపలు పడుట (లూకా 5:4-11), తుఫానును ఆపుట (మత్త 8:23-27), నీటిపై నడచుట (మత్త 14:23-34) మొదలగు అద్భుతాలు యేసు జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి.

గెన్నెసరేతు ప్రాంతము (మత్త 14:34): సరస్సు వెంబడి దాదాపు 8 కి.మీ మరియు వెడల్పు 3 కి.మీ. ఉంటుంది.

5. మగ్దల
తాల్ముద్ (మిష్నాకు వ్యాఖ్యానము) ప్రకారం, మగ్దల ప్రాముఖ్యత కలిగిన పట్టణం. 300 ల చక్కటి ఉన్నిగల నేతకార్మికుల దుకాణాలు, బలికోసం విక్రయించే పావురాల దుకాణాలు 80 వరకు ఉండేవి. మిద్రాష్ (రబ్బినిక్ వివరణ లేదా వ్యాఖ్యానము) ప్రకారం, పట్టణ ప్రజల అవినీతి, దుష్కార్యాల కారణముగా, చుట్టుప్రక్కల యూదులు ఈ పట్టణాన్ని నాశనం చేసారు. మరియ మగ్దల ఇంటి స్థలమున ఒకప్పుడు దేవాలయము ఉండేది. శిధిలాలతో కప్పబడిన ప్రాంతం ఇప్పుడు ఫ్రాన్సిస్ వారి సభ సభ్యులకు చెందినది.

6. బెత్సయిదా
అయ్యో! బెత్సయిదా పురమా! - మత్త 11:21
యేసు తన శిష్యులను  బెత్సయిదా పురమునకు చేరవలెనని చెప్పెను - మార్కు 6:45
బెత్సయిదా గ్రామములో నున్న యేసు వద్దకు కొందరు ప్రజలు ఒక గ్రుడ్డి వానిని తీసికొని వచ్చిరి - మార్కు 8:22
యేసు శిష్యులను మాత్రమే వెంటబెట్టుకొని  బెత్సయిదా గ్రామమునకు వెళ్ళెను - లూకా 9:10
అయ్యో! బెత్సయిదా పురమా! నీకు అనర్ధము - లూకా 10:13
పేతురు, అంద్రెయ, ఫిలిప్పు బెత్సయిదా పుర నివాసులు - యోహాను 1;44
ఫిలిప్పు గలిలీయలోని బెత్సయిదా నివాసి - యోహాను 12:21

బెత్సయిదా జాలరుల పట్టణం. పేతురు, అంద్రెయ, ఫిలిప్పు బెత్సయిదా పుర వాస్తవ్యులు. ఈ పట్టణ స్థానం మనకు స్పష్టముగా తెలియదు. గుర్తించడం కష్టమే! కొంతమంది అభిప్రాయం ప్రకారం, దీనిని 'ఖిర్బెట్ ఎల్ మిన్యేహ'గా గుర్తించారు.

7. కఫర్నాము
యేసు నజరేతును వీడి కఫర్నామునకు వచ్చి నివాస మేర్పరచుకొనెను - మత్త 4:12-17; మార్కు 1:14-15; లూకా 4:14
యేసు జనసమూహమును చూచి [కఫర్నాము] పర్వతమును ఎక్కి కూర్చుండెను - మత్త 5:1
యేసు కఫర్నాములో శాతాధిపతి సేవకుని స్వస్థపరచుట - మత్త 8:5-10, 13; లూకా 7:1-10; యోహాను 4:46-54
యేసు పేతురు అత్తను స్వస్థపరచుట - మత్త 8:14-15; మార్కు 1:29-31; లూకా 4:38-39
కఫర్నాములో యేసు పక్షవాత రోగిని స్వస్థపరచుట - మార్కు 2:1-12; మత్త 9:1-8; లూకా 8:19-21
ఓ కఫర్నాము పురమా! (అవిశ్వాసము గూర్చి) - మత్త 11:20-24
కొన్ని దినములు గడచిన పిమ్మట యేసు మరల కఫర్నాము చేరెను - మార్కు 2:1; మత్త 9:1
యేసు శిష్యులకు బోధించుట - మార్కు 9:33; మత్త 18:1-5; లూకా 9:46-48
యేసు తల్లి, సోదరులు - మార్కు 3:31-33; మత్త 12:46-50; లూకా 8:19-21
యేసు కఫర్నాము ప్రార్ధనా మందిరమున బోధించుట, ఇతర సంఘటనలు - మార్కు 1:21-38; 
కుష్ఠ రోగికి స్వస్థత - లూకా 5:12-16; మత్త 8:1-4; మార్కు 1:40-45
యేసు లేవిని (మత్తయి) పిలచుట - లూకా 5:27-32; మత్త 9:9; మార్కు 2:13-14
జీవాహారము గూర్చి బోధన - యోహాను 6:1ff.; మత్త 14:13-21; మార్కు 6:32-44; లూకా 9:10-17
కఫర్నామున దేవాలయపు పన్నులు చెల్లించుట - లూకా 10:13-15; మత్త 17:24-27

కఫర్నాము, తిబేరియా నుండి 15.5 కిలో మీటర్ల దూరము. దీని అసలు పేరు 'కెఫర్ నాహుం' (Kefer Nahum) అనగా నాహుం గ్రామము అని అర్ధము. ఈ నాహుం ఎవరో గుర్తించ బడలేదు. ఒరిజెన్ దీనిని 'ఓదార్పు గ్రామము'గా అన్వయించాడు. జేరోము దీనిని 'సుందరమైన నగరము' అని పిలిచాడు. 

14వ శతాబ్దం వరకు, ఈ పట్టణం కఫర్నాము అనే పేరుతోనే పిలువబడింది. అయితే, 16వ శతాబ్దములో 'తాన్హుం' (Tanhum) అనే కొత్త పేరుతో పిలువబడింది. తాన్హుం అనే రబ్బీ సమాధి మూలముగా, ఈ పేరుకు వచ్చినది. స్థానికులు దీనిని 'తాన్హుం' బదులుగా 'తాల్హుం' (Talhum) అని పిలిచారు. ఆ తరువాత, 'టెల్ హమ్' (Tell hum) అని తప్పుగా అన్వయించబడింది. 'టెల్ హమ్' (ruin of Nahum) అనగా 'నాహుం వినాశనము' అని అర్ధము. త్రవ్వకాలలో, ఈ స్థలాన్ని యేసు కాలం నాటి కఫర్నాముగా గుర్తుంచారు.

పురాతన కఫర్నాము యొక్క శిధిలాలు దాదాపు 15 ఎకరాల (6 హెక్టార్లు) విస్తీర్ణములో ఉన్నాయి. బైజాంటైన్ సామ్రాజ్య కాలములో (తూర్పు రోమన్ సామ్రాజ్యం- 1453 వరకు, దీని రాజధాని కాన్‌స్టాంటినోపుల్‌), గరిష్టముగా 1500  మంది నివసించి యుండవచ్చు! క్రీ.పూ. 1978 నుండి పురాతన కఫర్నాములో చాలా వరకు త్రవ్వకాలు జరిగాయి. యిండ్ల గోడలు నిజమైన పునాదులు లేకుండా ఉన్నాయి; ఒక అంతస్థుల గదులు మూడు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్నాయి. తేలికపాటి యింటి పైకప్పులు, చెక్క దూలాలతోను, గడ్డితో కలిపిన మట్టితో కప్పబడేవి. పై గదులకు చేరుకోవడానికి పెరట్లో నుండి రాతి మెట్లు ఉండేవి. ఒక యింటికి పెరడు లేదా ఆవరణము (courtyard) కేంద్రబిందుగా ఉండేది. పైకప్పులు గల గదులను, సామానులను భద్రపరచు కోవడానికి, మరియు వర్షాకాలములో పడుకోవడానికి ఉపయోగించేవారు. వంటచేయడం, వారి వృత్తిపనులు చేసుకోవడం, ఎండాకాలములో పడుకోవడం... మొదలగు ఇతర కార్యకలాపాలన్నీ కూడా పెరడులోని ఆవరనములోనే జరిగేవి. 

రోమను, బైజాంటైన్, అరబ్ సామ్రాజ్య కాలములో, కఫర్నాము గ్రామములో పెద్దగా మార్పులకు గురికాలేదు. బైజాంటైన్ కాలము చివరిలో, గ్రామం చాలా వరకు వదిలివేయ బడినది. దమాస్కసు పాలకుల క్రింద, గ్రామం మరల ఆక్రమించ బడింది. కాని, ఈ కాలములో, సినగోగు మరియు అష్టభుజి దేవాలయము శాశ్వతముగా వదిలివేయ బడినవి. బాగ్దాద్ అబ్బాసిద్ రాజవంశ ఎదుగుదలతో (8వ శతాబ్దం), కఫర్నాము క్షీణించినది. ఆతరువాత, శాతాభ్దాలుగా కఫర్నాము శిధిలాలలో ఉండిపొయినది.

5వ శతాబ్దం వరకు, కఫర్నాములో, యూదుల జనాభాతో పాటు యూదు-క్రైస్తవ సంఘం కూడా ఉండేది. ఐదవ శతాబ్దం మధ్యకాలం నాటికి, ఒక అష్టభుజి దేవాలయమును అన్య-క్రైస్తవులు నిర్మించారు. త్రవ్వకాల్లో లభించిన సిలువతో ముద్రింపబడి, దిగుమతి చేసుకున్న గిన్నెలు, క్రైస్తవ సంఘానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 7వ శతాబ్దంలో, యూదులు మరియు క్రైస్తవులు కఫర్నాము గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడికి కొత్తగా వచ్చిన వారు ముస్లింలు.

సినగోగు: నాల్గవ శతాబ్దపు ప్రార్థనా మందిర శిధిలాలు దానికి సాక్ష్యముగా ఉన్నాయి. తెల్లటి సున్నపురాయితో నిర్మించ బడింది. దీనిలో, ప్రార్ధనా మందిరం, ప్రాంగణం, దక్షిణాన వాకిలి మరియు ప్రార్థనా మందిరానికి వాయువ్య మూలలో ఒక ప్రక్కగది అను నాలుగు భాగాలతో నిర్మించబడింది. ప్రార్థనామందిర ముఖభాగం దక్షిణముననున్న యెరూషలేమువైపునకు ఉన్నది. ప్రార్ధనామందిరం 4వ శతాబ్దములో నిర్మించబడి, ఆతరువాత దానికి చేర్పులు చేయడం జరిగింది. పాత ప్రార్ధనలయాలపై, కొత్త వాటిని నిర్మించడం ఆనవాయితి కనుక, త్రవ్వకాలలో, యేసు సందర్శించి, బోధించిన మొదటి శతాబ్దపు సినగోగు అవశేషాలు ఏమీ లభ్యం కాలేదు.

పునీత పేతురు ఇల్లు: క్రీ.శ. 1968వ సం.లో, సినగోగుకు (యూదుల ప్రార్ధనా మందిరము) దక్షిణంగా దాదాపు 30 మీటర్ల దూరంలోనున్న అష్టభుజి దేవాలయ పునాదుల క్రింద, కఫర్నాములోని పేతురు ఇల్లు కనుగొనబడింది. ఈ ఇల్లు గ్రీకుకాలం చివరిలో నిర్మించబడింది. మొదటి శతాబ్దం చివరినాటికి, ఈ ఇల్లు డోమస్ ఎక్లేసియా (Domus Ecclesiae) అనగా క్రైస్తవ సమావేశ గృహముగా మార్చబడింది. నాల్గవ శతాబ్దంలో, విస్తరించబడి, ఆవరణ గోడతో, పట్టణంలోని మిగిలిన ప్రాంతాల నుండి వేరుచేయబడింది. ఐదవ శతాబ్ద ద్వితీయ భాగంలో, పునీత పేతురు ఇంటిపై అష్టభుజి దేవాలయం నిర్మించబడినది. ఈ దేవాలయము, 7వ శతాబ్దం వరకు ఉండినది.

8. తబ్ఘా (Tabgha)
పర్వతముపై ప్రసంగము - మత్త 5:1
ఐదువేల మందికి ఆహారము పంచుట - మార్కు 6:35-45
పేతురు, ఇతర అపోస్తలులకు ఉత్థాన యేసు దర్శనమిచ్చుట - యోహాను 21:1-19

'తబ్ఘ' అనగా 'ఏడు నీటిబుగ్గల ప్రాంతం' (hepta pegai - heptapegon - et-tapega - Tabgha) అని అర్ధము. ఇది చాలా ఏకాంత ప్రదేశం. యేసు తరుచుగా ఒంటరిగా ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళేవారు. యేసు నజరేతును వీడి కఫర్నాములో నివాస మేర్పరచుకున్నారు. 'తబ్ఘ', కఫర్నామునకు 2 కిలోమీటర్ల దూరములో మాత్రమే ఉండేది. 'తబ్ఘ' ప్రాంతములో మూడు సువార్త సంఘటనలను కొనియాడతాము: కొండపై యేసు బోధన, ఐదువేల మందికి ఆహారము పెట్టుట, పేతురు, ఇతర అపోస్తలులకు ఉత్థాన యేసు దర్శనమిచ్చుట. ఈ మూడు సంఘటనలు జ్ఞాపకార్ధముగా, క్రీ.శ. 4వ శతాబ్దములో క్రైస్తవులు మూడు చిన్న ప్రార్ధనాలయాలను నిర్మించారు. క్రీ.శ. 5వ శతాబ్దములో వాటిని పునర్నిర్మించారు.

క్రీ.శ. 614 నాటి పర్షియన్ దండయాత్ర మరియు క్రీ.శ. 637 నాటి అరబ్ దండయాత్రల వలన ఈ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. 'ది చర్చ్ ఆఫ్ ది మల్టిప్లికేషన్' (The Church of the Multiplication) పూర్తిగా ధ్వంసం చేయబడినది, మరల ఎప్పటికీ పునర్నిర్మింపబడలేదు. 'మొనాస్టరి అఫ్ ది బెయాటిట్యూడ్స్' (Monastery of the Beatitudesపునర్నిర్మింపబడినది. ఇది బహుశా, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు కొనసాగినది. 'చర్చ్ ఆఫ్ ది ప్రైమసీ అఫ్ పీటర్' (Church of the Primacy of Peter) మాత్రమే మిగిలి యున్నది.

'చర్చ్ ఆఫ్ ది ప్రైమసీ అఫ్ పీటర్' (Church of the Primacy of Peter): 
ఉత్థాన క్రీస్తు పేతురుకు తన ప్రేషిత బాధ్యతను ఆదేశించుట (యోహాను 21:1-19)
క్రీ.శ. 9వ శతాబ్దములో, 'చాపెల్ అఫ్ 12 త్రోన్స్ ఆర్ 12 అపోసల్స్' గా (Chapel of 12 Thrones or 12 Apostles) పిలువబడినది. ఇది 'మెన్స క్రిస్తి' (Mensa Christi)గా కూడ పిలువబడినది. స్థానికముగా, 'బొగ్గుల స్థలము' (Place of the Coals) గా పేరుగాంచినది (యోహాను 21:9). ఇది తరువాత ధ్వసం చేయబడింది, కాని మరల పునర్నిర్మింపబడింది. ఈ చిన్న దేవాలయానికి ఉత్తరాన క్రూసేడర్లు ఒక చిన్న కోటను నిర్మించారు. అయితే, క్రీ.శ. 1187లో, ఈ దేవాలయం ధ్వసం చేయబడింది. క్రీ.శ. 1260లో మరల పునర్నిర్మింపబడింది. కాని మరల క్రీ.శ. 1263/5లో ధ్వసం చేయబడింది. దీని తర్వాత, అనేక శతాబ్దాలుగా వదిలివేయబడింది.

మరల క్రీ.శ. 1933-34లో, ఫ్రాన్సిస్ సభకు చెందిన సహోదరులు ప్రస్తుతం ఉన్న చిన్న దేవాలయాన్ని నిర్మించారు. క్రీ.శ. 5 జనవరి 1964న, ఆరవ పాల్ జగద్గురువులు, ఈ దేవాలయాన్ని సందర్శించారు. పునీత పేతురు, ఈ స్థలములోనే, "నా గొర్రెలను మేపుము" అని ఉత్థాన క్రీస్తు పేతురుకు తన ప్రేషిత బాధ్యతను ఆదేశించారు (యోహాను 21:15-17).

ప్రభువు ఆదేశం మేరకు, అద్భుత రీతిన పడిన చేపలతో, ఆయన శిష్యుల కొరకు బొగ్గుల మంటపై చేపను, రొట్టెను సిద్ధము చేసిన స్థలముననే ప్రస్తుతమున్న చిన్న దేవాలయము ఉన్నది. ఈ దేవాలయమునుండి గలిలీయ సరస్సు నీటికి యాత్రికులు చేరుకోవడానికి మెట్లున్నాయి.

చర్చ్ అఫ్ ది మల్టిప్లికేషన్ అఫ్ లోవ్స్ (Church of the Multiplication of the Loaves):
ఐదువేల మందికి ఆహారము పంచుట - మార్కు 6:30-44; మత్త 14:13-21; లూకా 9:10-17; యోహాను 6:1-13
జనులు గుంపులు గుంపులుగా యేసును అనుసరించుట - మత్త 13:1-3
ఇచ్చట ప్రధమ దేవాలయము క్రీ.శ.350లో నిర్మించబడింది. క్రీ.శ. 5వ శతాబ్దములో, పెద్ద దేవాలయముగా పునర్మించబడింది.  నేల మొజాయిక్‌లతో అలంకరించబడింది.

క్రీ.శ. 614లో పర్షియన్ల దండయాత్రలో ధ్వంసం చేయబడింది. క్రీ.శ. 1932 సం.లో ఈ దేవాలయ శిధిలాలు త్రవ్వకాలలో బయటపడ్డాయి. పురాతన దేవాలయ మొజాయిక్‌లను రక్షించడానికి తాత్కాలిక దేవాలయం నిర్మించబడింది. దీని స్థానములో 1982లో ప్రస్తుతమున్న దేవాలయం నిర్మించబడింది.

9. అష్టభాగ్యాల కొండ (Mount of Beatitudes - మౌంట్ అఫ్ బెయాటిట్యూడ్స్)
కొండపై ప్రసంగము - మత్త 5:1-12
ప్రస్తుతం, ఆధునిక అష్టభాగ్యాల దేవాలయమున్న చోటుగాక, కఫర్నాముకు వెళ్ళే మార్గములో ఎడమవైపున నున్న చిన్న పర్వతం, యేసు తన అష్టభాగ్యాలను బోధించిన పర్వతం లేదా ప్రదేశమని విశ్వసిస్తారు. 1933/5 త్రవ్వకాలలో, 4 నుండి 6 శతాబ్దాల కాలమునాటి ఒక చిన్న దేవాలయము అచట ఉండేదని కనుగొనబడింది. కనుక ఆ స్థలమే యేసు తన అష్టభాగ్యాలను బోధించిన స్థలముగా విశ్వాసం. 

అదే పర్వతముమీద ఇప్పుడు ఆధునిక దేవాలయమొకటి యున్నది. అష్టభుజి ఆకారములో నున్న ఈ దేవాలయాన్ని అంతోనియో బార్లుజ్జి రూపొందించారు. ప్రస్తుతం ఇది ఫ్రాన్సిస్కన్ మఠకన్యలకు చెందినది. ఇది గలిలీయ సముద్రానికి ఎదురుగా నున్నది. ఇది ప్రార్ధనకు, ధ్యానమునకు చాలా అనువైన ప్రశాంతమైన ప్రదేశము.

10. కైసరయా ఫిలిప్పు
యరోబాము బంగారు కోడె దూడను చేయించి దాను నందు నెలకొల్పెను - 1 రాజు 12:26-30
అంటురోగము వలన, దాను నుండి బేర్షెబా వరకు డెబ్బది వేల మంది చచ్చిరి - 2 సమూ 24:15
అబ్రహాము రాజులను దాను వరకు తరిమెను - ఆ.కాం. 14:14
నగరమునకు దాను అని పేరిడుట - న్యాయాధి 18:27-31
యేసు కైసరయా ఫిలిప్పు ప్రాంతమునకు వచ్చెను - మత్త 16:13; మార్కు 8:27-30; లూకా 9:18-21

పాలస్తీనాలో ఉత్తర భాగాన (ఇశ్రాయేలు), దాను బాగా ప్రసిద్ధి గాంచిన పట్టణం. ఇచట క్రీ.పూ. 199లో అంతియోకుసు III, టోలమీయులను ఓడించాడు. ఇచట హేరోదు తెల్లని పాలరాయితో ఒక దైవ పీఠమును నిర్మించాడు. అతని కుమారుడు ఫిలిప్పు ఇచట ఒక నగరాన్ని నిర్మించి, అగుస్తు చక్రవర్తి పేరున కైసరయా అని నామకరణం చేసాడు. దీనిని సాధారణముగా, కైసరియా ఫిలిప్పు అని పిలిచేవారు. హేరోదు అగ్రిప్ప II, నీరో చక్రవర్తి గౌరవార్ధం, నగర పేరును 'నెరోనియాసు'గా మార్చాడు. యెరూషలేము పతనం తరువాత, టైటసు ఇచట విజయాన్ని జరుపుకున్నాడు.

దాను సమీపములో, 'బానియాసు' అను స్థలములో ప్రారంభమయ్యే జలపాతాలు, ఆధునిక ఇశ్రాయేలులో ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. 'బానియాసు'కు ఉత్తరాన 10 కిలో మీటర్ల దూరములో 'కల్లతు నిమ్రోదు' అనే ప్రదేశం కలదు. అక్కడనుండి మరో 10 కిలో మీటర్ల దూరములో 'హెర్మోను కొండ' కలదు. నిమ్రోదు వద్ద క్రూసేడర్లు నిర్మించిన పాత కోట ఒకటి కలదు.

యేసు శిష్యులతో కైసరయా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు, మార్గమధ్యమున, "నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు?" అని వారిని ప్రశ్నించారు. అప్పుడు పేతురు, "నీవు క్రీస్తువు" అని తన విశ్వాసాన్ని వెల్లడించాడు (మార్కు 8:27-30; లూకా 9:18-20; మత్త 16:13-20).

11. యోర్దాను నది
ఏలియా యోర్దానుకు తూర్పుననున్న కెరీతు వాగు వద్ద వసించెను - 1 రాజు 17:5
ఎలీషా యోర్దాను నది ఆవలి ఒడ్డుకు నడిచిపోయెను - 2 రాజు 2:13-14
నామాను కుష్ఠము (ఎలీషా చెప్పగా, యోర్దాను నదిలో ఏడు సార్లు స్నానము చేయగా) నయమగుట - 2 రాజు 5:1-14
యోర్దాను నదిలో జారిపోయిన గొడ్డలి మరల దొరుకుట - 2 రాజు 6:1-7
యోహాను యోర్దాను నదిలో బప్తిస్మమును ఇచ్చుట - యోహాను 1:28; లూకా 3:21; మత్త 3:13-17
యోర్దాను నదిలో యేసు బప్తిస్మము - మార్కు 1:9-11; లూకా 3:21-22; మత్త 3:13-17; యోహాను 1:9-34

యోర్దాను నది చిన్నది అయినప్పటికీ, అనేక బైబిల్ సంఘటనలతో విడదీయరాని సంబంధం కారణంగా, ప్రపంచంలోని అతిపెద్ద నదుల కంటే ఎక్కువ ప్రసిద్ధి చెందింది. ఇది హెర్మోన్ పర్వతం నుండి ఉద్భవించును. బనియాసు, దాను మరియు హజ్బానీ వంటి చిన్న నదులయికే జోర్డాన్ నది. ఇది గలిలీ సరస్సులోనికి ప్రవహించి, దక్షిణాన కొనసాగి,మృత సముద్రంలో కలుస్తుంది. ప్రసిద్ధమైన, బహుశా పురాతన నగరమైన యెరికో, ఈ ప్రాంతంలో ఉన్నది. 

12. తాబోరు పర్వతము
తాబోరు, గడ్డిబీడులతో కేటాయించుట - 1 రా.ది. 6:77
తాబోరు వద్ద జనులకు ఉచ్చుగా తయారైతిరి - హోషె 5:1
కర్మెలు పర్వతముతో పోల్చుట - యిర్మీ 46:18
బారాకు, దెబోరాల విజయము - న్యాయా 4:4-16
మిద్యానీయుల నుండి ఇశ్రాయేలీయుల ఆశ్రయం - న్యాయా 6:2
గిద్యోను పోరాటం - న్యాయా 7
తాబోరు సంతసముతో కీర్తించుట - కీర్త 89:12
యేసు పిశాచగ్రస్తుని స్వస్థపరచుట - లూకా 9:37-43; మత్త 17:14-18; మార్కు 9:14-27
యేసు దివ్యరూప ధారణము - మార్కు 9:2-8; లూకా 9:28-36; మత్త 17:1-8

గలిలీలోని అత్యంత అందమైన పర్వతం. దీనిని అరబిక్‌లో "జెబెల్ ఎట్-తుర్" అని పిలుస్తారు, అనగా "అత్యంత అద్భుతమైన పర్వతం" అని అర్ధము. ఇది ఎస్ద్రాలోను మైదానమునకు 602 మీటర్ల ఎత్తులో, మధ్యధరా సముద్రం మట్టమునకు 560 మీటర్ల ఎత్తులో ఉన్నది. రాళ్ళనుండి చెక్కబడిన 4340 మెట్లతో పర్వతం పైకి వెళ్ళుటకు మార్గము ఉన్నది. నేడు కారులో లేదా మినీబస్సులో కూడా పర్వత శిఖరానికి చేరుకోవచ్చు.

పురాతన మతాలు ఎత్తైన పర్వతాలకు పవిత్రతను ఆపాదించాయి. దీనికి తాబోరు పర్వతం మినహాయింపు కాదు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్ధత్త భూమికి చేరుకున్న తరువాత, ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, వారు తాబోరు పర్వతమునకు ప్రత్యేకమైన గౌరవాన్ని ఆపాదించారు. ఇస్సాఖారు, సెబూలూను భూప్రాంతాలకు సరిహద్దుగా స్తాపించబడింది. తాబోరు పర్వతం, సభలకు, ప్రాయశ్చిత్త బలులకు, ఇతర సమావేశాలకు ఉపయోగించబడింది. 

తాబోర్ పర్వతం సహజ కోటవలె ఉండుట వలన, ఇశ్రాయేలు శత్రువులు వారిని జయించడం కష్టంగా భావించేవారు. యిస్రాయేలీయుల తీర్పరి, ప్రవక్తి అయిన దెబోరా, బారాకు నాయకత్వములో, తాబోరు పర్వతముపై సీస్రా సైన్యములతో నిర్వహించిన యుద్ధము గురించి, న్యాయాధిపతులు 4వ అధ్యాయములో చదువుచున్నాము. యిస్రాయేలీయుల విజయానంతరం, దెబోరా, బారాకు పాడిన గీతమును 5వ అధ్యాయములో చదువుచున్నాము.

క్రీ.పూ. 218లో ఆంతియోకసు III తాబోరు పర్వతమును జయించాడు. క్రీ.శ. 66లో, జొసేఫుస్ ఫ్లావియుస్ తాబోర్ పర్వతంపై ఆశ్రయం పొందాడు. ప్లాసిడుస్ నేతృత్వంలోని వెస్పాసియన్ యొక్క రోమన్ సైన్యాలకు వ్యతిరేకంగా తాబోరు పర్వతాన్ని  బలపరిచి యున్నాడు. క్రీ.శ. 67లో యూదులు ఓడిపోయారు. ఆ తరువాత రోమనులు తాబోరు పర్వతాన్ని ఆక్రమించుకున్నారు.

యేసు దివ్యరూప ధారణ వలన, తాబోరు పర్వతం చాలా ప్రసిద్ధి గాంచినది. యేసు దివ్యరూప ధారణ గూర్చి లూకా 9:28-36; మత్త 17:1-8; మార్కు 9:2-8లో చదువుచున్నాము. తాబోరు పర్వతముపై నున్న దేవాలయానికి ఇరువైపులా నున్న రెండు చిన్న దేవాలయాలు, యేసు దివ్యరూప ధారణ సమయములో దర్శనమిచ్చిన మోషేకు, ఏలియాలకు జ్ఞాపకార్ధముగా అంకితం చేయబడినవి. 

కాన్స్టాంటైన్ చక్రవర్తి తల్లి పునీత హెలెనా, తాబోరు పర్వతముపై ప్రధమదేవాలయాన్ని నిర్మించినది.

13. నాయిను / నాయిము
నాయినులో మరణించిన వితంతువు కుమారుడిని యేసు లేపుట - లూకా 7:11-17

నాయిము అనగా "ఆహ్లాదకరమైన" అని అర్ధము. అఫుల మార్గమునకు వైపుననున్న నాయిము ముస్లిం గ్రామము. క్రీ.శ. 1880లో ఫ్రాన్సిస్ సభ సభ్యులు, పురాతన దేవాలయ పునాదులపై, ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించారు.

14. హైఫా / కర్మెలు పర్వతము
హైఫా ఆధునిక ఉత్తర ఇజ్రాయేలీ ప్రధాన ఓడరేవు నగరం. ఇది కర్మెలు పర్వతాలు, మధ్యధరా సముద్రం, మైదానాల మధ్య ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 546 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ నగర పుట్టుపూర్వోత్తరాల గురించిన సమాచారం లేదు. హైఫా అంటే "ఆశ్రయం" అని అర్ధం. హీబ్రూ భాషలో,  కర్మెలు అనగా, "దేవుని ద్రాక్షాతోట" అని అర్ధము.

ఎల్-ముహ్రకా: మండుచున్న స్థలము; ఏలియా బలి (El-Muhraqa = place of burning; Elijah's sacrifice)
షూనేము వనిత  కర్మెలు కొండపై నున్న ఎలీషాను వెదకుట - 2 రాజు 4:25
కర్మెలు కొండమీద - ఎల్-ముహ్రకా వద్ద ఏలియా బలి - 1 రాజు 18:21-20
యెస్రెయేలు లోయమీద కారుమబ్బులు క్రమ్ముట - 1 రాజు 18:41-45
కర్మెలు పర్వతముమీద గడ్డి మాడిపోవుట - ఆమోసు 1:2
వారు కర్మెలు కొండకొమ్మున దాగుకొనిన - ఆమోసు 9:3
బాషాను కర్మెలు మండలములలో కరువు - యెషయ 33:9
కర్మెలు షారోను మండలములవలె సారవంతము - యెషయ 35:2
కొండలన్నింటికంటె కర్మెలు కొండ కడలికి పైన నిల్చి యుండును - యిర్మీ 46:18
నీ శిరస్సు కర్మెలు కొండ వలె ఉన్నతముగా నిల్చియున్నది - పరమ 7:5

కర్మెలు కొండ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏలియా బలి. ఏలియా కర్మెలు కొండపై నివసించినట్లుగా కూడా చెబుతారు. కర్మెలు యొక్క ఎత్తైన శిఖరాన ఉన్న ప్రదేశాన్ని 'ఎల్-ముహ్రకా' అని పిలుస్తారు. ఇది దలియత్ ఎల్-కర్మెలు యొక్క డ్రూజ్ గ్రామానికి సమీపములో ఉన్నది. డ్రూజ్ ప్రజలు మోషే మామ అయిన యిత్రో వారసులని చెప్పుకునేవారు. ఎల్-ముహ్రకా పర్వతం దిగువన కీషోను వాగు ఉన్నది. ఈ ప్రదేశములోనే ఏలియా బలిని అర్పించాడని యూదుల సంప్రదాయ నమ్మకం. అక్కడ 12 రాళ్లతో కట్టబడిన బలిపీఠం ఉండేది. అది 19వ శతాబ్దపు చివరి భాగంలో కనుమరుగైంది.

ప్రస్తుతం అక్కడ ఒక చిన్న దేవాలయమున్నది. ప్రాంగణములో, యాత్రికులకు ఈ ప్రదేశము యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేయుటకు, ఏలియా స్వరూపము ఒక స్థంభముపై ఉంచబడినది. దేవాలయము లోపల, చెట్టుకింద చింతిస్తూ కూర్చున్న ఏలియా స్వరూపాన్ని చూడవచ్చు.

స్టెల్లా మారిస్ - కర్మెలు కొండ (Stella Maris)
కర్మెలు కొండ, ధ్యానానికి చాలా అనుకువైన ప్రదేశము కనుక, ఎంతోమంది సన్యాసులను/ మఠవాసులను ఆకర్షించినది. క్రీ.శ. 1203-1214 మధ్య కాలములో, కొంతమంది సన్యాసులు కర్మెలు కొండ మీద వారి నియమావళిని స్వీకరించుట వలన, కార్మలైటు సభ (Carmelite Order) స్థాపించబడినది. ఇది యూరప్ అంతటా వ్యాపించినది. ఇచ్చటి సన్యాసులపై పదేపదే దాడులు జరిగాయి. ఈ దాడులలో అనేకమంది హతసాక్షులుగా మరణించారు. భద్రత లేకపోవడం వలన, క్రీ.శ. 1219లో కర్మెలు కొండను విడిచి పెట్టవలసి వచ్చినది.

క్రీ.శ. 1631లో వారు కర్మెలు పర్వతానికి తిరిగి వచ్చి, ఏలియా ప్రవక్త నివసించినట్లు భావించే ఒక గుహ సమీపంలో ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మించారు. క్రీ.శ. 1767లో దాహెర్ ఎల్-ఒమర్ వారిని అక్కడనుండి తరిమికొట్టాడు; ఆశ్రమాన్ని నాశనం చేసాడు. ఆతరువాత, సన్యాసులు మరల తిరిగి వచ్చి దేవాలయాన్ని, ఆశ్రమాన్ని నిర్మించారు. క్రీ.శ. 1799లో నెపోలియన్ సైన్యంవలన భవనాలు దెబ్బతిన్నాయి. దేవాలయం ముందు ప్రస్తుతం ఉన్న పిరమిడ్ నిర్మాణం నెపోలియన్ సైనికుల జ్ఞాపకార్థముగా ఉన్నది. క్రీ.శ. 1821లో ఆక్రికి చెందిన అబ్దల్లా పాషా ఆశ్రమాన్ని, దేవాలయాన్ని నాశనం చేయాలని ఆదేశించాడు. క్రీ.శ. 1836లో అవి మరల తిరిగి తెరవబడ్డాయి. ప్రస్తుతం ఉన్న ఆశ్రమాన్ని 'స్టెల్లా మారిస్' అని పిలుస్తారు. దేవాలయం 'ఏలియా గుహ'పై నిర్మించ బడినది. క్రీ.శ. 1836లో చిలీ నుంచి వచ్చిన యాత్రికులు కానుకగా ఇచ్చిన మరియమాత స్వరూపము, దేవాలయము బయట స్తంభముపై ఉంచబడినది.

15. కైసరయా సముద్రతీరం
ఫిలిప్పు సువార్తను బోధించుచు, కైసరియాను చేరుకొనెను - అ.కా. 8:40
సౌలును కైసరియాకు తీసికొనిపోయి, అక్కడనుండి అతనిని తార్సునకు పంపివేసిరి - అ.కా. 9:30
పేతురు కైసరియా పట్టణములోనున్న కొర్నేలి యింటికి వెళ్ళెను - అ.కా. 10:1, 24
కైసరియానుండి ముగ్గురు మనుష్యులు పేతురు ఉండిన యింటి యొద్దకు వచ్చిరి - అ.కా. 11:11
హేరోదు (అగ్రిప్ప I) యూదయా (యెరూషలేము) నుండి కైసరియాకు వెళ్ళెను - అ.కా. 12:19

పురాతన ఓడరేవు నగరం, క్రీ.పూ. 3వ శతాబ్దం మధ్య కాలములో స్థాపించబడింది; దీనిని 'స్ట్రాటోస్ టవర్' (Strato's Tower) అని పిలిచేవారు. ఇది పెనిష్యా (తూరు, సిదోను) లంగరు; క్రీ.పూ. 90లో హస్మోనియన్ రాజైన అలెగ్జాండరు యానై దీనిని తన రాజ్యంలో కలుపుకున్నాడు. క్రీ.పూ. 25లో రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజరు గౌరవార్థముగా, హేరోదు చక్కటి ప్రణాళికతో, అందమైన నగరాన్ని నిర్మించి కైసరియా అని పేరు పెట్టాడు. క్రీ.శ. 6లో, కైసరియా రోమనుల పరిపాలనా కేంద్రంగాను, రోమను మరియు బైజాంటైను కాలంలో దేశరాజధానిగాను, అరబ్ మరియు క్రూసేడరుల కాలంలో ఇది ఒక ముఖ్యమైన ఓడరేవు నగరముగా ప్రసిద్ధి గాంచినది. 

మొదటి (క్రీ.శ. 66-70) మరియు రెండవ (క్రీ.శ. 132-135), రోమనులపై యూదుల తిరుగుబాటు కాలములో, కైసరియా ముఖ్యపాత్ర పోషించినది; దీనికారణముగా కైసరియా, రోమనుల అణచివేతకు చిహ్నముగా మారింది. క్రీ.శ. 69లో వెస్పాసియన్ రోము చక్రవర్తిగా, కైసరియాలోనే ప్రకటించబడినాడు.

క్రైస్తవ చరిత్రలో, కైసరియా ముఖ్యమైనది. దియాకను ఫిలిప్పు కైసరియాలో సువార్తను బోధించాడు (అ.కా. 8:40). అపోస్తలులు పేతురు, పౌలులు ఈ నగరాన్ని సందర్శించారు. ఈస్టర్ వేడుకలను ఆదివారము రోజున కొనియాడుటకు నిర్ణయించడానికి కైసరియాలో సమావేశం (కౌన్సిల్) జరిగింది. నాలుగవ శతాబ్దంలో ప్రధమ శ్రీసభ చరిత్రకారుడైన యుసేబియసు కైసరియాకు అగ్ర పీఠాధిపతిగా నియమించబడ్డాడు.

16. టెల్-అవీవ్ / లోదు / యొప్పా / లిద్దా
సీమోను యొప్పాను ముట్టడించుట - 1 మక్క 12:33-34
సీమోను యొప్పాను జయించి ఓడరేవుగా మార్చెను - 1 మక్క 14:5
దేవాలయ నిర్మాణము కొరకు కలపను యొప్పా ద్వారా యెరూషలేమునకు తరలించుట - 2 రా.ది.చ. 2:16
దేవాలయ నిర్మాణం కొరకు దేవదారు కొయ్యను యొప్పా రేవు గుండా యెరూషలేమునకు పంపుట - ఎజ్రా 3:7
దాను గోత్ర భూభాగము - యెహోషు 19:40-46
లిద్దాలో పేతురు పక్షవాత రోగిని స్వస్థపరచుట - అ.కా. 9:32-35
యొప్పాలో పేతురు మరణించిన స్త్రీని జీవముతో లేపుట - అ.కా. 9:36-43

టెల్-అవీవ్ అనేది ఇజ్రాయేలు దేశము ఏర్పడిన తర్వాత, యూదులు నిర్మించిన ఆధునిక నగరం. ఇది ఇజ్రాయేలుకు రాజధానిగా అనేక దేశాలచేత పరిగణించ బడుతుంది. ఇది దేశానికి ఆర్ధిక, సాంకేతిక కేంద్రం. యెరూషలేము ఇజ్రాయేలు దేశ ప్రధాన నగరము. 'కెన్నెసెట్' అని పిలువబడే ఇజ్రాయేలు పార్లమెంట్, అధ్యక్షుడి భవనం, ప్రధానమంత్రి బంగ్లా, అనేక మంత్రుల కార్యాలయాలు యెరూషలేములోనే ఉండటం గమనార్హం! యొప్పా టెల్అ-వీవ్ సమీపంలో ఉన్నది. నేటికీ పాత నగరంవలె మిగిలిపోయింది. లోదు మరొక సమీపంలోని నగరం. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం బెన్ గూరియన్ ఉన్నది; దీనినే టెల్-అవీవ్ పేరుతో పిలుస్తారు.

17. యెరూషలేము
'యెరూషలేము' నగరము బైబులులో 811 సార్లు ప్రస్తావించ బడినది. బైబులులో యెరూషలేము, 'షా(సా)లేము'గాకూడా పిలువబడుచున్నది (ఆ.కాం. 14:18; కీర్త 76:2; హెబ్రీ 7:1-2). 'యెరూషలేము' అనగా 'పవిత్ర నగరము' అని అర్ధము. దీని అసలు పేరు 'ఇరుసలేం' (Irusalem). హీబ్రూలో 'యెరుషలయిం' (Yerushalayim)గాను, గ్రీకులో 'హెరుసొలుమ' (Hierosolyma)గా పిలువబడుచున్నది. 'మిద్రాష్' వివరణ ప్రకారం, నగరము యొక్క హీబ్రూ పేరునకు 'శాంతికి పునాది' అని అర్థం.

యెరూషలేము, మధ్యధరా సముద్రానికి తూర్పున 58 కి.మీ., మృత సముద్ర ఉత్తర కొనకు పశ్చిమాన 26 కి.మీ. దూరములో ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 640-770 మీటర్ల ఎత్తులో ఉన్నది. నగరము తూర్పున కీద్రోను లోయ, పశ్చిమ-దక్షిణాన హిన్నోన్ లోయలను కలిగి యున్నది. యెరూషలేము ఉత్తర-దక్షిణ మధ్యన 'తైరోపియను' లోయద్వారా రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది. తూర్పు భాగాన 'మోరీయా పర్వతం' లేదా 'టెంపుల్ మౌంట్', ఓఫెలు ఉన్నాయి. నగరానికి ప్రధాన నీటి సరఫరా గీహోను ఊట; దీనిని 'వర్జిన్స్ ఫౌంటెన్' (Virgin's Fountain) అని కూడా పిలుస్తారు.

దావీదు మహారాజు యెరూషలేము ఆక్రమణతో (2 సమూ 5:5f.; 1 రా.ది.చ. 11:4f.), ఈ పట్టణం, ఇస్రాయేలు చరిత్రలో ప్రసిద్ధి గాంచినది. దీనికి 'దావీదు నగరము' అని పేరు. దావీదు రాజ్యమునకు యెరూషలేమును రాజధానిగా చేసాడు. అతను యెరూషలేములోనికి (ఒప్పంద పేటిక, దర్శన 11:19; మందసపు పెట్టె, నిర్గమ 25:10-22) 'నిబంధన మందసమును' (హెబ్రీ 9:4, Ark of the Covenant) తీసికొని వచ్చి, పవిత్ర నగరముగ చేసాడు. ఈ మందసాన్ని ప్రతిష్టించడానికి, దావీదు కుమారుడు సొలోమోను (క్రీ.పూ. 965-928) 'మొదటి యెరూషలేము దేవాలయాన్ని' నిర్మించాడు. ఆతరువాత యెరూషలేము నగరం యూదులకు ప్రధాన కేంద్రంగా మారింది.

ఇస్రాయేలు రాజ్యము ఉత్తర, దక్షిణ రాజ్యాలుగా విభజించబడిన తరువాత (క్రీ.పూ. 930), దక్షిణాన యూదారాజ్యానికి రాజధానిగా యెరూషలేము కొనసాగింది. ఇది క్రీ.పూ. 586లో బబులోనియనులచే నాశనం చేయబడింది. బబులోనియ వాసమునుండి తిరిగి వచ్చిన తరువాత, క్రీ.పూ. 515లో యెరూషలేము దేవాలయము పునర్నిర్మించబడినది. క్రీ.పూ. 20 కాలములో, హేరోదు రాజు దానిస్థానములో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు. ఇది క్రీ.శ. 70లో రోమనులు, టైటసు నాయకత్వములో నాశనం చేసారు. క్రీ.పూ. 132-135లలో, రోమనులపై యూదుల రెండవ తిరుగుబాటు తరువాత, రోమను చక్రవర్తి హెద్రియను యెరూషలేము నగరాన్ని నాశనం చేశాడు. హెద్రియను అక్కడ 'రోమను మార్కెటు పట్టణాన్ని' నిర్మించి, నగర పేరును 'ఏలియుసు [హెద్రియను వంశం పేరు] కాపితోలిన'గా మార్చాడు.

క్రైస్తవులకు యెరూషలేము ప్రాముఖ్యమైన పుణ్యస్థలము ఎందుకంటే, క్రీస్తు జీవితములోని ప్రధాన రక్షణ ఘట్టాలు అక్కడే జరిగాయి: విచారణ గావింపబడినారు, హింసింపబడినారు, సిలువవేయబడినారు. ఆనాటి యెరూషలేము ప్రాకారములకు వెలుపలనున్న కలువరి [కపాలము] వద్ద సిలువపై మరణించారు. సమీపములోని తోటలో రాతిలో తొలచబడిన సమాధిలో భూస్థాపితం చేయబడినారు. మూడవ రోజున, ఖాళీ సమాధి సాక్షిగా, మృతులలోనుండి లేచారు. పెంతకోస్తు పండుగ దినమున, అపోస్తలులు, మరియతల్లిపై పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు, యెరూషలేములో ప్రధమ సంఘము [తల్లి శ్రీసభ] స్థాపించ బడినది. అది త్వరలోనే అక్కడనుండి, సుదూర ప్రాంతాలకు విస్తరించినది.

18. ఓలీవు కొండ
సొలోమోను యెరూషలేము తూర్పు వైపున నున్న కొండపై మందిరములను నిర్మించుట - 1 రాజు 11:7-8
యోసీయా పూజా పీఠములను కూలద్రోయించుట - 2 రాజు 23:12-13
దావీదు అబ్షాలోమునుండి పారిపోతూ ఓలీవు కొండ మీదుగా ఎక్కి పోయెను - 2 సమూ 15:30-32
ప్రభువు తేజస్సు తూర్పున నున్న కొండపై నిల్చెను - యెహెజ్కె 11:23
ఓలీవు కొండ తూర్పునుండి పడమర వరకు రెండు ముక్కలుగా చీలిపోవును - జెక 14:3-4
యేసు ఓలీవు కొండకు వెళ్ళుట - లూకా 22:39; మత్త 26:30; మార్కు 14:26; లూకా 24 50-51
యేసు పరలోకమునకు కొనిపోబడుట - అ.కా. 1:4-12; మార్కు 16:19
యేసు ఓలీవు కొండపై కూర్చుండి యుండుట - మార్కు 13:3
యెరూషలేము సమీపించుచు ఓలీవు కొండ దగ్గర గ్రామము చేరిరి - మత్త 21:1-6; మార్కు 11:1-11; లూకా 19:28-38; యోహాను 12:12-16
గెత్సెమనిలో యేసు ఆవేదన - మత్త 26:30-56; మార్కు 14:32-50; లూకా 22:40-53; యోహాను 18:2-11

ఓలీవు పర్వతము సముద్ర మట్టానికి 808 మీటర్ల ఎత్తులో ఉన్నది. యెరూషలేమునకు తూర్పు వైపున నున్నది. యెరూషలేములోనున్న రెండు పర్వతాలలో ఇది ఎత్తైనది. నేడు అచట, యాత్రికుల కేంద్రములాంటి 'దోమినుస్ ఫ్లెవిత్'  (Dominus Flevit) మోక్షారోహణ దేవాలయము (Ascension Chapel), 'పాతర్ నోస్తర్' దేవాలయములు (Pater Noster Church) ఉన్నవి. ఓలీవు పర్వత కొమ్మునుండి బెత్ఫగే, బెతానియా దేవాలయాలు దగ్గరలోనే ఉన్నాయి.

19. మోక్షారోహణ దేవాలయము (Ascension Chapel)
యేసు మోక్షారోహణము - లూకా 24:50-51; మార్కు 16:19; అ.కా.1:4-12

యేసు మోక్షారోహణ జ్ఞాపకార్ధముగా ఈ దేవాలయము నిర్మించ బడినది. 

20. 'పాతర్ నోస్తర్' దేవాలయములు (Pater Noster Church)
ప్రభు ప్రార్ధన - మత్త 6:9-13; లూకా 11:1-4
ఈ దేవాలయానికి 'ఎలెయొన' లేదా 'ఓలీవు పర్వత దేవాలయము' (Eleona or Mount of Olives Church) అని పేరు. ప్రభువు శిష్యులకు "పరలోక ప్రార్ధన" నేర్పిన సంఘటనకు స్మరణగా, ఇచట మొట్టమొదటి దేవాలయాన్ని, క్రీ.శ. 335లో కాన్స్టెంటైన్ చక్రవర్తి నిర్మించాడు. పైకప్పులేని ఈ దేవాలయ గోడలపై 'పరలోక ప్రార్ధన' అనేక ప్రపంచ భాషలలో వ్రాయబడి యున్నది. ఓలీవు కొండ దగ్గరలో మఠవాసులు ఆశ్రమాలను ఏర్పరచుకున్నారు.

21. 'దోమినుస్ ఫ్లెవిత్'  (Dominus Flevit) దేవాలయము
యేసు యెరూషలేము చూచి విలపించుట - లూకా 13:34-35; 19:41-44

యేసు యెరూషలేము చూచి విలపించి, దాని వినాశనమును ప్రవచించిన సంఘటన స్మరనార్ధముగా ఈ చిన్న అందమైన దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయము ఓలీవు కొండమీద, యెరూషలేము నగరమునకు ఎదురుగా ఉంటుంది.

22. బెత్ఫగ పుణ్యక్షేత్రం
యేసు యెరూషలేము పుర ప్రవేశము - లూకా 19:28-40; మత్త 21:1-11; మార్కు 11:1-11; యోహాను 12:12-16

'బెత్ఫగ' అనగా 'పండని అత్తిపండ్ల గృహము' అని అర్ధము. యేసు గాడిద పిల్లపై ఎక్కి యెరూషలేము పుర ప్రవేశము చేసిన సంఘటనకు గురుతుగా ఇక్కడ ఒక దేవాలయము నిర్మించడమైనది. సంప్రదాయ ప్రకారముగా, యేసు పుర ప్రవేశం ఇక్కడనుండే ఆరంభ మైనది.

23. బెతానియా
యేసు మరణించిన లాజరును పునర్జీవము ఒసగుట - యోహాను 11:1-44
యేసు మరియమ్మ-మార్తమ్మలను సందర్శించుట - లూకా 10:38-42
బెతానియాలో అభిషేకము - మత్త 26:6-13; మార్కు 14:3-9; యోహాను 12:1-8

'లాజారు దేవాలయము' ఉన్న ఈ ప్రస్తుత గ్రామము, ఇప్పటికీ అరబికులో 'లజారియ' (Lazaria)గా పిలువబడు చున్నది. క్రీ.శ. 4వ శతాబ్దములో ఈ గ్రామం 'లజారియుం' (Lazarium)గా పిలువ బడేది. బెతానియా గ్రామము యెరూషలేమునకు మూడు మైళ్ళ (దాదాపు 5 కి.మీ.) దూరములో ఉన్నది. ప్రారంభ శతాబ్దాలలో, లాజరు సమాధిపై ఒక దేవాలయము నిర్మించ బడింది. క్రీ.శ. 16వ శతాబ్దములో ఆ దేవాలయము మసీదుగా మార్చ బడినది. ప్రస్తుతం ఉన్న దేవాలయము క్రీ.శ. 1952-53లో నిర్మించ బడినది.

24. గెత్సెమని
గెత్సెమనిలో యేసు ఆవేదన, ప్రార్ధన, బంధీయగుట - మత్త 26:36-56; మార్కు 14:32-50; లూకా 22:40-53

క్రీ.శ. 1666లో ఫ్రాన్సిస్ సభకు చెందినవారు, తొమ్మిది ఓలీవు చెట్లతో కూడిన గెత్సెమని తోటను పొందియున్నారు. క్రీ.శ. 1848లో గెత్సెమని తోట చుట్టూ గోడ నిర్మించడమైనది. క్రీ.శ. 1942లో గోడకు ఆవలి వైపున ఉన్న ఒక ఓలీవు చెట్టును తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఎనిమిది ఓలీవు చెట్లు ఉన్నాయి. క్రీ.శ. 1959లో ప్రస్తుతమున్న ప్రహరి గోడ నిర్మించడం జరిగింది. 

ఇచ్చట మొట్టమొదటి దేవాలయాన్ని క్రీ.శ. 379-393 మధ్య కాలములో తెయోడోషియస్ నిర్మించాడు. ఈ దేవాలయ శిధిలాలపై క్రూసేడరులు మరొక దేవాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పెద్ద దేవాలయం (Basilica), ప్రపంచ నలుమూలల నుండి పొందిన సహాయముతో, క్రీ.శ. 1919-1924 మధ్య కాలములో నిర్మించడ మైనది. అందుకే దీనిని "చర్చ్ ఆఫ్ నేషన్స్" (Church of Nations) అని అంటారు. దేవాలయ ప్రధాన ద్వారము మీద, సువార్తీకుల బొమ్మలు చిత్రీకరించ బడ్డాయి.

25. గెత్సెమని గుహ (యూదా గురుద్రోహము)
గెత్సెమనిలో యేసు ఆవేదన, ప్రార్ధన, బంధీయగుట - మత్త 26:36-56; మార్కు 14:32-50; లూకా 22:40-53

గెత్సెమని తోటలో ఉన్నటువంటి గుహ సహజముగా ఏర్పడినటువంటిది. సంప్రదాయం ప్రకారం, యేసు గెత్సెమని తోటలో ప్రార్ధన చేయుచుండగా, ఆయన శిష్యులు ఇక్కడే (ప్రస్తుతం బసిలికా దేవాలయములోనున్న రాయి మీద) నిదుర పోయారు. ప్రార్ధన తరువాత, యూదా ఇస్కారియోతు, అతనితో వచ్చిన మహా జనసమూహము యేసును ఇక్కడే కలుసుకున్నారు. యూదా యేసును ముద్దు పెట్టి గురుద్రోహమునకు పాలుపడగా, వారు యేసును పట్టుకొని బంధించిరి. అందుకే ఈ గుహకు 'ద్రోహ గుహ' (grotto of betrayal) అని పిలువబడు చున్నది. క్రీ.శ. 1392లో ఈ స్థలము ఫ్రాన్సిస్ సభ సభ్యుల సొంతమైనది. క్రీ.శ. 1956-59 మధ్య కాలములో, ఈ గుహ పునరుద్దరించ బడినది.

26. మరియ సమాధి
ఓలీవు తోట దగ్గర ఒక పెద్ద గుహ ఉన్నది. సంప్రదాయం ప్రకారం, మరియ ఇక్కడే భూస్థాపితం చేయబడ్డారు. ప్రస్తుతం ఇక్కగా గ్రీకు ఆర్థోడాక్స్ దేవాలయము ఉన్నది. ఈ గుహ దేవాలయములోనికి వెళ్ళడానికి అనేక మెట్లు ఉన్నాయి. మరియ భూస్థాపితం, ఆమె మోక్షమునకు ఎత్తబడుటకు జ్ఞాపకార్ధముగా ఇక్కడ దేవాలయములో ఖాళీ సమాధి ఉంచ బడినది.

27. గీహోను చెలమ
సొలోమోనును రాజుగా అభిషేకించుట - 1 రాజు 1:28-40
పట్టణములోనికి హిజ్కియా సొరంగము - 2 రాజు 20:20; 2 రా.ది.చ. 32:30; సీరా 48:17
యోవాబు గీహోను గుండా యెరూషలేములో ప్రవేశించుట - 2 సమూ 5:6-10; 2 రా.ది.చ. 11:4-6

గీహోను చెలమ ఓఫెలు శిఖర తూర్పునగల కీద్రోను లోయనందు కలదు. అనేక శతాబ్దాలుగా యెరూషలేమునకు నీటి సరఫరా చేయు ముఖ్య వనరులలో ఇది ఒకటి. యూదులు ఇక్కడికి రాకముందు షాలేము నివాసులగు యెబూసీయులు, నగరానికి నీటిని తీసుకురావడానికి ఈ చెలమనుండి ఒక మార్గాన్ని నిర్మించారు. బహుశా ఈ మార్గం ద్వారానే, దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు దావీదు కోసం షాలేము నగరాన్ని యెబూసీయుల నుండి స్వాధీనం చేసుకున్నాడు (2 సమూ 5:8). పవిత్రమైనదిగా పరిగణించబడే గీహోను చెలమ సమీపంలోనే సొలోమోనును ఇస్రాయేలు రాజుగా అభిషేకించడం జరిగింది (1 రాజు 1:33-38, 45).

28. సిలోయము కోనేటు
సిలోయము బురుజు - లూకా 13:4
ఆహాసును కలుసుకొనుటకు ప్రభువు యెషయాను పంపుట - యెషయ 7:3
షిలోహ జలములు - యెషయ 8:6
కోనేటి నుండి పారు నీటిని నిల్వజేయుటకు పట్టణ మధ్యమున జలాశయము - యెషయ 22:9-11
పుట్టు గ్రుడ్డివానికి స్వస్థత - యోహాను 9:1-38

'సిలోయము' అనగా 'పంపబడినవాడు' అని అర్ధము. సిలోయము కోనేటిలోకి గీహోను చెలమనుండి, 535 మీటర్ల పొడవున్న రాతిని తొలచిన కాలువద్వారా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. క్రీ.పూ. 11వ శతాబ్దంలో దావీదు సైన్యం షాలేము నగరాన్ని స్వాధీనం చేసుకొనక పొందే, గీహోను నుండి నగరములోకి నీటిని తీసుకురావడానికి యెబూసీయులు అప్పటికే కొన్ని భూగర్భ కాలువలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది (2 సమూ 5:8). క్రీ.పూ. 8వ శతాబ్దంలో ఆహాసు పాలనలో గీహోను నుండి నీటిని సేకరించేందుకు ఒక రిజర్వాయరు వంటి సౌకర్యం ఉండేది. బహుశా, ఇది "మీది చెరువు"గా (2 రాజు 18:17; యెషయ 7:3) పిలువబడుచున్నది లేదా "ప్రాత కోనేటు"గా (యెషయ 22:11) పిలువబడు చున్నది. అదేవిధముగా, యెషయ 8:6లో, "నెమ్మదిగా పారు షిలోహ జలము" అని చెప్పబడినది. అస్సిరియ రాజైన సన్హెరీబు శ్రీఘ్రగతిన యూదామీడికి దండెత్తివచ్చు సందర్భముగా, అస్సిరియనులు పట్టణము దగ్గరికి వచ్చినప్పుడు, వారికి నీరు దొరకకూడదని, చెలమ నుండి పారెడు నీటిని ఆపివేయవలెనని సంకల్పించిరి. అప్పుడు,  హిజ్కియా ఒక నూతన సొరంగమును త్రవ్వించి పట్టణమునకు మంచినీటి సరఫరా చేసెను (2 రా.ది.చ. 32:2-4, 30; 2 రాజు 20:20).

నూతన నిబంధనలో యేసు రెండుసార్లు సిలోయమును ప్రస్తావించారు: సిలోయము బురుజు (లూకా 13:4) మరియు సిలోయము కోనేటు (యోహాను 9:6-11). గీహోను చెలమ, సిలోయము కోనేటు మరియు ఆ రెండింటిని కలుపుతూ తొలచిన రాతి కాలువ ఇప్పటికీ యెరూషలేములో కనిపిస్తాయి.

29. ఎన్రోగెలు
అదోనీయా కుట్ర, విఫలమైన పట్టాభిషేకం, ఎన్రోగెలు చెంత బలి - 1 రాజు 1:5-10, 41-49
దావీదు తపించు కొనుట - 2 సమూ 17:15-22
అబ్షాలోము మృతి - 1 సమూ 18

ఇది యెరూషలేమునకు దరిలోనున్న చెలమ. ఒకప్పుడు ఇది యూదా, బెన్యామీను మధ్యన సరిహద్దుగా ఉండేది (యెహోషు 15:7; 18:16). ఇది గీహోను చెలమకు చాలా దిగువ భాగములో ఉన్నది. యెరూషలేమునకు ఇది మరొక నీటి వనరు. దావీదు ఇద్దరు కుమారులు అబ్షాలోము (2 సమూ 17:17) మరియు అదోనీయాల (1 రాజు 1:9) కుట్ర నేపధ్యములో ఈ ప్రదేశం ప్రస్తావించబడినది. నేడు ఈ చెలమకు "యోబు చెలమ" అని పేరు, ఎందుకన, సంప్రదాయం ప్రకారం, యోబు ఇక్కడ నయం చేయబడినాడు. అలాగే, దీనికి "యోవాబు చెలమ" అని పేరు, ఎందుకన, సంప్రదాయం ప్రకారం, అదోనీయా తననుతాను యూదా రాజుగా ప్రకటించుకున్న తర్వాత ఇచ్చిన విందులో యోవాబు పాల్గొన్నాడు (1 రాజు 1:5-10).

30. హకెల్దమ (Haceldama)
సొంత బిడ్డలను బలిగా సమర్పించుట - 2 రాజు 16:3; యిర్మీ 7:31
కుమ్మరివాని పొలము (రక్తపు పొలము) - మత్త 27:3-10
హకెల్దమ (రక్తభూమి) - అ.కా. 1:19

మత్త 27:3-10 ప్రకారం, యేసును అప్పగించుటకు, గురుద్రోహియగు యూదా ఇస్కారియోతు స్వీకరించిన ముప్పది వెండి నాణెములను తిరిగి ఇచ్చివేయగా, వాటితో ప్రధానార్చకులు, పరదేశీయుల భూస్థాపన కొరకు కుమ్మరివాని పొలము కొన్నారు. అరమాయిక్ భాషలో ఈ పొలమును 'హకెల్దమ' అని పిలిచారు. 'హకెల్దమ' అనగా 'రక్తపు పొలము' (మత్త 27:8) లేదా 'రక్తభూమి' (అ.కా. 1:19) అని అర్ధము. ఈ పొలము కీద్రోను లోయలో ఉన్నది. ఇది మొదట యూదుల సమాధి గుహల పక్కన ఉండేది. మొత్తం ప్రదేశాన్ని క్రైస్తవులు శ్మశానవాటికగా ఉపయోగించారు. తరువాత దీనిని 'యాంకోరైట్' (Anchorite) సన్యాసుల కోసం మఠంగా మార్చబడింది. క్రూసేడర్లు ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు. క్రీ.శ. 1143లో ఈ స్థలం 'హాస్పిటల్లెర్స్ అఫ్ సెయింట్ జాన్' (Hospitallers of St. John) వారికి ఇవ్వబడినది. వారు ఇక్కడ 'హకెల్దమ' పేర స్మశానవాటికను నిర్మించారు. అరబ్బులు ఈ స్థలమును "హప్ ఎల్ దామ్" (Happ el damn) అని పిలిచారు; అనగా 'రక్తము వెల' అని అర్ధము. క్రీ.శ. 1874లో గ్రీకులు ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించి పునీత ఒనుఫ్రియుసు (St. Onuphrius) అని పేరును పెట్టారు. అయినప్పటికినీ, నేటికీ ఈ స్థలం సందర్శకులకు 'హకెల్దమ'గానే ప్రసిద్ధి చెందినది.

31. గెహన్నా
నరకాగ్ని, నరకకూపము, నరకము, నరకశిక్ష - మత్త 5;22; 10:28; 18:9; 23:15, 33; మార్కు 9:43, 45, 47; లూకా 12:5; యాకోబు 3:6

హీబ్రూలో (గె-హిన్నోమ్) 'హిన్నోము'గా (యొహోషు 15:8) పిలువబడే లోయయొక్క గ్రీకు నామమే 'గెహన్నా'. గెహెన్నా  యెరూషలేమునకు దక్షిణాన ఉన్నది. ఇక్కడ అమ్మోనీయుల దేవత 'మోలెకు'కు పిల్లలను అగ్నిలో బలిగా అర్పించేవారు (2 రాజు 23:10; యిర్మీ 7:31-32). యిర్మియా ప్రవక్త, హిన్నోము లోయయని పిలువక, "వధలోయ"గా పిలువబడునని ప్రవచించాడు.ఈవిధముగా, 'గెహన్నా', నరకమునకు పర్యాయపదముగా మారింది. గ్రీకుల కాలములో 'గెహన్నా' అనే పదానికి అగ్నిద్వారా చివరి శిక్షగా  అర్ధం ఆపాదించ బడినది. ఇదే అర్థము, నూతన నిబంధన కాలంలో కొనసాగింది: నరకాగ్ని, నరకకూపము, నరకము, నరకశిక్ష. యెరూషలేము నివాసులు, చెత్తను ఈ లోయలోని ఒక ప్రాంతంలో విసిరేవారని, దానిని కాల్చేవారని తెలుస్తోంది. దీని వలన, అక్కడ నిరంతరముగా అగ్ని ఉండేది. అందుకే, యేసు 'గెహన్నా'ను, నిత్యనరకాగ్ని శిక్షగా ప్రస్తావించాడు. నూతన నిబంధనలో, 'గెహన్నా', సాధారనముగా 'నరకము' అని అనువదించ బడినది.

32. కీద్రోను లోయ / యెహోషాఫాత్తు లోయ
ప్రభువు యెహోషాఫాత్తు లోయన పాలించును, తీర్పు తీర్చును - యోవే 3:2
సిలోయము బురుజు - లూకా 13:4-5
ప్రవక్తల సమాధులు - మత్త 23:29

కీద్రోను లోయ ఓలీవు పర్వతం, యెరూషలేము నగరం నిర్మించబడిన పశ్చిమ కొండల మధ్య ఉన్నది. ఈ లోయ వాస్తవానికి 'స్కోపుస్' (Scopus) పర్వత పాదాల వద్ద ప్రారంభమవుతుంది. ప్రారంభ శతాబ్దాలనుండి, ఈ లోయను క్రైస్తవులు 'యెహోషాఫాత్తు' అని పిలుస్తారు; బహుశా, యోవేలు 3:2 ప్రవచనమునుండి ఈ స్థలాన్ని అపోస్తలుల కార్యములు 1:11లో తీర్పు కోసం యేసు రెండవ రాకడ గురించి దేవదూత యొక్క వాగ్దానానికి ఆపాదించబడి యుండవచ్చు!

హీబ్రూలో, 'యెహోషాఫాత్తు' అనగా 'దేవుడు తీర్పు చేయును' అని అర్ధము. ఈ లోయలో నాలుగు స్మారక చిహ్నాలు ఉన్నాయి: (1). అబ్షాలోము సమాధి; (2). యెహోషాఫాత్తు రాజు సమాధి; (3). పునీత యాకోబు సమాధి; (4). జెకర్యా సమాధి. ఆ పేర్లు కలిగిన వ్యక్తులతో వాటికిఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. అవి గ్రీకుల కాలంలో, ఆ పేర్లతో నిర్మించబడిన కుటుంబ సమాధులు లేదా స్మారక చిహ్నాలు!

33. సియోను కొండ
సియోను దుర్గము, దావీదు నగరము - 2 సమూ 5:7
మందసమును దావీదు పురమునకు కొనిపోవుట - 2 సమూ 6:10-19
ప్రభువు సియోను కొండపై వసించుట - యెషయ 8;18
ప్రజలు సియోను కొండమీద సంతసముతో పాటలు పాడుదురు - యిర్మీ 31:12

ఇది యెరూషలేము యొక్క పురాతన పవిత్ర పర్వతం. కొన్నిసార్లు యెరూషలేమును 'సియోను' అని పిలుస్తారు. ప్రస్తుత సియోను పర్వతం నగర ప్రాకారము వెలుపల ఉన్నది, కాని, ఒకప్పుడు, మరియుయేసు కాలములోకూడా ప్రాకారముల లోపలే ఉండేది.

అనేక కారణాల మూలముగా, క్రైస్తవులకు సియోను పర్వతము చాలా ప్రాముఖ్యమైనది: ప్రభువు కడరా భోజన ప్రదేశము; ఉత్థాన క్రీస్తు అపోస్తలులకు మరియు ఎనిమిది రోజుల తరువాత తోమాసు ఉన్నప్పుడు  దర్శన మిచ్చిన ప్రదేశము; పరిశుద్ధ మరియ, అపోస్తలులపై పవిత్రాత్మ దిగివచ్చిన ప్రదేశము; యెరూషలేము క్రైస్తవ సంఘమునకు, పీఠాధిపతులు యేసు సోదరుడైన యాకోబునకు కేంద్రస్థానం; అపోస్తలులకు ఆశ్రయము, వారి కూడికకు కేంద్రము. సియోను కొండపై ప్రధమ దేవాలయము నిర్మించబడి, క్రైస్తవులు ప్రార్ధనకు అచట సమావేశమయ్యేవారు. బెత్లెహేములో క్రిస్మస్ పండుగ తరువాతి రోజున, యెరూషలేము సంఘ పాలక పునీతులైన పునీత యాకోబుగారి మహోత్సవమును, ఇచ్చట అనాధి క్రైస్తవులు కొనియాడేవారు. పునీత యాకోబుగారితో పాటు, దావీదు మహారాజును కూడా స్మరించుకొనేవారు.

34. కడరాత్రి భోజన గది (Cenacle)
యేసు శిష్యుల కాళ్ళు కడుగుట, వీడ్కోలు ప్రబోధం, శిష్యుల కొరకు ప్రార్ధన - యోహాను 13-17
కడరాత్రి భోజనము, దివ్యసత్ప్రసాద స్థాపన - మత్త 26:26-35; మార్కు 14:22-25; లూకా 22:19-20; 1 కొరి 11:23-25
ఉత్థానము తరువాత శిష్యులకు దర్శనము - యోహాను 20:19-29
మత్తీయ ఎన్నిక - అ.కా. 1:12-26
పవిత్రాత్మ రాకడ - అ.కా. 2:1-4

ప్రభువు తన శిష్యులతో కడరాత్రి భోజనాన్ని భుజించిన స్థలము - పైగది (cenacle). సంప్రదాయం ప్రకారం, పైగది సువార్తీకుడు మార్కు తల్లియైన మరియమ్మకు చెందినదని గుర్తించారు. సియోను కొండపైనున్న ఈ గదిలోనే, ప్రభువు దివ్యసత్ప్రసాదమును స్థాపించారు. ఉత్థాన క్రీస్తు తన శిష్యులకు ఇచట దర్శనమిచ్చారు. యూదుల పెంతకోస్తు దినమున మరియమ్మ, శిష్యులతో కలిసి ఇచట ప్రార్ధించు చుండగా పవిత్రాత్మ వారిపైకి దిగి వచ్చినది. పేతురు ఇచట నుండే, ప్రజాసమూహమును ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చారు. శ్రీసభ ఇచటనే ఆవిర్భావం చెందినది. ప్రధమ 'యెరూషలేము సమావేశము' ఇచటనే నిర్వహించ బడినది. 

క్రీ.శ. మొదటి శతాబ్ద రెండవ భాగంలో, యూదు-క్రైస్తవులు ఇక్కడ ఒక యూదు-క్రైస్తవ ప్రార్ధనా మందిరమును నిర్మించి, 'అపోస్తలుల దేవాలయము' (Church of the Apostles) అని పేరు పెట్టారు. ఈ దేవాలయానికి ఉత్తారాన, క్రీ.శ. 383లో బైజాంటైనులు ఒక దేవాలయాన్ని నిర్మించి 'చర్చ్ అఫ్ ది పిల్లర్స్' (Church of the Pillars) అని పేరు పెట్టారు. యేసును రాతి స్తంభమునకు కట్టి కొరడా దెబ్బలు కొట్టిన స్తంభం ఇచట 'స్తంభాల గది'లో ఉంచడము వలన, వారు ఈ పేరు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ స్తంభాన్ని పవిత్ర సమాధి దేవాలయములోని దివ్యసత్ప్రసాద మందిరములో ఉంచబడినది. క్రీ.శ. 415లో ఈ దేవాలయం విస్తరించబడి, 'పవిత్ర సియోను'గా పిలువబడినది. పరిశుద్ధ మరియమ్మ ఇక్కడే జీవించి, మరణించినదని సంప్రాదాయక నమ్మకం. మరియమ్మ మరణ స్మారకముగా ఈ స్థలములో 'చర్చ్ అఫ్ డోర్మిషన్' (Church of Dormition) అను దేవాలయము నిర్మించబడినది.

'పవిత్ర సియోను' దేవాలయము క్రీ,శ, 1009లో నాశనం చేయబడినది. క్రూసేడరులు ఈ దేవాలయాన్ని 'అపోస్తలుల దేవాలయము'కలువున్నట్లుగా పునర్నిర్మించి, 'పరిశుద్ధ మరియ సియోను కొండ' (St. Mary of Mount Sion) అని నామకరణం చేసారు. కాని ఇది క్రీ.శ. 1219లో నాశనం చేయబడినది. 14వ శతాబ్దములో, ఫ్రాన్సిస్ సభ మఠవాసులు, కడరాత్రి భోజన గదిని స్వాదీనము లోనికి తీసికొని, ప్రాథమిక రూపాన్ని ఇచ్చారు; అది నేటికీ అలాగే ఉన్నది. క్రీ.శ. 1517లో ఫ్రాన్సిస్ సభ మఠవాసులు అక్కడనుండి తరిమి వేయబడ్డారు. ఈ క్రైస్తవ మందిరాన్ని మసీదుగా మార్చబడినది. క్రీ.శ. 1947లో యూదులు స్వాదీన పరచుకొని, సందర్శకులకు అందుబాటు లోనికి తీసికొని వచ్చారు. ఈ భవనం యొక్క క్రింది స్థలము, ఇప్పుడు దావీదు సమాధిగా ఉంచబడింది. యూదులకు ఇది వారి పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గౌరవిస్తారు. పైగది ప్రభువు కడరాత్రి భోజన గదిగా ఉంచబడి, క్రైస్తవ యాత్రా స్థలముగా ఉన్నది. 

35.  'చర్చ్ అఫ్ డోర్మిషన్' (Church of Dormition) దేవాలయము
ఈ స్థలము మరియ తల్లి మరణాన్ని మనకు జ్ఞప్తికి చేయును. ప్రస్తుత బసిలిక, మరియమ్మ మరణానికి జ్ఞాపకార్ధముగా నిర్మించ బడినది. మొట్టమొదటి దేవాలయాన్ని ఇచట యూద-క్రైస్తవులు నిర్మించారు. దీనిని తల్లి దేవాలయముగా పరిగణించారు. ఈ దేవాలయ శిధిలాలు నేటికి దావీదు సమాధి గోడలలో భద్రపరచారని భావించబడుతుంది. ఈ దేవాలయానికి ఉత్తరాన, క్రీ.శ. 383లో బైజాంటైనులు ఒక దేవాలయాన్ని నిర్మించి, 'చర్చ్ అఫ్ ది పిల్లర్స్' (Church of the Pillars) అని పేరు పెట్టారు. యేసును రాతి స్తంభమునకు కట్టి కొరడా దెబ్బలు కొట్టిన స్తంభం ఇచట 'స్తంభాల గది'లో ఉంచడము వలన, వారు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ స్తంభాన్ని కైఫా యింటినుండి తీసికొని రావడం జరిగింది. క్రీ.శ. 415లో రెండవ జాన్ పీఠాధిపతి ఈ దేవాలయాన్ని విస్తరించి, 'పవిత్ర సియోను'గా నామకరణం చేసాడు. అది ఒక పెద్ద దేవాలయము. ఈ దేవాలయ వాయువ్య ప్రాంతమును, యేసు పునరుత్థానం తర్వాత మరియ నివసించి,మరణించిన ప్రదేశంగా చూపబడింది. ఈ సంప్రదాయం నేటి దేవాలయానికి, 'చర్చ్ అఫ్ డోర్మిషన్' (Church of Dormition) అనెడు పేరును ఆపాదించినది.

36. పేతురు దేవాలయము (కోడి కూత)
నేను ఎరుగను అని పేతురు బొంకుట - యోహాను 18:15-27; మత్త 26:69-75; మార్కు 14:66-72; లూకా 22:55-62

కోడి కూయుటకు ముందు, పేతురు మూడుసార్లు, యేసు ఎవరో ఎరుగనని బొంకాడు (లూకా 22:54-62). క్రీ.శ. 457లో ఇచట ప్రధమ దేవాలయాన్ని యుడోచియ రాణి నిర్మించినది.

37. బెత్సతా కోనేరు, పునీత అన్నమ్మ దేవాలయము
బెత్సతా కోనేటి వద్ద స్వస్థత - యోహాను 5:1-9

St. Anne's Church with Pools

"యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో 'బెత్సతా' అందురు. దానికి అయిదు మండపములు ఉన్నవి" (యోహాను 5:2). 
'బెత్సతా' అనగా "కృపగల గృహము" (House of Mercy) అని అర్ధము. ప్రస్తుతం ఈ స్థలములో రెండు లోతైన ఎండిపోయిన కొలనులు ఉన్నాయి. ఈ కొలనులనుండే దేవాలయములోని జంతు బలుల కొరకు సొరంగ మార్గము ద్వారా నీటిని పంపేవారు.

ఈ స్థలము ప్రక్కనే, నగరములోనే అందమైన పునీత అన్నమ్మ దేవాలయము (క్రీ.శ. 1138) ఉన్నది. మరియమ్మ తల్లిదండ్రులు జ్వాకీము, అన్నమ్మలు ఇక్కడే యెరూషలేము దేవాలయ పరిసరాలలో నివసించేవారని, మరియ ఇక్కడే జన్మించినదని ఒక సంప్రదాయ నమ్మకం. బైజాంటైన్ సంప్రదాయం ప్రకారం, దేవాలయ క్రిందిభాగం (Crypt), మరియ, ఆమె తల్లిదండ్రులు జ్వాకీము, అన్నమ్మల గృహము అని భావించారు. ప్రతీ సంవత్సరం మ్రానికొమ్మల ఆదివారమున, కతోలిక క్రైస్తవులు, మ్రానికొమ్మలను చేతబట్టుకొని, 'హోసాన్న' పాడుతూ, ప్రదక్షిణను బెత్ఫగే దేవాలయమునుండి పునీత అన్నమ్మ దేవాలయమునకు చేరుకుంటారు.

38. సిలువ మార్గము (Via Dolorosa)
'గొల్గొతా'కు యేసు సిలువ ప్రయాణం - మత్త 27:1-32; మార్కు 14:66-72; లూకా 23:26-32; యోహాను 18:12-27

14 స్థలాలతో కూడన సిలువమార్గ భక్తి యూరపులో ప్రారంభమైనది. ప్రస్తుత 14 స్థలాల సిలువ మార్గమును 20వ శతాబ్ద ఆరంభములో ఏర్పాటు చేసారు. "సిలువ మార్గము"లోని మొదటి రెండు స్థలాలు, Ecce Homo కమాను (arch) దగ్గర ఉన్నాయి. 

39. యేసును కొరడాలతో కొట్టిన జ్ఞాపక దేవాలయము (Chapel of the Flagellation)
పిలాతు ఎదుట ప్రభువు - మత్త 27:1-2, 11-31
యేసును కొరడాలతో కొట్టుట - మత్త 27:21-32

ఈ ప్రాంతము ఒకప్పుడు 'అంతోనియ కోట'లో భాగము (అధిపతి మందిరము) కనుక, సంప్రదాయ ప్రకారం, యేసు ఇచట కొరడాలతో కొట్టబడినారు. దీనికి జ్ఞాపకార్ధముగా ఇచట, "Chapel of the Flagellation" అను దేవాలయము నిర్మించబడినది. క్రీ.శ. 1929లో, మధ్యయుగ పునాదులపై, పూర్తిగా పునర్నిర్మింప బడింది. ఇచట ఫ్రాన్సిస్ సభ ఆశ్రం ఉన్నది. ఇచ్చటి పరిసరాలు 'క్రీస్తు శ్రమల' జ్ఞాపకాలతో నిండి యుంటాయి (యోహాను 18:28-19:16).

40. యేసు మరణ దండన జ్ఞాపక దేవాలయము (Chapel of Condemnation)
యేసును మరణ దండనకు తీర్పు చేయుట - మార్కు 15:1-20

ఇచట ప్రధమ దేవాలయము 10 మీటర్ల చదరపు ఆకారములో బైజాంటైను శైలిలో నిర్మించబడినది. క్రీ.శ. 1903-04లో దీనిని ప్రస్తుత రూపులోనికి మాండెలుకు చెందిన ఆర్కిటెక్టు వెండెలిన్ గీర్లిక్ (Vendelin Gierlich of Mandel) పునరుద్ధరించారు. ఇది చివరిసారిగా క్రీ.శ. 1994లో కొత్త బలిపీఠముతో పునర్నిర్మించబడింది. పిలాతు యేసును మరణ దండనకు తీర్పు చేయుట, తలపై ముళ్ళకిరీటము పెట్టబడుట, కొరడాలతో కొట్టుట, యేసు సిలువను మోయుట, మరియ యేసును కలుసుకొనుట, యోహాను ఆమెను ఓదార్చుట మొదలగు బైబులు సంఘటనలను ఈ దేవాలయం జ్ఞప్తికి చేయును. ఈ దేవాలయ గచ్చుపై మొదటి శతాబ్దానికి చెందిన రాళ్ళు ఉపయోగించడ మైనది. కొన్ని రాళ్లపై చదరంగం ఆట (పాచికలు ఆట) గుర్తులను చూస్తాము. పిలాతుఎదుట యేసు విచారణ సమయములో సైనికులు చదరంగం ఆడిన గురుతుగా సందర్శకులకు చూపిస్తారు. క్రైస్తవ సందర్శకులు ఇక్కడనుండి 'సిలువ మార్గము'ను ప్రారంభించి, భక్తిపూర్వకముగా కలువరి కొండకు వెళ్ళడం జరుగుతుంది.

41. 'ఇదిగో మీ రాజు' జ్ఞాపక బసిలిక (Ecce Homo Basilica)
ఇదిగో మీ రాజు - యోహాను 19:12-16

ఇచట సియోను మఠకన్యలు వాసము చేయుచున్నారు. వారు 'ఇదిగో నీ రాజు' (Ecce Homo) పేరిట బసిలికను నిర్మించారు. మొదటగా యూదులైన తెయోడోర్ రాతిసుబోనె, ఆయన సహోదరుడు అల్ఫోన్స్ క్రైస్తవులుగా మారి, కతోలిక గురువులుగా అభిషిక్తులైనారు. వారిరువురు సియోను మఠకన్యల సభను స్థాపించారు. క్రీ. శ. 1856లో ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, 1862లో ప్రధమ మఠాన్ని ప్రారభించారు. ఆర్కిటెక్టు మావుస్ సహాయముతో ఇచట బసిలిక నిర్మించబడి, 1868లో అంకింతం చేయబడినది. "సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి, దానిని ఆయన శిరస్సుపై పెట్టి, ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి, 'యూదుల రాజా! నీకు శుభము!' అని నమస్కరించి, ఆయనను ముఖముపై కొట్టిరి" (యోహాను 19:2-3).

42. పవిత్ర సమాధి యొక్క బసిలిక (Basilica of the Holy Sepulchre)
ఈ బసిలికలో, అరిమత్తయి యోసేపు, నికోదేములు ప్రభువును భూస్థాపితం చేసిన సమాధిని చూడవచ్చు. ఈ సమాధి అరిమత్తయి యోసేపునది. క్రీ.శ. 335లో కాన్స్టాంటైన్ చక్రవర్తి ప్రధమ బసిలికను నిర్మించారు (326-335). 614లో పర్షియనులు కాల్చి నాశనం చేసారు. సందర్శకుల విరాళాలతో, 1012లో పునర్నిర్మాణాన్ని చేపట్టారు. పూర్తి మరమ్మత్తులకు విరాళాలు సరిపోకపోవడము వలన, దేవాలయ చాలా భాగాన్ని పునర్నిర్మించ కుండానే వదిలివేయ వలసి వచ్చినది. ఆతరువాత, తూర్పున ఒక ముఖద్వారాన్ని జొప్పించడం ద్వారా, మరల దేవాలయముగా అభివృద్ధి చేయబడింది. 15 జూలై 1099న నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత క్రూసేడరులు "స్తుతి గీతాన్ని" (Te Deum) ఆలపించడానికి భక్తితో, కన్నీళ్లతో వచ్చిన దేవాలయము ఇదియే! క్రూసేడరులు దీని పునర్నిర్మాణాన్ని 1114లో ప్రారంభించారు. తరువాతి కాలములో, ఈ దేవాలయం అనేకసార్లు విధ్వంసానికి గురియైనది. 1808లో జరిగిన అగ్నిప్రమాదం, 1927లో సంభవించిన భూకంపం చాలా నష్టాన్ని కలిగించాయి. అయితే మూడు ప్రధాన సంఘాలు (లతీనులు, గ్రీకులు, అర్మేనియనులు) పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టుటకు ఒక ఒప్పందానికి రావడానికి 1959 వరకు పట్టింది.

క్రైస్తవ చరిత్రలో, ప్రతీ విపత్తు తరువాత, క్రైస్తవులు దానిని పునర్నిర్మించారు. "యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట గలదు. ఆ తోటలో ఇంతవరకెవరిని భూస్థాపితము చేయని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్దపడు దినమగుట చేతను, ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి" (యోహాను 19:41-42).

43. బేత్లెహేము
దావీదు మూలాలు - 1 రా.ది.చ. 2:51
సమూవేలు దావీదును రాజుగా అభిషేకించుట - 1 సమూ 16:1-13
రెహబాము - 2 రా.ది.చ. 11:6
ఫిలిస్తీయులు బేత్లెహేమును చుట్టుముట్టుట - 2 సమూ 23:14
రాహేలు సమాధి - ఆ.కా. 35:19; 48:7; 1 సమూ 10:2
బేత్లెహేముకు చెందిన యువకుడు, మీకా సేవకుడు, రూతు గ్రంథము - న్యాయా 17:7-13
మెస్సయ్య జననము గూర్చిన ప్రవచనము - మీకా 5:2
బేత్లెహేములో యేసు జననము - లూకా 2:1-20; మత్త 2:1-18

బేత్లెహేము కీర్తి ఇరువురు బైబులు వ్యక్తులకు ఋణపడి యున్నది. వారే దావీదు మరియు యేసు. రాహేలు మరణం, భూస్థాపితం గురించి బైబిలులో మొదటిసారిగా బేత్లెహేము గురించి ప్రస్తావించబడినది (ఆ.కాం. 35:19). అత్యంత ప్రసిద్ధుడైన ఇస్రాయేలు రాజు దావీదు బేత్లెహేము నుండి వచ్చెను. ఇస్రాయేలీయుల మొదటి రాజు సౌలును తిరస్కరించి, యావే యూదా గోత్రానికి చెందిన యిషాయి కుమారుడైన దావీదును ఎన్నుకున్నాడు.

సమూవేలు దావీదును రాజుగా అభిషేకించిన తరువాత, దావీదుకు సంబంధించి, బైబులులో బేత్లెహేము అనేక సార్లు ప్రస్తావించబడినది (అ సమూ 20:6, 28; 2 సమూ 2:32; 23:14-16, 24). ఎజ్రా, నెహెమ్యాలో ఒక్కోసారి ప్రస్తావించ బడినది (ఎజ్రా 2:21; నెహె 7;26). "బబులోనియా రాజు దేశమునకు రాష్ట్రాధిపతిగా నియమించిన గెదల్యాను, యిష్మాయేలు వధించెను. కనుక వారు బబులోనీయులకు జడిసిరి. కావున వారు బబులోనీయుల నుండి తప్పించు కొనుటకు ఐగుప్తునకు పయనము కట్టిరి. దారిలో బేత్లెహేము చెంతనున్న కింహాము నొద్ద విడిది చేసిరి" (యిర్మీ 41:17-18).

పాత నిబంధనలో, బేత్లెహేమునకు సంబంధించి, ప్రాముఖ్యమైన మెస్సయ్యను గూర్చిన ప్రవచనం మీకా గ్రంధములో చూడవచ్చు: "బేత్లెహేము ఎఫ్రాతా! నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. కాని యిస్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలముకు చెందినది" (5:2). నూతన నిబంధనలో యేసు జననము గురించి బేత్లెహేము ప్రస్తావించబడినది (మత్త 2:1, 5-8, 16; లూకా 2:4, 15; యోహాను 7:42). యేసు జననము నుండి, యిషాయి పిలక, దావీదు వంశమునుండి వచ్చిన మెస్సయ్య జన్మస్థలముగా, బేత్లెహేము ప్రపంచ వ్యాప్తముగా ప్రసిద్ధి గాంచినది.

హీబ్రూలో 'బేత్లెహేము' అనగా 'రొట్టెల ఇల్లు' అని అర్ధము. హీబ్రూలో 'బేత్లెహేము' రెండు మాటల కలయిక: 'బెత్' = ఇల్లు; 'లెహెం' = రొట్టె. బైబులులో 'బేత్లెహేము' 'ఎఫ్రాతా'గా గుర్తించ బడినది (రూతు 4:11). బైబులులో కొన్నిసార్లు, ఈ రెండు పేర్లు కలిపి ప్రస్తావించ బడ్డాయి (మీకా 5:2). "గలిలీయ బేత్లెహేము" పేరుతోనున్న మరొక ప్రదేశమునుండి దీనిని గుర్తించడానికి తరుచుగా, "బేత్లెహేము యూదా" (యూదయా సీమ యందలిబేత్లెహేము)  అని పిలువబడుచున్నది. "బేత్లెహేము యూదా" యూదా తెగకు చెందినది. "గలిలీయ బేత్లెహేము" సెబూలూను తెగకు చెందినది. "బేత్లెహేము యూదా" సముద్ర మట్టానికి 777 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఇది ఎప్పుడు కూడా పచ్చిక బయళ్ళతో వ్యవసాయ గ్రామముగా ప్రసిద్ధి గాంచినది.

యేసు జననముతో, మెస్సయ్య పుట్టిన నగరముగా బేత్లెహేము ప్రత్యేక గుర్తింపును పొందినది. మీకా ప్రవచాన్ని (5:2) నెరవేరుస్తూ, ప్రపంచ దృష్టిని ఆకర్షించినది.

44. కాపరుల పొలము
కాపరుల పొలములు, రూతు గ్రంథము, బోవసు పొలము - లూకా 2:8-20

బేత్లెహేము ఆగ్నేయంగా దాదాపు మూడు కి.మీ. దూరములోనున్న స్థలము 'కాపరుల పొలము'గా గుర్తించబడుచున్నది.  ఈ ప్రదేశాన్ని ఇప్పుడు "కాపరుల పొలము" (షెపర్డ్స్ ఫీల్డ్)  అని పిలుస్తారు. ఇది బీట్ సాహోర్ గ్రామానికి సమీపములో ఉన్నది. ప్రారంభ శతాబ్దాలనుండి క్రూసేడరుల తరువాతి కాలము వరకు, ఈ ప్రదేశంలో ఒక చిన్న దేవాలయము ఉండేది. క్రూసేడరులు తరిమివేయబడిన తర్వాత, ఇది శిథిలావస్థకు చేరుకున్దిన. పూర్వకాలంలో ఇక్కడ ఒక చిన్న దేవాలయము, ఒక మఠం ఉన్నట్లుగా తెలుస్తోంది. యూసేబియుస్ ప్రకారం, బేత్లెహేము నుండి వెయ్యి అడుగుల దూరంలోనున్న 'ఏదెరు గోపురము' (ఆ.కాం. 35:21), యేసు జననం గురించి గొర్రెల కాపరులు దేవదూత సందేశాన్ని ఆలకించిన స్థలముగా గుర్తించారు.

1953లో గుడారము (టెంటు) రూపంలో నిర్మించిన ఒక చిన్న అందమైన దేవాలయాన్ని చూడవచ్చు. సమీపంలోని రెండు సహజ గుహలు అందమైన ప్రార్థనా మందిరాలుగా మార్చబడ్డాయి. ఆ గుహలలో యేసు జన్మించిన సమయంలో గొర్రెల కాపరులు నివసించారని నమ్ముతారు. సమీపంలోని బైజాంటైన్ కాలంనాటి మఠం యొక్క శిధిలాలను చూడవచ్చు. రూతు గ్రంథములో ప్రస్తావించబడిన బోవసు పొలాలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవిగా భావించబడుతున్నాయి.

45. ఎమ్మావు
ఎమ్మావు మార్గములో ఉత్థాన యేసు దర్శనము - లూకా 24:13-35; మార్కు 16:12-13

సువార్తలోని ఎమ్మావు అని చెప్పుకునే  ప్రదేశాలు మూడుఉన్నాయి: ఎల్-క్యూబెబెహ్, అబు గోష్ మరియు లాట్రున్. నాలుగవ శతాబ్దంలో, 'లాట్రున్'ను ఎమ్మావుగా పరిగణించారు. ఇది యెరూషలేము నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మరియు దీనిని నికోపోలి అని పిలిచేవారు. శిష్యులు అదే రోజు సాయంత్రం, యెరూషలేము వెళ్లి తిరిగి వచ్చేలా దూరం ఉండాలి కాబట్టి క్రూసేడరులు 'ఎల్-క్యూబెబెహ్' ఎమ్మావు అని నిర్ణయించారు. 1335లో ఫ్రాన్సిస్ సభ సభ్యులు ఈ సంప్రదాయాన్ని అనుసరించి, ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు. మూడవ అవకాశం ఏమిటంటే, 12వ శతాబ్దంలో క్రూసేడరులు ఒక దేవాలయాన్ని నిర్మించిన అబు గోష్. దాని గోడల మందం (3.80 మీటర్లు) కారణంగా ఇది ఎప్పుడూ నాశనం చేయబడలేదు. అది ఈనాటికీ పదిలముగా ఉన్నది. దేవాలయ క్రింది భాగములో శాశ్వత చెలమ ఉన్నది. ఈ దేవాలయాన్ని నిర్మించినప్పటి నుండి 'నైట్స్ ఆఫ్ సెయింట్ జాన్' (The Knights of St. John) దాని సంరక్షణను చూసుకున్నారు. ప్రస్తుతం, దీనిని ఫ్రెంచ్ బెనెడిక్టైన్ మఠవాసులు సంరక్షిస్తున్నారు.

46. రెల్లు సముద్రము (నాచు సముద్రము, ఎర్ర సముద్రము)

ఆధునిక బైబులు అనువాదకులు, 'ఎర్ర సముద్రము'కు బదులుగా 'రెల్లు సముద్రము' అని అనువదించుటకు ఇష్టపడుచున్నారు. దీనిని హీబ్రూ భాషలో "యామ్ సుఫ్" (యామ్ = సముద్రము; సుఫ్ = రెల్లు) నుండి అనువదిస్తే, దాని అర్ధం "రెల్లు సముద్రము". నిర్గమకాండములో (13-15) వివరించిన విధముగా, ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తునుండి వలస వచ్చిన తరువాత, వారు దాటినటువంటి నీటి ప్రాంతము. దీని స్థానాన్ని గుర్తించడానికి, వివిధ ప్రతిపాదనలు చేయబడ్డాయి: మొదటిగా, ఎర్ర సముద్రానికి సమీపములోనున్న పెద్ద సరస్సు; అయితే, ఈ సరస్సు సూయజ్ కాలువ కారణముగా అప్పటినుండి ఎండిపోయి ఉన్నది. రెండవదిగా, సభత్ అల్ బర్దావిల్, సినాయి ద్వీపకల్పం యొక్క ఉత్తర తీరంలో నున్న పెద్ద మడుగు.

47. గొల్గొతా / కల్వరి
యేసు సిలువ వేయబడిన ప్రదేశమునకు, బైబులు నామము "గొల్గొతా". బహుశా, ఇది యెరూషలేము ప్రాకారములకు వెలుపల నున్న చిన్న కొండ అయుండవచ్చు! 'గొల్గొతా' అనే పేరు అరమాయికు పదం 'గుల్గుల్తా' నుండి వచ్చినది. 'గొల్గొతా' అనగా 'కపాల స్థలము అని అర్ధము (మత్త 27:33; మార్కు 15:22; యోహాను 19:17). కల్వరి అనేది లతీను పదము నుండి వచ్చినది.

దెకపొలి ప్రాంతము
యేసు కీర్తి వ్యాపించుట - మత్త 4:24-25
గదరేనీయుల (గెరాసేనుల) ప్రాంతమున దయ్యము పట్టిన వానికి స్వస్థత - మార్కు 5:9-13
దయ్యము పట్టిన వానికి స్వస్థత - మార్కు 5:18-20
మూగ, చెవిటి వానికి స్వస్థత - మార్కు 7:31-35

గ్రీకులో, 'డెకపోలి' (దెకపొలి) అనగా 'పది పట్టణములు' అని అర్ధము (డెక = పది; పొలిస్ = పట్టణం). ఇది యోర్డాను, సిరియా, పాలస్తీనాలోని రోమను సామ్రాజ్యం యొక్క తూర్పు సరిహద్దులో ఉన్న పది నగరాల సమూహం. భాష, సంస్కృతి, స్థానము, రాజకీయ హోదాను బట్టి వాటిని ఒకటిగా కలపడం జరిగింది. ఈ పట్టణాలు గ్రీకు, రోమన్ సంస్కృతికి కేంద్రాలు. లేకుంటే, అచట సెమిటిక్ సంస్కృతి అనగా, అరేబియ, అరమీయ, యూదు సంస్కృతి ఉండేది.
ఆ పది పట్టణాలు ఏమనగా (ప్లినీ):
1. ఫిలడెల్ఫియ-అమ్మను
2. రఫన (కపితోలియాస్)
3. గదర 
4. హిప్పోర్
5. దియోన్
6. పల్లు
7. గెరాస
8. కనత
9. దమాస్కో (అబిల)
10. న్యాస-సితోపొలిస్

వీటిలో కొన్ని క్రీ.పూ. 103-76 (అలెగ్జాండర్ జన్నాయస్) మధ్య కాలములో యూదుల పరిపాలనలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 63లో పాలస్తీనాను ఆక్రమించిన తర్వాత పాంపే వారికి స్వాతంత్ర్యం ఇవ్వడంతో ఈ నగరాలు యూదుల పాలన నుండి బయటపడ్డాయి. గతంలో యూదుల ఆధిపత్యం కారణంగా, యేసు కాలంలో, ఈ ప్రాంత ప్రజలు బలమైన యూదు వ్యతిరేక భావాలను కలిగి ఉండేవారు.

No comments:

Post a Comment